అఫనాసీ నికితిన్.: 500 ఏళ్ల కిందట శ్రీశైలం వచ్చి, శివుడిని దర్శించుకున్న రష్యన్ నావికుడు.. మతం మారాలని పట్టుబట్టిన ముస్లిం రాజు

అఫనాసీ నికితిన్

ఫొటో సోర్స్, Artem Sobov

    • రచయిత, జాహ్నవీ మూలే
    • హోదా, బీబీసీ న్యూస్ మరాఠీ

భారత్, రష్యాల మధ్య సత్సంబంధాల గురించి మనం నేడు మాట్లాడుకుంటున్నాం. కానీ, ఈ రెండు దేశాల మధ్య బంధాలు ఏనాటివి? ఈ ప్రశ్నకు సమాధానాలు 15వ శతాబ్దం వరకూ వెళ్తాయి. ఆ కాలంలోనే తొలి రష్యన్.. భారత్‌లో కాలుమోపారు. ఆయన పేరు అఫనాసీ నికితిన్.

భారత్‌ను చూడాలనే సంకల్పం, సాహస యాత్ర కోసం గుండె నిండా ధైర్యం, ఒక గుర్రం, డైరీ.. భారత్‌లో కాలు మోపేటప్పుడే ఇవే నికితిన్ దగ్గరున్న వస్తువులు. 1469లో ఆయన భారత్‌లో అడుగుపెట్టారు.

అప్పుడే దిల్లీలో లోధీల పాలనా కాలం మొదలైంది. విజయనగర్, బహమనీ సుల్తానుల పాలనలో దక్షిణ భారత దేశం ఉంది.

ఇంకా బాబర్ జన్మించలేదు. వాస్కోడిగామా అప్పుడే పుట్టారు. భారత్‌ను ఆయన చేరుకోవడానికి మరో 30ఏళ్లు పడుతుంది.

అప్పట్లో భారత్ ఎలా ఉండేది? ఆనాటి పరిస్థితులను నికితిన్ చూడటమే కాదు. వాటి గురించి సవివరంగా ఆయన తన డైరీలో రాసుకొచ్చారు.

గుజరాత్, దీవ్‌ల మీదగుండా మహారాష్ట్రలోని తీర పట్టణం చౌల్‌కు ఆయన చేరుకున్నారు. దక్కన్‌లోని గ్రామీణ ప్రాంతాల మీదుగా ఆయన ప్రస్తుత తెలంగాణలోనూ పర్యటించారు.

ఆయన కథను బాలీవుడ్‌లో సినిమాగా తెరకెక్కించారు. దీనిలో హిందీ సినీ ప్రముఖులు నటించారు. మహారాష్ట్రలోని చౌల్‌లో ఆయన కోసం ఒక స్మారకం కూడా కట్టారు.

ఇంతకీ అఫనాసీ నికితిన్ ఎవరు? ఆయన కథ ఎందుకంత ముఖ్యమైనది?

అఫనాసీ నికితిన్

ఫొటో సోర్స్, Shardul kadam/bbc

వోల్గా నుంచి కుండలిక వరకు..

నికితిన్ ఒక రష్యన్ వ్యాపారి, నావికుడు. 1433లో రష్యా నగరం ట్వెర్‌లో ఆయన జన్మించినట్లు రష్యన్ చరిత్ర చెబుతోంది.

భారత్‌కు ప్రయాణం కాకముందు ఆయన జీవితం గురించి ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు. అయితే, ఆయన ఎందుకు ఈ ప్రయాణం మొదలుపెట్టారో మనం ఊహించొచ్చు.

ఆ రోజుల్లో ట్వెర్ ఒక వాణిజ్య నగరం. వోల్గా నదీ తీరంలో అది ఉంటుంది. ఇక్కడి నుంచి చాలా మంది సాహస యాత్రలు మొదలుపెట్టారు. వీరు యూరప్, మధ్య ఆసియా ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లేవారు.

నికితిన్ కూడా ఇలానే సాహస యాత్రకు 1466లో ట్వెర్ నుంచి ప్రయాణం అయ్యారు.

భారత్‌లో మేలుజాతి గుర్రాల కొరత ఉందనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. దీంతో తనతోపాటు ఆయన ఒక గుర్రాన్ని కూడా తీసుకొని వచ్చారు.

చౌల్ గ్రామం

ఫొటో సోర్స్, Shardul kadam/bbc

తన ప్రయాణం గురించి నికితిన్ చాలా వివరంగా రాసుకొచ్చారు. మధ్యయుగంనాటి వాణిజ్య మార్గాలను కూడా ఆయన డైరీలో వివరించారు.

వోల్గా నది మీదుగుండా కాస్పియన్ సముద్రం వరకు ఎలా చేరుకున్నారో ఆయన వివరించారు. మార్గ మధ్యంలో ఆయన రెండుసార్లు దొంగల బారిన పడ్డారు. ఆయనతోపాటు వచ్చిన చాలా మంది మార్గమధ్యంలోనే ఉండిపోయారు. కానీ, నికితిన్ మాత్రం ముందుకు వెళ్తూనే ఉన్నారు.

అలా ఆయన పర్షియాకు చేరుకున్నారు. ఆ తర్వాత హోర్ముజ్ మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించి పశ్చిమ భారత దేశానికి వచ్చారు.

నికితిన్ మొదట దీవ్‌లోకి ఆ తర్వాత గుజరాత్‌లో ఖంబత్ తీరానికి వచ్చారు. అక్కడి నౌకాశ్రయంలో నీలిమందు వ్యాపారం గురించి ఆయన డైరీలో రాసుకొచ్చారు. ఆ నీలిమందుకు రష్యాలో మంచి గిరాకీ ఉండేది.

అక్కడి నుంచి ఆయన మహారాష్ట్రలోని కుండలిక నది తీరంలోని చౌల్ నౌకాశ్రయానికి చేరుకున్నారు.

భారత గడ్డపై నికితిన్ కాలుమోపింది తొలుత చౌల్‌ లోనేనని రష్యా చరిత్రకారులు తమ పుస్తకాల్లో పేర్కొన్నారు.

చౌల్ గ్రామం

ఫొటో సోర్స్, Shardul kadam/bbc

దక్కన్‌లో నికితిన్ ఏం చూశారు?

ముంబయికి 110 కి.మీ దూరంలో రాయ్‌గఢ్‌ జిల్లాలోని అలీబాగ్‌కు దక్షిణాన చౌల్ గ్రామం ఉంటుంది.

నేడు ఈ గ్రామం కొబ్బరి, వక్కపొడి చెట్లతో జాజికాయ వాసనతో గుప్పు మంటుంది.

ఈ ప్రాంతానికి 2000ఏళ్లకుపైనే చరిత్ర ఉంది. చాలా మంది నావికులు, చరిత్రకారులు తమ పుస్తకాల్లో దీని గురించి ప్రస్తావించారు. చంపావతి, చెవుల్, చివ్లి తదితర పేర్లతో దీని గురించి రాశారు.

మధ్య యుగంలో చౌల్ పెద్ద నౌకాశ్రయం. ఇక్కడకు భిన్న దేశాలకు చెందిన వ్యాపారులు వచ్చేశారు. కుండలిక నది గుండా వీరు ఈ ప్రాంతానికి చేరుకునేవారు. నేడు దీనికి సమీపంలోనే రెవ్‌దండ గ్రామం ఉంది.

అలా వచ్చిన నావికుల్లో నికితిన్ కూడా ఒకరు. ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన మనసులో ఏమని అనుకున్నారో తన డైరీలో రాసుకొచ్చారు.

‘‘ఇక్కడ ప్రజలు నగ్నంగా కనిపిస్తున్నారు. తలకు ఏమీ కప్పుకోవడం లేదు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. మహిళలు తమ జుట్టుతో జడ వేసుకుంటున్నారు’’అని ఆయన రాసుకొచ్చారు.

‘‘ధనవంతులు మాత్రం తమ తలను వస్త్రాలతో కప్పుకుంటున్నారు. ఒక వస్త్రాన్ని నడుముకు, మరో వస్త్రంతో శరీరం పైభాగాన్ని కప్పుకుంటున్నారు. మహిళలు నడుముకు మాత్రమే వస్త్రం చుట్టుకుంటున్నారు. వారి రొమ్ములు బహిరంగంగానే కనిపిస్తున్నాయి.’’

చౌల్ గ్రామం

ఫొటో సోర్స్, Shardul kadam/bbc

ఫొటో క్యాప్షన్, చౌల్ గ్రామం

‘‘ఇక్కడి మనుషులు కాస్త ముదురు వర్ణంలో ఉన్నారు. నేను వెళ్లిన ప్రతిచోట నా రంగుచూసి వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.’’

నికితిన్ రాసిన డైరీ చదువుతుంటే, ఆనాడు ఆయన ఏమనుకున్నారో తెలుస్తుంది. ఆయన్ను అందరూ వింతగా చూసేవారని, ఆయనకు కూడా అంతా కొత్తగా కనిపించేందని అర్థమవుతుంది.

చౌల్ నుంచి పాలి, ఆ తర్వాత జున్నార్‌కు నికితిన్ వెళ్లారు. ‘‘ఇక్కడ నాలుగు నెలలపాటు పగలు, రాత్రి వర్షం పడుతుంటుంది. అంతా బురదబురదగా అవుతుంది’’అని ఆయన పేర్కొన్నారు. పొలాల్లో ఇక్కడి ప్రజలు ఎలా పనిచేస్తున్నారు? కిచిడీ ఎలా తింటున్నారు లాంటి విషయాలను కూడా ఆయన రాసుకొచ్చారు.

జున్నార్‌లో నికితిన్ మత విశ్వాసాలకు సవాల్ ఎదురైంది. స్థానిక నాయకుడు అసద్ ఖాన్.. నికితిన్ గుర్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రైస్తవ మతస్థుడైన నికితిన్ ఇస్లాంకు మారితేనే తన గుర్రాన్ని మళ్లీ ఇస్తానని, లేదా భారీ జరిమానా కట్టాలని అసద్ ఖాన్ సూచించారు.

అయితే, తుర్క్ మూలాలున్న, అసద్ ఖాన్ మంత్రుల్లో ఒకరైన మొహమ్మద్ ఖోరాసన్ అడ్డుపడ్డారు. అసద్ ఖాన్‌ను ఆయన వారించి నికితిన్ గుర్రాన్ని వెనక్కి ఇప్పించారు. దీంతో ఖోరాసన్, నికితిన్ మంచి స్నేహితులయ్యారు.

అఫనాసీ నికితిన్

ఫొటో సోర్స్, Getty Images

బహమనీ, విజయనగర..

ఆ తర్వాత బహమనీ సుల్తాన్ రాజధాని బీదర్‌కు నికితిన్ చేరుకున్నారు. చివరగా అక్కడే ఆయన తన గుర్రాన్ని విక్రయించారు. ఆయనకు మంచి లాభం కూడా వచ్చింది. అక్కడి నుంచి ఆయన విజయనగర సామ్రజ్యానికి వెళ్లారు.

బహమనీ సుల్తాన్, విజయనగర సామ్రాజ్యాల మధ్య పోటీ గురించి నికితిన్ రాసుకొచ్చారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం యాత్రకు నికితిన్ వెళ్లొచ్చారు. అక్కడ ఏనుగు, కోతి తలలతో వున్న దేవుళ్ల విగ్రహాలను చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. గుడి నిర్మాణం గురించి, అక్కడ ఉన్న దేవతల విగ్రహాల గురించి, గుడిలో భక్తులు పాటించే నియమాల గురించి, గుడిలో ఇచ్చిన ప్రసాదం గురించి, స్థానిక మార్కెట్ గురించి కూడా ఆయన చాలా వివరంగా రాశారు.

మరోవైపు రంజాన్ నెలలో నికితిన్ కూడా ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత గుల్బర్గాకు వెళ్లారు. అక్కడ రాయ్‌చుర్, గోల్కొండ ప్రాంతాల్లో వజ్రాల గనులను ఆయన చూశారు.

అప్పటికే ఆయన భారత్‌కు వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తైంది. దీంతో వెనక్కి వెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు.

దీంతో చౌల్‌కు 180 కి.మీ దరక్షిణాన వున్న దభోల్ నౌకాశ్రయానికి ఆయన వచ్చారు. ఈజిప్టు, అరేబియా, టర్కీల నుంచి తీసుకొచ్చిన గుర్రాలను ఇక్కడ విక్రయించేవారు.

దభోల్ నుంచి నికితిన్ ఇథియోపియాకు వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఇరాన్‌కు పయనం అయ్యారు. ఆ తర్వాత రోడ్డు మీదుగా క్రైమియాకు చేరుకున్నారు. ఆ తర్వాత యుక్రెయిన్‌లోని కీయెవ్‌కు వచ్చారు. అయితే, 1472లో తన ట్వెర్ పట్టణానికి చేరుకోకముందే, రష్యాలోని స్మోలెన్సెక్‌లో ఆయన మరణించారు.

అఫనాసీ నికితిన్

ఫొటో సోర్స్, Getty Images

బాలీవుడ్ సినిమా

నికితిన్ మరణం తర్వాత రష్యాలో చాలా సామ్రాజ్యాలు వచ్చాయి, వెళ్లాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, సోవియట్ కాలంలో.. నికితిన్‌ను రెండు దేశాల మైత్రికి ప్రతీకగా భావించేవారు.

1957లో నికితిన్ కథపై పరదేశీ పేరుతో ఒక సినిమా తీశారు. దీని కోసం భారత్, రష్యా సినీ ప్రముఖులు కలిసి పనిచేశారు.

ఆ సినిమా రష్యన్(కలర్), హిందీ(బ్లాక్ అండ్ వైట్) భాషల్లో విడుదలైంది.

నర్గిస్, ప్రథ్వీరాజ్ కపూర్, బాల్‌రాజ్, పద్మినిలతోపాటు ఒలెగ్ స్ట్రిఝెనోవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘‘యార్ దస్విదనియా’’అంటూ మన్నా డే పాడిన పాట మంచి హిట్ అయ్యింది. దీనిలో లతా మంగేష్కర్, మీనా కపూర్‌ కూడా పాటలు పాడారు.

2002లో చౌల్‌లో రష్యా కాన్సులేట్ సాయంతో నికితిన్‌కు ఒక స్మారకం నిర్మించారు. ఎస్‌ఆర్‌టీ హైస్కూల్ ప్రాంగంణంలో ఇది ఉంది. దీన్ని చూడటానికి రష్యన్లు, చరిత్రకారులు వస్తుంటారు.

మరోవైపు ట్వెర్‌తోపాటు క్రైమియాలోని ఫెయోడోసియాలోనూ ఆయనకు స్మారకాలు ఉన్నాయి.

అఫనాసీ నికితిన్

ఫొటో సోర్స్, PHAS/getty

నికితిన్ డైరీ ఎందుకు ముఖ్యమైనది?

తన జీవితంలో చివరి రోజు వరకు నికితిన్ డైరీ రాస్తూనే ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఆ డైరీ బయటపడింది. దాన్ని ఓ బౌద్ధారామంలో ఉంచారు.

ఆ డైరీని ‘‘ఖోఝెనియె జా త్రి మోర్యా’’ లేదా ‘‘మూడు సముద్రాలు దాటిన ప్రయాణం’’గా పిలుస్తుంటారు. కాస్పియన్, అరేబియన్, నల్ల సముద్రాలను నికితిన్ దాటివచ్చారు.

రష్యన్‌లో భారత్ గురించి సమగ్రంగా రాసిన తొలి పుస్తకాల్లో ఈ డైరీ ఒకటి.

15వ శతాబ్దంలో భారత్‌లో పర్యటించిన యూరోపియన్ నావికుల్లో నికితిన్ కూడా ఒకరు. అయితే, ఆయన చాలా భిన్నమైనవారని కోల్హాపుర్‌ శివాజీ యూనివర్సిటీలోని విదేశీ భాషల విభాగం ప్రొఫెసర్ డా మేఘ పనసరే వివరించారు.

‘‘ఆయన ఎన్నో ఇబ్బందులు, అవరోధాలను దాటుకుంటూ భారత్‌కు వచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లో పర్యటించి, వాటి విశేషాలను రాసుకొచ్చారు. ఆయన యాత్రలు చాలా ప్రత్యేకమైనవి. సాధారణ పౌరులతో ఆయన ఇట్టే కలిసిపోయేవారని ఆ డైరీ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఆయన డైరీలో రాసుకొచ్చారు’’అని ఆమె చెప్పారు.

‘‘ఆయన ఆ డైరీని రష్యా కోణంలో రాసుకొచ్చారు. ఇక్కడి మహిళలు తలపై ఏమీ కప్పుకోకపోవడాన్ని ఆయన ప్రత్యేకంగా గమనించారు. ఎందుకంటే రష్యాలో మహిళలు ఎప్పుడూ తలపై వస్త్రాన్ని కప్పుకొని ఉండేవారు.’’

వీడియో క్యాప్షన్, బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి?

మిగతా నావికుల్లా నికితిన్‌కు ఎలాంటి రాజుల సాయం లేదు. అయినప్పటికీ ఆయన భారత్ చేరుకుని, తన యాత్రను పూర్తిచేశారు. దీని బట్టి ఆయనకు భారత్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.

ఆనాడు భారత్‌లో పరిస్థితులపై నికితిన్ ఓ పెయింటింగ్ కూడా వేశారు. చాలా మంది ముస్లింలు, హిందువులు ఆయనకు స్నేహితులయ్యారు. ఆయన తొలిసారిగా పనసపండు, నెయ్యి తిన్నారు.

గుర్రాల కంటే ఎద్దులు, ఆవులకు ఇక్కడి ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన గమనించారు. ముఖ్యంగా, ధనవంతులు, పేదల మధ్య భేదాలు, కులాల గురించి ఆయన రాసుకొచ్చారు. ఒక కులానికి చెందిన వారు మరో కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకునే వారుకాదని, వేరే కులం వారి ఇళ్లలో భోజనం కూడా చేసేవారు కాదని పేర్కొన్నారు.

‘‘మన చరిత్ర గురించి చాలా తక్కువ ఆధారలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఆయన డైరీలో చాలా వివరాలను స్పష్టంగా రాసుకొచ్చారు’’అని పనసరే వివరించారు.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌లో బ్రిటిషన్లు ఏమేం దోచుకెళ్లారో తెలుసా

‘‘అప్పట్లో ముస్లిం పాలకులు ఉండేవారని మనకు తెలుసు. అయితే, వారిలో కొందరికి చాలా మంచి గుణాలు, లక్షణాలు ఉండేవి. భిన్న మతాలు ఒకేసారి ఎలా మనుగడ సాగించేవో నికితిన్ వివరించారు. ఆ విషయాలు నేటికీ చాలా ముఖ్యమైనవి.’’

‘‘నికితిన్ ఒక క్రైస్తవుడు. అయితే, ఇస్లాంలోకి మారాలని ఆయనపై ఒత్తిడి వచ్చింది. అప్పుడే.. మీరు ఇక్కడికి రావాలంటే, మీ మతాన్ని, విశ్వాసాలను మీ దేశంలోనే వదిలిపెట్టి రావాలని రాసుకొచ్చారు. అయితే, చివరకు ఆయన మతం మాత్రం మారలేదు.’’

నేటికీ నికితిన్ కథకు చాలా ప్రాముఖ్యముందని పనసరే లాంటి నిపుణులు చెబుతున్నారు.

‘‘మనం రష్యా, భారత్ సత్సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం. యుక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత్ వైఖరి ఎలా ఇబ్బందుల్లో పడుతోందో మాట్లాడుకుంటున్నాం. అయితే, రెండు దేశాల మధ్య బంధాల గురించి తెలుసుకోవాలంటే మొదట నికితిన్ చరిత్ర గురించి అర్థం చేసుకోవాలి. అప్పుడే రెండు దేశాల బంధాలు లా పెనవేసుకుపోయాయో అర్ధమవుతుంది’’అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)