అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఇస్లామిక్‌ దేశాలు యోగాను ఎలా ఒప్పుకున్నాయి? యోగా నిజంగానే మతపరమైన అభ్యాసమా?

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న విద్యార్ధిని (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జమ్మూకాశ్మీర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న విద్యార్ధిని (ఫైల్ ఫొటో)
    • రచయిత, విలియం క్రీమ్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యోగా క్లాసుల్లో చాలామంది తాము సరిగ్గా శ్వాస పీలుస్తున్నామా, కాళ్లు సరైన దిశలో ఉంటున్నాయా లేవా అని చూసుకుంటారు. కానీ కొంతమంది అసలు యోగా క్లాసులకు వెళ్లాలా వద్దా అన్నదానిపై మదనపడుతుంటారు. వెళితే తమ మతం పాడైపోతుందేమోనన్న ఆందోళన వారిది.

అమెరికాలో ఉంటున్న ఫరీదా హమ్జా అనే ముస్లిం మహిళ యోగా టీచర్ కావాలని నిర్ణయించుకున్నారు. ఆమె గత రెండు, మూడేళ్లుగా యోగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. "నా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులకు ఈ విషయం చెప్పినప్పుడు వారి స్పందన సానుకూలంగా లేదు. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో అని వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఇస్లాంకు వ్యతిరేకం అనుకుంటారు వారు" అన్నారు.

ఫరీదా హమ్జా
ఫొటో క్యాప్షన్, ఫరీదా హమ్జా

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ముస్లిం, క్రైస్తవ, యూదు మతాలకు చెందిన వారు యోగా గురించి ఇటువంటి సందేహాలనే వ్యక్తం చేస్తున్నారు. వారు యోగాను హిందూ, బౌద్ధమతాలతో ముడిపడి ఉన్న ఒక పురాతన ఆధ్యాత్మిక సాధనగా చూస్తున్నారు. 2012లో బ్రిటన్‌లో ఓ చర్చి యోగా క్లాసులను నిషేధించింది. "యోగా ఒక హిందూ ఆధ్యాత్మిక సాధన. కాథలిక్ చర్చిగా మనం సువార్తను (యేసు ఉపన్యాసాలు) ప్రచారం చేయాలి" అని పాస్టర్ జాన్ షాండ్లర్ అన్నారు.

అమెరికాలో కూడా ప్రముఖ మతాధికారులు యోగాను "ది డెవిల్‌" అని పిలుస్తారు. మరి యోగా నిజంగానే మతపరమైన అభ్యాసమా? "యోగా ఒక విస్తృత పదం, ఇది కొందరికి ఇబ్బందిని కలిగిస్తుంది" అని 'యోగా లండన్' సహ వ్యవస్థాపకులు రెబెకా ఫ్రెంచ్ అన్నారు.

శారీరక, మానసిక శాంతికి యోగా

యోగాలో చాలా రకాలు ఉన్నాయని, వాటిలో కొన్ని మిగతా వాటితో పోలిస్తే మతపరంగా కనిపిస్తాయని రెబెకా ఫ్రెంచ్‌ అంటారు. ఉదాహరణకు హరేకృష్ణ భక్తులు ''సాధుభక్తి యోగా''ను అనుసరిస్తారు. పాశ్చాత్య దేశాలలో యోగా అంటే హఠయోగా. ఇది శారీరక, మానసిక బలాన్ని పెంచుకోవడానికి అనుసరించే విధానం.

చాలామంది హిందువులు యోగా ద్వారా ప్రకృతి నిజమైన స్వభావాన్ని, మన వాస్తవ స్థితి గురించి తెలుసుకోవచ్చని నమ్ముతారు. జనన, మరణ బంధాలను వదిలించుకోవడానికి చాలామంది దీనిని ఒక సాధనంగా భావిస్తారు. క్రైస్తవ, ఇస్లాం, ఇంకా ఇతర మతాలలో వీటన్నింటినీ నమ్ముతారా అనేది చర్చనీయాంశం.

సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం శారీరక శ్రమలకు సంబంధించిన సమ్మిళిత భంగిమ. కానీ ఇది హిందూవుల సూర్యారాధనతో ముడిపడి ఉంది. "ఇది కొంచెం మతపరమైనది, కానీ అది మీ దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. మోకరిల్లడం అంటే ప్రార్థన అని అర్ధం. నేను నమస్కరిస్తున్నానని కూడా అనుకోవచ్చు" అంటారు రెబెకా ఫ్రెంచ్

యోగా నేర్చుకోవడానికి హిందూ దేవాలయానికి వెళుతుండగా ఫరీదా హమ్జా మనసులో కూడా ఇలాంటి సందేహాలే ఉన్నాయి. ఆమె తన బ్లాగులో "నన్ను నేను నిందించుకున్నాను, కాని చివరికి అల్లా నా ఉద్దేశాలను అర్థం చేసుకున్నాడని నాకు నమ్మకం కలిగింది. నేను ఏ మతపరమైన కర్మలోనూ చేరడానికి ఇష్టపడనని, యోగాలో నా భావాలకు పూర్తి గౌరవం లభిస్తుందని భావిస్తున్నాను" అని రాసుకున్నారు.

యోగా భంగిమలు

ఇరాన్‌లో యోగా ఒక ఆట

యోగాలో చాలా రకాలుంటాయి. చాలామంది హిందూమంత్రాలను పఠిస్తూ, మరికొందరు జీవాన్నిచ్చే శక్తులను, మరికొందరు విశ్వాంతరాళ శక్తులను మననం చేసుకుంటారు.

యోగా శిక్షణ ముందుగా నమస్తే అంటూ ప్రార్ధనలతో మొదలై శుభాశీస్సులతో ముగుస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఓంకారాన్ని జపించాల్సి ఉంటుంది. కానీ చాలా యోగా క్లాసులలో ఇది అస్సలు జరగదు.

ఇరాన్‌లో యోగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ దాన్ని ఒక ఆటగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా యోగా సమాఖ్యలు టెన్నిస్ లేదా ఫుట్‌బాల్ సమాఖ్యల మాదిరిగానే పనిచేస్తాయి. ఇక్కడ ప్రతి ఆసనం భౌతిక ప్రయోజనాలకు ఉద్దేశించిందే.

ఫరీదా హమ్జా

'ఓపెనింగ్ సీక్వెన్స్‌'

మలేషియాలో కూడా ఆధ్యాత్మిక యోగాపై ఇలాంటి పరిమితులు ఉన్నాయి. అమెరికన్‌లు యోగాలో అనేక మార్పులు చేశారు. అష్టాంగ యోగా పేరుపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా పాఠశాలల్లో, పద్మాసనాన్ని 'క్రిస్-క్రాస్ ఆపిల్ సాస్' అని, సూర్య నమస్కారానికి 'ఓపెనింగ్ సీక్వెన్స్' అని పేరు పెట్టారు. ఇది కేవలం శారీరక వ్యాయామమని నిర్వాహకులు నొక్కి చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు తల్లిదండ్రులు, క్రైస్తవ సంస్థలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

యోగాలో మతపరమైన భావనలున్నప్పటికీ కొన్ని మార్పులు చేర్పులతో దాన్ని అనుసరించవచ్చని 2013లో శాన్‌ డియాగో కోర్టు తీర్పు చెప్పింది. ఈ మార్పులతో పాఠశాలల్లో బోధించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. "పశ్చిమ దేశాలలో చాలామంది యోగాను మతరహితంగా భావిస్తారు ఎందుకంటే ఇది తర్కాన్ని ప్రోత్సహిస్తుంది" అని ''నేషనల్ సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ'' అనే క్రైస్తవ సంస్థ అధ్యక్షుడు డీన్ బ్రాయిల్స్ అన్నారు.

ప్రొటెస్టెంట్‌లు పదాలు, విశ్వాసంపై ప్రధానంగా దృష్టి పెడతారని, అష్టాంగ యోగా ప్రయత్నం, అనుభవం గురించి చెబుతుందని ఆయన వివరించారు.

యోగాలోని కొన్నిభావనలను ఇతర మతాలను వ్యతిరేకించవచ్చని హిందూ సంస్థలు కూడా నమ్ముతున్నాయి. అయితే అలాంటి వ్యతిరేకత హిందూ మతంలోని కొన్నినమ్మకాలలో కూడా ఉంది.

ఇతర మతాలు తమకు ఇబ్బంది కలిగినచోట చిన్నచిన్న మార్పులు చేసి దాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమెరికన్ క్రైస్తవులకు ప్రెసుమోవ్‌ వంటి ఇతర ఆప్షన్లు ఉన్నాయి. ఇది యోగాకు క్రిస్టియన్‌ వెర్షన్.

బీరు యోగా
ఫొటో క్యాప్షన్, బీరు యోగా

‘‘నేను యోగా చేయడం అల్లా అనుగ్రహం’’

''యోగా సాధన చేసిన తరువాత ఎక్కువ ఏకాగ్రతతో ప్రార్థన చేయగలుగుతున్నామని మా విద్యార్థులు చెబుతున్నారు'' అని ఇరాన్‌లో ఒక యోగా ఉపాధ్యాయుడు బీబీసీతో అన్నారు. "మేము ఇస్లాంలో అనుసరించే బోధనలన్నీ యోగాలో కనిపిస్తాయి. ఇస్లాంలో పేదలకు సహాయం చేసినట్లే, ఒక యోగి కూడా అదే చేస్తాడు. మీరు నిజాయితీగా ఉండాలి, అహింసాత్మకంగా ఉండాలి. ఈ విషయాలన్నీ ఇస్లాంలో ఉన్నాయి, యోగాలో కూడా ఉన్నాయి'' అన్నారు ఫరీదా హమ్జా.

"ముస్లింలు ప్రార్థించే విధానమంతా యోగాలో కనిపిస్తుంది. యోగాను ద్వేషించే ముస్లింలకు దాని గురించి తెలియదు. ప్రార్థన సమయంలో ముస్లింలు వారి మధ్య వేలు, బొటనవేలును ఒకచోటకు చేరుస్తారు. ఇది యోగా భంగిమ లాంటిది" అన్నారు హమ్జా.

వీడియో క్యాప్షన్, వీడియో: ఈ బామ్మ యోగా ఎలా చేస్తున్నారో చూశారా?

అయితే, యోగా ఇస్లాంను ప్రభావితం చేసిందంటే తాను నమ్మనని ఆమె చెబుతారు. "నేను యోగా చేయడం అల్లా అనుగ్రహం. ఈ రూపంలో ఆయన నాకు మంచి చేశారు" అంటున్నారు హమ్జా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)