కరోనావైరస్: గుజరాతీ మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్ల అవసరం భారీగా పెరిగింది. ఆరోగ్యం విషమించిన కోవిడ్-19 రోగులకు వెంటిలేటర్ల సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తారు.
కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో చాలా దేశాల్లో వెంటిలేటర్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది.
ఈ కొరతను తీర్చేందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న జ్యోతి సీఎన్‌సీ సంస్థ కేవలం 10 రోజుల్లోనే వెంటిలేటర్ నమూనాను రూపొందించి, ఉత్పత్తి చేస్తోంది. వాటిని తక్కువ ధరకే అందిస్తోంది.
ఈ సంస్థ తయారు చేసే వెంటిలేటర్‌కు ‘ధామన్ 1’ అని పేరు పెట్టారు. దీని ధర లక్ష రూపాయలు.
వెంటిలేటర్ ఎలా పనిచేస్తుంది?
ఊపిరితిత్తులు పనిచేయనంతగా వ్యాధి ముదిరినప్పుడు, రోగి శరీరానికి అవసరమైన శ్వాస అందించే పనిని వెంటిలేటర్లు చూసుకుంటాయి. వ్యాధితో పోరాడి, నయం అయ్యేందుకు అవసరమైన సమయాన్ని రోగి శరీరానికి ఇస్తాయి.
అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంతో పాటు, రోగి శరీరం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను వెంటిలేటర్ బయటకు పంపిస్తుంది. శ్వాసను పూర్తిగా యంత్రమే నియంత్రిస్తుంది కాబట్టి వారి శ్వాసకోశ కండరాలు విశ్రాంతి తీసుకునేలాగా వైద్యం అందుతుంది.
“కరోనావైరస్ రోగులను దృష్టిలో పెట్టుకుని ఈ వెంటిలేటర్‌ను రూపొందించాం. మొదటి దశలో 1000 వెంటిలేటర్లను తయారు చేశాం. వాటన్నింటినీ గుజరాత్‌లోని వివిధ ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి అందించాం. వెంటిలేటర్లు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడిగింది. ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే స్పెయిన్, అమెరికా, కజకిస్థాన్, ఇరాన్, కెన్యా, పోర్చుగల్, ఫ్రాన్స్‌లు వెంటిలేటర్ల కోసం మమ్మల్ని సంప్రదించాయి” అని సంస్థ ప్రతినిధి శివాంగి లఖానీ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పది రోజుల్లోనే నమూనా సిద్ధం
గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య పరికరాల తయారీ సంస్థలతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ప్రత్యేకించి వెంటిలేటర్ల తయారీకి రాష్ట్రంలో పెద్దగా సౌకర్యాలు లేవని, వాటిని త్వరితగతిన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆ సమావేశంలో మాజీ క్రికెటర్, జ్యోతి సీఎన్‌సీ సంస్థ అధినేత పరాక్రమసిన్హా జడేజా కూడా ఉన్నారు. సాధ్యమైనంత వేగంగా వెంటిలేటర్ల తయారీకి ఏర్పాట్లు చేయాలని ఆయన నిర్ణయించారు.
“అహ్మదాబాద్‌లోని ఆర్‌హెచ్‌పీ మెడికల్స్ అనే సంస్థ యజమాని డాక్టర్ రాజేంద్రసిన్హాను సంప్రదించాం. విదేశాల్లో వెంటిలేటర్లపై పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. ధామన్-1 అభివృద్ధికి సాయం చేసేందుకు ఆయన అంగీకరించారు. మా డిజైన్ బృందానికి సూచనలు చేశారు. నమూనా వెంటిలేటర్‌ను రూపొందించేందుకు 25 మంది, 10 రోజుల పాటు రాత్రీపగలు తేడా లేకుండా శ్రమించారు. ప్రస్తుతం మా సంస్థలో కేవలం వెంటిలేటర్ల తయారీ కోసమే 250 మంది పనిచేస్తున్నారు. రోజుకు ఐదు నుంచి పది వెంటిలేటర్ యంత్రాలను ఉత్పత్తి చేస్తున్నాం. మరో 20 రోజుల్లో ఆ సంఖ్యను 80 నుంచి 100కి పెంచాలన్నది మా లక్ష్యం” అని లఖాని వివరించారు.
నమూనా వెంటిలేటర్‌కు ప్రభుత్వం నుంచి వేగంగా అనుమతులు రావడంతో ఉత్పత్తిని ప్రారంభించారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ధర లక్ష రూపాయలు
“సాధారణంగా దేశంలో ఒక్కో వెంటిలేటర్ కనీస ధర ఆరు లక్షల రూపాయల నుంచి ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాటికి ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల దాకా అవుతుంది. అయితే, వెంటిలేటర్‌కు అవసరమయ్యే వివిధ రకాల విడి భాగాల కోసం 26 కంపెనీలతో మాట్లాడాం. కరోనావైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మేం వెంటిలేటర్లు తయారు చేస్తున్నాం కాబట్టి, వాళ్లు విడి భాగాలను లాభాలు చూసుకోకుండా తక్కువ ధరకే ఇస్తున్నారు. అందుకే మేం ధామన్-1 ను లక్ష రూపాయలకే అమ్మగలుగుతున్నాం. ఒక్కో వెంటిలేటర్ లక్ష రూపాయల (పన్ను అదనం) చొప్పున దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని నిర్ణయించాం” అని లఖాని వివరించారు.

ఫొటో సోర్స్, PARAKRAMSINH JADEJA
వెంటిలేటర్ తయారు చేస్తున్న మాజీ క్రికెటర్
జ్యోతి సీఎన్‌సీ సంస్థ అధినేత పరాక్రమసిన్హా జడేజా మొదట్లో క్రీడల్లో రాణించాలని అనుకున్నారు. కానీ, వ్యాపారవేత్త అయ్యారు.
చెస్, క్రికెట్‌లో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. 1985 నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న టాప్ 3 గుజరాత్ ఆటగాళ్లలో ఆయన ఒకరు.
అప్పుడు ఆయన 12వ తరగతి చదువుతున్నారు. అయితే, చెస్ టోర్నమెంటులో పాల్గొనాల్సిన రోజే ఆయనకు బోర్డు పరీక్ష కూడా ఉంది. ఆయన పరీక్షను వదిలేసి, ఆట ఆడేందుకు వెళ్లారు.
1989లో అండర్-19 ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. కానీ, అప్పుడు విమానం టికెట్ కొనాలంటే రూ.25,000 అవసరమయ్యాయి. అందుకు వారి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఆ అనుభవం పరాక్రమసిన్హా ఆలోచనను పూర్తిగా మార్చేసింది. క్రీడలను వదిలేసి, ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన ఆయన మదిలో మొదలైంది. ఆఖరికి ఆయన అనుకున్నది సాధించారు.
“కృత్రిమ మోకాలి జాయింట్లు, మోచేతి జాయింట్లు సహా అనేక వైద్య పరికరాలను తయారు చేస్తాం. చాలా రకాల యంత్రాలను ఆస్పత్రులకు పంపిణీ చేస్తున్నాం. ధామన్-1 వెంటిలేటర్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఇంకా పరిశోధనలు చేస్తున్నాం. ధామన్-2, ధామన్-3 కూడా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాం. అవి ధామన్-1 కంటే మరింత మెరుగ్గా పనిచేసేలా ఉంటాయి” అని సంస్థ ప్రతినిధి లఖాని చెప్పారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








