సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను

కోల్ కతా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తుపాను ధాటికి జలమయమైన కోల్‌కతా విమానాశ్రయం

ఆంఫన్‌ తుపాను తీవ్రతకు భారత తూర్పు తీర నగరం కోల్‌కతా కకావిలకమైంది. బుధవారంనాడు ఆంఫన్‌ తుపాను భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటింది. దీని ధాటికి 15మంది మరణించారు. తీరం వెంబడి భీకరమైన గాలులు వీచాయి. భారీ వర్షాలు కురిశాయి. కోలకతా నగరంలో సుమారు 1 కోటి 40 లక్షలమంది ప్రజలు రాత్రి చీకటిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కోవిడ్‌-19 వైరస్‌కన్నా ఈ తుపాను బీభత్సం పెద్దదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కోల్‌కతా నగరంలో ఇప్పటికే 3,103 కరోనా పాజిటివ్‌ కేసులున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

''చాలా ప్రాంతాలు సర్వనాశనమయ్యాయి. నిన్నటి పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి'' అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.

కోల్‌కతా విమానాశ్రయం

ఫొటో సోర్స్, Reuters

పశ్చిమబెంగాల్‌లో 10 నుంచి 12మంది ఈ తుపాను దాటికి మరణించి ఉంటారని మమతా బెనర్జీ అన్నారు. దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్‌ ప్రాంతాలు ఈ తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీబీసీ బెంగాలీ ప్రతినిధి అమితాభ భట్టాసలి కోల్‌కతాలో ఉంటారు. గత 17గంటలుగా కోల్‌కతా నగరంతోపాటు పొరుగున ఉన్న జిల్లాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయిందని ఆయన వెల్లడించారు. తుపాను ధాటికి బాగా దెబ్బతిన్న ప్రాంతాలలో మొబైల్‌ నెట్‌వర్క్‌లు పనిచేయడం లేదని మా బీబీసీ ప్రతినిధి చెప్పారు.

తుపాను తీవ్రతను తెలిపే అనేక వీడియోలను చిత్రీకరించిన కోల్‌కతా నగరవాసులు సోషల్ మీడియాలో వాటిని షేర్‌ చేస్తున్నారు. ఇందులో తుపాను ధాటికి ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. '' దేవుడి దయవల్ల మేం క్షేమంగా ఉన్నాం'' అని ఓ కోల్‌కతా వాసి అన్నారు. ఆయన పంపిన వీడియోలో ఇంటికప్పులు ఎగిరిపోతున్న దృశ్యాలున్నాయి.

కోల్ కతా

ఫొటో సోర్స్, Reuters

చెట్లు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయిన దృశ్యాలు, కూలిన కరెంటు స్థంభాల దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. నీళ్లు నిండిన వీధులు, విరిగిన చెట్ల కింద పడి నలిగిపోయిన కార్లు, గాలికి ఎగిరిపడి విరిగిపోయిన పడవలు కూడా స్థానిక మీడియా దృశ్యాలలో ఉన్నాయి.ఓవైపు తుపాను బీభత్సంలో కూడా కోవిడ్‌-19 వైరస్‌ భయంతో ముఖానికి మాస్కులు కట్టుకుని జర్నలిస్టులు ఈ బీభత్సాన్ని రిపోర్ట్‌ చేసే ప్రయత్నంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. '' బయట పరిస్థితులు నరకాన్ని తలపించాయి'' అని కాజల్‌ బసు తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. బసు కోల్‌కతా నగరంలో 12వ అంతస్తులో నివసిస్తున్నారు. తుపాను గాలుల తీవ్రతను బిల్గింగ్ ఊగిపోయిందని బసు వెల్లడించారు. '' భూకంపం వచ్చినప్పుడు భవనాలు కదిలిన రీతిలో మా బిల్డింగ్ అటూ ఇటూ ఊగింది'' అని చెప్పారు బసు. '' ఇనుప సామాన్లు ఒకదాన్నొకటి కొట్టుకుంటున్నట్లు, అద్దాలు పగులుతున్నట్లు శబ్దాలు వినిపించాయి. చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. మా ఇంటికి సమీపంలో మూడుచోట్ల విద్యుత్‌ లైన్లు కాలిపోయాయి. వైర్లు కరిగిపోయాయి'' అని బసు తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో రాశారు.

తుపాను విరుచుకుపడిన సమయంలో చాలామంది ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. కోవిడ్‌-19మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో వారు ఇంటి నుంచి బైటికి రాలేదు. మరోవైపు తుపాను విరుచుకు పడవచ్చన్న అంచనాలతో అధికారులు కొద్ది రోజులుగా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

కోల్ కతా

ఫొటో సోర్స్, Reuters

''చెట్లు కూలాయి. కరెంటు లేదు. స్థంభాలు నేలమీదకు వంగిపోయాయి. ఇళ్లకున్న అద్దాలు పగిలిపోయాయి. ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. పిల్లలు భయపడిపోయారు'' అని షామిక్‌ బేగ్‌ అనే కోల్‌కతావాసి తన అనుభవాలను బీబీసీకి వివరించారు. '' అన్ని తలుపులు, కిటికీలు వేసినా, గాలుల తీవ్రతకు మా ఇల్లు కదిలిపోయినట్లనిపించింది. 45 నిమిషాలలో వీధుల్లోకి నీళ్లు వచ్చాయి. ఇళ్లలోని గ్రౌండ్‌ఫ్లోర్లలోకి నీళ్లు చేరుకున్నాయి'' అని ఆయన చెప్పారు.

''తుపాను తర్వాత విద్యుత్‌ వ్యవస్థను పునరుద్ధరించగానే మా వీధిలో పిల్లలంతా పెద్దగా కేరింతలు కొట్టారు. మా చిన్నతనంలో కరెంటు తరచూ వచ్చి పోతుండే రోజుల్లో మేము కూడా ఇలాగే అరిచేవాళ్లం'' అన్నారు షామిక్‌ బేగ్‌ అన్నారు. ''కరెంటు పోవడంతో నీళ్లు నిండిన కోల్‌కతా వీధులు కదులుతున్న నల్లని పాముల్లా కనిపించాయి'' అని 'ది టెలీగ్రాఫ్‌' దినపత్రిక కోల్‌కతాపై తుపాను తీవ్రతను వర్ణించింది. అత్యవసర సేవలు, వరద సహాయక చర్యల కోసం కోల్‌కతాలో కరోనావైరస్‌ నియమాలను కాస్త సడలించారు. కోవిడ్‌-19 వ్యాధిని అడ్డుకోవడంలో భాగంగా పెట్టిన సామాజిక దూరం నియమాలు ప్రజల తరలింపు విషయంలో అధికారులకు చాలా ఇబ్బందిగా మారాయి. పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు.1999 తర్వాత ఇది బంగాళాఖాతంలో ఏర్పడ్డ సూపర్ సైక్లోన్‌ అంటున్నారు. ప్రస్తుతం గాలుల వేగం తగ్గినా, దీన్ని అతి తీవ్ర తుపానుగానే చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)