హాంగ్‌కాంగ్ సెక్యూరిటీ లా భయంతో బ్రిటన్‌కు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న స్థానికులు

హాంగ్‌కాంగ్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, గ్రేస్ సోయి
    • హోదా, బీబీసీ న్యూస్, హాంగ్‌కాంగ్

మైకేల్, సెరెనా దంపతులు హాంగ్‌కాంగ్ నుంచి బ్రిటన్ వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్నారు. ఆ దేశంలో వారంతకు ముందెప్పుడూ అడుగు పెట్టలేదు.

వీళ్లిద్దరికీ బ్రిటిష్ నేషనల్ ఓవర్సీస్ (బిఎన్ఓ) పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. బ్రిటన్ చైనాకి 1997లో హాంగ్‌కాంగ్ ని అప్పగించే ముందు హాంగ్‌కాంగ్ పౌరులకు ఈ పాస్‌పోర్ట్ లను జారీ చేసింది.

ఈ పాస్‌పోర్ట్ యుకె, గాని, యూరోప్ గాని సులభంగా వెళ్ళడానికిగాని, దౌత్య కార్యాలయంలో ఏదైనా సహాయానికి మాత్రమే పనికి వస్తుందని చాలా మంది భావించారు. కొంత మంది మాత్రం ఎందుకైనా మంచిదని పాస్‌పోర్ట్ తీసుకున్నారు.

ఒక బ్యాంకులో మధ్య స్థాయి మేనేజర్ లుగా పని చేస్తున్న మైకేల్, సెరెనా తమ 13 సంవత్సరాల వయసున్న కూతురుతో కలిసి చాలా ప్రదేశాలకు ప్రయాణించారు. వారు చాలా సంవత్సరాల క్రితమే ఒక ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు. ఇవన్నీ వదులుకుని వెళ్లడం కష్టమే.

హాంగ్‌కాంగ్ ని చైనాకి అప్పగించడం పై గత కొన్ని నెలలుగా హాంగ్‌కాంగ్ లో చోటు చేసుకుంటున్న నిరసనలతో హాంగ్‌కాంగ్ గుర్తు పట్టలేనంతగా మారిపోయిందని వాళ్ళు అన్నారు. ఇక్కడ ప్రజల మాట వినని ప్రభుత్వం, సహనం లేని పోలీస్ వ్యవస్థ కనిపిస్తోందని చెప్పారు.

వారి కుటుంబం నిరసనల్లో పాల్గొనకపోయినప్పటికీ నిరసనల కారణంగా వాళ్ళ అమ్మాయి బాగా ప్రభావితమైపోయింది. వీరు పని చేసే చైనా బ్యాంకులో అటువంటి నిరసనల్లో పాల్గొంటే ఉద్యోగాలలోంచి తీసేస్తారు.

"తనకి చాలా విచారంగా కోపంగా ఉంది. అధికారులు మనల్ని ఎందుకు అలా చూస్తున్నారని అడుగుతోంది?” అని సెరెనా చెప్పారు. వాళ్ళ అమ్మాయి విదేశాలలో చదువుకోవాలని అనుకుంటుందని చెప్పారు.

గత వారంలో చైనా అమలు లోకి తెచ్చిన జాతీయ భద్రతా చట్టం హాంగ్‌కాంగ్ మీద ప్రయోగించిన ఆఖరి అస్త్రం.

"ఈ చట్టంలో ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి” అని మైకేల్ అన్నారు.

ఈ చట్టం కొన్ని వర్గాల వారికే వర్తిస్తుందనే బీజింగ్ చెబుతున్న మాటలు తాను నమ్మనని సెరెనా అన్నారు.

హాంగ్‌కాంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హాంగ్‌కాంగ్‌లో గత ఏడాది వెల్లువెత్తిన నిరసనలు

బిఎ ఓ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తులు ఆరు సంవత్సరాల పాటు బ్రిటన్ లో ఉంటే , వారికి పూర్తి పౌరసత్వ హక్కులు కల్పిస్తామని బ్రిటన్ చెబుతోంది.

జాతీయ భద్రతా చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా, చైనా సైనో -బ్రిటిష్ సంయుక్త ఒప్పందాన్ని ఉల్లఘించిందని బ్రిటన్ ఆరోపిస్తోంది. ఈ చట్టం హాంగ్‌కాంగ్ ప్రజల స్వతంత్రాన్ని, పౌర హక్కులను కాల రాస్తోందని బ్రిటన్ అంటోంది.

మొదట్లో మైకేల్ , సెరెనా తమ కూతురుని మాత్రమే చదువు కోసం విదేశాలకు పంపాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు కుటుంబం మొత్తం హాంగ్‌కాంగ్ వదిలి వెళ్లాలని అనుకుంటున్నారు.

అస్తవ్యస్తంగా కనిపిస్తున్న భవిష్యత్ ని చూసి ఎందుకైనా మంచిదని గత సంవత్సరం నవంబర్లో వారు బిఎన్ ఓ పాస్ పోర్టులను పునరుద్ధరణ చేసుకున్నారు.

"బిఎన్ఓ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్ళకి ఆఖరి అస్త్రంగా మాత్రమే బ్రిటన్ పౌరసత్వం ఇస్తుందని అనుకున్నాను. కానీ, అది ఇంత తొందరగా జరుగుతుందని నేననుకోలేదు. కానీ, ఒక్క సారిగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి”, అని మైకేల్ చెప్పారు.

నా కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని ప్రకటించినప్పటి నుంచీ మైకేల్, సెరెనా లాంటి వాళ్ళ కథలు సాధారణంగా మారిపోయాయి. ప్రస్తుతం హాంగ్‌కాంగ్‌లో 350,000 మంది బిఎన్ఓ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఉన్నారు. యు కె ప్రభుత్వం అంచనాల ప్రకారం మొత్తం 29 లక్షల మందికి బి ఎన్ ఓ పాస్‌పోర్ట్ లు ఉన్నాయి.

1997 తర్వాత పుట్టిన హాంగ్‌కాంగ్ నివాసులు ఈ బి ఎన్ ఓ పాస్పోర్ట్ పొందేందుకు అర్హులు కాదు. అలాగే, హాంగ్‌కాంగ్ ని చైనాకి అప్పగించక ముందు దరఖాస్తు చేసుకోని వారికి కూడా ఈ పాస్ పోర్ట్ పొందే అవకాశం లేదు.

హెలెన్ 1997 లో హాంగ్‌కాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లక ముందే జన్మించారు. కానీ, ఆమె తల్లి తండ్రులు ఆమెకి బి ఎన్ ఓ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేయలేదు.

"నేను వెళతానో లేదో నాకర్ధం కావటం లేదు. కానీ, ఇది నా హక్కు. యు కె కంటే నాకు హాంగ్‌కాంగ్ అంటేనే ఇష్టం. కానీ, నాకు బి ఎన్ ఓ పాస్ పోర్ట్ ఉంటే బాగుండేది”, అని హెలెన్ అన్నారు. ఆమె తల్లి తండ్రులు ఆమె కోసం బి ఎన్ ఓ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయకపోవడం పట్ల వారిని స్వల్పంగా నిందించారు.

యుకె ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంత మంది హాంగ్‌కాంగ్ పౌరులు ఉపయోగించుకుంటారో చూడాల్సిందే. జులై 01వ తేదీ తర్వాత యుకె హాంగ్‌కాంగ్ పౌరులకు బ్రిటన్ పౌరసత్వం ఇస్తామని ప్రకటించినప్పటి నుంచి హాంగ్‌కాంగ్ వాసుల్లో ఆసక్తి పెరిగింది. "మేము హాంగ్‌కాంగ్ ని మరోలా చూడం. అలాగే హాంగ్‌కాంగ్ పట్ల మాకున్న చారిత్రక బాధ్యతలను కూడా మర్చిపోం” అని హౌస్ ఆఫ్ కామన్స్ లో పార్లమెంట్ సభ్యుడు రాబ్ అన్నారు.

"హాంగ్‌కాంగ్ లో ఉన్న నా సహ ఉద్యోగికి యు కె కి వెళ్లే మార్గాలు తెలుసుకునేందుకు ఫేస్ బుక్ లో రోజుకు 30 నుంచి 40 సందేశాలు వస్తున్నాయి”, అని యుకె లో ఒక ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీలో పని చేస్తున్న బెన్ యు చెప్పారు.

ఆయన వాట్సాప్ అయితే కొన్ని వందల సందేశాలతో నిండిపోయిందని చెప్పారు. ఆ రోజు నుంచి ఆగకుండా ప్రశ్నలు వస్తున్నాయని చెప్పారు.

హాంగ్‌కాంగ్

ఫొటో సోర్స్, Reuters

హాంగ్‌కాంగ్ లో చోటు చేసుకున్న రాజకీయ అనిశ్చితి కూడా బి ఎన్ ఓ పాస్పోర్ట్ లు పునరుద్ధరించుకోవడానికి ఒక కారణమయింది. 2018 లో 170000 బి ఎన్ ఓ పాస్పోర్ట్ లు పునరుద్ధరిస్తే, 2019 లో వీటి సంఖ్య 310000 కి పెరిగింది.

బ్రిటన్ కాలనీ గా హాంగ్‌కాంగ్ ఉన్నప్పటి నుంచీ ఆ దేశాన్ని ఎప్పుడూ కొంత కాలానికి అప్పు తెచ్చుకున్న ప్రాంతంగానే పరిగణించేవారు. ఇక్కడ నుంచి వేరే దేశాలకు తరలి వెళ్లడం అసాధారణమేమి కాదు. 1984 - 1997 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం సుమారు 20000 నుంచి 66000 మంది నగరం వదిలి బయటకు వెళ్లేవారు.

అయితే, చాలా మంది 1997 కి ముందు గాని, తర్వాత గాని, వాళ్లకి విదేశీ పాస్ పోర్ట్ లు లభించగానే , హాంగ్‌కాంగ్ లో ఊహించినట్లుగా రాజకీయ అనిశ్చితి లేదని అనిపించగానే దేశానికి తిరిగి వచ్చారు, అని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలిటిక్స్ అధ్యాపకులుగా పని చేస్తున్న ప్రొఫెసర్ మింగ్ సింగ్ అన్నారు.

ప్రస్తుతం ప్రజల తీరు చూస్తుంటే తిరిగి వచ్చేలా కనిపించటం లేదని అన్నారు.

“ఈ చట్టం చాలా క్రూరంగా ఉండటం మాత్రమే కాకుండా, బీజింగ్ మాట తప్పిన తీరును తెలుపుతోంది. ఇది హాంగ్ కాంగ్ కి సంయుక్త ఒప్పందం కింద లభించిన స్వతంత్రాన్ని కాపాడలేకపోతోందని”, అయన అన్నారు. హాంగ్‌కాంగ్ లో చాలా మంది యువత హాంగ్‌కాంగ్ ని వదిలి వెళ్ళిపోతారని భావిస్తున్నట్లు తెలిపారు.

హాంగ్‌కాంగ్

ఫొటో సోర్స్, Getty Images

తర్వాత ఏమిటి?

75 లక్షల జనాభా ఉన్న నగరంలో సుమారు 8 లక్షల మంది బ్రిటిష్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా పాస్ పోర్టులు ఉన్న వారుంటారు.

యుకె బిఎన్ ఓ పాస్ పోర్టులు ఉన్నవారికి పౌరసత్వం కల్పిస్తామని చేసిన ప్రకటన పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంగ్‌కాంగ్ పౌరులు 30 లక్షల మంది వరకూ బ్రిటన్ పౌరసత్వం అందిస్తామంటూ యూకే చేసిన ప్రకటన, '' చైనా అంతర్గత వ్యవహారాల్లో తీవ్రంగా జోక్యం చేసుకోవటమే''నని చైనా రాయబారి లీయు షిజామింగ్ పేర్కొన్నారు.

"దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ని కాపాడేందుకు చైనా దృఢ సంకల్పాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని”, ఆయన అన్నారు.

"హాంగ్‌కాంగ్ లో నివసిస్తున్న చైనా దేశీయులందరూ చైనా పౌరులేనని”, చైనా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

హాంగ్‌కాంగ్ ప్రజలను యుకె రావడానికి చైనా అంగీకరించక పొతే , యుకె చేయగలిగేది ఏమి ఉండదని ఐ టీవీ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాబ్ అన్నారు.

ఇక్కడి నుంచి ప్రజలను రక్షించడం ఆఖరి మార్గం అని, హాంగ్ కాంగ్ వాచ్ అడ్వొకసి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రోజర్స్ అన్నారు.

"హాంగ్‌కాంగ్ లో ప్రజలు వారి ఇళ్ల నుంచి పారిపోనక్కర లేకుండా వారికున్న స్వతంత్ర హక్కులతో జీవితాన్ని గడపగలిగేటట్లు చూడాలని”, ఆయన అన్నారు.

యుకె లో కొత్త జీవితం మొదలు పెట్టడానికి మైకేల్, సెరెనా సిద్ధమవుతున్నారు. అయితే, వారి 18 సంవత్సరాల కొడుకు మాత్రం వారితో యుకె వెళ్ళడానికి అంగీకరించలేదు. అతను తన తాత మామ్మలతో ఉంటానని చెప్పారు.

"హాంగ్‌కాంగ్ తనదని మా అబ్బాయి అనుకుంటాడు. అతనికి ఈ దేశం వదిలి పెట్టి రావడం ఇష్టం లేదని”, సెరెనా చెప్పారు.

ఇందులో కొంత మంది పేర్లు మార్చడమైనది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)