భారత్-నేపాల్ సరిహద్దు: భారత రైతులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు

భారత్-నేపాల్ సరిహద్దు(ఫైల్ ఫొటో)
ఫొటో క్యాప్షన్, భారత్-నేపాల్ సరిహద్దు(ఫైల్ ఫొటో)

లాక్‌డౌన్ సమయంలో సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన భారత రైతులను అడ్డుకోడానికి నేపాల్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

రైతులు మొక్కజొన్న పంట కోతల కోసం సరిహద్దు దాటడానికి ప్రయత్నించారని ఒక నేపాల్ అధికారి ఆదివారం చెప్పారు.

“దాదాపు 150 మంది భారత రైతులకు ఝాపా జిల్లాలో పట్టా భూములు ఉన్నాయి. శనివారం వాళ్లు బలవంతంగా ఈ వైపు రావాలని చూశారు. వారందరూ గుంపుగా మా సరిహద్దు పోస్టుపై దాడి చేయడంతో వారిని అడ్డుకోడానికి మా బోర్డర్ పోలీస్ గాల్లోకి కాల్పులు జరిపింది” అని నేపాల్ తూర్పు జిల్లా ఝాపా కలెక్టర్ ఉదయ్ బహదూర్ రాణామగర్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి చెప్పారు.

అయితే ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడినట్లు, మరణించినట్లు ఎలాంటి సమాచారం లేదు.

ఝాపా స్థానిక ప్రజా ప్రతినిధి లక్ష్మీయాదవ్ బీబీసీతో శనివారం రాత్రి సుమారు 7.30 సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు.

“నేపాల్‌లో వ్యవసాయం చేసుకునే కొంతమంది భారతీయుల గుంపు, మా దేశంలోకి రాకపోకలు ఆపేసిన సమయంలో ఈవైపు వచ్చింది. సరిహద్దు గ్రామాల ప్రజలు వారిని తిప్పి పంపించేందుకు ప్రయత్నించారు” అన్నారు.

సాయుధ పోలీసులతో గొడవకు దిగిన తర్వాత వారు తిరిగి వెనక్కు వెళ్లిపోయారని కూడా యాదవ్ చెప్పారు.

భారత్-నేపాల్ సరిహద్దు(ఫైల్ ఫొటో)
ఫొటో క్యాప్షన్, భారత్-నేపాల్ సరిహద్దు(ఫైల్ ఫొటో)

సరిహద్దు పోస్టుపై దాడి ఎందుకు?

నేపాల్ ఝాపా జిల్లా భారత్‌లోని పశ్చిమ బెంగాల్, బిహార్ సరిహద్దుల్లో ఉంటుంది. ఝాపాలోని కచనాకవాల్, ఝాపా గ్రామాల్లోని దాదాపు 200 ఎకరాల భూముల్లో భారత రైతులు వ్యవసాయం చేస్తున్నారు.

వారు బంద్ సమయంలో నేపాల్ రావాలని అనుకున్నారని. కానీ సరిహద్దు పోలీసులు వారు లోపలికి రావడానికి అనుమతించలేదని స్థానికులు చెప్పారు.

వార్డు సభ్యుడు యాదవ్ మాత్రం “భారత పౌరులు సరిహద్దు ప్రాంతంలో పశువులు మేపుకోడానికి తమను ఎందుకు అనుమతించడం లేదంటూ సరిహద్దు పోలీసులపై దాడి చేశారు” అని చెప్పారు.

భారత్-నేపాల్ సరిహద్దు(ఫైల్ ఫొటో)
ఫొటో క్యాప్షన్, భారత్-నేపాల్ సరిహద్దు(ఫైల్ ఫొటో)

అధికారులు ఏం చెబుతున్నారు?

తరచూ నేపాల్ వచ్చిపోయే భారత పౌరుల సమస్యను పరిష్కరించడానికి స్థానిక పాలనాయంత్రాంగం ఏదో ఒక ప్రయత్నం చేయాలని హోంమంత్రిత్వ శాఖ చెప్పింది.

“భారత పౌరులు వ్యవసాయం చేసుకోడానికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారు ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ సమస్య చాలాసార్లు వచ్చింది. వారిని గుంపుగా వెళ్లనీకున్నా, వ్యవసాయం చేసుకోడానికి అయినా అనుమతించి ఉండాలి” అని భారత హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి కేదార్ నాథ్ శర్మ అన్నారు.

నేపాల్ స్థానిక అధికారులు మాత్రం భారత్‌లోని అధికారులతో చర్చలు జరిపిన తర్వాత దీనిపై ఒక పరిష్కారం వెతుకుతామని చెప్పారు.

“ఈ నెల మొదట్లో కూడా పదుల సంఖ్యలో భారతీయులు సరిహద్దు దాటి మా జిల్లాలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు మా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు” అని ఉదయ బహదూర్ చెప్పారు.

ఫైల్ ఫొటో
ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

భారత-నేపాల్ సరిహద్దు

నేపాల్‌, భారత్ మధ్య 1850 కిలోమీటర్ల పొడవునా ఉన్న సరిహద్దు ఎక్కువగా తెరిచే ఉంటుంది.

సరిహద్దు ప్రాంతాల్లో నివసించే చాలామంది ఎలాంటి అడ్డంకీ లేకుండా అటూఇటూ వెళ్లివస్తుంటారు.

కోవిడ్-19 మహమ్మారి వల్ల నేపాల్ మార్చి 22 నుంచి తమ అంతర్జాతీయ సరిహద్దులను సీల్ చేసింది. ఆ తర్వాత రెండ్రోజులకు జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ కూడా అమలు చేసింది.

భారత సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగుతుండడంతో నేపాల్ తమ వైపు నుంచి అప్రమత్తం అయ్యింది.

శనివారం నేపాల్‌లో కరోనా వల్ల మొదటి మృతి నమోదైంది. ఆదివారం వరకూ దేశంలో మొత్తం 291 పాజిటివ్ కేసులు ఉన్నట్టు ధ్రువీకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)