కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిళ్లు

పెళ్లి కూతురి కిడ్నాప్
ఫొటో క్యాప్షన్, పెళ్లి కూతురి కిడ్నాప్
    • రచయిత, లిజా తంబునన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇండోనేసియా మారుమూల దీవి సుంబాలో వధువులను కిడ్నాప్ చేసే వివాదాస్పద ఆచారాన్ని పూర్తిగా రూపుమాపనున్నట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు.

పెళ్లి చేసుకోడానికి మహిళలను ఎత్తుకెళ్తున్న వీడియోలు బయటపడిన తర్వాత ఈ ఆచారంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

‘నా బండి స్టార్ట్ చేసేలోగా చుట్టుముట్టి నన్ను ఎత్తుకెళ్లిపోయారు’

స్థానిక అధికారులమని చెప్పిన ఇద్దరు సిట్రా(పేరు మార్చాం) దగ్గరికి వచ్చారు. ఆమె నడుపుతున్న ఒక స్వచ్ఛంద సంస్థ సంస్థ ప్రాజెక్టు బడ్జెట్ పెంచాలనుకుంటున్నామని, మీతో కాస్త మాట్లాడాలని చెప్పారు. దాంతో అది మామూలు సమావేశమేనని ఆమె అనుకున్నారు.

28 ఏళ్ల ఆమె మనసులో ఒంటరిగా వారితో వెళ్లాలంటే ఏ మూలో కాస్త ఆందోళనగా ఉంది. కానీ, పనిలో భాగమే కదా అని ఆమె ఆ భయాన్ని పక్కనపెట్టారు.

ఒక గంట తర్వాత, సమావేశం వేరే చోట కొనసాగుతుందని, అక్కడికి తమతోపాటూ కారులో రావచ్చని వారు సిట్రాకు చెప్పారు.

కానీ, తన మోటార్ సైకిల్‌పైనే వస్తానని చెప్పిన ఆమె, దాని దగ్గరికెళ్లి స్టార్ట్ చేయడానికి తాళం తీసుకున్నారు. అంతలోనే కొంతమంది ఆమెను హఠాత్తుగా పట్టుకున్నారు.

“వాళ్లు నన్ను కార్లోకి ఎక్కించబోతున్నారు. నేను వాళ్ల నుంచి విడిపించుకోడానికి పెనుగులాడుతూ, గట్టిగట్టిగా అరుస్తున్నాను. నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను లోపలున్న ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. ఏం జరుగుతోందో నాకు అర్థమైంది” అని సిట్రా చెప్పారు.

సిట్రాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తి ఆమెను బంధించాడు.

వధువును కిడ్నాప్ చేయడం లేదా ‘కవిన్ టాంగ్‌కాప్’ అనేది సుంబాలో ఒక వివాదాస్పద ఆచారం. ఇందులో భాగంగా ఒక అబ్బాయి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిపోతాడు. ఇందుకోసం స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఏకంగా దండయాత్రకు వచ్చినట్లు వస్తాడు.

ఈ ఆచారాన్ని నిషేధించాలని మహిళా హక్కుల సంఘాలు చాలా కాలంగా పిలుపునిస్తున్నప్పటికీ, ఇండోనేసియా బాలీకి తూర్పుగా ఉన్న సుంబా దీవిలోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.

కానీ, పెళ్లి చేసుకోవడం కోసం ఇద్దరు యువతులను కిడ్నాప్ చేస్తున్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ఈ ఆచారానికి ముగింపు పలకాలని ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చింది.

పూజలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రాణంపోతున్నట్టు అనిపించింది

కారులో ఉన్న సిట్రా ఎలాగోలా తన బాయ్‌ఫ్రెండ్‌కు, తల్లిదండ్రులకు మెసేజ్ పంపించగలిగారు. కిడ్నాపర్లు ఆమెను సంప్రదాయంగా చెక్క స్తంభాలతో ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు. అది చూడగానే, వారు తన తండ్రి తరఫు దూరపు బంధువులనే విషయం ఆమెకు అర్థమైంది.

“అక్కడ అప్పటికే చాల మంది నాకోసం ఎదురుచూస్తున్నారు. నేను రాగానే ఒక పెద్ద గంట మోగించి, మంత్రాలు చదవడం ప్రారంభించారు” అని సిట్రా చెప్పారు.

సుంబా ప్రజలు ఇస్లాం, క్రైస్తవ మతాలతోపాటూ 'మరపు' అనే ఒక పురాతన మతాన్ని కూడా అనుసరిస్తున్నారు. చెట్లు, జీవంలేని వస్తువులకు కూడా ప్రాణం ఉందని వారు భావిస్తారు. ప్రపంచాన్ని సమతౌల్యంగా ఉంచడానికి వేడుకలు, బలుల ద్వారా ఆత్మలను ప్రసన్నం చేసుకోవచ్చని నమ్ముతారు.

నీళ్లు మన నుదుటికి తగిలినప్పుడు, ఇంట్లోనుంచి బయటకు వెళ్లకూడదని కూడా సుంబా ప్రజలు భావిస్తారు.

“ఏం జరుగుతోందో నాకు అర్థమవుతోంది. వాళ్లు నాకు నీళ్లు తాకించాలని ప్రయత్నించినపుడు, అవి నా నుదుటికి తగలకుండా నేను చివరి నిమిషంలో తప్పించుకున్నా” అంటారు సిట్రా

ఆమెను కిడ్నాప్ చేసినవారు నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశామని చెబుతూ ఆమెను ఆ పెళ్లికి ఒప్పించడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేశారు.

“నా గొంతు తడారిపోయేవరకు ఏడ్చాను, నేలపై పడిపోయాను, నా మోటార్ బైక్ కీ కడుపులో గాయం అయ్యేలా గుచ్చుకుంటోంది. నా తలను అక్కడున్న చెక్క స్తంభాలకు కొట్టుకున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎలాగోలా వాళ్లకు అర్థమైతే చాలనుకున్నా. వాళ్లకు నా మీద జాలైనా కలుగుతుందేమోనని ఆశపడ్డా” అని సిట్రా వెల్లడించారు.

తర్వాత ఆరు రోజుల వరకూ ఆమె ఒక ఖైదీలా ఆ ఇంట్లోనే బందీగా ఉన్నారు. అక్కడ హాల్లోనే నిద్రపోయారు. “రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. నిద్రపట్టలేదు, నాకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది” అని చెప్పారు.

ఆ ఇంట్లో వాళ్లు ఇచ్చిన ఏవైనా తిన్నా, తాగినా... ఆచారం ప్రకారం ఆమె ఆ పెళ్లికి ఒప్పుకున్నట్లే అయిపోతుంది. “మనం వాళ్లు ఇచ్చిన ఏదైనా తిన్నామంటే, ఆ పెళ్లికి సరే అన్నట్టే లెక్క” అని చెప్పారు సిట్రా

బందీగా ఉన్నప్పుడు ఆమె సోదరి సిట్రాకు దొంగచాటుగా ఆహారం, నీళ్లు అందించింది. తర్వాత మహిళా సంఘాల సాయంతో కుటుంబం ఆమెను విడిపించడానికి గ్రామ పెద్దలు, సిట్రాను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి కుటుంబంతో చర్చలు జరిపింది.

పసోలా ఉత్సవానికి గుర్రాలపై వెళ్తున్న పురుషులు

ఫొటో సోర్స్, Getty Images

చర్చలు జరిపే స్థితిలో ఉండరు

గత నాలుగేళ్లలో ఇలా ఏడుగురు అమ్మాయిలను ఎత్తుకెళ్లినట్లు పెరుయాతిలోని మహిళా హక్కుల సంఘం గుర్తించింది. సుంబా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి ఇంకా చాలా జరుగుతూ ఉండచ్చని భావిస్తోంది.

“సిట్రా సహా మరో ముగ్గురు మాత్రమే వారి చేతుల్లోంచి బయటపడగలిగారు. ఇటీవల బయటపడిన కిడ్నాప్‌ వీడియోలను జూన్‌లో చిత్రీకరించారు. వారిలో ఒక మహిళ ఆ పెళ్లిలోనే ఉండిపోయింది. ఎందుకంటే ఆమెకు వేరే దారిలేకుండా పోయింది” అని పెరుయాతి గ్రామ పెద్ద, సంఘం కార్యకర్త అప్రిస్సా తరనావ్ చెప్పారు.

‘కావిన్ తాంగ్‌కాప్’ కొన్నిసార్లు పెద్దలు కుదిర్చిన వివాహంలా మారిపోతుందని, అక్కడ బాధిత మహిళలకు చర్చలు జరిపే అవకాశం ఉండదని ఆమె చెప్పారు.

“వారి నుంచి ఎలాగోలా బయటపడినవారిని తరచూ సమాజం చిన్నచూపు చూస్తుంది. వారిపై అవమానకరమైన ముద్ర వేస్తారు. పెళ్లి చేసుకోడానికి, పిల్లలు కనడానికి వారు తగరని భావిస్తారు. ఆ భయం వల్లే మహిళలు కిడ్నాప్ చేసిన వారినే పెళ్లి చేసుకోడానికి సిద్ధమైపోతుంటారు” అంటారు తరవాన్.

సిట్రా కూడా దానితో ఏకీభవిస్తారు.

“దేవుడి దయ వల్ల నేను నా బాయ్‌ఫ్రెండును పెళ్లి చేసుకోగలిగా. నాకు ఇప్పుడు ఏడాది బిడ్డ కూడా ఉన్నాడు” అని ఆ కిడ్నాప్ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత సిట్రా చిరునవ్వుతో చెబుతున్నారు.

సుంబా గ్రామంలో ఇళ్లు

ఫొటో సోర్స్, Getty Images

చట్టవిరుద్దంగా మారుస్తాం

“సుంబా సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ ఆచారం భాగం కాదు. మహిళకు ఇష్టం లేకపోయినా, ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకునేవారు దీనిని ఉపయోగిస్తున్నారు. నేతలు, అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది” అని స్థానిక చరిత్రకారుడు ఫ్రాన్స్ వోరా హెబీ చెప్పారు.

దీనికి వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలూ లేవు. ఇలా మహిళలను ఎత్తుకొచ్చినవారిని కొన్నిసార్లు సమాజమే మందలిస్తుంది. కానీ చట్టపరంగా, సాంస్కృతిక పరంగా దీన్ని ఎవరూ అడ్డుకోవడం లేదు.

ఇండోనేసియా మహిళా సాధికారత మంత్రి పుష్పయోగ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండోనేసియా మహిళా సాధికారత మంత్రి బింతాంగ్ పుష్పయోగ

దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు రావడంతో, ఈ ఆచారాన్ని రూపుమాపాలంటూ సుంబా స్థానిక నాయకులు ఈ నెల ప్రారంభంలో ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు.

దేశ మహిళా సాధికారత మంత్రి బింతాంగ్ పుస్పయోగా దీనికి హాజరవడానికి రాజధాని జకార్తా నుంచి ఈ దీవికి విమానంలో వచ్చారు.

“నిజానికి వైరల్ అయిన ఈ వధువును అపహరించే ఆచారం, సుంబా సంప్రదాయాల్లో భాగం కాదని స్థానిక నేతలు, మతపెద్దల ద్వారా మాకు తెలిసింది” అని ప్రకటనపై సంతకాలు జరిగిన తర్వాత ఆమె మీడియాతో చెప్పారు.

సుంబా మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఆచారాన్ని మహిళల పట్ల జరుగుతున్న హింసగా వర్ణించిన పుస్పయోగా, దానికి ముగింపు పలకాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ ప్రకటన ఒక ప్రారంభమేనని చెప్పారు.

మహిళా హక్కుల సంఘాలు దీనిని స్వాగతించాయి. “సుదీర్ఘ కాలం తర్వాత దీనిని తొలి అడుగు”గా వర్ణించాయి.

ఇన్నాళ్లకు ఈ ఆచారాన్ని అంతం చేయడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వానికి రుణపడి ఉంటానని సిట్రా చెబుతున్నారు. తనకు జరిగింది, ఇక ఎవరికీ జరగదని ఆశిస్తున్నారు.

“కొంతమందికి ఇది మా పూర్వీకుల ఆచారంలా అనిపించవచ్చు. కానీ ఇది కాలం చెల్లిన ఆచారం. దానిని కచ్చితంగా అడ్డుకోవాలి. ఎందుకంటే దానివల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు” అంటారు సిట్రా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)