ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన లాభమా? నష్టమా?

ఆంధ్రప్రదేశ్ మ్యాప్, వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల విభజన విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాలను యథాతథంగా జిల్లాలుగా చేయడం పట్ల పలువురు అభ్యంతరం చెబుతున్నారు. అసలింతకీ ఏపీలో జిల్లాల విభజన అవసరం ఎంత? తెలంగాణలో విభజన తరువాత ఏం జరిగింది?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నుంచీ ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలను విభజిస్తామని చెబుతూనే ఉంది. ఆ పార్టీ నిర్మాణం కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. మిగిలిన పార్టీల్లో జిల్లా అధ్యక్షులు ఉంటే, వైఎస్సార్సీపీలో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షులు ఉంటారు. ఎన్నికల ముందే ఆ పార్టీ ఈ తరహాలో నిర్మాణం చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, డొక్కా మాణిక్య వర ప్రసాద్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న సమయంలో కూడా జిల్లాల సంఖ్య పెంచుతారనే వార్తలు వచ్చాయి. ఇక కేంద్రం ఇచ్చే డబ్బులు, లెక్కలు అన్నీ జిల్లాల వారీగానే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద జిల్లాలు

2020 నాటికి దేశంలో 739 జిల్లాలు ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెద్ద జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో జిల్లాకు సగటు జనాభా 38 లక్షలు. విభజన తరువాత తెలంగాణలో సగటు జిల్లాల జనాభా 11 లక్షలుగా ఉంది.

ఆంధ్రాలో విస్తీర్ణంలో పెద్దది అనంతపురం జిల్లా. ఇది కువైట్, ఫిజి దేశాల కంటే పెద్దది. శ్రీకాకుళం జిల్లాకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా శ్రీకాకుళం.

జనాభాలో అతి పెద్దది తూర్పు గోదావరి. ఆ జిల్లాలో 51 లక్షల జనాభా ఉండగా, తరువాత గుంటూరులో 48 లక్షలు, కృష్ణా జిల్లాలో 45 లక్షల జనాభా ఉంది. అతి తక్కువ జనాభా విజయనగరంలో 23 లక్షలు, శ్రీకాకుళంలో 26 లక్షల మంది ఉన్నారు.

జన సాంద్రత అత్యధికంగా కృష్ణా జిల్లాలో 519, ప.గో.లో 508, తూ.గో.లో 477 ఉండగా, అతి తక్కువ కడపలో 188, ప్రకాశంలో 192 మంది ఉన్నారు. విజయనగరంలో రెండే రెవెన్యూ డివిజన్లుండగా, తూర్పుగోదావరిలో 7 డివిజన్లున్నాయి.

గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని భాగాలతో 1970లో ప్రకాశం ఏర్పాటు చేశారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి 1979లో విజయనగరం జిల్లా ఏర్పాటు చేశారు.

కేసీఆర్ జిల్లాలను విభజించక ముందు వరకు తెలంగాణలో రంగారెడ్డి మినహా, మిగతావన్నీ నిజాం కాలం నాటి జిల్లాలే. చాలా రాష్ట్రాల్లో అవసరాలని బట్టి ఒకట్రెండు జిల్లాల విభజన జరుగుతూనే వచ్చింది. మొత్తానికి అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరులు చాలా చాలా పెద్దవిగా, శ్రీకాకుళం, విజయనగరాలు చిన్నవిగా ఉంటాయి.

తెలంగాణ జిల్లాల మ్యాప్

ఫొటో సోర్స్, Telangana.gov.in

తెలంగాణలో చాలా చిన్న జిల్లాలు

విభజన తరువాత తెలంగాణ స్వరూపమే మారిపోయింది. విస్తీర్ణంలో భద్రాద్రి జిల్లా పెద్దది కాగా, హైదరాబాద్ చిన్నది. అయితే అతి పెద్ద భద్రాద్రి జిల్లా అయిన భద్రాద్రి పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి కన్నా చిన్న జిల్లా. ఇక అత్యధికంగా హైదరాబాద్ 39 లక్షల జనాభా ఉండగా, ములుగు జిల్లాలో కేవలం 3 లక్షల మంది ఉన్నారు. ఇది హైదరాబాద్లోని కొన్ని మండలాల జనాభా కంటే తక్కువ. జనసాంద్రతలో 106 మందితో కుమ్రం భీం జిల్లా చివరి స్థానంలో ఉండగా, సహజంగానే హైదరాబాద్ 18వేలకు పైగా సాంద్రతతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో దాదాపు 15 జిల్లాల జనాభా కేవలం 5 నుంచి 8 లక్షల మధ్యే ఉంది.

జిల్లాల విభజన విషయంలో బహుశా ఏ రాష్ట్రమూ చేయనంత ప్రయోగం తెలంగాణ చేసింది. 40 లక్షల నుంచి 3 లక్షల వరకూ జనాభా ఉన్న జిల్లాలున్నాయి. విస్తీర్ణమూ జిల్లాల సంఖ్యతో పోల్చినప్పుడు, నిష్పత్తిలో, బహుశా ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రం కూడా తెలంగాణ అవుతుంది.

చిన్న జిల్లాలతో పాటూ చాలా గ్రామీణ ప్రాంతాలను అర్బన్ కమిషనరేట్లుగా (అంటే పోలీసుల్లో ఎస్పీ, డీఎస్పీ బదులు, కమిషనర్, డీసీపీ, ఏసీపీలు ఉంటారు) మార్చేశారు. రామగుండం, సిద్ధిపేట వంటి పట్టణాలకు కూడా ఎస్పీల బదులు కమిషనర్ వచ్చేశారు.

తెలంగాణ ఫార్ములా సఫలం అయిందా?

పార్టీలకతీతంగా తెలంగాణ జిల్లాల విభజన విషయంలో అనేక అభిప్రాయాలున్నాయి. ప్రతీ తెలంగాణ జిల్లా వారూ తమది పోరాటాల గడ్డ అంటూ అభివర్ణించుకోవడానికి ఇష్టపడతారు. ఖమ్మం, వరంగల్, కరీంనర్, నల్లగొండలు.. ఈ జాబితాలో ముందుంటాయి. కానీ వారంతా ఇప్పుడు రకరకాల జిల్లాలుగా విడిపోవడంతో చాలా మందికి జీర్ణించుకోవడం కష్టమైంది. చాలా మంది, తెలంగాణ జిల్లాల విభజన సమర్థిస్తూనే మరీ ఇంత చిన్న జిల్లాలు అవసరం లేదని చెబుతుంటారు.

‘‘నిజానికి తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఉన్నట్టయితే సరిగ్గా సరిపోయేవి. ప్రొఫెసర్ జయశంకర్ కూడా తెలంగాణలో జిల్లాల విభజన లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా ఉండాలని భావించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం విభజనతో జిల్లాల ప్రాధాన్యతను చిన్నాభిన్నం చేసింది. వరంగల్‌ను ఆరు జిల్లాలుగా విభజించారు. జనగామ అసెంబ్లీ.. జనగామ జిల్లాతో పాటూ సిద్ధిపేటలో కూడా ఉంటుంది. ఘనపూర్ నియోజకవర్గం జనగామ, వరంగల్ అర్బన్లో ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఇద్దరు కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి. వరంగల్ కి 15 కిమీ దూరంలోని గ్రామాలు వాటికి 35 కిమీ దూరంలోని జనగామలో చేరాయి. ఇందులో సౌలభ్యం ఏముంది? కేవలం సిద్ధిపేట కమిషనరేట్‌లో జనాభా కోసం ఇదంతా చేశారు. సిద్ధిపేట ప్రాధాన్యత పెంచడం కోసం వరంగల్ ని తగ్గించారు’’ అని విమర్శించారు వరంగల్ కి చెందిన సీనియర్ జర్నలిస్టు పివి కొండల రావు.

‘‘భూపాలపల్లి వంటి ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చేవారు, హన్మకొండలో కొనుగోళ్లు జరిపే వారు. కానీ వారు ఇప్పుడు వరంగల్ రావడం లేదు. అలాగని భూపాలపల్లిలో రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ పెరగలేదు. చాలా జిల్లాల్లో తమ జిల్లా కేంద్రాలకు కాకుండా పక్క జిల్లా కేంద్రాలకు బస్సులు నడుస్తాయి’’ అని ఆయన వివరించారు.

‘‘జిల్లాల ఏర్పాటు మంచిదే కానీ, తెలంగాణలో అవసరానికి మించి ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి 20-22 జిల్లాలు సరిపోయుండేవి. చివర్లో ఏర్పాటు చేసిన జిల్లాలైతే మరీ దారుణం. సిరిసిల్ల, జనగామ అసలు అవసరం లేని జిల్లాలు. వరంగల్ జిల్లా ఆరు జిల్లాలయింది. వరంగల్ అర్బన్ - రూరల్ అవసరమే లేదు. ఇద్దరు కలెక్టర్లూ వరరంగల్ లోనే ఉంటారు. భూపాలపల్లి జిల్లా అవసరమే. జనగామ నుంచి 15 కిమీ దాటితే జిల్లా మారిపోతుంది. మొత్తమ్మీద తెలంగాణలో ఒక ఐదారు జిల్లాలను వృథాగా ఏర్పాటు చేశారు’’ అన్నారు లోక్ సత్తా ఉద్యమ సంస్థ రెండు రాష్ట్రాల కన్వీనర్ బండారు రామ్మోహన రావు.

జిల్లా పరిధి తగ్గడంతో జిల్లా స్థాయి యంత్రాంగం ఎప్పుడు కావాలంటే అప్పుడు, జిల్లాలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ముందస్తు ప్రణాళిక లేకుండా వెళ్లగలిగిన సౌలభ్యం వచ్చింది.

‘‘ఒకప్పుడు ఆదిలాబాద్ వంటి ప్రాంతాలలో కలెక్టర్ల పర్యటనకు రెండు రోజులు పట్టేది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్లేందుకు పట్టే సమయం కన్నా పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకే ఎక్కువ సమయం పట్టేది. తాలూకాలు, సమితుల స్థానంలో మండలాలు వచ్చాక దూరం తగ్గింది కానీ, జిల్లాలు మాత్రం దూరంగానే ఉండిపోయాయి. ఆ లోటు చిన్న జిల్లాలతో తీరింది. పనుల కోసం వెళ్లి రాత్రుళ్లు అక్కడే రోడ్లపక్కన, బస్టాండ్లలో పడుకునే బాధ లేకుండా పోయింది. 30 శాఖలను సమన్వయం చేసే కలెక్టర్లపై ఒత్తిడి తగ్గింది’’ అన్నారు రామ్మోహన రావు. అయితే వికేంద్రీకరణ శృతిమించి, రాజకీయ అవసరాల కోసం జరిగింది అని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ మ్యాప్, బుద్ధ విగ్రహం

ఫొటో సోర్స్, ap.gov.in

ఆంధ్రాలో పార్లమెంటు నియోజకవర్గాలను యధాతథంగా జిల్లా చేస్తే ఏమవుతుంది?

పరిపాలన మీద అవగాహన ఉన్న అందరూ ఆంధ్రాలో జిల్లాలు చాలా పెద్దవనీ, వాటిని విభజించాలనీ చెబుతారు. కానీ ఎక్కువ మంది మాత్రం ప్రస్తుత ప్రతిపాదనలో చెబుతున్నట్టుగా పార్లమెంటు నియోజకవర్గాలను యధాతథంగా జిల్లాలను చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాల విభజనకు తీసుకునే ప్రాతిపదిక, జిల్లా పరిపాలనకు అవసరమయ్యే ప్రాతిపదికా ఒకేలా ఉండవు. పైగా దూరాలు ఇంకో సమస్య.

ప్రస్తుత తూర్పుగోదావరిలో రంపచోడవరం అరకు పార్లమెంటు పరిధిలో ఉంది. అరకు ఊరు నుంచి రంపచోడవరం అక్షరాలా 250కిమీ ఉంది. అది కూడా మామూలు రోడ్డు. హైవే అయితే 280కిమీ పైనే పడుతుంది. ఇక పాలకొండ నుంచి అరకు ప్రయాణం పూట కంటే ఎక్కువ పడుతుంది. వారికి శ్రీకాకుళం పక్కనే ఉంటుంది. ఇప్పుడు అరకు యధాతథంగా జిల్లా అయితే రంప చోడవరం ప్రజలకు అరకు కంటే విజయవాడ, విశాఖపట్నం దగ్గర అవుతాయి.

ఇక ఎమోషనల్ ఎటాచ్మెంట్స్ మరో సమస్య. ఉదాహరణకు మండపేట అమలాపురంలోకి వస్తుంది. వాటి మధ్య 50 కిమీ దూరం. కానీ వారికి రాజమండ్రి 25 కిమీ దూరంలోనే ఉంటుంది. అక్కడి వారు అమలాపురం కాకుండా రాజమండ్రి వెళ్లడానికి అలవాటుపడ్డారు. సంతనూతలపాడుకు ఒంగోలు 10 కిమీ ఉంటుంది. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం జిల్లాలను విభజిస్తే వారు 80 కిమీ దూరంలో బాపట్ల జిల్లాకు వెళ్తారు. తిరుపతి నుంచి సర్వేపల్లి 120 కిమీ. నెల్లూరు నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ వారు తిరుపతి జిల్లాకు వెళ్తారు. తిరుపతి పక్కనే, ఆనుకుని ఉన్న మంగళం, చంద్రగిరి వంటివి చిత్తూరు జిల్లాలోకి వెళ్తాయి. రాజంపేటకు పుంగనూరు, మదనపల్లె పట్టణాలు 150 కిమీ దూరం వరకూ ఉంటాయి. కడప, రాజంపేట మాత్రం 50 కిమీ దూరంలో పక్కపక్కనే ఉంటాయి.

విజయవాడ పక్కనే గన్నవరం ఉంటుంది. గన్నవరంలోని విమానాశ్రయాన్ని కూడా విజయవాడ విమానాశ్రయం అంటారు. అదే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లా ఏర్పడితే గన్నవరం మచిలీపట్నం జిల్లాలోకి వెళుతుంది. అంటే, పొరుగున ఉన్న విజయవాడ కాకుండా గన్నవరం వాసులు దూరంగా ఉన్న మచిలీపట్నం వెళ్లాల్సి వస్తుంది.

ప్రకాశం జిల్లాలో వైవిధ్యం చాలా ఎక్కువ. సముద్రతీరం, సీమ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం.. అన్నీ కలసి ఉంటాయి. కర్నూలుకూ, ఒంగోలుకూ మధ్యలో కడపకు ఉత్తరంగా ఉన్న మార్కాపురం, గిద్దలూరు వంటి ప్రాంతాలవారు భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో ప్రత్యేక జిల్లాగా ఉండాలని కోరుకుంటారు. తూర్పుగోదావరిలోని అమలాపురం సఖినేటిపల్లి మధ్య ప్రాంతాలు కోనసీమగా ప్రత్యేక జిల్లాగా చాలా కాలం నుంచి కోరుతూ వచ్చారు. మచిలీపట్నం, చిత్తూరు వంటి పట్టణాలు పేరుకు జిల్లా కేంద్రాలుగా ఉన్నా, వాటి స్థానంలో విజయవాడ, తిరుపతి నగరాల్లోనే పాలన జరుగుతూ వస్తోంది. దీంతో పార్లమెంటు స్థానం యథాతథంగా కాకుండా ఆయా ప్రాంతాల సామాజిక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్.

‘‘లోక్ సభ నియోజకవర్గానికి ప్రధాన కార్యాలయం ఉండదు. అదసలు పాలనా కేంద్రమే కాదు. పేరు కోసం మాత్రమే. దానికీ ప్రజలకూ సంబంధం లేదు. తంబళ్లపల్లె వారికి రాజంపేట వెళ్లే అవసరం ఎప్పుడూ కలగదు. తిరుపతి పక్కన ఉండే వారిని చిత్తూరు వెళ్లమనడం వృథా. తిరుపతి జిల్లాలో నాలుగు కోస్తా నియోజకవర్గాలు వస్తాయి. గుంటూరులో బాపట్ల, తెనాలి జిల్లాలవుతాయి. బాపట్ల, తెనాలి మధ్య దూరం అరగంట. కానీ వాటి పరిధిలోని ప్రాంతాలు మాత్రం చాలా దూరంగా ఉంటాయి. ఇలాగే విభజిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదు. రైల్వే కోడూరు కడప కంటే తిరుపతికి దగ్గర. దీనిపై ఒక కమిటి వేసి శాస్త్రీయంగా విభజన జరపాలి’’ అని డిమాండ్ చేశారు రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి. పార్లమెంటుతో సంబంధం లేకుండా మదనపల్లె వంటి ప్రాంతాలకు జిల్లా కేంద్రం అయ్యే అర్హత ఉందనేది ఆయన అభిప్రాయం.

ఆంధ్రప్రదేశ్ మ్యాప్,

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

జిల్లా విభజనతో ఏం జరుగుతుంది - ఒరుగుతుంది?

జిల్లాల విభజన జరిగితే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను విభజిస్తారు. రెవెన్యూ, ఇతర పనుల కోసం దూరం వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. అలాగే జిల్లా స్థాయి అధికారుల పరిధి తగ్గి, పని భారం తగ్గుతుంది. ఉన్న వాటిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం వస్తుంది.

త్వరలో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. కరోనా వల్ల ఆగింది. కాబట్టి కొత్త జనాభా లెక్కలు వచ్చాక జిల్లాలు ఏర్పాటు చేస్తే బావుంటుందన్న వాదన కూడా ఉంది. 2011 తరువాత ఇప్పుడు జనాభా పెరిగింది. జనాభా చూడకుండా విభజన చేస్తే అస్తవ్యస్తం అయ్యే అవకాశం కూడా ఉంది.

పార్లమెంటు నియోజకవర్గాలు శాశ్వతం కాదు. 2026లో మళ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిటి వస్తుంది. వారు మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలను కలగాపులగం చేసినా ఆశ్చర్యం లేదు. కానీ జిల్లా అలా కాదు. ఒకసారి ఏర్పాటు చేస్తే, ఇక కదపరు. ఆంధ్రాలో ఇలా వందేళ్లు దాటిన జిల్లాలు కూడా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాల వారీగా వచ్చే కేటాయింపుల వల్ల మేలు జరుగుతుంది. ఉదాహరణకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఆంధ్రాలో ఇప్పుడు ఉన్న జిల్లాలకు అనుగుణంగా 13 కాలేజీలు వస్తాయి. జిల్లాల సంఖ్య పెరిగితే మెడికల్ కాలేజీలూ పెరుగుతాయి, తద్వారా వైద్య విద్య అభ్యసించేందుకు సీట్లూ పెరుగుతాయి.

ఉత్తరాంధ్ర వారి అభ్యంతరాలు

'పార్లమెంటు ప్రకారం విభజిస్తే ఏజెన్సీ మొత్తం ఒకే జిల్లా అవుతుంది. అసలు ఏమాత్రం వసతులు, సౌకర్యాలు, పారిశ్రామిక వనరులు లేని జిల్లాగా అరకు మారిపోతుంది. పైగా అక్కడ జిల్లా మొత్తం 1/70 చట్టం వస్తుంది. ఏం చేయడానికీ ఉండదు.

ఇక శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ప్రధాన పరిశ్రమలున్న ప్రాంతాలు అప్పుడు విజయనగరంలోకి వచ్చేస్తాయి. దీనివల్ల జిల్లా విభజన అరకు విషయంలో తప్ప, మిగతా విషయాల్లో ఉత్తరాంధ్రపై పెద్ద ప్రభావం చూపదు.

కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది విశాఖ ఎగ్జిగ్యూటివ్ కాపిట్ ఎక్కడ ఉంటుందనేదానిపై ఆధారపడి ఉంటుంది. అది విశాఖలోనే పెడతారా? విశాఖ-విజయనగరం మధ్యలో పెడతారా? అనేదానిపై ఉంటుంది. ఈలోపు జనాభా లెక్కలూ వస్తాయి. అప్పటి వరకూ ఆగి కొత్త జనాభా లెక్కల ఆధారంగా చేస్తే బావుంటుంది.

అన్నిటికీ మించి, ఈ జిల్లాల గొడవ కంటే, వలసల నివారణే ఉత్తరాంధ్ర ముందున్న సమస్య అంటు తమ వాదన వినిపించారు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షులు శివ శంకర్.

పేర్ల పంచాయితీ

జిల్లాల పేర్లు కూడా సమస్యే. కృష్ణా జిల్లాకు యన్టీఆర్ పేరు పెడతాం అని జగన్ హామీ ఇచ్చారు. బహుశా గుడివాడ ఉండే జిల్లాకు ఆ పేరు వస్తుంది.

ఇక గోదావరి జిల్లాల వారు కొత్త ఏర్పాటు చేయబోయే ఐదు జిల్లాలకీ (తూగో, పగో విడిపోతే ఐదు జిల్లాలు అవుతాయి.) గోదావరి పదం వచ్చేలా పెట్టాలంటూ డిమాండ్ వచ్చింది. వాటికి కొన్ని పేర్లు కూడా సూచించారు గోదావరి జిల్లాలకు సంబంధించి సోషల్ మీడియాలు గ్రూప్ నిర్వహించే ఈవీవీ సత్యనారాయణ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)