కరోనావైరస్: డబ్ల్యూహెచ్ఓ పాత్రపై స్వతంత్ర విచారణకు సభ్య దేశాల అంగీకారం

టెడ్రోస్ అదనమ్ విచారణను స్వాగతించారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, టెడ్రోస్ ఈ విచారణను స్వాగతించారు

కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు ఆ సంస్థలోని సభ్య దేశాలు అంగీకరించాయి.

జెనీవాలో వార్షిక సమావేశంలో ఇందుకోసం పెట్టిన తీర్మానం అభ్యంతరాలేవీ లేకుండా ఆమోదం పొందింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. డబ్ల్యూహెచ్ఓలో 194 సభ్యదేశాలు ఉన్నాయి.

డబ్ల్యూహెచ్ఓ తీరుపై అమెరికా తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సమావేశంలో భారత్ సహా పది దేశాలు డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొత్త సభ్యులుగా ఎన్నికయ్యాయి.

ఎగ్జిక్యూటివ్ బోర్డులో మొత్తం 34 సభ్యదేశాలకు చోటు ఉంటుంది. ఆయా దేశాల తరఫున ఆరోగ్య రంగ నిపుణులు బోర్డులో ఉంటారు. మూడేళ్ల పాటు వీరు ఈ పదవిలో కొనసాగుతారు.

డబ్ల్యూహెచ్ఓ వార్షిక సమావేశపు నిర్ణయాలు, విధానాలను అమలయ్యేలా చూడటం ఎగ్జిక్యూటివ్ బోర్డు బాధ్యత.

డబ్ల్యుహెచ్ఓ సమావేశం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సభ్య దేశాలన్నీ ఆన్‌లైన్‌లో ఈ సమావేశంలో పాల్గొన్నాయి

తీర్మానంలో ఏముందంటే...

వంద దేశాల తరఫున యూరోపియన్ యూనియన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

అంతర్జాతీయంగా డబ్ల్యూహెచ్ఓ కోవిడ్-19పై స్పందించిన తీరుపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర విశ్లేషణ జరపాలని ఈ తీర్మానంలో ఉంది.

కోవిడ్-19 సంక్షోభ సమయంలో డబ్ల్యూహెచ్ఓ ఏయే సమయాల్లో ఎలా స్పందించిందో కూడా ఈ దర్యాప్తులో పరిశీలించనున్నారు. కరోనావైరస్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించడంలో ఆలస్యం చేసిందని విమర్శలు వచ్చాయి.

వ్యాక్సిన్లు, చికిత్సలు పారదర్శకంగా, సమయానుగుణంగా అందుబాటులో ఉండేలా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని కూడా ఈ తీర్మానం అభ్యర్థించింది.

‘కరోనావైరస్ ఎక్కడ పుట్టింది? మనుషులకు ఎలా వచ్చింది’ అనే అంశంపై డబ్ల్యూహెచ్ఓ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్

డబ్ల్యూహెచ్ఓపై ఒత్తిడి ఎందుకు?

డబ్ల్యూహెచ్ఓ చైనా కీలుబొమ్మలా పనిచేస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు. తమ దేశం నుంచి ఆ సంస్థకు అందించే నిధులు నిలిపివేస్తామని ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా నుంచే అత్యధికంగా నిధులు అందుతున్నాయి.

కరోనావైరస్ వ్యాప్తిని చైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని, చైనా ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా చేయడంలో డబ్యూహెచ్ఓ విఫలైమందని కూడా ట్రంప్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను చైనా తిరస్కరించింది.

అమెరికాలో కరోనావైరస్ బారినపడి ఇప్పటివరకూ 90 వేలకు పైగా మంది చనిపోయారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ట్రంప్ ఈ ఆరోపణలకు దిగుతున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

అయితే, కోవిడ్-19 సంక్షోభంలో వ్యవహించిన తీరుపై దర్యాప్తు జరగాలని యురోపియన్ యూనియన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలు కూడా అంటున్నాయి.

‘‘ఈ మహమ్మారి ఎలా వ్యాపించింది? దీనికి కారణలేంటి? భవిష్యతుల్లో ఇలాంటివి మరిన్ని జరగకుండా చూడటానికి, ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఇది సమయం కాదు’’ అని ఈయూ అధికార ప్రతినిధి వర్జీనీ బట్టూ-హెన్రిక్సన్ అన్నారు.

కరోనావైరస్ సంక్షోభం విషయంలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహరించిన తీరుపై సమీక్షకు సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అంగీకారం తెలిపారు. అయితే, సంస్థ నడిచే తీరులో ప్రక్షాళన అవసరమన్న సూచనలను ఆయన తిరస్కరించారు.

ఈ సంక్షోభం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, అవసరమైన సలహాల కోసం స్వతంత్ర విశ్లేషణ వీలైనంత త్వరగా జరుగుతుందని టెడ్రోస్ అన్నారు.

డబ్ల్యూహెచ్ఓ సహా పలు సంస్థలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

షి జిన్‌పింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, షి జిన్‌పింగ్

చైనా ఏమంటోందంటే...

తొలి కరోనావైరస్ కేసు చైనాలోని వుహాన్ నగరంలో నమోదైంది. అక్కడి వన్య ప్రాణుల మార్కెట్‌లో ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే, ఆరంభంలో చైనా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపణలు వచ్చాయి.

వుహాన్‌లోని ప్రయోగశాలలో గబ్బిలాలపై జరుగుతున్న పరిశోధనల్లో ఈ వైరస్ పుట్టిందని కొందరు అమెరికా రాజకీయ నాయకులు ఆరోపించారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

కరోనావైరస్ సంక్షోభం విషయంలో తాము నిజాయితీగా ఉన్నామని, వైరస్ జన్యు కోడ్‌ను కూడా జనవరిలోనే వెల్లడించామని చైనా అంటోంది. డబ్ల్యూహెచ్ఓతోనూ వేగంగా సమాచారం పంచుకున్నామని చెబుతోంది.

తమ దేశం పారదర్శకంగా, విశాల దృక్పథంతో వ్యవహరించిందని, మహమ్మారిని నియత్రించాకే ఏ విచారణైనా జరగాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తాజాగా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)