టిప్పు సుల్తాన్: బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సేనలపై భారత పాలకుల విజయానికి సంబంధించిన పెయింటింగ్ వేలం

చరిత్ర

ఫొటో సోర్స్, SOTHEBY'S

    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత స్వతంత్ర పోరాటంలో ప్రసిద్ధ ఘట్టాన్ని వర్ణించే పెయింటింగ్‌ను లండన్‌లో వేలానికి పెట్టారు.

1780లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సేనలపై భారత పాలకులు సాధించిన విజయాన్ని వర్ణించే చిత్రాన్ని సదబీస్ సంస్థ సేల్‌కు పెట్టింది.

బుధవారం జరిగే వేలంపాటలో దీని ధర 370,000 పౌండ్ల (సుమారు రూ.3.7 కోట్లు) దగ్గర మొదలవుతుంది.

పొల్లిలూర్ యుద్ధంలో మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ ఈస్టిండియా కంపెనీ దళాలను మట్టికరిపించిన ఘట్టాన్ని తెలుపుతుందీ పెయింటింగ్.

చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటిషర్లను గడగడలాడించిన టిప్పు సుల్తాన్

"మైసూర్ పులి"గా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ ఈస్టిండియా కంపెనీని గడగడలాడించాడు. 1799 యుద్ధంలో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయేవరకు బ్రిటిషర్ల పాలిట సింహస్వప్నంగా నిలిచాడు.

ప్రముఖ రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ పొల్లిలూర్ యుద్ధాన్ని ఉటంకిస్తూ, "వలసరాజ్య పాలనపై భారతీయులు సాధించిన అతిగొప్ప విజయాన్ని వర్ణించే చిత్రమిది" అని పేర్కొన్నారు.

డాల్రింపుల్ రాసిన 'ది అనార్కీ' పుస్తకంలో 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ ఆవిర్భావం, పతనాన్ని వివరిస్తారు.

పొల్లిలూర్ యుద్ధంలో బ్రిటిషర్ల ఓటమిని "అత్యంత దారుణమైన ఓటమి" అని, "భారతదేశంలో బ్రిటిష్ పాలనను దాదాపుగా అంతమొందించిన" యుద్ధమని వర్ణిస్తారు.

పొల్లిలూర్‌లో తొలిసారిగా యుద్ధానికి సారథ్యం వహించిన టిప్పు, బ్రిటిషర్లను "కోలుకోలేని దెబ్బతీశాడు" అని డాల్రింపుల్ బీబీసీతో అన్నారు.

1784లో టిప్పు స్వయంగా ఈ యుద్ధాన్ని వర్ణించే చిత్రాలను గోడలపై గీయించాడు. అప్పటి మైసూర్ రాజధాని శ్రీరంగపట్నంలోని సుల్తానుల కోట 'దరియా దౌలత్ బాగ్' గోడలపై యుద్ధ సన్నివేశాలను చిత్రించారు.

ఆ తరువాత, ఈ దృశ్యాలలో కొన్నింటిని కాగితాలపై కూడా కనీసం రెండుసార్లు చిత్రించారు. ఇందుకోసం సిరా, గౌచే పిగ్మెంట్లను ఉపయోగించారు.

వాటిల్లో ఒక పెయింటింగ్‌ను 2010లో వేలానికి వేయగా, ఖతార్‌లోని ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియం కొనుగోలు చేసింది.

టిప్పు ఓటమి తరువాత శ్రీరంగపట్నంలో ఉన్న కల్నల్ జాన్ విలియం ఫ్రీస్ ఈ పెయింటింగ్‌ను ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లారు.

1978 వరకు ఈ చిత్రాన్ని ఆయన కుటుంబమే సంరక్షించింది. ఆ తరువాత దాన్ని ఒక ఔత్సాహికుడికి అమ్మేశారు. ఆయన దాన్ని 2010లో వేలంపెట్టారు.

రెండో పెయింటింగ్‌ను ప్రస్తుతం సదబీస్ వేలానికి పెట్టింది. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే విషయాలు స్పష్టంగా తెలీవు.

దీనికి, కల్నల్ ఫ్రీస్ తీసుకొచ్చిన మొదటి పెయింటింగ్‌కు పోలికలు ఉండడంతో, దీన్ని కూడా ఒక బ్రిటిష్ అధికారి ఇంగ్లండ్ తీసుకువచ్చి ఉంటారని భావిస్తున్నారు.

1980లలో జరిగిన ఒక వేలంపాటలో ఈ పెయింటింగ్ మొదటిసారి కనిపించిందని సదబీస్‌కు చెందిన బెనెడిక్ట్ కార్టర్ బీబీసీకి తెలిపారు.

"అంతకుముందు 100 ఏళ్ల పాటు ఈ పెయింటింగ్ ఎక్కడ ఉందో మాకు తెలీదు. 1990లో ఒకసారి, 1999లో మరొకసారి దీన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ పెయింటింగ్‌ను మంచి స్థితిలో భద్రపరిచారు" అని ఆయన చెప్పారు.

టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, SOTHEBY'S

ఫొటో క్యాప్షన్, ఏనుగుపై కూర్చుని తన సైన్యాన్ని పర్యవేక్షిస్తున్న టిప్పూ సుల్తాన్
టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, SOTHEBY'S

ఫొటో క్యాప్షన్, టిప్పు అశ్విక దళం, కంపెనీ సైన్యాన్ని రెండువైపుల నుంచి ముట్టడించిన పెయింటింగ్

పొల్లిలూర్ యుద్ధ దృశ్యాలను వర్ణించే చిత్రం

పొల్లిలూర్ యుద్ధంలో 1780 సెప్టెంబర్ 7న ఉదయం ఏం జరిగిందో స్పష్టంగా వివరిస్తుందీ చిత్రం. భారతీయుల విజయాన్ని, భయంకరమైన యుద్ధ దృశ్యాలను ఇందులో వర్ణించారు.

అప్పటి మద్రాసుకు దగ్గర్లో ఉన్న పొల్లిలూర్ అనే గ్రామ సమీపంలో కల్నల్ విలియం బెయిలీ నేతృత్వంలోని ఈస్టిండియా కంపెనీ దళాలపై టిప్పు సుల్తాన్ మెరుపుదాడి చేశాడు.

సుల్తాన్ హైదర్ అలీ అక్కడకు చేరుకునేసరికే, టిప్పు "చేయవలసినదంతా చేసేసాడని" డాల్రింపుల్ అంటారు.

32 అడుగుల పొడుగున్న ఈ పెయింటింగ్‌ను 10 కాగితాలపై చిత్రించారు. ఇందులో ఒక చివర, ఏనుగుపై కూర్చుని తన సైన్యాన్ని పర్యవేక్షిస్తున్న టిప్పును చూడవచ్చు.

మరో చివర, అతడి అశ్విక దళం, కంపెనీ సైన్యాన్ని రెండువైపుల నుంచి ముట్టడించిన దృశ్యాలను చూడవచ్చు. అప్పటికే కల్నల్ విలియం బెయిలీ గాయాలతో పల్లకీలో కూర్చుని ఉన్నాడు. బ్రిటిష్ సైనికులు ఆయనకు కాపలాగా చతురస్రాకారంలో నిలబడి ఉన్నారు. వారిపై టిప్పు తన అశ్వికదళాన్ని ఉరికించిన ఘట్టాలను ఈ పెయింటింగ్‌లో చిత్రించారు.

యుద్ధంలో, మందుగుండు సామాగ్రి ఉన్న బండి పేలిపోవడం కూడా ఇందులో చిత్రించారు.

వేలానికి పెట్టిన పెయింటింగ్‌తో పాటు డాల్రింపుల్ రాసిన ఒక వ్యాసాన్ని కూడా జతపరిచారు. బెయిలీ చిన్న తమ్ముడు యుద్ధం గురించి చెప్పిన విషయాలను ఆయన ఈ వ్యాసంలో వివరించారు.

"యుద్ధ సామాగ్రి నింపిన రెండు బళ్లపై దాడి చేశారు. రెండూ ఒకేసారి పేలిపోయాయి. దాంతో, రెండు పెద్ద దారులు ఏర్పడ్డాయి. ఆ దారులలో ముందుగా అశ్విక దళం దూసుకొచ్చింది. వెనుకే గజదళం వచ్చి బ్రిటిషర్లను పూర్తిగా మట్టికరిపించింది."

"ఇది అద్భుతమైన, అపూర్వమైన కళాఖండం" అని డాల్రింపుల్ బీబీసీతో చెప్పారు.

శ్రీరంగపట్నంలో గోడలపై చిత్రించిన కుడ్యచిత్రాలు అంత అద్భుతంగా ఉండబట్టే, తమ దేశం ఓటమి పాలైనప్పటికీ, కల్నల్ ఫ్రీస్ లాంటి బ్రిటిష్ అధికారులు వీటిని కాగితాలపై గీయించారని డాల్రింపుల్ అభిప్రాయపడ్డారు.

మరో సిద్ధాంతం ఏమిటంటే, తరువాతి కాలంలో ఆర్థర్ వెల్లెస్లీ ఆదేశాల మేరకు శ్రీరంగపట్నంలో కుడ్యచిత్రాలను పునరుద్ధరించే ముందు వాటి నకలును కాగితాలపై గీయించారని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.

టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, SOTHEBY'S

ఫొటో క్యాప్షన్, టిప్పు సుల్తాన్ సైన్యం దాడికి నేలకొరిగిన బ్రిటిష్ సైనికులు

టిప్పు యుద్ధ చతురతకు అబ్బురపోయిన బ్రిటిషర్లు

ఈస్టిండియా కంపెనీతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత టిప్పు సుల్తాన్ స్వయంగా ఈ చిత్రాలపై సున్నం వేయమని ఆదేశించాడు.

ఆ చిత్రాలు "నమ్మశక్యం కానంత రక్తపాతంతో" నిండి ఉంటాయని, వాటిని చెరిపేయాలనుకోవడం బహుశా శాంతి ఒప్పందానికి చిహ్నమని డాల్రింపుల్ అభిప్రాయపడ్డారు.

తరువాత టిప్పు ఓడిపోయినప్పటికీ, ఆయన యుద్ధచతురత, "యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రీతికి" బ్రిటిషర్లు ఆయన్ను గౌరవించారని డాల్రింపుల్ అంటారు.

అందుకే, బ్రిటిషర్లు పొల్లిలూర్ యుద్ధం ఆధారాలను భద్రపరచడం అంత ఆశ్చర్యకరం కాదని చరిత్రకారులు అంటారు.

పొల్లిలూర్ యుద్ధం అంత ప్రసిద్ధి చెందింది కాబట్టే ఈ పెయింటింగ్ ప్రాముఖ్యం సంతరించుకుంటుందని డాల్రింపుల్ అన్నారు.

టిప్పు సుల్తాన్, బ్రిటిషర్లను "అత్యంత భయపెట్టిన రాజు" అని, ఆ సమయంలో వారితో చేతులు కలపడానికి సమ్మతించని ఒకే ఒక్క భారతీయ పాలకుడు అని డాల్రింపుల్ చెప్పారు.

అప్పట్లో టిప్పు సుల్తాన్ దగ్గర మెరుగైన తుపాకులు, ఆయుధాలు ఉండేవని, అశ్వికదళం కూడా వ్యూహాలపరంగా, ఆచరణపరంగా ముందుండేదని ఆయన అన్నారు.

ఉదాహరణకు, ఒంటెలపై నుంచి రాకెట్లు ప్రయోగించేవారు. తరువాతి కాలంలో బ్రిటిషర్లు సొంత రాకెట్ వ్యవస్థను తయారుచేసుకోవడానికి ఒకరకంగా ఇది స్ఫూర్తినిచ్చిందని చెప్పవచ్చని డాల్రింపుల్ అంటారు.

18వ శతాబ్దం చివరి వరకు టిప్పు సుల్తాన్ సైన్యం బలంగా ఉండేది. ఆ తరువాతే బ్రిటిషర్లు యుద్ధరంగంలో బలం పుంజుకున్నారు.

ప్రస్తుతం భారతదేశంలో పెరుగుతున్న హిందుత్వ జాతీయవాద ధోరణిలో, ఒక ముస్లిం రాజుగా టిప్పు సుల్తాన్ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేస్తున్నారు.

కానీ, "మైసూర్ పులి" టిప్పు సుల్తాన్, అప్రతిహతంగా సాగుతున్న బ్రిటిషర్ల ఆక్రమణకు అడ్డుకట్ట వేశాడన్న సంగతిని గుర్తుచేస్తుంది పొల్లిలూర్ యుద్ధం.

టిప్పు సుల్తాన్ చనిపోయిన తరువాత, అతని గుడారాన్ని, ఇతర కళాఖండాలను బ్రిటన్‌కు తీసుకెళ్లారు. బ్రిటిషర్లు వాటిని టిప్పు ఓటమికి బహుమతిగా భావించారు.

వీడియో క్యాప్షన్, ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా క్యూబా విప్లవాన్ని 81 మంది ఫైటర్లతో ఎలా ప్రారంభించారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)