నేపాల్: 'లిపులేఖ్, లింపియాధురా కాలాపానీ' తమవే అంటూ కొత్త మ్యాప్‌ను ఆమోదించిన క్యాబినెట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురేంద్ర ఫుయాల్
- హోదా, కాఠ్‌మండూ నుంచి, బీబీసీ హిందీ కోసం
కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపించే అధికారిక రాజకీయ మ్యాప్‌ను నేపాల్ కేబినెట్ ఆమోదిస్తూ, ఓ సంచలన అడుగు వేసింది.
మహాకాలీ నది మొదలయ్యేది లింపియాధురాలోనేనని నేపాల్ మరోసారి నొక్కిచెప్పింది. ప్రస్తుతం భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో ఈ లింపియాధురా ప్రాంతం ఉంది.
భారత్ మాత్రం నేపాల్ వాదనను తిరస్కరిస్తూ వస్తోంది.
టిబెట్‌లో ఉండే మానస సరోవర్‌కు వెళ్లే లిపులేఖ్ మార్గంలో ఓ సరిహద్దు రహదారిని భారత్ పది రోజుల క్రితం ప్రారంభించింది. దీనిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాఠ్‌మాండూలోని వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఆ దేశ పార్లమెంటులోనూ భారత్ తీరుపై నిరసన వ్యక్తమైంది.
అంతకుముందు ఆరు నెలల క్రితం జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త రాజకీయ మ్యాప్‌లో లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్‌లను భారత్ తమ భూభాగాలుగా చూపించింది. అయితే, ఇవి తమ భూభాగాలని నేపాల్ చాలా కాలంగా వాదిస్తోంది.

ఫొటో సోర్స్, SAVE THE BORDER CAMPAIGN/HANDOUT
నేపాల్ కేబినెట్ తాజా నిర్ణయం కొత్త ఆరంభమని, కొత్త విషయం మాత్రం కాదని ఆ దేశ మంత్రి గణ్‌శ్యామ్ భూసల్ కాంతిపుర్ టీవీతో అన్నారు.
‘‘మహాకాలీ నదికి తూర్పున ఉన్న ప్రాంతం నేపాల్‌కు చెందుతుందని మేం చాలా కాలంగా చెబుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ఆ ప్రాంతాలను మ్యాప్‌లో చూపించింది’’ అని చెప్పారు.
అయితే, భారత ప్రభుత్వంతో ఈ విషయానికి సంబంధించి దౌత్యపరమైన చర్చలు కొనసాగుతాయని గణ్‌శ్యామ్ తెలిపారు.

1816 ఆంగ్లో-నేపాల్ సుగాలీ ఒప్పందం ప్రకారం మహాకాలీ నది మొదలయ్యే ప్రాంతం లింపియాధుర అని నేపాల్ పదేపదే అంటోంది. ఈ నదికి తూర్పునున్న ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తోంది.
కానీ, భారత ప్రభుత్వం మాత్రం మహాకాలీ నది లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలకు తూర్పున మొదలవుతుందని వాదిస్తోంది.
కోవిడ్-19 సంక్షోభం ముగిసిన తర్వాత భారత్, నేపాల్‌ల మధ్య విదేశాంగ కార్యదర్శి స్థాయిలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
నేపాల్ కేబినెట్ సోమవారం మ్యాప్‌పై తాజా నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతరత్రా చోట్ల ఇకపై ఇదే మ్యాప్‌ను వాడాలని వివిధ ప్రభుత్వ విభాగాలకు నేపాల్ ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Narayan Maharjan/NurPhoto via Getty Images
భారత్ మే 8న కాలాపానీ, గంజీ ప్రాంతాల గుండా లిపులేఖ్ మార్గంలో సరిహద్దు రహదారిని తెరిచిన తర్వాత... కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవని నేపాల్ మళ్లీ గొంతెత్తింది. కాఠ్‌మాండూలోని భారత రాయబారికి, భారత విదేశాంగ శాఖకు తమ అభ్యంతరాలను తెలియజేసింది.
కోవిడ్-19పై పోరాటంలో భారత్, నేపాల్‌ల మధ్య సహకారం కొనసాగుతున్నా, సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ పరిణామం నేపాల్‌ను సరిహద్దు భద్రత విషయమై దృష్టి సారించేలా చేసింది.
గంజీ-లిపులేఖ్ మార్గం ప్రారంభమైయ్యాక, చరిత్రలో తొలిసారి నేపాల్ తమ సశస్త్ర సీమా బల్ (ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్)కు చెందిన బృందాన్ని లిపులేఖ్‌కు దక్షిణాన ఉన్న ఛాంగ్రూ గ్రామానికి పంపింది.
రెండు రోజుల తర్వాత నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి తమ ప్రభుత్వ వార్షిక ప్రణాళికలు, విధానాల గురించి చేసిన ప్రకటనలో సరిహద్దు భద్రత అంశానికి ప్రాధాన్యతను ఇచ్చారు. 500 ఏపీఎఫ్ సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించారు. వీటిలో ఎక్కువ భాగం భారత్-నేపాల్ సరిహద్దు (1880 కి.మీ.లు) వెంబడే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చైనా-నేపాల్ సరిహద్దు (1440 కి.మీ.లు) వెంబడి పదికిపైగా శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.
సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, భూ ఆక్రమణలను నిరోధించడం లక్ష్యంగా నేపాల్ ఈ నిర్ణయాలు తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: తీవ్ర అనారోగ్యం పాలైన 30 శాతం రోగుల రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
- సముద్రపు ముసుగు దొంగలు తుపాకుల మోతతో దాడి చేసి కిడ్నాప్ చేసిన రోజు...
- కరోనావైరస్: గల్ఫ్ దేశాల్లో దిక్కు తోచని స్థితిలో భారతీయ వలస కార్మికులు
- మే 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించిన తమిళనాడు, మహారాష్ట్ర
- కరోనా లాక్డౌన్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – నెదర్లాండ్స్ ప్రభుత్వ మార్గదర్శకాలు
- లక్షల జంతువులను బలి ఇచ్చే 'అత్యంత రక్తసిక్త జాతర' మళ్ళీ మొదలు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









