తెలుగు: భాష ఒకటే.. మాండలికాల సొగసులు అనేకం

- రచయిత, తిరునగరి శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఒక ప్రదేశానికి, ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాట్లాడుకునే భాషా విశేషం మాండలికం.
డైలెక్ట్ అన్న ఇంగ్లిష్ మాటకు ఇది సమానార్థకం. భాషను మాట్లాడే ప్రజలలో వృత్తిని బట్టి, కులాన్ని బట్టి ఏర్పడ్డ ఒక వర్గం ప్రజల భాషాభేదాన్ని మాండలికంగా చెప్పొచ్చు.
డైలెక్ట్ అన్న పదానికి సంభాషణ, మాట్లాడే తీరు, వైఖరి, రీతి, మాండలికం అనే అర్థాలున్నాయి. విలక్షణమైన ఉచ్ఛారణలో ఉండి ఒక మండలానికి చెందిన భాషను గాని, ఒక భాషాశాఖను గాని, ఒక మూలభాషను ఒక వృత్తి వ్యాపారానికే చెందిన భాషను మాండలిక భాషగా భావించవచ్చు.
మాండలిక భాషను ఒక వర్గం, కులం భాష, ఒక మూల భాష, వృత్తి పదజాలపు భాష, ఒక ప్రాంతానికే పరిమితమైన భాషగా సూచిస్తాయి.
ఒక ప్రత్యేక ప్రదేశంలో కనిపించే నుడికారం, విభిన్న పదజాలం వంటి వాటితో మాండలికాలను భాషాశాస్త్రజ్ఞులు గుర్తిస్తారు.
ధ్వని వల్ల ఒక పదంలో కనిపించే మార్పు వల్ల కలిగిన భేదాన్ని కూడా మాండలికంగానే చెబుతారు.
ధ్వనుల కారణంగా మార్పునకు లోనైన పదాలను మాత్రమే నిర్దిష్టంగా మాండలికాలుగా భావిస్తారు.
ఒకే భావం ఉన్నా పదరూపం వేరయినప్పుడు వాటిని మాండలికాలుగా గుర్తించడం సాధ్యం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
స్పష్టమైన మాండలికంగా నిర్థారించాలంటే మాండలికం అనే పదం మండల శబ్దం నుండి వ్యుత్పపన్నమైంది కాబట్టి ఒక ప్రత్యేక పరిమిత ప్రాంతంలోని ప్రజల స్థానిక భాషా వ్యవహారంలోని ఉచ్ఛరణ భేదమే మాండలికం అని భావించాలి.
వర్గం, కులం, వృత్తి వంటివి చేరి మాండలికం విస్తృతి పొందింది. దానికి అనుగుణంగానే మాండలికం నుండి ప్రాంతీయాన్ని ప్రత్యేకంగా అవగాహన చేసుకోవాలి.
మాండలికమంటే దేశ భాగం అని అర్థం ఉంది. మాండలిక భాషను ఉపభాష అని కాని ప్రాదేశిక భాష అని కూడా వ్యవహరిస్తారు.
సర్ జార్జ్ గ్రియర్సన్ తన లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అన్న గ్రంథంలో తెలుగు మాండలికాలను గురించి ప్రస్తావించారు. , మాండలికాలపై ఎక్కువ పరిశోధనలు వెలువడిన దేశం ఇంగ్లండ్.
పదజాలంలో, ఉచ్ఛరణలో మాండలికం ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మాక్స్‌ముల్లర్ ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కాని భాష కాదు, మాండలికాల సమాహార రూపమే భాష అని వివరించారు.
చారిత్రక, ప్రాంతీయ, సాంఘిక మాండలికాలుగా బహురూపతతో కూడిన ప్రధాన విధాలుగా మాండలికాలను భాషాశాస్త్రవేత్తలు వర్గీకరించారు.
ప్రజల మధ్య వ్యవహారం సన్నగిల్లడం వల్ల ఏర్పడే మాండలికాలు ప్రాంతీయ మాండలికాలు. సాధారణంగా ప్రాంతీయ మాండలికాలనే భౌగోళిక పరిస్థితుల కారణంగా ఏర్పడే స్థల మాండలికాలు అని కూడా అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మార్పులు మాట్లాడే మాటల్లో వ్యక్తమైతే వాటిని సామాజిక మాండలికాలు అంటారు. సామాజిక మాండలికాలు కుల(వర్ణ), వర్గ, వైయక్తిక అన్న మూడు రకాలుగా తిరిగి విభజించొచ్చు.
చారిత్రక ఆధారాలను బట్టి ఒకే కాలంలో ఉన్న రూపాలు కాలానుగుణంగా ఎలా పరిణామం చెందాయో వివరించి చెప్పేవి చారిత్రక మాండలికాలు. వయస్సును, లింగ భేదాన్ని బట్టి జీవశాస్త్రానుసార మాండలికాలు ఏర్పడతాయి.
మాండలికాలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. భాషలో కాలానుగుణంగా కలిగే మార్పులు, భాషావ్యవహర్తలు, వలసపోవడం, భాషావ్యవహర్తల సంఖ్యతో పాటు ప్రాంతాలు కూడా పెరగడం, ఒక భాష విస్తరించి మరో కొత్త భాషలతో కలవడం, భాషా ప్రాంతాలపై పాలకుల ప్రభావం, సరిహద్దులలో ఉన్న భాష పరిసరాల్లోని భాషా ప్రభావానికి గురికావడం వంటి పలు కారణాలు ఈ కోణంలో ప్రస్తావించదగినవి.
మాండలికాల ప్రధాన లక్షణాలలో మొదట చెప్పుకోదగింది ఇవి ప్రామాణిక భాష, ప్రధాన భాషలలో అంతర్భాగంగా ఉంటాయి. నిర్ణీత ప్రదేశంలో మాత్రమే వ్యవహారంలో ఉంటూ భాషా వ్యవహర్తల మధ్య పరస్పర అవగాహన కోల్పోకపోవడం, న్యూన ప్రామాణికంగా ఉండడం, క్రియారూపాలలో పదాలలో ప్రాంతీయ వైవిధ్యపు విలక్షణత ఎక్కువగా ఉండడం, ముద్రిత ప్రామాణిక సాహిత్యం లేకపోవడం మాండలికాల ముఖ్య లక్షణాలు.

ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మాండలికాలపై పరిశోధనలు చేసి వృత్తి పదకోశాలను బట్టి రెండు తెలుగు రాష్ట్రాలను నాలుగు భాషా మండలాలుగా వర్గీకరించారు.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు పూర్వ మండలంగా.. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను దక్షిణ మండలంగా ఆయన వర్గీకరించారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రమంతటినీ ఉత్తర మండలంగా పేర్కొన్నారు. కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను మధ్య మండలంగా వర్గీకరించారు.
తిక్కన రాసిన భారతంలో కపిల అన్న శబ్దం నెల్లూరు ప్రాంతంలో మాండలిక వ్యవహారంగా ఉంది.
తెలంగాణ మాండలిక పదాలు అధికంగా అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన హంస వింశతి కావ్యంలో ఉన్నాయి.
గునపం, గడ్డపార పదాలను పింగళి సూరన కళాపూర్ణోదయం కావ్యంలో ప్రయోగించారు.
విభిన్న వ్యవహారిక పదాలతో తెలంగాణ మాండలిక పదకోశం గ్రంథాన్ని నలిమెల భాస్కర్ రాశారు.
కళింగప్రాంతం మాండలికంపై ఒడియా ప్రభావం కన్పిస్తుంది. కంబారి, బుగత, భోగట్టా వంటి ఒడియా పదాలు పూర్వమండలంలో ఉన్నాయి.
మధ్య మండలంలో తెలుగు ప్రామాణికత కన్పిస్తుంది. తెలుగు భాషపై సంస్కృత ప్రభావం మధ్య మండలంలో ఎక్కువగా ఉంది.
దక్షిణ మండలంపై తమిళ, కన్నడ భాషల, తెలంగాణ మాండలికంపై ఉర్దూ ప్రభావం కన్పిస్తుంది.
తమిళనాడులో మాండలికాలు కనిపించవు. పాలె అనే పదం తెలంగాణ ఉత్తర ప్రాంతంలో వాడుకలో ఉంంది.
ఈ పదం మరాఠీ ప్రాంతం నుంచి తెలంగాణ మాండలికంలోకి వచ్చి చేరింది.
వరి నారును పూర్వ (కళింగ) మండలంలో ఆకు అని.. పొగాకు, మిరపనారును నారు అని.. తెలంగాణలో వరి నారును తుకం అని.. మిరప, పొగాకునారును నారు అని పిలుస్తారు.
ముందుగా చెల్లించే ధనాన్ని తెలంగాణలో ఆగావు అనే పదంతో దక్షిణాంధ్రలో అప్రయత్నంగా లభించేది, రాయలసీమలో అన్యాయంగా లభించేది అన్న వేర్వేరు అర్థాలతో పిలుస్తారు.
అంకెం అన్న పదాన్ని కళింగాంధ్రలో పిలుస్తుండగా అదే పదాన్ని తూర్పు గోదావరిలో గోతాం, దక్షిణాంధ్రలో పొగాకు కట్టిన పెద్దకట్ట, రాయలసీమలో పశువులపై వేసే గంత అన్న వేర్వేరు అర్థాలుగా చెబుతారు.
నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాలలో మరాఠీ ప్రభావంతో ప్రజల వ్యవహారంలో కులకుర్తి, గెడంచు, చకడాబండి, గిరిక వంటి పదాలు కన్పిస్తాయి.
ప్రాంతీయ భేదాలను గుర్తించడానికి సాధారణంగా మాండలిక పటాలను వినియోగిస్తారు.
ఒక వర్గం వినియోగించే విలక్షణ పదాలను ప్రత్యేక చిహ్నాల ద్వారా వేరు చేసే పటాలను మాండలిక పటాలు అంటారు.
పదాలతో గీసిన పటాలను వరల్డ్ అట్లాస్ అని, ధ్వనులతో గీసిన పటాలను ఫోనెటిక్ అట్లాస్ అని, వ్యాకరణాంశాలతో గీసిన పటాలను గ్రమెటిక్ అట్లాస్ అని, ప్రాంతీయ భేదాల్ని సూచించే వాటిని డైలెక్ట్ అట్లాస్(మాండలిక పటాలు) అని చెబుతారు. ఒకే విధమైన గుర్తులను కలిపి గీతగీసి చూపితే మాండలిక విభజన లేఖ అంటారు.
భాషలో ఉండే ప్రాంతీయ భేదాలను అధ్యయనం చేయడాన్ని డైలెక్జాలజీ అంటారు.
ప్రభావితం కాకుండా ప్రాచీన వ్యవహారాన్నే తక్కువ మార్పులతో నిలుపుకునే భాషా వ్యవహార ప్రాంతాన్ని పునరాతన వ్యవహార ప్రాంతం (రిలిక్ ఏరియా), భిన్న ప్రభావాలకు లోనయ్యే ప్రాంతాన్ని మాండలిక సంధి ప్రాంతం (ట్రాన్స్ లేషన్ ఏరియా), మాండలిక సంధి ప్రాంతాన్ని మిశ్రవ్యవహార ప్రదేశం అని పిలుస్తారు.
ప్రామాణిక మాండలిక భాషగా చెప్పే వ్యవహారంలో అన్నం, కథ, రోజు, క్షురక, రజక, యాదవ వంటి పదాలు వినిపిస్తే .. ‘న్యూన’ ప్రామాణిక మాండలికంలో వాటినే బువ్వ, కత, పొద్దు, మంగలి, చాకలి, గొల్లగా పలుకుతుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టెమిస్: చంద్రుడి మీదకు మనుషులను పంపించేందుకు 50 ఏళ్ల తరువాత మళ్లీ ప్రయత్నాలు
- సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను ఎలా గుర్తించాలి? మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి
- 'నా కూతురిని గ్యాంగ్ రేప్ చేసి నెల తరువాత చంపేశారు '
- శ్మశానం మీద నిర్మించిన నగరం... అక్కడ పునాదుల కోసం తవ్వితే పురాతన మమ్మీలు బయటపడతాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












