సంభల్: 'నా కూతురిని గ్యాంగ్ రేప్ చేసి నెల తరువాత చంపేశారు '

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR
- రచయిత, షహబాజ్ అన్వర్
- హోదా, బీబీసీ కోసం
"వాళ్లు నా కూతురిపై సామూహిక అత్యాచారం చేశారు. న్యాయం కోసం నేను, నా కూతురు అధికారులందరినీ కలిశాం. ముఖ్యమంత్రికి లేఖలు పంపినా, ఫలితం లేకపోయింది. గ్యాంగ్‌రేప్ జరిగిన నెలన్నర తరువాత ఆగస్టు 24న వాళ్లు నా కూతురిని చంపేశారు. మేం ఫిర్యాదు చేసినప్పుడే వాళ్లను పట్టుకుని ఉంటే, ఈరోజు నా కూతురు బతికుండేది. ఇప్పుడు ఆమె ఈ లోకంలో లేదు. కానీ, నా కూతురి మెడకు తాడు బిగించి ఎలా చంపారో, అదే విధంగా నిందితులను ప్రభుత్వం ఉరితీయాలని కోరుకుంటున్నాను."
కూతురిని పోగొట్టుకున్న దుఃఖంతో రీనా దేవి చెప్పిన మాటలివి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ జిల్లా తాలూకా చందౌసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుధ్ ఫతేఘర్‌లో రీనా దేవి కుటుంబం నివసిస్తోంది.
ఆగస్టు 24న సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న కూతురి మృతదేహం చూసి ఆమె కంపించిపోయారు.
ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురిపై జులై 12 రాత్రి పక్కింట్లో ఉండే ముగ్గురు అన్నదమ్ములు, వారి బంధువు కలిసి అత్యాచారం చేశారని రీనా దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీనాదేవి కుమార్తె మైనర్. ఆమెకు 16 ఏళ్లు ఉంటాయి.
దీని తరువాత జూలై 15న ఒక నిందితుడు సోవేంద్రపై మాత్రమే కేసు నమోదు చేశారు.
ఆగస్టు 25న మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన తరువాత, మిగిలిన ముగ్గురు నిందితులు వీరేష్ గుర్జార్, విపిన్ గుర్జార్, జినేష్ గుర్జార్ పేర్లను కూడా దర్యాప్తులో చేర్చారు.
ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయలేదనే ఆరోపణలపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేశారు.
"ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్వెస్టిగేటర్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిని కూడా సస్పెండ్ చేశారు. బాధితుల ఇంటి వద్ద భద్రత కోసం పోలీసులను కాపలా ఉంచాం" అని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శలభ్ మాథుర్ చెప్పారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANAWAR
ఆరోజు ఏం జరిగింది?
ఆగస్టు 24న రీనా దేవి ఇంటి నుంచి ఏడుపులు, అరుపులు వినిపించాయి. గ్రామంలోని ప్రజలంతా ఆమె ఇంటి ముందు గుమికూడారు.
గదిలో రీనా దేవి కుమార్తె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది.
"నేను ఈ గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్నాను. ఆ రోజు నేను డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి, మా అమ్మయి ఇంటి వెనుక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది" అని రీనా దేవి బీబీసీతో చెప్పారు.
కూతురిని ఈ స్థితిలో చూసిన ఆమె స్పృహతప్పి పడిపోయారు.
ఆమె పెద్ద కొడుకు తరుణ్ జరిగిన విషయాలను బీబీసీకి చెప్పారు.
"నేను చందౌసిలో కూలి పని చేస్తాను. నాకు విషయం తెలిసిన వెంటనే ఇంటికి వెళ్లాను. గ్రామస్థులంతా ఇంటి ముందు గుమిగూడారు. పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి మా చెల్లెలి మృతదేహాన్ని కిందకు దించారు. తరువాత పోస్ట్‌మార్టం కోసం పంపారు" అని తరుణ్ చెప్పారు.
అసలేం జరిగింది?
తన కూతురి దుస్థితికి పొరుగున ఉన్న కుటుంబం, వారి బంధువే కారణమని రీనా దేవి చెప్పారు.
"జూలై 12న మా అమ్మాయి, తన చిన్నచెల్లితో కలిసి ఇంటి లోపల పడుకుంది. ఉక్కపోతగా ఉందని నేను, నా చిన్నకొడుకు రతన్ వీధి వసారాలో పడుకున్నాం. మా ఇంటి ముందు ఉన్న చిన్న గుడిసెలో మా అబ్బాయిలు తరుణ్, అరుణ్ పడుకున్నారు. నా చిన్నకూతురు లేచి, బయటకి వచ్చి అక్క కనబడడం లేదని చెప్పింది. మేం అన్నిచోట్లా వెతికాం. కానీ, అమ్మాయి కనిపించలేదు. తరువాత ఇంటి డాబాపై కనిపించింది. అప్పుడు తను మాకేం చెప్పలేదు. కానీ, తరువాత మెల్లగా తనకేం జరిగిందో చెప్పింది. మా పక్కింట్లో ఉండే సత్పాల్ ముగ్గురు కొడుకులు వీరేష్, జినేష్, విపిన్, వాళ్ల బంధువు సోవేంద్ర కలిసి తనను పక్కనే ఉన్న అడవిలోకి ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారని చెప్పింది.
జూలై 14న మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ, పోలీసులు సోవేంద్రపై మాత్రమే కేసు ఫైల్ చేశారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా నిందితులే. మేజిస్ట్రేట్ ముందు మా అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది. ఆ తరువాతే, మిగతా ముగ్గురి పేర్లను దర్యాప్తులో జతచేశారు. కానీ, వాళ్లను అరెస్ట్ చేయలేదు" అని రీనా దేవి బీబీసీకి వివరించారు.
'వాళ్లను అరెస్ట్ చేసుంటే, మా చెల్లి బతికుండేది'
ఏడేళ్ల క్రితం రీనా దేవి భర్త చనిపోవడంతో కుటుంబ భారం పెద్ద కొడుకు తరుణ్‌పై పడింది.
"నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మా అమ్మ, చెల్లి రోజూ అధికారుల చుట్టూ తిరిగేవారు. కానీ, వాళ్ల మాటలను ఎవరూ పట్టించుకోలేదు. నిందితులు హాయిగా బయట తిరుగుతూ మా కుటుంబాన్ని బెదిరించేవారు. చివరికి, ఆగస్టు 24న వాళ్లు మా చెల్లి ప్రాణం తీశారు" అని తరుణ్ చెప్పారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANAWAR
పోలీసులు ఏమంటున్నారు?
ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్టేషన్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేసినట్టు మురాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ మీడియాకు చెప్పారు.
ఈ అంశంపై ఎస్పీ చక్రేష్ మిశ్రాతో మాట్లాడడానికి బీబీసీ ప్రయత్నించింది.
"డీఐజీ ఇప్పటికే దీనిపై సమాచారం అందించారు. ఈ ఘటన జరిగిన వెంటనే, జూలై 15న రీనా దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారంతో పాటు పోక్సో చట్టం సహా అనేక ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ అమ్మాయి చనిపోయిన తరువాత, ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలను కూడా జతచేశారు. నిందితులకు చలాన్ విధించారు. బాధితుల ఇంటి వద్ద పోలీసులను కాపలాగా ఉంచారు" అని ఎస్పీ చెప్పారు.
"మైనర్ బాలిక ఉరి తాడుకు వేలాడడం వలన ప్రాణాలు కోల్పోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది" అని స్టేషన్ కొత్త ఇన్‌చార్జ్ సీవీ సింగ్ తెలిపారు.
ఆగస్టు 24న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
"రాత్రి పోస్టుమార్టం చేశారు. అర్థరాత్రి 1.30 ప్రాంతంలో బలవంతంగా నా కూతురికి అంత్యక్రియలు చేశారు" అని రీనా దేవి ఆరోపించారు.
ఆమె ఆరోపణలను సంభల్ పోలీసులు ఖండించారు.
"మృతురాలి దహన సంస్కారాలను బంధువులు, గ్రామస్థుల ఆమోదతోనే నిర్వహించారు. బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారన్న ఆరోపణలు నిరాధారం. చితి దగ్గర ఒక్క పోలీసు కూడా లేడు" అంటూ పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANAWAR
గ్రామస్థులు ఏమంటున్నారు?
ఆ గ్రామంలో గుర్జర్, భుర్జీ వర్గాలతో పాటూ అనేక ఇతర వర్గాల వారు నివసిస్తున్నారు.
బాధితుల ఇంటి డాబాకు, నిందితుల ఇంటి డాబాకు కామన్ గోడ్ ఉంది. ఆ అమ్మాయి చనిపోయినరోజు నిందితుల ఇంట్లో ఎవరూ కనిపించలేదని, వాళ్లు వ్యవసాయం చేస్తారని, ఆర్థికంగా ఉన్నత కుటుంబమని గ్రామస్థులు చెప్పారు.
గ్రామ పెద్ద మున్నే సింగ్ జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.
"గ్రామంలో మొత్తం 1526 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. ఆ అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. చిన్నాచితకా వ్యవహారాలు నా దగ్గరకు వస్తుంటాయి కానీ, ఇంత పెద్ద కేసు నేనెప్పుడూ చూడలేదు. ఇందులో నేనేం చేయగలను!" అన్నారు మున్నే సింగ్.
ఇంతకుముందు పొట్టకూటికి పోరాటం, ఇప్పుడు న్యాయం కోసం పోరాటం
సోవేంద్ర, సత్పాల్ ఇంటికి వచ్చి ఉంటున్నారని, గతంలో కూడా వాళ్ల బంధువుల పేర్లు పోలీసు స్టేషన్ వరకు వెళ్లాయని రీనా దేవి చెప్పారు. నిందితులకు తగిన శిక్ష వేసి, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
"ఇంతకుముందు పొట్టకూటికి పోరాడేవాళ్లం. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నాం. మొన్న కలెక్టర్ మా ఇంటికి వచ్చి మాకు అన్ని విధాల సాయం అందిస్తామని చెప్పారు" అని రీనా దేవి అన్నారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANAWAR
నిందితుల బంధువులు ఏమంటున్నారు?
ఆ ముగ్గురి అన్నదమ్ముల బంధువులు తమ పేర్లు గోప్యంగా ఉంచాలన్న షరతుతో ఈ కేసు గురించి బీబీసీతో మాట్లాడారు.
బాలిక చనిపోవడం విచారకరమే కానీ, ఆ ముగ్గురి అన్నదమ్ముల్లో ఒకరైన విపిన్ సంఘటన జరిగిన రోజు గ్రామంలో లేరని వాళ్లు చెప్పారు.
ఆ అమ్మాయి మరణించిన రోజు నిందితుల్లో ఇద్దరు సోదరుల లొకేషన్ గ్రామంలో లభించలేదని ఒక పోలీసు అధికారి కూడా చెప్పారు.
ఏది ఏమైనప్పటికీ, పూర్తి దర్యాప్తు జరిపిన తరువాత మాత్రమే నిజాలు బయటకి రాగలవు.
గమనిక: (మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007)
ఇవి కూడా చదవండి:
- నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తి కథ
- అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
- అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
- బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













