హిందూ మహిళ పేరిట దిల్లీలో మసీదు.. ఇంతకీ ఆమె ఎవరు.. బ్రిటిష్ అధికారి భార్యా?

- రచయిత, అమృత కదం, నామ్ డియో అంజన
- హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధులు
మహారాష్ట్రలోని పుణె నుంచి ఒక బ్రాహ్మణ యువతి దిల్లీకి వెళ్లారు. ఓ బ్రిటిష్ అధికారి ఆమెను వివాహం చేసుకున్నరు. అంతేకాదు.. ఆమె పేరిట దిల్లీలో ఒక మసీదునూ నిర్మించారు. జానపద కథలా అనిపించినప్పటికీ ఇది ఇటీవలి చరిత్రే.
దిల్లీలో ఆదివారం కురిసిన వర్షాలకు ఆ మసీదు గుమ్మటం కూలిపోయింది.
దిల్లీలోని చావడి బజార్‌లోని ఇరుకు సందుల్లో ఉన్నఆ మసీదును ఎరుపు రంగు రాయితో నిర్మించారు.
ఇది సరిగ్గా హౌజ్ కాజీ చౌక్ దగ్గర ఉంటుంది. 19 వ శతాబ్దంలో ఈ మసీదుని ‘రండీ కి మసీద్’ అని పిలిచేవారు. నేటికీ చాలా మంది ఈ మసీదుని ఇదే పేరుతో పిలుస్తారు.
రండీ అంటే వేశ్య అని అర్ధం. నిజానికి ఈ మసీదు అసలు పేరు ముబారక్ బేగం మసీదు.
1823లో నిర్మితమైన దీన్ని ఎవరు నిర్మించారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ముబారక్ బేగమే స్వయంగా నిర్మించారా? లేదంటే ఆమె కోసం ఇంకెవరైనా నిర్మించారా అనే విషయంలో బలమైన ఆధారాలు లేవు.
ఈ మసీదు మౌల్వీ (మతాధికారి) మాత్రం ముబారక్ బేగమే నిర్మించారని చెపుతున్నారు.
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన వారే మసీదు నిర్మాణాలను చేపట్టే కాలంలో అందుకు భిన్నమైన నేపథ్యంతో ఉన్న మహిళ దీన్ని నిర్మించడం ఆసక్తికరం.
చరిత్ర ఆ మహిళ గురించి పెద్దగా చెప్పనప్పటికీ అందుబాటులో ఉన్న కొద్దిపాటి సమాచారం మాత్రం ఆమె నేపథ్యాన్ని వివరిస్తోంది.
ముబారక్‌గా మారినప్పటికీ ఆమె నిజానికి హిందూ మతానికి చెందిన మహిళ. మహారాష్ర్టలోని పుణే నుంచి దిల్లీకి వచ్చారు.
కొన్ని చోట్ల ఆమె పేరు చంపా అని కనిపిస్తోంది. దీన్ని ధ్రువీకరించే సమాచారం లభించలేదు.
ఈమె ముబారక్ బేగంగా ఎలా మారారు? అడుగడుగునా మొఘల్ సంస్కృతి కనిపించే నగరంలో ఈ మహిళ పేరిట మసీదు ఎలా నిర్మించారు?

ముబారక్ బేగం జీవితం
ఆమె అసలు పేరు చంపానా కాదా అనేది తేల్చలేం కానీ ఆమె పుణే నుంచి దిల్లీకి చేరాక ఇస్లాం మతంలోకి మారారు అని చరిత్రకారుల వల్ల తెలుస్తోంది. మతం మారాక ఆమె కొత్త పేరు బీబీ మహ్రతున్ ముబారక్ అల్ నిస్స బేగం.
హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన ఆమె అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ డేవిడ్ ఆక్టర్లనీని వివాహం చేసుకున్నారు. (కొందరు చరిత్రకారులు ఆమె డేవిడ్ ప్రియురాలు అని అంటారు)
జనరల్ డేవిడ్ రెండో అక్బర్ షా కాలంలో దిల్లీలో రెసిడెంట్ అధికారిగా పని చేశారు.
డేవిడ్, ముబారక్‌ల మధ్య ఉన్న బంధం ఏదైనప్పటికీ ఆయన జీవితంలో ముబారక్ బేగం స్థానం మాత్రం చాలా ముఖ్యమైనది.
ముబారక్ బేగం పట్ల డేవిడ్‌కున్న ప్రేమ గురించి జాఫర్ మాసన్ అనే రచయిత గతంలో ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో వివరించారు.
డేవిడ్‌కు 13 మంది భార్యలుండేవారు. అందులో ముబారక్ బేగం ఒకరు. ఆమె డేవిడ్ చిన్న కొడుకుకు తల్లి కూడా.
డేవిడ్ కంటే ముబారక్ వయసులో చిన్నదైనప్పటికీ వారిద్దరి బంధంలో ఆమెకి ఎక్కువ అధికారం మాత్రం ఉండేది.
అందుకే డేవిడ్ ఆక్టర్లనీ క్రైస్తువడైనప్పటికీ ముబారక్ బేగం ద్వారా పుట్టిన పిల్లలను ఆయన ముస్లిం పద్ధతులలోనే పెంచారు.
ఆమె కూడా ముస్లింల తరహాలోనే ప్రజలకు బహుమతులు (నిజార్) ఇవ్వడం, ఖిలాత్ (బట్టలు పంచడం) లాంటివి చేసేవారు. అయితే "బ్రిటిష్ వారు, మొఘల్‌లు ఇద్దరూ ముబారక్ బేగంని ద్వేషించేవార”ని దిల్లీ యూనివర్సిటీ హిస్టరీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అనిరుద్ధ దేశ్‌పాండే చెప్పారు.
“ముబారక్ బేగం తనని తాను లేడీ డేవిడ్‌గా పిలుచుకోవడం.. అంటే బ్రిటిష్ ఉన్నతాధికారి పట్టపురాణిగా తనను తాను భావించుకోవడం బ్రిటిష్ వర్గాలకు ఇష్టం ఉండేది కాదని ప్రొఫెసర్ పాండే చెప్పారు. అలాగే మరోవైపు తనని తాను ఖుదాసియా బేగం గా (చక్రవర్తికి తల్లి) పిలుచుకోవడం మొఘల్ వర్గాలకు ఇష్టం ఉండేది కాదని అంటారు. డేవిడ్ నిర్మించిన ఒక పార్క్‌కి ముబారక్ బాగ్ అని పేరు పెట్టారు. ఆ తోటకు మొఘల్స్ వెళ్లేవారు కాదు”.
“ఆమె తనకు ఇష్టమైన రీతిలో జీవించారు. మొఘల్ కాలంలో ఉంపుడుగత్తెలపై సమాజంలో మరీ అంత చిన్నచూపేం ఉండేది కాదు” అంటారు ప్రొఫెసర్ ఫాండే.
“ఆ రోజుల్లో ముబారక్ బేగం పేరు చాలా ప్రముఖంగా వినిపించేది. దిల్లీలో జరిగిన ఆఖరి పెద్ద ముషాయరీ (కవిత్వ సభ) ఆమె అంతఃపురంలోనే జరిగింది. ఈ సభకు సుమారు 40 మంది కవులు హాజరయ్యారని అందులో మీర్జా గాలిబ్ కూడా ఉన్నారని చెబుతారు”.

ఫొటో సోర్స్, TWITTER/@DALRYMPLEWILL
వైట్ మొఘల్
డేవిడ్ ఆక్టర్లనీ 1758లో బోస్టన్‌లో జన్మించినట్లు బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది.
ఆయన భారతదేశానికి 1777లో వచ్చారు. లార్డ్ లేక్ నాయకత్వంలో జరిగిన కోయిల్, అలీగఢ్, దిల్లీ యుద్ధాలలో పాల్గొన్నారు. 1803లో ఆయనను రెసిడెంట్ అధికారిగా దిల్లీకి పంపించారు. ఆ మరుసటి సంవత్సరమే ఆయనను మేజర్ జనరల్ చేశారు.
హోల్కర్‌లు దిల్లీ పై దాడి చేసినప్పుడు ఆయన దిల్లీ తరుపున పోరాడిన సైన్యానికి నేతృత్వం వహించారు. ఆయన మరి కొన్ని యుద్ధాలలో బ్రిటిష్ సేనలకు నాయకత్వం వహించారు. ఆయన 1825లో మరణించారు.
“ఆయన దిల్లీలో నివాసమున్నప్పుడు మొఘల్ సంస్కృతిని పూర్తిగా పాటించారు. అందుకే ఆయనను తెల్ల మొఘల్ అని అంటారని” ప్రొఫెసర్ పాండే చెప్పారు.
ఆంగ్లేయులకు నేపాల్‌కు యుద్ధం జరిగినప్పుడు, మరాఠా యుద్ధం సమయంలోనూ డేవిడ్ స్వయంగా యుద్ధాలలో పాల్గొన్నట్లు చెప్పారు.

గతంలోంచి బయటకు రావడానికి ప్రయత్నం
జియా అస్ సలాం రాసిన పుస్తకం "విమెన్ ఇన్ మసీద్’’ పుస్తకంలో ముబారక్ బేగం గురించి భిన్నమైన సమాచారాన్ని ఇచ్చారు.
"ఆమె మొదట్లో ఒక వేశ్య. ఆమె గత జీవితం నుంచి బయటకు వచ్చి సమాజంలో ఉన్నత స్థానం పొందాలని తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందుకే ఆమె బ్రిటిష్ జనరల్ డేవిడ్ పరివారంలో భాగమయ్యారు. ఆయన మరణం తర్వాత ఆమె ఒక ముస్లిం సర్దార్ ని పెళ్లి చేసుకున్నార’’ని జియా అస్ సలాం బీబీసీ మరాఠీతో చెప్పారు.
"మసీదు నిర్మించడం వెనక ఆమె ఉద్దేశం.. ఉన్నత వర్గాల వారి ఆమోదం పొందడమే. కొంత మంది ఈ మసీదుని ముబారక్ బేగం నిర్మించారని చెప్పగా, మరికొంత మంది దీనిని జనరల్ డేవిడ్ నిర్మించి ముబారక్ బేగం పేరు పెట్టారని అంటారు. నిజానికి మసీదుని ముబారక్ బేగం నిర్మించగా, దానికి డేవిడ్ ఆర్ధిక సహాయం చేశారు."
మధ్య యుగంలో మహిళలు చాలా మసీదులు నిర్మించారు. వాళ్లు మదరసాలను కూడా నిర్మించారు. దిల్లీ లో ఉన్న ఫతేపురి మసీదుని షాజహాన్ భార్య నిర్మించారు. ఆమె చక్రవర్తికి భార్య, కానీ ముబారక్ బేగం వేశ్య అని గుర్తు పెట్టుకోవాలి అని జియా అన్నారు.
ముబారక్ మసీదు ఎలా ఉంటుంది?
మసీదు ప్రవేశ ద్వారం దగ్గర ‘మాజీద్ ముబారక్ బేగం' అనే పేరు రాసి ఉంటుంది.
మసీదు రెండు అంతస్థులతో నిర్మితమైంది. మసీదులో గ్రౌండ్ ఫ్లోర్ లో పూర్తిగా దుకాణాలు ఉన్నాయి. మసీదు ప్రవేశం దగ్గరకు వెళ్ళడానికి ఇరుకైన సందు ఉంటుంది. మొదటి అంతస్తులో మసీదు ఉంటుంది. అందులో ఒక ప్రార్ధన మందిరం, మూడు గుమ్మటాలు ఉన్నాయి. ఆదివారం నాటి వర్షాలకు ఇందులో ఒకటి కూలిపోయింది.
మసీదుని ఎర్ర సున్నం రాయితో నిర్మించారు.
ఆదివారం కూలిన గోపురాన్ని మినహాయించి మసీదులో మిగిలిన భాగమంతా దృఢంగానే ఉంది. మసీదు మరెక్కడా చెక్కు చెదరలేదు.
హౌజ్ కాజీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ మసీదుని ‘రాండి కి మాజీద్ ' అని పిలుస్తారని అనిరుద్ధ దేశ్‌పాండే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








