సైక్లోన్ ఆంఫన్: పశ్చిమ బెంగాల్, ఒడిశాల మీదకు ముంచుకొస్తున్న పెను తుపాను

తుపాను

ఫొటో సోర్స్, INDIA MET DEPARTMENT

ఫొటో క్యాప్షన్, గత 12 గంటల్లో తీవ్రంగా మారిన తుపాను

భారత తూర్పు తీరంలోని ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆంఫన్ తుపాను తాకనుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇది పెను తుపానుగా మారే అవకాశముంది. ఆ రెండు రాష్ట్రాలకు రెండు సహాయ బృందాలను పంపించారు. మరో 17 సహాయ బృందాలను సంసిద్ధంగా ఉంచారు.

తుపానును ఎదుర్కోవటానికి ఏర్పాట్ల మీద చర్చించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి దేశవ్యాప్తంగా దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో లక్షలాది మంది జనం నగరాల నుంచి గ్రామాలకు వలసపోతున్న సమయంలో ఈ తుపాను ముంచుకొచ్చింది.

ఒడిశా, పశ్చిమబెంగాల్ - రెండు రాష్ట్రాలకూ భారీ సంఖ్యలో జనం తిరిగి వస్తున్నారు. వీరిలో అత్యధికులు కాలినడకన ప్రయాణిస్తున్నారు. దీంతో వారి మీద తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత వాతావరణ విభాగం ఈ ప్రాంతాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. మత్స్యకారులు రాబోయే 24 గంటల పాటు దక్షిణ బంగాళాఖాతం ప్రాంతం మీదకు వెళ్లవద్దని హెచ్చరించింది. అలాగే ఉత్తర బంగాళాఖాతం మీదకు మే 18 నుంచి 20 వరకూ వెళ్లవద్దని సూచించింది.

సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ఈ తుపాను హెచ్చరికలు జారీచేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆంఫన్ తుపాను వాయువ్య బంగాళాఖాతం దిశగా పయనించి.. స్థానిక కాలమానం ప్రకారం మే 20వ తేదీ ఉదయం పశ్చిమబెంగాల్ – బంగ్లాదేశ్‌ల వద్ద ‘పెను తుపాను’గా తీరం దాటే అవకాశం ఉందని అవకాశం ఉందని వాతావరణ విభాగం ఒక బులెటిన్‌లో వివరించింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తుఫాను తాకిడికి అలలు ఉప్పొంగి తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని.. రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డీఆర్ఎఫ్) అధిపతి ఎస్.ఎన్.ప్రధాన్ చెప్పారు.

గత ఏడాది జూన్‌లో శక్తివంతమైన తుపాను సైక్లోన్ వాయు భారత పశ్చిమ తీరంలో తీరం దాటాల్సి ఉండగా.. దిశ మార్చుకుని అరేబియా సముద్రం లోపలికి కదిలిపోయింది.

వాయు తుపానును పెను తుపానుగా వర్గీకరించటంతో అప్పటికే పశ్చిమ తీరంలో లక్షలాది మందిని ఖాళీ చేయించారు.

గత ఏడాది మే నెలలో సైక్లోన్ ఫని కారణంగా ఒడిషాలో 16 మంది చనిపోయారు. ఆ సమయంలో దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బంగాళాఖాతంలో తుపానుల సీజన్ సాధారణంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)