హాంకాంగ్‌లో చైనా కొత్త చట్టంపై తీవ్ర నిరసనలు.. అసలేమిటీ చట్టం

నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

హాంకాంగ్‌లో మరోసారి అగ్గి రాజుకుంది. నగరంలో కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయటానికి చైనా ప్రణాళికలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన నిరసనకారుల మీద పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించారు.

హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయటానికి చైనా ప్రణాళికలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన నిరసనకారుల మీద పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించారు. ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా వేలాది మంది హాంగ్ కాంగ్ పౌరులు నిరసన ప్రదర్శన చేపట్టారు.

వాటర్ క్యాన్ల ప్రయోగం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ క్యాన్ల ప్రయోగం

నగరం మధ్య నుంచి ప్రదర్శన సాగుతుండగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పటివరకూ దాదాపు 120 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. చైనా ప్రణాళికను విమర్శిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 200 మంది సీనియర్ రాజకీయవేత్తలు సంయుక్త ప్రకటన జారీచేశారు. ''ఇది హాంగ్ కాంగ్ నగర స్వయంప్రతిపత్తి మీద, చట్టం మీద, ప్రాథమిక స్వాతంత్ర్యాల మీద మూకుమ్మడి దాడి'' అని వారు అభివర్ణించారు.

నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

హాంగ్ కాంగ్ భూభాగంలో 'కుట్ర, వేర్పాటు, దేశద్రోహం, విద్రోహాల'ను నిషేధిస్తూ ఈ కొత్త చట్టం చేయాలన్నది చైనా ప్రణాళిక. ఇది హాంగ్ కాంగ్‌లోని విదేశీ పెట్టుబడిదారులకు హాని చేస్తుందన్న భయాలను చైనా కొట్టివేసింది.

విమర్శిస్తున్న దేశాలు తమ అంతర్గత వ్యవహారాల్లో 'జోక్యం చేసుకుంటున్నాయం'టూ చైనా మండిపడింది. చైనా అనుకూల రాజకీయ వ్యవస్థలో భాగంగా పరిగణించే హాంకాంగ్ నాయకురాలు క్యారీ లామ్.. ప్రతిపాదిత చట్టానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

పౌరుల స్వేచ్ఛలో ఎటువంటి మార్పూ ఉండదన్నారు.

చైనాలో ఆందోళనలు

ఫొటో సోర్స్, YAN ZHAO/AFP VIA GETTY IMAGES

నిరసనలు ఎలా రగులుతున్నాయి?

''ఆ చట్టం అమలైతే కేవలం మాట్లాడటమే నేరంగా మారిపోవచ్చు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని శిక్షించవచ్చు'' అని 25 ఏళ్ల విన్సెంట్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసనకారులు నగరంలో రద్దీగా ఉండే కాస్‌వే బే, వాన్ చాయ్ ప్రాంతాల్లో గుమిగూడారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫేస్ మాస్కులు ధరించిన నిరసనకారుల మీద పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించారు. సామాజిక దూరం అమలు చేయటం కోసం పెద్ద బహిరంగ సమావేశాల మీద నిషేధం ఉన్నప్పటికీ.. అనుమతి లేకుండా ఎవరూ సమావేశం జరపటానికి వీల్లేదని అధికారులు హెచ్చరించినప్పటికీ ప్రజలు వేల సంఖ్యలో గుమిగూడి నిరసన ప్రదర్శన చేపట్టారు. కొందరు నిరసనకారులు పోలీసు సిబ్బంది మీద గొడుగులు, వాటర్ బాళిళ్లు వంటి వస్తువులను విసిరారు.

సోలీసులు ముందుకు రాకుండా రోడ్లను దిగ్బంధించటానికి చెత్త డబ్బాలు, ఇతర చెత్తను అడ్డుగావేశారు. ఆదివారం నాటి నిరసన ప్రదర్శన క్రమం.. గత ఏడాది హింసాత్మకంగా మారిన నిరసన ప్రదర్శనల తరహాలోనే సాగిందని కొన్ని వార్తలు చెప్తున్నాయి. హాంగ్‌కాంగ్‌లో గత ఏడాది ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు చెలరేగినప్పటి నుంచీ 8,400 మందికి పైగా ప్రజలను అరెస్ట్ చేశారు.

చైనా-హాంకాంగ్

ఫొటో సోర్స్, ANTHONY WALLACE/AFP

ఏమిటీ చట్టం? ఎందుకీ చట్టం?

హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేస్తామని ప్రకటించిన చైనా స్థానికుల గుండెల్లో బాంబు పేల్చింది.

ఇప్పుడు ఈ చట్టం వస్తే హాంకాంగ్ ప్రత్యేక స్వేచ్ఛకు ముగింపు పలుకుతుందని చాలామంది భయపడుతున్నారు.

అయితే దీని గురించి స్థానికుల్లో అంత కలవరం ఎందుకు, దీనివల్ల ఏమవుతుంది. తెలుసుకుందాం.

చైనా ఇప్పటికే తన రబ్బర్ స్టాంప్ పార్లమెంటులో ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వచ్చే వారం దీనిపై ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే ఇది అసలు ముసాయిదా చట్టంగా మారుతుంది.

ఈ చట్టం గురించి పెద్దగా వివరాలు తెలియకపోయినా, ప్రజల్లో ఆందోళనలు మాత్రం తీవ్రంగానే ఉన్నాయి. మనకు తెలిసిన వివరాల ప్రకారం కింది వాటిలో ఏ చర్యకు పాల్పడినా అది చట్టం ప్రకారం నేరం అవుతుంది.

  • విభజన – దేశం నుంచి విడిపోవడం
  • కూలదోయడం-కేంద్ర ప్రభుత్వం అధికారాలను బలహీనపరచడం
  • ఉగ్రవాదం-ప్రజలపై హింస లేదా బెదిరింపులకు పాల్పడడం.
  • హాంకాంగ్‌లో జోక్యం చేసుకునే విదేశీ శక్తుల కార్యకలాపాలు

ముఖ్యంగా హాంకాంగ్‌లో జాతీయ భద్రతను కాపాడుకోడానికి బాధ్యత వహించే సంస్థలను ఏర్పాటు చేస్తామన్న చైనా సూచనలు తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయి.

అంటే నగరంలో హాంకాంగ్‌ సొంత సంస్థలతోపాటూ చైనా చట్టాలు అమలు చేసే సంస్థలు కూడా ఉంటాయి.

హాంకాంగ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, ISAAC LAWRENCE/AFP

చైనా ఇలా ఎందుకు చేస్తోంది?

బ్రిటన్ తన అదుపులో ఉన్న హాంకాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించింది. ఒక ప్రత్యేక ఒప్పందం ప్రకారం ప్రాథమిక చట్టం అనే ఒక చిన్న రాజ్యాంగం, ‘వన్ కంట్రీ, టూ సిస్టమ్స్’ (ఒకే దేశం-రెండు వ్యవస్థలు) అనే సూత్రం కింద ఇది జరిగింది.

హాంకాంగ్‌లో కొన్ని స్వేచ్ఛలను కాపాడటానికి వాటిని రూపొందించారు. ఫలితంగా ఆ నగరానికి భావ ప్రకటనా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, కొన్ని ప్రజాస్వామ్య హక్కులు లభించాయి. ఇలాంటి స్వేచ్ఛ చైనా మెయిన్‌లాండ్‌లో వేరే ఏ ప్రాంతానికీ లేదు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఆ ఒప్పందం ప్రకారం హాంకాంగ్ తన సొంత జాతీయ భద్రతా చట్టాలను అమలు చేయాల్సి వచ్చింది. ప్రాథమిక చట్టంలోని ఆర్టికల్ 23లో వాటిని పొందుపరిచారు.

కానీ జనాదరణ లేకపోవడంతో, ఆ చట్టాలను ఎప్పుడూ అమలు చేయలేదు. ప్రభుత్వం 2003లో వాటిని అమలు చేయాలని భావించినా, 5 లక్షల మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

గత ఏడాది ఒక అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా నెలల తరబడి జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అది విస్తృత చైనా వ్యతిరేక, ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంగా మారింది.

అలా మరోసారి జరగడం చూడాలని చైనా అనుకోవడం లేదు.

చైనాలో ఆందోళనలు

ఫొటో సోర్స్, EPA/JEROME FAVRE

హాంకాంగ్ ప్రజల్లో భయం ఎందుకు?

చట్టం ఇంకా ముసాయిదా దశలోనే ఉంది కాబట్టి, దానిని అమలు చేయడం కష్టం. కానీ, ముఖ్యంగా హాంకాంగ్ ప్రజలు దానివల్ల తాము పౌర స్వేచ్ఛ కోల్పోతామేమో అని భయపడుతున్నారు.

చైనా మెయిన్‌లాండ్‌లో ప్రభుత్వాన్ని నిందించడం నేరం. ఇప్పుడు ఈ చట్టం వల్ల ప్రభుత్వాన్ని విమర్శించిన హాంకాంగ్ ప్రజలను కూడా శిక్షించవచ్చని ఆ దేశ నిపుణులు విల్లీ లామ్ ఆందోళన వ్యక్తం చేశారు.

దానివల్ల హాంకాంగ్‌లో ప్రస్తుతం చట్టబద్ధంగా ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కులపై ప్రభావం పడుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చైనాలో అలాంటి చర్యలను విద్రోహంగా వర్గీకరించారు.

జోషువా వాంగ్ లాంటి ప్రముఖ ఉద్యమకారులు నగరంలో తమ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలకు సాయం చేయమని విదేశీ ప్రభుత్వాలను కోరుతున్నారు.

ఏళ్ల తరబడి లాబీయింగ్ చేసిన తర్వాత అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం హాంకాంగ్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమాక్రసీ యాక్ట్ ఆమోదించింది.

ఇప్పుడు చైనా చట్టం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను నేరంగా పరిగణిస్తారేమో అని స్థానికుల్లో భయం మొదలైంది. హాంకాంగ్ న్యాయ వ్యవస్థ కూడా చైనాలాగే మారిపోతుందేమో అని చాలామంది వణికిపోతున్నారు.

“జాతీయ భద్రతకు సంబంధించి దాదాపు అన్ని విచారణలు మూసిన తలుపుల వెనుకే జరుగుతాయి. ఆరోపణలు ఏంటి, వారి దగ్గరున్న ఆధారాలు ఏంటి అనే విషయంలో ఎప్పుడూ స్పష్టత ఉండదు. ఇక జాతీయ భద్రత అనే మాట కూడా స్పష్టత లేదు. దానిలో దాదాపు అన్ని అంశాలూ కవర్ కావచ్చు” అని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌ ప్రొఫెసర్ జొహన్నెస్ చాన్ చెప్పారు.

ముఖ్యంగా తమ స్వేచ్ఛను కత్తిరించడం వల్ల, ఆ ప్రభావం వ్యాపార, ఆర్థిక శక్తి కేంద్రంగా ఉన్న హాంకాంగ్ ఆకర్షణశక్తిపై పడుతుందని ప్రజలు తెలుసుకున్నారు.

ఈ చట్టం వల్ల రాజకీయంగానే కాదు, హాంకాంగ్ ఆర్థిక భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది అని నిపుణుల చెబుతున్నారు.

చైనా దీన్ని అమలు చేయగలదా?

చైనా ప్రాథమిక చట్టాలను అనెక్స్ త్రీ అనే సెక్షన్లోకి చేరిస్తే తప్ప, వాటిని హాంకాంగ్‌లో అమలు చేయడం కుదరదు. అక్కడ ఇప్పటికే కొన్ని ఉన్నాయి. వాటిలో చాలా వరకూ వివాదరహితంగా ఉన్నాయి.

ఈ చట్టాలను డిక్రీ ద్వారా చేర్చవచ్చు. అంటే దానికోసం నగర పార్లమెంటును బైపాస్ చేయాలి. “వీలైనంత త్వరగా చట్టం తీసుకురావడానికి చైనాకు సహకారం అందిస్తానని” హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ ఇప్పటికే చెప్పారు.

హాంకాంగ్‌కు చాలా ముఖ్యమైన ‘ఒక దేశం, రెండు వ్యవస్థల. సూత్రాన్ని ఇది ఉల్లంఘిస్తుందని, ప్రతిపాదిత చట్టం ఆర్టికల్ 23ను కూడా ఇది అతిక్రమిస్తుందని ప్రొఫెసర్ చాన్‌ చెప్పారు.

“చైనా ప్రభుత్వం హాంకాంగ్ ప్రాథమిక చట్టాన్ని తనకు ఇష్టం వచ్చినట్లు చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది” అన్నారు.

ఆర్టికల్ 23 కింద హాంకాంగ్ ప్రభుత్వం కూడా తన సొంత జాతీయ భద్రతా చట్టాన్ని ఒక ప్రత్యేక చట్టంలా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని ముసాయిదా తీర్మానం కూడా చెబుతోంది.

“అనెక్స్ లో ఉన్న జాతీయ చట్టాలకు సంబంధించి ఏవైనా ఆంక్షలు ఉంటే అవి హాంకాంగ్ పార్లమంటు ద్వారానే అమలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది” అని చాన్ చెప్పారు.

“రెండు న్యాయ పరిధుల్లో అంతర్లీనంగా ఉండే క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ విలువలు చాలా భిన్నంగా ఉంటాయి. దాని ప్రకారం ఏ క్రిమినల్ చట్టం అయినా హాంకాంగ్ ద్వారానే చేయాలి. మెయిన్‌లాండ్ చేయడం కుదరదు” అని ఆయన చెపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)