హాంగ్‌కాంగ్ సెక్యూరిటీ లా: వివాదాస్పద చట్టానికి చైనా ఆమోదం... వెల్లువెత్తిన ఆగ్రహం

హాంగ్‌కాంగ్‌ నిరసనల్లో జూన్ 12న ఒక వ్యక్తిని నిర్బంధిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రజలు నిరసన వ్యక్తం చేసే హక్కును కూడా కోల్పోతారంటున్న ప్రతిపక్షం

హాంగ్ కాంగ్ మీద కొత్త అధికారాలు పొందేందుకు ఉద్దేశించిన వివాదాస్పద భద్రతా చట్టాన్ని చైనా లాంఛనంగా ఆమోదించింది. ఈ చట్టం ఆమోదంతో తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రమాదంలో పడతాయన్న హాంగ్ కాంగ్ పౌరుల భయాలు మరింత తీవ్రమయ్యాయి.

ఈ చట్టం ప్రకారం వేర్పాటు, విద్రోహం, విదేశీ శక్తులతో కుమ్మక్కులను నేరాలుగా పరిగణించినప్పటికీ.. ఆచరణలో నిరసనలు, వాక్‌స్వాంత్ర్యాలను కూడా అదుపుచేస్తుంది.

హాంగ్ కాంగ్‌లో అశాంతి పెరుగుతుండటంతో పాటు ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం విస్తృతమవుతున్న పరిస్థితుల్లో చైనా ఈ చట్టం చేసింది.

ఈ చట్టం ఆమోదం వార్త వినగానే.. తన కార్యకలాపాలన్నిటినీ నిలిపివేస్తున్నట్లు ప్రజాస్వామ్య ఉద్యమ సంస్థ డెమోసిస్టో ప్రకటించింది.

జాషువా వాంగ్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, జాషువా వాంగ్

అంతకుముందు.. హాంగ్ కాంగ్‌ ఉద్యమకారుల్లో అత్యంత ముఖ్యుల్లో ఒకరైన జాషువా వాంగ్.. తాను సారథ్యం వహిస్తున్న బృందం నుంచి వైదొలగుతున్నట్లు చెప్పారు.

కానీ.. కొత్త చట్టం కింద అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉన్నాకూడా బుధవారం జరగబోయే ఒక కీలకమైన నిరసన ప్రదర్శనలో పాల్గొంటామని కొందరు సీనియర్ ఉద్యమకారులు పేర్కొన్నారు.

కొత్త చట్టం మీద దేశాధ్యక్షుడు షిన్ జిన్‌పింగ్ తాజాగా సంతకం చేసినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది. ఈ చట్టాన్ని హాంగ్ కాంగ్ 'ప్రాథమిక చట్టం'లో పొందుపరిచారు.

అనేక దశాబ్దాల పాటు బ్రిటిష్ నియంత్రణలో ఉన్న హాంగ్ కాంగ్‌ను 1997లో చైనాకు తిరిగి అప్పగించారు. ఈ నగరానికి 50 సంవత్సరాల పాటు నిర్దిష్ట హక్కులు కల్పించాలన్న హామీతో ప్రత్యేక ఒప్పందం కింద ఈ బదలాయింపు జరిగింది. ఆ సందర్భంగా అమలులోకి వచ్చిన 'ప్రాథమిక చట్టాన్ని' హాంగ్ కాంగ్ మినీ రాజ్యాంగంగా పరిగణిస్తుంటారు.

అయితే.. కొత్త భద్రతా చట్టంలోని నియమ నిబంధనలు ఇంకా స్పష్టంగా తెలియదు. అంటే తాము కట్టుబడాల్సిన నిబంధనలు ఏమిటన్నది పౌరులకు స్పష్టంగా తెలియదు. ఈ చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది.

చైనా కొత్త చట్టం ఆమోదించిందన్న వార్తల పట్ల బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ 'తీవ్ర ఆందోళన' వ్యక్తంచేశారు.

ఈ చట్టం గురించి చైనా మే నెలలో ప్రకటించనప్పటి నుంచీ హాంగ్ కాంగ్‌లో నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. అశాంతి, అస్థిరతలను పరిష్కరించటానికి ఈ చట్టం అవసరమని చైనా అంటోంది. ఇది హాంగ్ కాంగ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమేనన్న విమర్శలను తిరస్కరిస్తోంది.

హాంగ్‌కాంగ్‌లో గత ఏడాది నిరసనలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, హాంగ్‌కాంగ్‌లో గత ఏడాది నిరసనలు

ఈ చట్టం ఏం చేస్తుంది?

బీజింగ్‌లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు బీబీసీకి తెలిసింది.

హాంగ్ కాంగ్‌ను బ్రిటన్ నుంచి చైనాకు అప్పగించిన 23వ వార్షికోత్సవానికి (జూలై 1వ తేదీకి) ఒక రోజు ముందు ఈ వివాదాస్పద చట్టాన్ని హాంగ్ కాంగ్ చట్టంలో చేర్చుతున్నారు.

ఈ చట్టం ప్రకారం.. వేర్పాటు చర్య, కేంద్ర ప్రభుత్వం పట్ల విద్రోహం, ఉగ్రవాదం, విదేశీ లేదా బయటి శక్తులతో కుమ్మక్కు వంటి పనులన్నీ నేరాలు అవుతాయి.

జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను పరిష్కరించటానికి హాంగ్ కాంగ్‌లో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కార్యాలయం.. హాంగ్‌కాంగ్ స్కూళ్లలో జాతీయ భద్రతకు సంబంధించిన విద్య తదితర అంశాలను కూడా పర్యవేక్షిస్తుంది.

ఈ చట్టాలను అమలు చేయటం కోసం హాంగ్ కాంగ్ నగరం సొంతంగా జాతీయ భద్రత కమిషన్‌ను కూడా ఏఱ్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి చైనా ఒక సలహాదారును నియమిస్తుంది.

జాతీయ భద్రత కేసులను విచారించే న్యాయమూర్తులను నియమించే అధికారం హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు ఉంటుంది. ఈ చర్య కారణంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద భయాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా.. ఈ చట్టానికి ఎలా భాష్యం చెప్పాలనే అంశం మీద చైనాకే అధికారం ఉంటుంది. ఈ చట్టంలోని ఏవైనా అంశాలకు హాంగ్ కాంగ్‌లోని ఏవైనా చట్టాలకు మధ్య తేడాలు ఉన్నట్లయితే చైనా చట్టానికే ప్రాధాన్యత లభిస్తుంది.

బీజింగ్‌లో చైనా జెండాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త చట్టంత హాంగ్‌కాంగ్‌ మీద చైనా పట్టు పెరిగిపోతుంది

ఈ చట్టం హాంగ్కాంగ్‌ను ఎలా మారుస్తుంది?

హాంగ్‌కాంగ్‌ను చైనాలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా నిలిపిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఈ చట్టంతో మృగ్యమవుతాయని చాలా మంది భావిస్తున్నారు.

ఈ ప్రాంతం మీద సార్వభౌమాధికారాన్ని 1997లో చైనాకు తిరిగి అప్పగించినపుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం లభించిన.. ఈ ప్రాంతపు చిన్ని రాజ్యాంగంలో పొందుపరచిన వాక్‌స్వాతంత్ర్యం, నిరసన హక్కు, పూర్తిగా స్వతంత్రమైన, బలమైన న్యాయవ్యవస్థలను హాంగ్ కాంగ్ జనం చాలా అపురూపంగా పరిగణిస్తారు.

చైనా కొత్త చట్టం కింద నేరాలను విస్పష్టంగా నిర్వచించారని హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి మంగళవారం పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఈ చట్టం వల్ల కేవలం 'ఓ చిన్న అల్పసంఖ్యాకుల' వర్గాన్ని ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని.. హాంగ్ కాంగ్ స్వయంప్రతిపత్తికి ఎటువంటి విఘాతం కలగదని ఆమె చెప్పారు.

హాంగ్‌కాంగ్‌లో 2020 మే 20మ చెలరేగిన నిరసనలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కొత్త చట్టం అసమ్మతి నోరు నొక్కుతుందుని విమర్శుకులు అంటున్నారు

'రాజకీయ ఆందోళనను అణచివేసే పనిముట్టు'

బీబీసీ చైనా ప్రతినిధి స్టీఫెన్ మెక్‌డోనెల్ విశ్లేషణ

హాంగ్ కాంగ్ కొత్త చట్టం.. రాజకీయ ఆందోళనను అణచివేయటానికి ఉపయోగించుకునే వీలున్న చట్టం. ఇది తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

చైనా ప్రధాన భూభాగంలోని ఇతర చట్టాల తరహాలోనే.. కమ్యూనిస్టు పార్టీ ప్రమాదకరంగా పరిగణించే ఎటువంటి చర్యనైనా అణచివేయటానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు వాడుకోవటానికి వీలుగా ఉన్నట్లు ఈ చట్టం కనిపిస్తోంది.

చైనాలోని ఇతర ప్రాంతాల తరహాలో కాకుండా హాంగ్ కాంగ్‌కు స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంది. ఆ కారణం వల్ల.. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఈ చట్టానికి భాష్యం చెప్పే పనిని ఏ పాత న్యాయమూర్తుల చేతుల్లోనూ పెట్టబోదు.

ఈ అంశాలకు నేతృత్వం వహించే వారిని.. చైనా సమర్థవంతంగా నియమించిన నగర నాయకురాలు కారీ లామ్ స్వయంగా ఎంపిక చేస్తారు.

అయితే.. ఈ కొత్త భద్రతా చట్టానికి ముందు ఉద్యమకారుల ఏ చర్యలను - అవి ఎంత విద్రోహపూరితమైనా కానీ - ప్రస్తుత చట్టాల కింద నేరాలుగా పరిగణించలేదు? ''అతివాదులు'' ఏ చర్యలకు పాల్పడి తప్పించుకోవటం వల్ల ఈ కొత్త చట్టం అవసరమైంది?

బాంబుల తయారీనా? కాదు. భవనాల కూల్చివేతనా? కాదు. నగరంలో తరిగిపోతున్న స్వాతంత్ర్యాల గురించి మాట్లాడటానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలను కలవటమా? హా.. కావచ్చు. హాంగ్ కాంగ్ స్వాతంత్ర్యాన్ని బాహాటంగా సమర్థించటమా? దాదాపు నిజమే.

షి జిన్‌పింగ్ సారథ్యంలోని చైనా.. హాంగ్ కాంగ్ మీద తన పట్టును ఎంతగా బిగించాలని అనుకుంటే ఈ నగర ప్రజలు అంతగా ప్రజాస్వామ్య అనుకూల శిబిరం వైపు మళ్లారు.

కానీ ఆయన ఒక సుదీర్ఘమైన ఆట ఆడుతున్నారు. బదిలీ చేసేటపుడు బ్రిటన్‌కు హామీలు ఇచ్చారు. కానీ.. మాతృమూర్తికి విధేయతను ఒక పశ్చిమ అనుబంధం దెబ్బతీయటానికి ఆయన అనుమతించబోరు. ఆయన ఉండగా కాదు. అందుకే ఈ చట్టం వచ్చింది.

హాంగ్‌కాంగ్

ఫొటో సోర్స్, AFT

ప్రతిస్పందన ఎలా ఉంది?

బుధవారం నిర్వహించబోయే 'బదిలీ దినం' ప్రదర్శన మీద పోలీసు నిషేధాన్ని తాను ఉల్లంఘిస్తానని డెమొక్రటిక్ పార్టీ నయాకుడు వు చి-వాయ్ చెప్పారు.

పౌర మానవ హక్కుల వేదిక ఫిగో చాన్ కూడా ఆయనతో జత కలుస్తున్నారు. ''కేసులు పెట్టి విచారించే ప్రమాదం గురించి మనకు తెలుసు. కానీ హాంగ్‌కాంగ్ వాసులు భయపడకుండా ఉండటానికి మనం ముందు వరుసలో నిలబడదాం'' అని ఆయన పిలుపునిచ్చారు.

పోలీసులు 4,000 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందిని మోహరించబోతున్నట్లు సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది.

''ప్రపంచానికి ఇంతకుముందు తెలిసిన హాంగ్ కాంగ్‌కు ఈ చట్టం ముగింపు పలికింది'' అని జాషువా చెప్పారు.

హాంగ్ కాంగ్ స్వయం ప్రతిపత్తిని ఈ చట్టం తీవ్రంగా దెబ్బతీస్తోందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ తప్పుపట్టారు.

తైవాన్ తన ప్రజలను.. హాంగ్ కాంగ్‌ను సందర్శించటం ప్రమాదకరమని కూడా హెచ్చరించింది.

హాంగ్ కాంగ్‌కు తమతో గల ప్రత్యేక హోదా వ్యాపార సంబంధానికి ముగింపు పలికే చర్యలను అమెరికా ప్రారంభించింది.

ఈ చర్యలకు తాము ప్రతిచర్యలు చేపడతామని చైనా స్పందించింది.

చైనా ఈ చట్టం చేసినట్లయితే.. బ్రిటన్ వలస నిబంధనలను మార్చి, హాంగ్ కాంగ్‌కు చెందిన లక్షలాది మంది ప్రజలకు 'పౌరసత్వ మార్గం' అందిస్తామని బ్రిటన్ ఇంతకుముందు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)