మీర్ సుల్తాన్ ఖాన్: 90 ఏళ్ళ కిందటే బ్రిటిష్ చెస్ చాంపియన్... కానీ, ఆయనకు 'గ్రాండ్ మాస్టర్' గౌరవం ఎందుకు దక్కలేదు?

ఫొటో సోర్స్, UNKNOWN CAMERAMAN OF 1932
- రచయిత, అశోక్ పాండే
- హోదా, బీబీసీ కోసం
అది 1890వ సంవత్సరం. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో చెస్ పోటీలు జరుగుతున్నాయి. భారతదేశానికి చెందిన పందొమ్మిదేళ్ల యువకుడు గోవింద్ దీనానాథ్ మడ్గావ్కర్ ఈ పోటీల్లో పాల్గొని, తన ఆటతో బ్రిటిష్‌వారిని ఆశ్చర్యపరిచాడు.
మడ్గావ్కర్ పెద్ద చెస్ ఛాంపియన్ అవుతారని నిపుణులు భావించారు. కానీ, రెండేళ్లలోనే ఆయన చెస్ విడిచిపెట్టి ఇండియన్ సివిల్ సర్వీస్‌లో చేరారు.
మడ్గావ్కర్ చెస్ ఆడటం మానేసి ఉండకపోతే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తొలి భారతీయ చెస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవారు.
నలభై ఏళ్ల తరువాత 1931లో మడ్గావ్కర్ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. అదే సమయంలో ఇంగ్లండ్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఒక యువకుడు చదరంగం నిపుణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడని బహుశా అప్పుడు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు.
మీర్ సుల్తాన్ ఖాన్ పేరు మడ్గావ్కర్ విని ఉంటే, నలభై ఏళ్ల క్రితం తాను చదరంగం ఆటను విడిచిపెట్టినందుకు చింతించి ఉండక పోయేవారు. ఆ రోజుల్లో చదరంగాన్ని డబ్బున్నవాళ్ల ఆటగా పరిగణించేవారు. సామాన్య ప్రజానీకానికి అది అందుబాటులో ఉండేది కాదు.
1903లో పంజాబ్‌లో సర్గోధా సమీపంలోని టివాణా గ్రామంలో పీర్-జమీందార్ల కుటుంబంలో జన్మించారు మీర్ సుల్తాన్ ఖాన్. ఆయన తండ్రి మియా నిజాముద్దీన్ చదరంగం అద్భుతంగా ఆడేవారు.

ఫొటో సోర్స్, BETTMANN
చదరంగం విజేత మీర్ సుల్తాన్ ఖాన్
మియా నిజాముద్దీన్, తన తొమ్మిది మంది కొడుకులకూ చదరంగం ఆడటం నేర్పించారు. పదహారు-పదిహేడు ఏళ్ల వయస్సులో మీర్ సుల్తాన్ ఖాన్ రోజూ తన గ్రామం నుంచి సర్గోధా వెళ్లి, అక్కడి ప్రభువుల ప్రాంగణాలలో చదరంగం ఆడుతుండేవారు. 21 ఏళ్లకు ఆ ప్రాంతంలో చదరంగం విజేతగా ఎదిగారు.
సుల్తాన్ నైపుణ్యం పొరుగున ఉన్న కాల్రా సంస్థానాధీశుడు ఉమర్ హయత్ ఖాన్ చెవిన పడింది. ఆయన స్వయంగా చదరంగం అభిమాని.
పంజాబ్‌లోని అతిపెద్ద భూస్వాములలో ఒకరైన ఉమర్ హయత్ ఖాన్ బ్రిటిషర్ల మద్దతుతో కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ సైన్యంలో మేజర్ జనరల్ హోదాలో పనిచేసిన ఉమర్ హయత్ ఖాన్‌కు బ్రిటిష్ ప్రభుత్వం 'సర్' బిరుదు కూడా ఇచ్చింది.
భారతీయ శైలిలో చదరంగం
చదరంగం ఆటలో విపరీతమైన ఆసక్తి ఉన్న ఉమర్ హయత్ ఖాన్, సుల్తాన్ ఖాన్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. తన రాజ్యంలో యువకులకు చదరంగం నేర్పించి, ఒక క్రీడాకారుల బృందాన్ని తయారుచేయాలని, అందుకు మంచి జీతం, వసతి కల్పిస్తానని మాటిచ్చారు. ఆ విధంగా మీర్ సుల్తాన్ ఖాన్ ఔత్సాహిక చదరంగం క్రీడాకారుడు స్థానం నుంచి ధనిక భూస్వామిగా మారారు.
1926 సంవత్సరంలో ఉమర్ హయత్ ఖాన్ కొలువులో చేరక ముందు, సుల్తాన్ ఖాన్ భారతీయ శైలిలో చదరంగం ఆడేవారు. తరువాత ఆయనకు యూరోపియన్ శైలిలో చదరంగం ఆట నేర్పేందుకు ట్యూటర్లను నియమించారు.
తరువాత రెండు సంవత్సరాలకు అఖిల భారత చదరంగం ఆటల పోటీ జరిగింది. మీర్ సుల్తాన్ ఖాన్ అతి సులభంగా ఈ పోటీలో విజయం సాధించారు. ఆయన మొత్తం తొమ్మిది గేమ్‌లు ఆడి, కేవలం అరపాయింట్ తేడాతో ఓడిపోయారు.
ఉమర్ హయత్ ఖాన్ దిల్లీలోని అధికార పీఠానికి సన్నిహితంగా మెలిగేవారు. బ్రిటీషర్లను కలిసినప్పుడల్లా సుల్తాన్ ఖాన్ ప్రతిభను వారికి వివరించి చెప్పేవారు.
1929లో ఒక రాజకీయ వ్యవహారంలో ఉమర్ హయత్ ఖాన్‌ను ఇంగ్లాండ్ పంపారు. ఆయన తన వెంట తీసుకెళ్లిన సేవకులలో మీర్ సుల్తాన్ ఖాన్ కూడా ఉన్నారు.
1929 ఏప్రిల్ 26, శుక్రవారం నాడు మీర్ సుల్తాన్ ఖాన్ లండన్ చేరుకున్నారు. బ్రిటిష్ దౌత్యవేత్త సర్ జాన్ సైమన్, ఉమర్ హయత్ ఖాన్‌కు సన్నిహితుడు. సుల్తాన్ ఖాన్ ఆటకు అభిమాని కూడా.
మరుసటి రోజు అంటే శనివారం జాన్ సైమన్, సుల్తాన్ ఖాన్‌ను నేషనల్ లిబరల్ క్లబ్ ఆఫ్ లండన్‌లో కొంతమంది ప్రముఖులకు పరిచయం చేశారు. అక్కడే దక్షిణాఫ్రికాకు చెందిన చెస్ ఛాంపియన్ బ్రూనోతో కొన్ని మ్యాచ్‌లు ఆడి, తన ప్రతిభను ప్రదర్శించారు సుల్తాన్ ఖాన్.
రక్షణాత్మక వ్యూహం
మరుసటి రోజు అంటే ఆదివారం నాడు, అదే క్లబ్‌లో పలువురు ఆటగాళ్లతో ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ ఆటగాడు ఆడుతున్నారు. సుల్తాన్ ఖాన్ ఆయన పేరు కూడా వినలేదు. కానీ ఆయనతో ఆడే అవకాశం వచ్చింది.
ఆ ఛాంపియన్ దూకుడైన ఆట ముందు సుల్తాన్ పటిష్టమైన రక్షణాత్మకమైన ఆటను కొనసాగించారు. తన విజయంపై మొదటి నుంచీ నమ్మకంతో ఉన్న ఆ ఛాంపియన్ ప్లేయర్, చివరకు సుల్తాన్ చేతిలో ఓడిపోయాడు.
ఆ అంతర్జాతీయ ఆటగాడు మరెవరో కాదు, క్యూబాకు చెందిన జోస్ రౌల్ కాపాబ్లాంకా. 1921 నుంచి 1929 వరకు ఆయన వరసగా ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగారు. కాపాబ్లాంకాతో జరిగిన ఈ అనధికారిక మ్యాచ్‌లో మీర్ సుల్తాన్ ఖాన్ తన ఆటలోని అతి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు.
సూట్‌తో తలపాగా ధరించి, భావోద్వేగం లేని ముఖంతో, ఆయన ఎలాంటి కదలికలు లేకుండా ఆట ఆడుతున్నప్పుడు, ఆయన లోపల ఎంత బలమైన వ్యూహాలను రచిస్తున్నారో ఎవరికి అర్ధమయ్యేది కాదు.
ఆయనలోని ఈ బలాన్ని ఆయన ప్రత్యర్ధులుగానీ, ఉమర్ హయత్ గానీ అర్థం చేసుకోలేకపోయాడు.
సుల్తాన్‌ఖాన్ శైలి విభిన్నంగా ఉండటంతో, దాన్ని ఎవరూ అధిగమించలేకపోయారు. ఆ సంవత్సరం చివరి భాగంలో లండన్‌లోని రామ్స్‌గేట్‌లో బ్రిటీష్ ఛాంపియన్‌షిప్ జరిగింది. దీనిని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో సమానంగా పరిగణిస్తారు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సుల్తాన్ ఖాన్ ఛాంపియన్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు ప్రపంచం మొత్తానికి పరిచయమైంది. యూరప్‌లోని పలు నగరాల్లో ఆడేందుకు ఆయనకు ఆహ్వానాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, J. GAIGER
మళ్లీ ఇంగ్లండ్‌కు
ఇంగ్లండ్‌లో చలిని ఆయన తట్టుకోలేకపోయారు. నవంబర్ నెలలో స్వదేశానికి తిరిగి వచ్చారు. కానీ, చెస్ ప్రపంచం ఆయన్ను మరుసటి సంవత్సరమే తిరిగి ఇంగ్లండ్‌కు ఆహ్వానించింది.
1930,1933 మధ్య, మీర్ సుల్తాన్ ఖాన్ బ్రిటీష్ ఛాంపియన్‌షిప్‌ను రెండుసార్లు గెలుచుకున్నారు. ఇంకా అనేక ఇతర టోర్నమెంట్‌లలో పోటీ పడ్డారు. సవియలీ టార్టాకోవర్, సోల్టెన్‌బీఫ్, సాలో ఫ్లోర్, అకిబా రూబిన్‌స్టెయిన్, జోస్ రాల్ కాపబ్లాంకాతో సహా, ఆయన కాలంలో గొప్ప ఆటగాళ్లు అనదగ్గ వారందరినీ ఓడించారు.
చెకోస్లోవేకియా రాజధాని ప్రాగ్‌లో జరిగిన అంతర్జాతీయ టీమ్ టోర్నమెంట్‌లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ అలెగ్జాండ్రా లెఖైన్‌తో సుల్తాన్ ఖాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అప్పటికే ఆయన తన కెరీర్‌లో అత్యుతన్న స్థాయికి చేరుకున్నారు. ప్రపంచంలోని టాప్ 10 ఆటగాళ్లలో ఆయన పేరు నిత్యం కనిపించేది. 1933 నాటికి ఉమర్ హయత్ ఖాన్ ఇంగ్లండ్‌కు వచ్చిన పని అయిపోయింది. దీంతో ఆయన తన అనుచరులు, సేవకులతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు.
1934 ప్రారంభం నాటికి సుదీర్ఘ సముద్ర ప్రయాణం తర్వాత సుల్తాన్‌ఖాన్ బొంబాయి చేరుకున్న తర్వాత ప్రజలకు ఆయన గురించి తెలియడం ప్రారంభమైంది. జనవరి 25న ఆయన బొంబాయికి చెందిన 37 మంది ఆటగాళ్లతో కలిసి చెస్ ఆడారు.
ఈ మ్యాచ్‌లను ఆయన చాలా సులభంగా ఆడారు. ప్రేక్షకుల నుంచి సలహా తీసుకోవడానికి, ఎత్తులను ఉపసంహరించుకోవడానికి ప్రత్యర్ధులకు అనుమతి ఇచ్చారు సుల్తాన్ ఖాన్. అయినా, ముప్ఫైఒక్క గేములను గెలిచారు. ఒకటి టై కాగా, ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయారు.
దీని తర్వాత సాంగ్లీలో నివసిస్తున్న మేటి ప్లేయర్ వినాయక్ కాశీనాథ్ ఖాదిల్కర్ తో పది మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చింది. మీర్ సుల్తాన్ ఖాన్ తొమ్మిది గేముల్లో విజయం సాధించగా, ఒకటి డ్రాగా ముగిసింది.

ఫొటో సోర్స్, DOUGLAS MILLER
దక్షిణాఫ్రికాలో
స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయనకు కొన్ని సంవత్సరాల పాటు ప్రధాన యూరోపియన్ టోర్నమెంట్లలో ఆడటానికి ఆహ్వానాలు వచ్చాయి. కానీ, ప్రయాణ ఖర్చులకు, మ్యాచ్ ఫీజులకు ఆయన దగ్గర డబ్బు లేదు.
ఉమర్ హయత్ ఖాన్ కూడా ఆయనకు ఆర్థిక సహాయం చేయడం మానేశారు. దీంతో ఒక ఛాంపియన్ ప్లేయర్ అంతర్జాతీయ క్రీడా జీవితం ముగిసింది. తన శేష జీవితాన్ని సర్గోధాలో తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ గడిపారు.
కొన్నిసార్లు పత్రికల్లో ఆయన క్రీడాజీవితం ముగింపు పై భిన్నమైన కథనాలు ప్రచురించేవి.
ఆయన ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన గ్రామానికి వెళ్లారని, అక్కడ ఒక వృద్ధ ఫకీరు ఆయన ఇంటికి వచ్చి తనతో చెస్ ఆడాల్సిందిగా సవాల్ చేశారని, అయితే, ఆయనతో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో సుల్తాన్‌ఖాన్ ఓడిపోయారని రాశారు. మూడో గేమ్‌లో ఓడిపోతే, తాను ఇక చెస్‌ను తాకనని చెప్పారని, అయితే, ఆ మ్యాచ్‌లో ఆయన ఓడిపోవడంతో ఆయన చెస్‌కు దూరమయ్యారని చెప్పుకొచ్చాయి.
1950 సంవత్సరంలో మీర్ సుల్తాన్ ఖాన్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలోని ఒక నైట్‌క్లబ్‌లో ఒపెరా సింగర్‌గా మారారని యూరోప్‌లో ఒక పుకారు కూడా వచ్చింది.
మీర్ సుల్తాన్ ఖాన్ ఒక గుజ్జర్ మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. 1966 వరకు స్వగ్రామం సర్గోధాలో నివసించిన ఆయన, అక్కడే మరణించారు.
చదరంగంలో ఎత్తులు
మీర్ సుల్తాన్ ఖాన్ '' చదరంగం అంటే సముద్రంలాంటిది. అందులో ఈగ నీరు తాగగలదు. ఏనుగు కూడా స్నానం చేయగలదు'' అనే సామెతను ఇష్టపడేవారు. ఆయన యూరప్ తరహా చెస్ ఆడటం మొదలు పెట్టినప్పుడు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు.
భారతీయ శైలికి, యూరప్ శైలికి కొన్ని తేడాలుండేవి. అయితే, మ్యాచ్ ప్రారంభమైన కాసేపట్లోనే వాటిని అర్ధం చేసుకుని ముందుకు కదిలేవారు.
అతని అసాధారణమైన ఆటతీరే కాకుండా, అతని దుస్తులు ధరించే తీరు కూడా అందరినీ ఆకట్టుకునేది. అన్నింటికన్నా ఎక్కువ ఆశ్చర్యపరిచే విషయం ఆయన నిరక్షరాస్యుడు కావడం. ఈ ఛాంపియన్‌కు చదవడం, రాయడం రాదు. అయితే, ఆయనకు చదువు రాదు అన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు.
చెస్‌కు సంబంధించిన టెక్నికల్ అంశాలన్నీ ఇంగ్లీషు పుస్తకాలలోనే ఉండేవి. కానీ, వాటిలో దేన్నీ ఆయన చదవలేదు. ఒక్క పుస్తకం కూడా చదవకుండా ఎవరైనా ఇంత బాగా ఆడడం ఎలా సాధ్యమని విమర్శకులు ఆశ్చర్యపోయేవారు.

'ది లాంగ్వేజ్ ఆఫ్ చెస్'
ప్రఖ్యాత చెస్ క్రీడాకారుడు, రచయిత ఆర్.ఎన్.కోల్ సుల్తాన్ ఖాన్ ను గ్రేట్ పాల్‌మర్ఫీ తో పోల్చారు. సుల్తాన్ ఖాన్‌ను చెస్ మేధావిగా ప్రకటించారు.
మర్ఫీ 1857 నుంచి 1859 మధ్య మొత్తం మూడు సంవత్సరాలు చెస్ ఆడారు. చెస్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఆస్ట్రియన్ ఛాంపియన్ హన్స్ కమోచ్ 1930లో హాంబర్గ్‌లో సుల్తాన్ ఎదురుగా కూర్చుని ఆడుతున్నారు. కమోచ్ గేమ్‌ను మూడుసార్లు డ్రా చేసుకోమని ప్రతిపాదించాడు. కానీ, భాష అర్ధంకాక మీర్ సుల్తాన్ మూడుసార్లు ఏమీ మాట్లాడకుండా నవ్వుతూనే ఉన్నారు.
చిరాకు పడ్డ కామోచ్, "మీ ఛాంపియన్ ఏ భాషలో మాట్లాడతారు?" అని అనువాదకుడిని ప్రశ్నించారు. దానికి ఆయన 'చదరంగం భాష' అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత మూడు నాలుగు ఎత్తుల తర్వాత కామోచ్ ఓడిపోయారు.
క్యూబన్ ప్రపంచ ఛాంపియన్ జోస్ కాపాబ్లాంకా తో ఆడిన ఏకైక అధికారిక మ్యాచ్‌లో కూడా అదే పరిణామం జరిగింది.
కాపాబ్లాంకా తన విజయం గురించి ఉత్సాహంగా ఉండగా, సుల్తాన్ ఖాన్ మెల్లగా మూలన ఉన్న బంటును జరిపి నేలవైపు చూస్తూ ఉండిపోయారు. కాపాబ్లాంకా ను ఓడించడం మీర్ సుల్తాన్ ఖాన్ కెరీర్‌లో ఒక మైలురాయి. దీంతో ఆయన రేటింగ్ 2550 కి పెరిగింది.
దీనినిబట్టి ఆయన్ను ఆసియా మొదటి గ్రాండ్ మాస్టర్ అని చెప్పవచ్చు. కానీ, దురదృష్టవశాత్తు ప్రపంచ చెస్ సమాఖ్య ఆయనకు ఈ గౌరవాన్ని ఇవ్వలేదు. 1950 లో సుల్తాన్ చేతిలో ఓడిపోయిన అకిబా రూబిన్‌స్టెయిన్‌కు మాత్రం మరణానంతర గ్రాండ్‌మాస్టర్ ఇచ్చారు.
సహజసిద్ధమైన ప్రతిభ
దశాబ్దాలు గడిచేకొద్దీ, మీర్ సుల్తాన్ ఖాన్ పేరు చెస్ ఔత్సాహికులలో ఒక హీరో స్థాయికి చేరింది. అదే సమయంలో ఆయన గురించి అనేక అసత్య కథనాలు కూడా ప్రచారమయ్యాయి.
ఆయన పుట్టుకతోనే సహజమైన ప్రతిభతో పుట్టారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఫొటోలలో ఆయన చాలా ప్రశాంతంగా, ముదురు రంగులో, సగటు కంటే ఎక్కువ ఎత్తు వ్యక్తిగా కనిపిస్తారు.
వీటన్నింటికీ మించి ఆయన సామాజిక స్థితి గురించి అమెరికన్ చెస్ ప్లేయర్, విమర్శకుడు రూబెన్ ఫైన్ గుండెలకు హత్తుకునే ఒక సంఘటనను వివరించారు.1933లో ఫోక్‌స్టోన్ ఒలింపియాడ్ తర్వాత, ఉమర్ హయత్ ఖాన్ లండన్‌లోని తన ఇంటిలో విందుకు రూబెన్ ఫైన్ తో సహా అమెరికన్ జట్టును ఆహ్వానించారు.
సంప్రదాయం ప్రకారం డిన్నర్ టేబుల్ వద్ద మెయిన్ సీట్ ఛాంపియన్ కు కేటాయిస్తారని అంతా భావించారు. కానీ, మీర్ సుల్తాన్ ఖాన్ సాధారణ దుస్తులు ధరించి, మిగిలిన సేవకులతో పాటు అతిథులకు భోజనం వడ్డించడం చూసి తాను ఆశ్చర్యపోయానని రూబెన్ ఫైన్ అన్నారు.
''ఒక గ్రాండ్‌మాస్టర్ ఛాంపియన్ గౌరవార్థం మమ్మల్ని ఆహ్వానించారు. కానీ, ఆయన సామాజిక స్థితి కారణంగా వెయిటర్‌గా మాకు ఆహారం అందించవలసి వచ్చింది" అని ఫైన్ రాశారు.

ఫొటో సోర్స్, NEW IN CHESS
'సుల్తాన్ ఖాన్ కామెట్'
నేటికీ భారత దేశంలో మీర్ సుల్తాన్ ఖాన్ గురించి తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువ. కానీ, తన కాలంలో ఆయన చెస్‌లో స్టార్.
దాదాపు ఇరవై సంవత్సరాల కిందట, రష్యన్ రచయిత అనాటోలీ మత్సుకెవిచ్, సుల్తాన్ ఖాన్ ఆడిన 198 మ్యాచుల్లో 120 మ్యాచుల వివరాలు సేకరించి 'సుల్తాన్ ఖాన్ కామెట్' అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. అదే విధంగా సుల్తాన్ ఖాన్ జీవితంపై మరో రెండు మూడు పుస్తకాలను కూడా ఆయన రాశారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సర్ ఉమర్ హయత్ ఖాన్ సేవకుల బృందంలో గులాం ఫాతిమా అనే మహిళా హోస్టెస్ కూడా ఇంగ్లండ్ వెళ్లారు. పద్దెనిమిదేళ్ల ఫాతిమాకు చదరంగం ఆడటం తెలుసు.
తన వృద్ధాప్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సుల్తాన్ ఐదో జార్జ్ చక్రవర్తి భార్య క్వీన్ మేరీ కి కూడా చెస్ ఆడటం నేర్పించారని చెప్పారు.
ఉమర్ హయత్ ఖాన్ కోరిక మేరకు, గులాం ఫాతిమా 1932 బ్రిటిష్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పాల్గొని ఆరో స్థానంలో నిలిచారు.
దీని తర్వాత మీర్ సుల్తాన్ ఫాతిమాకు కొన్ని క్లిష్టమైన చదరంగం మూమెంట్లను నేర్పించారు. ఆ తర్వాత ఫాతిమా 1933 బ్రిటిష్ ఛాంపియన్‌షిప్ ను గెలుచుకున్నారు. ఆ ఏడాది పురుషుల బ్రిటీష్ ఛాంపియన్‌షిప్ ను మీర్ సుల్తాన్ ఖాన్ గెలుచుకున్నారు.
కుటుంబ సభ్యుల అభ్యంతరాలు
బ్రిటీష్ చెస్ గ్రాండ్‌మాస్టర్, రచయిత డేనియల్ కింగ్ రచించిన 'సుల్తాన్ ఖాన్- ది ఇండియన్ సర్వెంట్ హూ బికేమ్ చెస్ ఛాంపియన్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్' ఆయన మీద వచ్చిన పుస్తకాలలో ఇటీవలిది. 2020 సంవత్సరంలో ప్రచురించిన ఈ పుస్తకంలో వాస్తవాలను ప్రదర్శించిన తీరుపై మీర్ సుల్తాన్ ఖాన్ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తారు.
సుల్తాన్ ఖాన్ పెద్ద కుమారుడు అథర్ సుల్తాన్ కుమార్తె, డాక్టర్ అతియాబ్ సుల్తాన్, తన తాత భారతీయుడు అని పుస్తకంలో పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ విభజన తర్వాత ఆయన నివసిస్తున్న భూభాగం పాకిస్తాన్‌లో భాగమైంది.
తన తాతను పాకిస్తానీగా పేర్కొనాలని అతియాబ్ సుల్తానా కోరుతున్నారు. ఆమె చెప్పిన రెండో అభ్యంతరం ఆయన్ను సేవకుడుగా పేర్కొనడం. మూడోది ఆయనను చదువు రాని వాడిగా వర్ణించడం.
ఉమర్ హయత్ ఖాన్, మీర్ సుల్తాన్ ఖాన్ మధ్య అనుబంధం ఎలాంటిది అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం దొరకడం లేదు. ఇది యజమాని-సేవకుల అనుబంధం మాత్రమేనని చరిత్రకారులు చెబుతుంటే, మీర్ సుల్తాన్ ఖాన్ కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
నిర్ణీత జీతంతో మీర్ హయత్ ఖాన్‌తో సుల్తాన్ ఖాన్ కలిసి పని చేసేవారని, సేవకుడు అనడం సరికాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఈ అభ్యంతరాల నేపథ్యంలో సుల్తాన్ ఖాన్ జీవితానికి సంబంధించిన పూర్తి కథ ప్రపంచానికి తెలియరాలేదన్న విషయం తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
- పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జెండా వివాదం: ఫేస్‌బుక్ నుంచి జెండా ఫొటోను పాక్ ఎందుకు తొలగించింది?
- నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు
- అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ. 21 కోట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ. ఈమె ఎవరు? మమత ప్రభుత్వంలోని మంత్రికీ ఆమెకూ లింకేంటి?
- పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














