తమిళనాడు పోలీసు కస్టడీ మరణాలపై ప్రజాగ్రహం... కేసు సీబీఐకి ఇస్తామని సీఎం ప్రకటన

జయరాజ్
ఫొటో క్యాప్షన్, జయరాజ్

తమిళనాడులో పోలీస్ కస్టడీలో ఉన్న తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.

పి.జయరాజ్ (58), ఆయన కుమారుడు ఫెనిక్స్(38)లను లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం మూసివేయాల్సిన సమయం తరువాత కూడా దుకాణం తెరిచే ఉంచారన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరు రెండు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.. ఆ సమయంలో ఒకరి తరువాత ఒకరు మరణించారు.

ఈ సంఘటనపై తమిళనాడు రాష్ట్రమంతటా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో , రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదప్పాడి కె. పళనిసామి ఆదివారం ఒక ప్రకటన చేస్తూ, హైకోర్టు అనుమతిస్తే దీనిపై సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారు.

ఫెనిక్స్
ఫొటో క్యాప్షన్, ఫెనిక్స్

జూన్ 19న ఏం జరిగిందంటే

షాపులు మూయంచేందుకు పోలీసులు వచ్చినప్పుడు ఫెనిక్స్‌కు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఫెనిక్స్‌, ఆయన తండ్రి జయరాజ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జయరాజ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.వారి వెనకే ఫెనిక్స్ కూడా స్టేషన్‌కు వెళ్లారు. జయరాజ్‌ను, ఫెనిక్స్‌ను పోలీసులు స్టేషన్‌లోని సెల్‌లో బంధించారు.

పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం, లాక్‌డౌన్‌లో అనుమతించిన సమయం దాటాక కూడా నడుస్తున్న షాపులను మూయించేందుకు పోలీసులు వెళ్లినప్పుడు జయరాజ్, ఫెనిక్స్, వారి మిత్రులు కొందరు వారి దుకాణం ముందు నిల్చొని ఉన్నారు. వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. కానీ, వారు పోలీసులనే తిట్టారు. పోలీసుల విధులకు అడ్డుపడ్డారు. పోలీసు అధికారిని చంపేస్తామని కూడా వారు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్‌లో ఉంది.

జయరాజ్, ఫెనిక్స్‌లపై 188, 269, 294(బీ), 353, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. జూన్ 21న వాళ్లిద్దరినీ కోవిల్‌పట్టి సబ్ జైలుకు పంపించారు. జయరాజ్, ఫెనిక్స్ కిందపడ్డారని, వాళ్లకు అంతర్గత గాయాలయ్యాయని కూడా ఎఫ్ఐఆర్‌లో ఉంది. కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఫెనిక్స్ మరణించారు. మంగళవారం ఉదయం జయరాజ్ ప్రాణాలు కోల్పోయారు.

కస్టడీ మరణాలపై నిరసన
ఫొటో క్యాప్షన్, కస్టడీ మరణాలపై నిరసన

''జూన్ 22 సాయంత్రం తలనొప్పి కారణంగా ఫెనిక్స్ చనిపోయారు. జైలు సూపరింటెండెంట్ సాయంతో డ్యూటీలో ఉన్న వార్డెన్ ఆయన్ను చికిత్స కోసం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

కానీ, రాత్రి 9 గంటలకు ఆయన చనిపోయారు. కొన్ని గంటల తర్వాత జయరాజ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆయన మరణించారు'' అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

''కింద పడటం వాళ్లకు అలాంటి గాయాలవుతాయా? సతాంకులంలో చాలా జైళ్లు ఉన్నాయి. అయినా, వారిని వంద కి.మీ.ల దూరంలోని కోవిల్‌పట్టి జైల్లో ఎందుకు పెట్టారు'' అని జయరాజ్, ఫెనిక్స్‌ల బంధువు చార్లెస్ ప్రశ్నించారు. రక్తస్రావం వల్ల ఫెనిక్స్ మరణించారని, ఫెనిక్స్ మలద్వారంలో లాఠీ పెట్టారని చార్లెస్ ఆరోపించారు. అయితే, పోలీసుల నుంచి అధికారిక పోస్ట్ మార్టమ్ నివేదికను ఇంకా కోర్టులో సమర్పించలేదు.

ఈ ఉదంతంపై మానవ హక్కుల సంఘం పోలీసులకు నోటీసులు పంపింది. సతాంకులానికి ఓ విచారణ కమిటీని పంపినట్లు తెలిపింది. తాజాగా జూన్ 28న ముఖ్యమంత్రి పళనిసామి దీనిపై స్పందించారు. హైకోర్టు అనుమతితో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తామన్నారు.

కోవిల్‌పట్టి జైలు
ఫొటో క్యాప్షన్, కోవిల్‌పట్టి జైలు

తండ్రీకొడుకుల మృతి తరువాత ఏమైంది?

మరణానికి ముందు ఆ తండ్రీకొడుకులిద్దరినీ తీవ్రంగా వేధించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రంలోని విపక్ష ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై నిరసన వ్యక్తంచేశారు.

వర్తక సంఘాలూ పోలీసుల చర్యను ఖండించాయి. స్థానిక న్యాయస్థానం ఒకటి ఈ కేసును విచారణకు స్వీకరించింది.

ఈ తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసును ప్రభుత్వం బదిలీ చేసింది.

బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అందించింది.

దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో జరిగితే ఇండియాలో స్పందించారు.. దక్షిణ భారతంలో జరిగితే స్పందించలేదు

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీస్ అధికారి మోకాలితో మెడపై నొక్కిపెట్టి హతమార్చిన ఘటన తరువాత దానిపై భారత్‌లోనూ సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు.

కానీ, తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై మాత్రం పెద్దగా స్పందన లేదు.తమిళనాడులోని తూత్తుకుడి వంటి చిన్నపట్టణంలో ఈ ఘటన జరగడంతో అది నేషనల్ మీడియా దృష్టిలో పడడానికి సమయం పట్టింది.

ఇటీవల వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో దీనిపై తీవ్ర చర్చ జరగడంతో ఇప్పుడు అందరి దృష్టిలో పడింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘దక్షిణ భారతదేశంలో జరిగే ఘటనలపై ఎవరూ చర్చించడం లేదు.. అవి ఇంగ్లిష్‌లో రాకపోవడమే దానికి కారణం’’ అని నెటిజన్ ఒకరు ఓ వీడియోలో చెప్పారు.

మృతులను ఎంతగా వేధించారో కూడా ఆమె వివరించారు.మరోవైపు ఈ ఇద్దరి మరణానికి కారణంగా భావిస్తున్న పోలీసుపై హత్య కేసు పెట్టకుండా కేవలం ట్రాన్స్‌ఫర్ చేయడంతో సరిపెట్టడంపైనా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

ఇప్పుడు దీనిపై రాహుల్ గాంధీ, క్రికెటర్ శిఖర్ ధావన్ వంటివారూ స్పందించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి పడింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోలీసుల జులుం

అయేషా పెరీరా, బీబీసీ ఇండియా ఆన్‌లైన్ ఎడిటర్

భారత్‌లో 2019లో 1731 మంది పోలీసు కస్టడీలో మరణించినట్లు కొన్న స్వచ్ఛంద సంస్థల కన్సార్టియం ఒకటి తన నివేదికలో వెల్లడంచింది.

అంటే సగటున రోజుకు అయిదుగురు పోలీస్ కస్టడీలో చనిపోతున్నారు.పోలీసులు ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో కూడా ఆ నివేదికలో చెప్పారు.

నేరాంగీకారం పేరుతో నిందితులను తీవ్రంగా హింసించడం భారతదేశంలో పోలీసింగ్‌లో భాగంగా మారిందన్నది వాస్తవం.

దీనికి కారణమయ్యే పోలీసులకు చాలా అరుదుగా శిక్ష పడుతుంది.చాలాసార్లు వారిని బదిలీ చేయడంతోనే సరిపెడతారు.

అరుదుగా మాత్రమే వారిని బాధ్యులను చేస్తారు. ఈ పరిస్థితి మారాలని న్యాయవ్యవస్థ ఎన్నోసార్లు వ్యాఖ్యానించింది.

‘‘కస్టడీలో నిందితుడు చనిపోయి ఆ నిజం వెల్లడైనా కూడా తమనెవరూ ఏమీ చేయరన్న ధైర్యం పోలీసులకు ఉంది’ అని గత ఏడాది ఒక కేసు తీర్పులో న్యాయమూర్తి అన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

పోలీసులపై ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక అథారిటీని అన్ని రాష్ట్రాలూ ఏర్పాటు చేయాలని 2006లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ అలాంటి వ్యవస్థ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)