INDvsPAK: ఒకప్పుడు భారత్‌కు ఆడిన ఈ క్రికెటర్ ఆ తరువాత పాకిస్తాన్ టీమ్‌కు ఎందుకు ఆడారంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కనిష్క్ థరూర్, మర్యమ్ మరూఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
భారత్‌లో క్రికెట్ ఒక మతం లాంటిది. భారత్‌కు పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లో కూడా క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. ఈ రెండు దేశాలు మైదానంలో పోటీపడినప్పుడల్లా క్రికెట్ అభిమానులంతా టీవీలకే అతుక్కుపోతుంటారు. దేశభక్తి ఉప్పొంగుతుంటుంది. ఆ మ్యాచ్ గెలిస్తే దేశం గెలిచినట్లుగా, ఒకవేళ ఓడిపోతే దేశమే ఓడిపోయినట్లుగా భావిస్తుంటారు అభిమానులు.
అయితే, 75 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి.
ఎందుకంటే, 75 ఏళ్ల క్రితం పాకిస్తాన్ అనే దేశం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ అని పిలుస్తున్న ప్రాంతం అంతా ఒకప్పుడు భారత్‌లోనే ఉండేది. కాబట్టి భారత్ తరఫున ఒకే క్రికెట్ జట్టు ఉండేది.
భారత్ 1932లోనే టెస్టు క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. ఆ సమయంలో భారత్, ఇంగ్లండ్‌తో స్వదేశంలోనూ, విదేశీ గడ్డపై అనేక టెస్టు సిరీస్‌లు ఆడింది. అయితే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
అయితే దేశ విభజన జరిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు ఒకటిగా ఉన్న టీమ్ రెండు భాగాలుగా విడిపోయింది. భారత జట్టుకు చెందిన చాలామంది క్రికెటర్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అప్పటివరకు ఒకే టీమ్‌లో కలిసి ఆడిన ఆటగాళ్లంతా ప్రత్యర్థులుగా మారిపోయారు.
అలా భారత జట్టుకు దూరమైన క్రికటర్ అమీర్ ఇలాహీ. ఆయన బరోడా జట్టుకు ఆడుతుండేవారు. అప్పట్లో బరోడా జట్టును భారత జట్టుతో సమానంగా పరిగణించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
విభజన తర్వాత పాక్‌కు అమీర్ ఇలాహీ
దేశ విభజన జరిగినప్పుడు అమీర్ ఇలాహీ, పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన కుటుంబంతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు.
అమీర్ కొత్త దేశానికి తరలిపోగా, పాత జట్టు అతన్ని వదిలేసింది. తర్వాత భారత్, పాక్ జట్లు ఏర్పడ్డాయి.
అమీర్ ఇలాహీ మనవడు మనన్ అహ్మద్ ప్రస్తుతం అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఆయనతో బీబీసీ కోసం కనిష్క్ థరూర్ మాట్లాడారు.
తన తాతయ్య అమీర్ ఇలాహీ బాగా పేరున్న క్రికెటర్ కాదని మనన్ చెప్పారు. మైదానంలో ఆయనేమీ పెద్ద విజయాలు సాధించలేదని అన్నారు. ఆయనొక సగటు క్రికెటర్ అని తెలిపారు. అప్పుడప్పుడు బౌలింగ్ చేసేవారని, అవకాశం వస్తే బ్యాటింగ్ చేసేవారని అన్నారు. ఓవరాల్‌గా టీమ్‌లో ఆయన ఒక సాధారణ సభ్యుడు అని చెప్పారు.
మనన్ చెప్పిన దాని ప్రకారం అమీర్ ఇలాహీ, పాకిస్తాన్ గట్టి మద్దతుదారుడు. అందుకే దేశ విభజన సమయంలో ఆయన జట్టును వదిలిపెట్టి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అనంతరం పాకిస్తాన్ జాతీయ జట్టుకు కూడా ఇలాహీ ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
అమీర్ ఇలాహీ ఆట..
1953లో పాకిస్తాన్ జట్టు తొలిసారిగా భారత్‌లో పర్యటించింది. అమీర్ ఇలాహీ కూడా ఈ టూర్‌కు వచ్చారు. తన పాత జట్టు సహచరులను కలుసుకొని గత జ్ఞాపకాలను తలుచుకున్నారు. రెండు దేశాలు కూడా ఈ సిరీస్‌ను గెలుచుకోవాలనే పట్టుదలను ప్రదర్శించాయి.
తొలి పర్యటనలోనే భారత జట్టుపై పాకిస్తాన్ గెలుపొందాలని అమీర్ ఇలాహీ అనుకున్నట్లు మనన్ చెప్పారు. అయితే, అది జరగలేదు. భారత్ గెలిచింది. ఆ సిరీస్‌లో అమీర్ ఇలాహీ వ్యక్తిగతంగా కూడా గొప్ప ప్రదర్శనేమీ చేయలేదని మనన్ తెలిపారు.
ఆ తర్వాత కూడా తన దేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం అమీర్ ప్రయత్నించారు.
చిన్నతనంలోని రోజులను మనన్ గుర్తు చేసుకున్నారు. తను చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు తన తాతయ్య అమీర్ వాడిన కిట్‌ను తనకు నాన్నమ్మ ఇచ్చిందని మనన్ చెప్పారు. అయితే, దాన్ని ఎప్పుడు తాను ఉపయోగించలేదని ఆయన అన్నారు.
కానీ, తన తాతయ్య ధరించిన స్వెట్టర్‌ను వాడినట్లు మనన్ చెప్పారు. అది ధరించినప్పుడు చాలా బాగా అనిపించిందని, జట్టులో తానే అత్యుత్తమ ప్లేయర్‌లా భావించానని మనన్ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
మ్యూజియం కట్టలేదు, కిట్ దొరకలేదు
అమీర్ ఇలాహీ తన క్రికెట్ కిట్‌ను దానికి సంబంధించిన సామగ్రిని చాలా జాగ్రత్తగా దాచుకున్నారు. అయితే, ఒక రోజు ఒక వ్యక్తి తన తాతయ్య దగ్గరి నుంచి కిట్‌ను తీసుకున్నారని మనన్ చెప్పారు.
''ఒక వ్యక్తి వచ్చి మా తాతయ్యతో లాహోర్‌లో క్రికెట్ మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
వెంటనే ఆయన తన క్రికెట్ సామగ్రి అంతటినీ అతనికి ఇచ్చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి జాడ లేకుండా పోయారు. ఆయన చెప్పినట్లుగా మ్యూజియం కట్టలేదు, ఆ వస్తువులు కూడా దొరకలేదు, ఆ వ్యక్తి కూడా ఎప్పుడూ కనబడలేదు'' అని మనన్ వివరించారు.
ఆ క్రికెట్ సామగ్రిని బహుశా బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసి ఉండొచ్చని మనన్ అన్నారు.
ప్రస్తుతం మనన్ అహ్మద్, కొలంబియా యూనివర్సిటీలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. తన తాతయ్యకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా ఆయనలో పదిలంగా ఉన్నాయని చెబుతున్నారు.
భారత్, పాక్‌లు విడిపోయిన తర్వాత క్రికెట్ చాలా పురోగతి చెందింది. ఇరుదేశాలు ప్రపంచ కప్ గెలుపొందాయి. ఇరు దేశాలు పోటీపడినప్పుడు ఒక్కోసారి ఒక్కో జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తుంది.
అయితే ఇప్పుడు పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్న పరిగణించుకుంటున్న ఆటగాళ్లంతా గతంలో ఒకే దేశానికి, ఒకే జట్టు తరఫున కలిసి ఆడారని తలుచుకోవడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- రష్యా: ఒకవైపు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుంటే.... రష్యా రోజుకు కోటి డాలర్ల గ్యాస్‌ను తగులబెడుతోంది ఎందుకు?
- ఆసియా కప్: క్రికెట్ సమరానికి భారత్-పాకిస్తాన్ జట్లు రెడీగా ఉన్నాయా?
- ఆసియా కప్ 2022: భారత-పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య వెల్లివిరిసిన స్నేహభావం
- చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?
- జస్టిస్ ఎన్వీ రమణ: వివాదాలు ఎందుకని ముఖ్యమైన కేసుల్ని పెండింగ్‌లో ఉంచారా... ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












