టిబెట్ పంచెన్ లామా: ఆరేళ్ల బాలుడిని చైనా ఎందుకు మాయం చేసింది.. ఆ బాలుడంటే ఎందుకంత భయం

ఫొటో సోర్స్, EPA
- రచయిత, మిఖైల్ బ్రిస్టో
- హోదా, బీబీసీ న్యూస్
ఇది టిబెట్‌కు చెందిన గెధున్ చోకీ నియిమా ఫోటో. కనిపించకుండాపోయిన ప్రపంచ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు.
ఆయనకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఈ ఫోటో తీశారు. ప్రజలకు అందుబాటులోనున్న ఆయన ఏకైక ఫోటో ఇదే. దీనిలో గులాబీ రంగు బుగ్గలతో ఆయన చక్కగా కనిపిస్తున్నారు.
ఇప్పుడు ఆయనకు 31 ఏళ్లు. ఆయన్ను పంచెన్ లామాగా గుర్తించిన మూడు రోజులకే చైనాలో ఆయన కుటుంబంతోపాటు కనిపించకుండా పోయారు. ఈ ఘటనకు 2020 మే 17తో సరిగ్గా 25 ఏళ్లు పూర్తయింది. టిబెటన్ బుద్ధిజంలో పంచెన్ లామా రెండో అత్యంత ప్రముఖుడు.
అదృశ్యమైన తర్వాత ఆయనకు ఏం జరిగిందో ఇప్పటివరకు ఎలాంటి సమాచారమూ లేదు.
ఆయన్ను ఇప్పటికైనా చైనా విడుదల చేయాలని చైనా బయటనున్న టిబెటన్లు కోరుతున్నారు. అయితే కేవలం చైనా అధికారులకు మాత్రమే ఆయన ఎక్కడున్నారో తెలుసు. ఇప్పుడు వారు నోరు తెరచి నిజం చెబుతారని ఎవరూ అనుకోవడం లేదు.
"మాకు మబ్బు పట్టినట్టు అనిపిస్తోంది"అని లండన్లో ఉంటున్న టిబెట్ అజ్ఞాత ప్రభుత్వ ప్రతినిధి సోనమ్ షెరింగ్ వ్యాఖ్యానించారు.
పంచెన్ లామాను ఇప్పటికైనా విడుదల చేయాలని కోరుతున్న వారి బాధను అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండానే తాము కోరుకున్న వారిని కనిపించకుండా చేయగల చైనా నాయకుల సామర్థ్యాన్ని ఈ కేసు కళ్లకు కడుతోంది.

పంచెన్ లామాకు ఏమైందో కనుక్కొనేందుకు ఐరాస వర్కింగ్ గ్రూప్.. 1995 నుంచీ ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్నీ తెలుసుకోలేకపోయారు.
పంచెన్ లామా అదృశ్యమై 25 ఏళ్లు అవుతున్న తరుణంలో కొన్ని వారాల కిందట తాము చేసిన కృషిపై బీబీసీకీ ఆ ఐరాస బృందం ఓ ప్రకటన విడుదల చేసింది.
"ఈ విషయంపై చైనా ప్రభుత్వం చాలాసార్లు స్పందించింది. అయితే వారిచ్చే సమాచారం కేసును పరిష్కరించేందుకు సరిపోవడం లేదు. అందుకే ఎన్నేళ్లయినా కేసు ఇలానే ఉండిపోయింది"
2013లో తమను దేశంలో పర్యటించేందుకు అనుమతించాలని చైనా ప్రభుత్వాన్ని వర్కింగ్ గ్రూప్ కోరింది.
తమ అభ్యర్థనకు ఆరేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆమోదం దొరకలేదని తమ వార్షిక నివేదికలో వర్కింగ్ గ్రూప్ తెలిపింది.
"త్వరలో సానుకూల ప్రత్యుత్తరం వస్తుందని భావిస్తున్నాం" అని నివేదికలో పేర్కొంది.
ఈ ఆరేళ్ల బాలుణ్ని చైనా కావాలనే కనిపించకుండా చేసేందుకు చాలా కారణాలున్నాయి. టిబెటన్ బుద్ధిజంలో దలైలామా తర్వాత అంతటివాడు పంచెన్ లామా. ఇక్కడి టిబెటన్ ప్రాంతంపై చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే టిబెటన్లకు దలైలామా నాయకుడు. 1959లో ఆయన టిబెట్ వదిలివెళ్లారు.

ఫొటో సోర్స్, BBC/BRISTOW
చైనాలో తమ పాలనకు దలైలామాలాగే పంచెన్ లామా కూడా అడ్డుకాకూడదని, పంచెన్ లామా కూడా ప్రజా నాయకుడిగా మారకూడదని చైనా భావించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గెధున్ అదృశ్యమైన తర్వాత వేరొకరిని పంచెన్ లామాగా చైనా ప్రకటించింది. మరోవైపు ప్రస్తుత దలైలామా మరణానంతరం సొంతంగా ఓ దలైలామాను చైనా ఎంపిక చేస్తుందని చాలా మంది భావిస్తున్నారు.
చైనా మాట ఎలా మార్చింది?
గత 25ఏళ్లలో పంచెన్ లామా అదృశ్యం గురించి కొంత సమాచారం బయటపెట్టింది. అంతేకాదు తాము ఎలాంటి తప్పూ చేయలేదనే రీతిలో స్పందించింది.
ఆయన కనిపించకుండాపోయిన వెంటనే ఐరాస వర్కింగ్ గ్రూప్ ముందు చైనా స్పందించింది.
గెధున్ అదృశ్యమైనట్టు లేదా ఆయన కుటుంబం కనిపించకుండా పోయినట్లు ఎలాంటి కేసూ నమోదుకాలేదని వివరించింది.
ఇదంతా దలైలామా గ్రూప్ అల్లిన కట్టుకథని వివరించింది.
1996లో చైనా మాట మార్చింది. "కొంతమంది నీతి, నిజాయితీలేనివారు ఆ బాబును విదేశాలకు అక్రమంగా తీసుకెళ్లాలని ప్రయ్నతించారు. దీంతో తన తల్లిదండ్రులు రక్షణ కల్పించమని కోరారు. మేం వారిని సంరక్షిస్తున్నాం"అని వివరించింది.

బాబుతోపాటు ఆ కుటుంబమూ సాధారణ జీవితం గడుపుతోందని తెలిపింది. ఎవరూ తమను ఇబ్బంది పెట్టకూడదని ఆ కుటుంబం భావిస్తోందని వివరించింది. ఇదే విషయాన్ని చైనా పదేపదే చెబుతూ వచ్చింది.
కొన్నిసార్లు ఏదో జరిగిందనే తెలియజెప్పే సంకేతాలనూ చైనా ప్రభుత్వం ఇచ్చింది.
1998లో పంచెన్ లామా తల్లి జైలు శిక్ష అనుభవిస్తున్నారని వర్కింగ్ గ్రూప్‌కు చైనా తెలిపింది. అయితే ఈ శిక్ష ఎందుకు విధించారు? ఎంతకాలం పాటు విధించారు? లాంటి విషయాలపై స్పందించలేదు.
ఈ అంశంపై కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు కూడా స్పందించారు.
కనిపించకుండాపోయిన పంచెన్ లామాకు చెందిన రెండు ఫోటోలను తమ అధికారులకు చైనా చూపించిందని 2000లో అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి రాబిన్ కుక్ వెల్లడించారు.
టేబుల్ టెన్నిస్ ఆడుతున్న బాబు ఫోటో ఒకటి, బోర్డుపై చైనా అక్షరాలు రాస్తున్న బాబు ఫోటో ఒకటి చూపించారని తెలిపారు. అయితే ఆ ఫోటోలను కేవలం చూడటానికి మాత్రమే ఇచ్చారని చెప్పారు.
2007లో టిబెట్ వెళ్లినప్పుడు కొందరు టిబెట్ అధికారులు మాట్లాడారు. పంచెన్ లామా.. ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నారని, ఎవరూ తనను ఇబ్బంది పెట్టకూడదని ఆయన భావిస్తున్నట్లు అధికారులు విరించారు.
భారత్‌లోని ధర్మశాలలో ఉంటున్న టిబెటన్ అజ్ఞాత ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించింది. పంచెన్ లామా సామాన్య జీవితం గడుపుతున్నారని, ఉద్యోగం కూడా చేస్తున్నారని రెండేళ్ల క్రితం ఐరాస వర్కింగ్ కమిటీకి చైనా చెప్పినప్పుడు.. ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటనపై స్పందించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది.
ఆయన్ను కుటుంబంతోపాటు ఎత్తుకెళ్లిపోయారు
ఐరాస మానవ హక్కుల నిబంధనలకు వ్యతిరేకంగా పంచెన్ లామాను చైనా మాయం చేసిందని ఐరాస వర్కింగ్ గ్రూప్‌లో 2008 నుంచి 2014 మధ్య పనిచేసిన ప్రొఫెసర్ జెరెమీ సార్కిన్ వ్యాఖ్యానించారు.
"చైనా చెబుతున్న మాటల్లో నిజం లేదు. ఆయన్ను కుటుంబంతోపాటు తీసుకుపోయారు"అని ఆయన వివరించారు. "ఆయన సురక్షితంగా ఉన్నారో లేదో చూసేందుకు మమ్మల్ని అనుమతించాలి"
"తాను చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకొనేందుకు చైనా నిరాకరిస్తోంది"అని ఆయన అన్నారు. తాము మాయం చేసిన ప్రజలపై మాట్లాడేందుకు ఏ దేశమూ ఒప్పుకోదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన లిస్బన్‌లోని నోవా వర్సిటీలో పనిచేస్తున్నారు.
మరోవైపు టిబెట్‌లో చైనా అణచివేత విధానాలకు చాలా మంది మద్దతు పలుకుతున్నారని టిబెటన్ వ్యవహారాలపై అధ్యయనం చేస్తున్న రాబర్ట్ బార్నెట్ వివరించారు.
"టిబెటన్ల మనసులు గెలుచుకోవడంలో చైనా విజయం సాధించలేదు. కానీ చైనా చేస్తుంది సరైనదేనని చైనాలోని 140 కోట్ల మంది నమ్ముతున్నప్పుడు.. ఇంకేం చేయగలం"అని లండన్‌లోని స్కూల్ ఫర్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో పనిచేస్తున్న ఆయన వ్యాఖ్యనించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే టిబెట్‌పై తమ ఆధిపత్యాన్ని చైనా నాయకులు ఎప్పుడూ ఆస్వాదించలేకపోయారని ఆయన అన్నారు.
"అది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. తమ పరిపాలన కూలిపోతుందేమోననే భయంలోనే వారెప్పుడూ ఉంటారు"
గెధుమ్ సమాచారాన్ని కనుక్కొనేందుకు టిబెట్ అజ్ఞాత ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారమూ బయటపడకపోవడాన్ని చూస్తుంటే టిబెట్‌పై చైనా పట్టు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
గెధున్ బతికే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందిందని రెండేళ్ల క్రితం దలైలామా చెప్పారు. ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పందనా లేదు.
ఆరేళ్ల వయసున్నప్పుడు తీసిన ఆ ఫోటో తప్పా తమ దగ్గర మరే సమాచారమూలేదని టిబెట్ అజ్ఞాత ప్రభుత్వ ప్రతినిధి సోనమ్ షెరింగ్ తెలిపారు.
ఏదో ఒకరోజు పంచెన్ లామాను చూస్తామనే ఆశతో తాము ఉన్నట్లు ఆయన వివరించారు. పంచెన్ లామాకోసం బౌద్ధారామాల్లో టిబెటన్లు ప్రార్థనలు చేస్తున్నారని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
- కరోనావైరస్: 'కశ్మీర్లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?'
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్: రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: గల్ఫ్ దేశాల్లో దిక్కు తోచని స్థితిలో భారతీయ వలస కార్మికులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








