లిపులేఖ్, లింపాధురియాలపై నేపాల్ ఎందుకు పంతం పడుతోంది? భారత్‌పై కాలుదువ్విందా?

- రచయిత, సురేంద్ర ఫుయాల్
- హోదా, బీబీసీ కోసం
లిపులేఖ్ పాస్ మీదుగా ఉత్తరాఖండ్ నుంచి మానసరోవర్‌కు వెళ్లే రహదారిని భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 8వ తేదీన ప్రారంభించారు. అయితే భారత్, చైనా, నేపాల్ సరిహద్దులను కలిపే ఈ ట్రై జంక్షన్‌లో ప్రాంతంలో ఇండియన్ గవర్నమెంట్ నిర్మించిన ఈ రహదారి ప్రాజెక్టు ప్రారంభం కాకముందే నేపాలీల నుంచి ఆగ్రహం వినిపిస్తోంది.
గుంజి-లిపులేఖ్ మీదుగా మానససరోవర్‌కు వెళ్లే ఈ రోడ్డు ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్సు ద్వారా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేస్తుండగానే, కాఠ్‌మండూలో భారత వ్యతిరేక ప్రదర్శనలు మొదలయ్యాయి.
అంతేకాదు లిపులేఖ్ పర్వత ప్రాంతం తమ దేశంలోనిదేనని, ఇది తమ అంతర్గత భూభాగమని భారత ప్రభుత్వానికి నేపాల్ సర్కారు ఘాటైన పదజాలంతో రాయబార కార్యాలయం ద్వారా సందేశం పంపింది.
తమ భూభాగంలో భారత ప్రభుత్వం 22 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించిందని నేపాల్ ఆరోపించింది.
కొన్నిరోజుల కిందట అంటే అక్టోబర్ 31న భారత ప్రభుత్వం జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత అధికారికంగా దేశానికి సంబంధించిన ఒక మ్యాప్ విడుదల చేసింది.
ఈ మ్యాప్‌లో ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య ఉన్న కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు భారత్‌లోనే ఉన్నట్టు చూపించారు.
అంతకు ముందు మే 2015లో వ్యాపార సంబంధాల కోసం లిపులేఖ్ ప్రాంతంలో ట్రైజంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్న భారత్-చైనాల నిర్ణయంపై కూడా నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు తెలిపింది.
త్రైపాక్షికంగా జరగాల్సిన ఈ ఒప్పందంలో తనను పక్కనబెట్టడంపై చైనాను ప్రశ్నించింది నేపాల్.

ఫొటో సోర్స్, twitter/rajnathsingh
నేపాల్ కాలుదువ్విందా?
లిపులేఖ్ వ్యవహారంలో ఒకపక్క కాఠ్‌మాండులో భారత వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతుండగానే, బుధవారంనాడు నేపాల్ మరో సాహసోపేతమైన చర్యకు దిగింది.
మొట్టమొదటిసారిగా మహాకాళీ నది ప్రాంతంలోకి సాయుధ పోలీసు బలగాలను నడిపించింది.
ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్‌కు చెందిన బ్యారక్స్‌కు ఎదురుగా, కాలాపానీ సమీపంలోని ఛంగ్రు గ్రామంలోకి తన దళాలను చేర్చి అక్కడ ఒక ఔట్‌పోస్టును ఏర్పాటు చేసింది.
1816లో ఆంగ్లో-నేపాల్ సగౌలీ ఒప్పందం కుదిరిన తర్వాత అంటే 204 ఏళ్ల అనంతరం నేపాలీ సైన్యం మళ్లీ ఇక్కడ అడుగు పెట్టింది. రెండు సంవత్సరాలపాటు సాగిన బ్రిటన్-నేపాల్ యుద్ధం తర్వాత మహాకాళీ నదికి పశ్చిమాన ఉన్న ప్రాంతాన్ని బ్రిటీష్ వారికి వదులకుంటూ అప్పట్లో ఒప్పందం చేసుకుంది నేపాల్.
అయితే లిపులేఖ్ విషయంలో గత కొద్దివారాలుగా కాఠ్‌మాండూలో జరుగుతున్న భారత వ్యతిరేక ఆందోళనలు, రాయబార చర్యలు ఇన్నాళ్లుగా సవ్యంగా సాగతున్న భారత నేపాల్ సంబంధాలపై ప్రభావం చూపాయి. రెండు దేశాల మధ్య సత్సంబంధాల గురించి చెప్పాల్సి వస్తే, గత నెలలోనే నేపాల్ ప్రధానమంత్రి కె.పి.ఓలి, భారతప్రధాని నరేంద్రం మోడీ కోవిడ్-19పై యుద్దంలో కలిసి పని చేస్తామని ప్రతిజ్జ చేశారు.
కానీ లిపులేఖ్ విషయానికి వచ్చేసరికి భారత్ తీరుపై నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''నేపాల్ తన భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోదు '' అని ఆ దేశ ప్రధాని కె.పి.ఓలి స్పష్టంగా ప్రకటించారు.
రెండు దేశాల మధ్య చిచ్చురగల్చాల్సినంతగా లిపులేఖ్‌లో ఏముంది? ఈ పర్వత ప్రాంతం, మహాకాళీ నదీ జన్మస్థానంపై నేపాల్‌కు అంత పట్టుదల ఎందుకు? మరి లిపులేఖ్‌కు భారత్ కూడా ఎందుకు అంతగా ప్రాధాన్యతనిస్తోంది?

ఫొటో సోర్స్, SURVEY OF INDIA
వివాదానికి అసలు కారణాలు
భారతదేశానికి చెందిన చాలామంది పండితులు ఇండో-నేపాల్ బంధం చాలా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. ప్రపంచంలో ఈ రెండు దేశాల మధ్య కూడా భారత్-నేపాల్‌ల మధ్య ఉన్నంత చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక అనుబంధం లేదంటారు.
కానీ 1800 కి.మీ.ల మేర ఉన్న సరిహద్దులపై మాత్రం నిత్యం వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.
మహాకాళి, గండక్ నదులు నిత్యం తమ మార్గాన్ని మార్చుకుంటున్నందువల్ల నూటికి నూరుపాళ్లు ఈ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సరిహద్దు ఇది అని చెప్పడం కష్టంగా మారింది.
మిగిలిన చాలా ప్రాంతాల్లో హద్దులు తెలిపే స్థంభాలు ఉన్నాయి. కానీ నిత్యం అటూ ఇటూ తిరిగే స్థానికులు ఎప్పుడూ పట్టించుకోరు. సంవత్సరాల తరబడి ఇరు దేశాలకు చెందిన సర్వేయర్లు, టెక్నీషియన్లు కృషి చేస్తున్నా పూర్తిస్థాయిలో సరిహద్దుల నిర్ణయం జరగలేదు.
ఇరు దేశాల మధ్య సరిహద్దుల గుర్తింపు దాదాపు జరిగిపోయిందని అయితే నదుల విషయంలో కొన్ని సమస్యలున్నట్లు కాఠ్‌మండూలోని అధికారులు కొందరు చెబుతున్నారు.
నేపాల్, భారత్‌లను ఆనుకుని ప్రవహించే మహాకాళీ, గండక్ నదులకు సంబంధించిన హద్దుల గుర్తింపు ఇంకా అధికారికంగా పూర్తి కాలేదు.
సమస్య సరిగ్గా లిపులేఖ్ మౌంటెయిన్ పాస్ దగ్గరే ఎదురవుతోంది. లిపులేఖ్ పర్వతం మహాకాళీ నదికి తూర్పున ఉందని, కాబట్టి ఇది సహజంగానే ఇది తమ దేశంలో అంతర్భాగమని నేపాల్ వాదిస్తోంది.
ఈ విషయం మార్చి 4, 1816లో బ్రిటన్-నేపాల్‌ల మధ్య కుదిరిన సగౌలీ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. ''ఈ ఒప్పందం ప్రకారం మహాకాళీ నదికి పశ్చిమాన సట్లెజ్ వరకు ఉన్న తరాయి లేదా లోతట్టు భూభాగంపై హక్కులను నేపాల్ వదులకుంది'' అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పేర్కొంది.
మరి 1816నాటి సగౌలీ ఒప్పందం మహాకాళీ నది తూర్పు భాగం నేపాల్‌దే అన్నప్పుడు మరి సమస్య ఎక్కడ?

మహాకాళీ జన్మస్థానం ఏది?
మహాకాళీ నది ఎక్కడ పుట్టిందన్న విషయంలోనే సమస్య మొదలవుతోందని నేపాలీ చరిత్రకారులు, సర్వే అధికారులు చెబుతున్నారు. మరి నిజంగా మహాకాళీ నది జన్మస్థానం ఎక్కడ? లింపియాధురా పర్వతాలలోనా లేక లిపులేఖ్ పర్వతాలలోనా?
ఇటీవల భారత్ రోడ్డు మార్గాన్ని నిర్మించిన గుంజి గ్రామం సమయంలో రెండు చిన్ననదుల సంగమ ప్రాంతం ఉంది. ఆ నదులలో ఒకటి లింపియాధురా పర్వతంలో ఆగ్నేయ ప్రాంతం నుంచి పశ్చిమదిశగా ప్రవహిస్తుంది. రెండోది లిపులేఖ్ ప్రాంతంలోని దక్షిణ ప్రాంతంవైపు సాగుతుంది.
మహాకాళీ నది లింపియాధురా పర్వత శ్రేణిలో పుట్టి వాయవ్య దిశగా భారతదేశంలోని ఉత్తరాఖండ్ వైపు ప్రవహిస్తుందని నేపాలీ నిపుణులు, అధికారుల అభిప్రాయపడుతున్నారు.
అయితే భారత నుంచి దానికి విరుద్ధమైన వాదన వినిపిస్తోంది. లిపులేఖ్ నుంచి నేపాల్‌లోని ఈశాన్యం దిశగా ప్రవహించే నదే మహాకాళీ నదికి మూలమని భారత అధికారులు వాదిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య సరిహద్దు అని వారు చెబుతున్నారు.
మహాకాళీ-కాలాపాని వ్యవహారం నేపాల్ జాతీయ రాజకీయాలపై మూడు దశాబ్దాల నుంచి ప్రభావం చూపడం మొదలుపెట్టింది.
రోడ్డు నిర్మాణంపై నేపాల్‌వైపు నుంచి వ్యతిరేకతక రావడంతో భారత ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రకటన చేసింది. నేపాల్ భూభాగాన్ని ఎక్కడా ఆక్రమించలేదని తెలిపింది.
ఇప్పుడు నిర్మించిన రోడ్డు సంప్రదాయంగా మానసరోవర్ యాత్రికులు వెళ్లే మార్గమేనని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, SAVE THE BORDER CAMPAIGN

చరిత్ర ఏం చెబుతోంది?
నేపాల్ చరిత్రకారులు, అధికారులు, గుంజి గ్రామస్తులు మాత్రం భారత ప్రభుత్వం నిర్మించిన రోడ్డు నేపాల్ పరిధిలోకి వస్తుందని, ఇందుకు 1816లో కుదిరిన ఆంగ్లో-నేపాల్ ఒప్పందమే మూలమని చెబుతున్నారు.
లిపులేఖ్, గుంజితోపాటు మహాకాళీ నదికి ఉత్తరప్రాంతంలో భారత్ ఆధీనంలో ఉన్న కాలాపానీ (ఇందులోనే ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్ పోస్ట్‌లు ఉంటాయి. 1950లో చైనా మిలిటరీ కదలికకు పోటీగా వీటిని ఏర్పాటు చేశారు), ఇంకా పశ్చిమ ప్రాంతంలో ఉన్న లింపియాధురా కూడా నేపాల్‌లో అంతర్భాగమేనని నేపాలీ అధికారులు పదే పదే వాదిస్తున్నారు.
లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు హిమాలయ ప్రాంతంలో ఉంటాయని, ఇక్కడ మనుషుల సంచారం చాలా తక్కువని, తాము ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించలేదని, అందుకే ఆర్మీ పోస్టులుగానీ, మౌలిక సదుపాయాలుగానీ ఏర్పాటు చేయలేదని అంటున్నారు.
ఇవి తమ భూభాగంలోనివే అనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని నేపాలీ అధికారులు వాదిస్తున్నారు.
1816 నాటి సగౌలి ఒప్పందంతోపాటు, దానికంటే ముందు బ్రిటీష్ ఇండియా అధికారులు రూపొందించిన అధికారపత్రాలు, లేఖలు కూడా తమ వద్ద ఉన్నాయంటున్నారు నేపాల్ అధికారులు. అలాగే గుంజి, కాలాపానీ గ్రామస్తులకు ఓటరు ఐడీలాంటి నేపాలీ గుర్తింపు కార్డులు, భూమి పన్ను రసీదులు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.
1908లో మానసరోవర్‌ను సందర్శించిన యోగి భవాన్ శ్రీహంసలాంటి సుప్రసిద్ధ యోగులు రాసిన పత్రాలు, లిపులేఖ్‌కు దక్షిణాన ఉన్న ఛంగ్రు గ్రామంలో నేపాలీ పోలీసుల కదలికల గురించి 1930, 1940లలో మానసరోవరాన్ని సందర్శించిన స్వామి ప్రణవానంద రాసిన వివరాలను నేపాలి అధికారులు ఇవి తమ భూభాగం అనడానికి ఆధారంగా చూపుతున్నారు.
లిపులేఖ్ వివాదం నేపథ్యంలో గత దశాబ్దాలుగా కాలాపానీ ప్రాంతాన్ని సందర్శిస్తున్న నేపాలీ అధికారులు, జర్నలిస్టులు తాము గుంజి, కాలాపానీ గ్రామాల ప్రజల దగ్గరున్న నేపాలీ గుర్తింపు కార్డులను చూశామని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, DoS Nepal
భారత్ ఏం చేయబోతోంది?
అయితే నేపాలీ భూభాగాలను తాము ఆక్రమించామనే, చొరబాట్లకు పాల్పడ్డామనే వాదనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వివాదాన్ని వీలయినంతగా త్వరగా సమసిపోయేలా ప్రయత్నాలు చేస్తున్నామని అటు నేపాల్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం, ఇటు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చెబుతున్నాయి.
లిపులేఖ్, కాలాపాని విషయలో గత కొన్నేళ్లుగా నేపాల్‌లో భారత వ్యతిరేక నినాదాలు వినిపిస్తూనే ఉన్నా...సమస్య మాత్రం సమసిపోవడం లేదు. అందుకే భారత్ మీద ఆక్రమణ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఏకంగా నేపాల్ భూభాగంలో రోడ్డు కూడా నిర్మించారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆధారాలు:
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా: సగౌలి ఒప్పందం (మార్చ్ 4, 1816)
ఆంగ్లో-నేపాలీస్ వార్ (1814-1816) ముగిసిన తర్వాత బ్రిటీష్ అధికారులకు, గూర్ఖా నాయకులకు మధ్య జరిగిన ఒప్పందమే సగౌలి ఒప్పంది. ఈ ఒప్పందం ప్రకారం కాళీ నదికి పశ్చిమాన సట్లెజ్ నది వరకు ఉన్న తరాయి లేదా లోతట్టు ప్రాంతంపై నేపాల్ అధికారాన్ని వదులుకుంటుంది. నేపాల్ స్వతంత్ర దేశమవుతుంది. అయితే భారత్‌లోలాగా అధికారాలు చెలాయించకపోయినా బ్రిటీష్ వారి ప్రతినిధిగా నేపాల్‌లో ఒక ఆంగ్లేయ రాయబారిని ఏర్పాటు చేస్తారు)
ఇవి కూడా చదవండి:
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








