భారత్ - చైనా ఉద్రిక్తతలు: రెండు వైపులా తాత్కాలికంగా బలగాల ఉపసంహరణ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగిన కొన్ని ప్రాంతాల్లో రెండు వైపులా బలగాలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు సరిహద్దుల్లో జరిగే పరిణామాలను పర్యవేక్షిస్తున్న భారత అధికారులు ధ్రువీకరించారు.
ఢీ అంటే ఢీ అంటూ ఎదురెదురు పడిన బలగాలు ప్రస్తుతానికి తాత్కాలికంగా వెనక్కి వెళ్తున్నట్లు వారు వెల్లడించారు.
"గాల్వన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో బలగాలను రెండు వైపులా వెనక్కి తీసుకుంటున్నాం. అయితే ఉత్తరాన ఉండే డెప్సాంగ్ మైదానాలు, దక్షిణాన ఉండే ప్యాంగాంగ్ సో సరస్సుల్లో పరిస్థితుల గురించి మేం మాట్లాడటంలేదు" అని ఓ అధికారి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్కడ ఏం జరుగుతోంది?
"టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ప్రస్తుతానికి రెండు వైపులా తొలగిస్తున్నారు. బలగాలను ఉపసంహరించుకుంటున్నారు. దీని అర్థం బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నామనో లేదా సమస్య పరిష్కారం అయిందనో కాదు" అని మరో అధికారి వివరించారు.
ఉపగ్రహ చిత్రాల పరిశీలన, విహంగ వీక్షణంతోపాటు క్షేత్రస్థాయిలో సైనికులు వెళ్లి పరిస్థితులను ధ్రువీకరించే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందని చెప్పారు.
చైనా బలగాలు ఏఏ చోట్ల ఎంతెంత దూరం వెనక్కి వెళ్లాయో మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే దీనిపై అడిగిన ప్రశ్నలకు అధికారులు స్పందించలేదు. "ఇంత దూరం అంటూ ఏమీలేదు. చుషుల్‌లో జూన్‌లో జరిగిన 30 కోర్ కమాండర్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేశాం"అని వారు పేర్కొన్నారు.
జులై 1న రెండు దేశాల అధికారులు సమావేశమయ్యారు. దీనిపై కొందరు అధికారులతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Getty Images
"కోవిడ్-19 ప్రొటోకాల్స్ నడుమ సుదీర్ఘ సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు వైపులా సంసిద్ధత వ్యక్తమైంది. ఎల్ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణ కొంచెం క్లష్టమైన ప్రక్రియ. దీని గురించి వచ్చే ఊహాగానాలు, అసత్య వార్తలను పట్టించుకోకూడదు. ఎల్ఏసీ వెంబడి ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌లకు అనుగుణంగా రెండు వైపులా సైనిక, దౌత్య స్థాయిల్లో మరిన్ని సమావేశాలు జరుగుతాయి" అని వారు చెప్పారు.
"ఫ్రంట్‌లైన్ సరిహద్దు బలగాలను బ్యాచ్‌ల వారీగా వెనక్కి తీసుకునేందుకు చైనా, భారత్ అంగీకరించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి" అని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా పేర్కొంది.
"సైనిక కమాండర్ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని రెండు దేశాలు తీర్మానించాయి" అని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, MEA
ఇరు దేశాల మధ్య చర్చలు...
మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ సెక్టార్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి, స్టేట్ కౌన్సెలర్.. జూలై 5న లోతుగా చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులూ ఫోన్‌కాల్ ద్వారా మాట్లాడుకున్నట్లు పేర్కొంది.
"ఎల్ఏసీ వెంబడి బలగాలను వీలైనంత త్వరగా ఉపసంహరించుకొనేందుకు వారు అంగీకరించారు. సరిహద్దుల్లో సంపూర్ణ శాంతి స్థాపనకు ఇది అత్యవసరమని వారు తీర్మానించారు. దీనికోసం ప్రస్తుతం కొనసాగుతున్న బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వారు అంగీకరించారు. ఈ ప్రక్రియ దశల వారీగా జరుగుతుంది. ఎల్ఏసీని కచ్చితంగా పాటించాలని, ఏక పక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వారు తీర్మానించారు."
"వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్ (డబ్ల్యూఎంసీసీ)తోపాటు వివిధ స్థాయిల్లో దౌత్య, సైన్యాధికారుల చర్చలు కొనసాగించేందుకూ వారు అంగీకరించారు. పూర్తిస్థాయిలో సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేవరకూ తమ చర్చలు కొనసాగిస్తామని ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులూ తీర్మానించారు."
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శాంతి స్థాపనకూ ప్రాధాన్యం: చైనా
మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు సంబంధించి అజిత్ డోభాల్‌తో జరిపిన చర్చల్లో సానుకూల అంగీకారం కుదిరినట్లు వీడాంగ్ కూడా ఓ ట్వీట్ చేశారు.
"గాల్వన్ లోయలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి తప్పు, ఒప్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. చైనా తమ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంతోపాటు సరిహద్దుల్లో శాంతి స్థాపనకూ ప్రాధాన్యం ఇస్తుంది" అని చైనా విదేశాంగ శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.
"రెండు దేశాలూ ఒకరితో మరొకరికి ముప్పు కలగచేసుకునే కంటే.. అభివృద్ధి అవకాశాలను పంచుకుంటే మంచిది. ప్రస్తుత సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనే దిశగా రెండు దేశాలూ ప్రయత్నించాలి"అని ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









