ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, అలీస్టైర్ కోల్‌మ్యాన్
- హోదా, బీబీసీ మానిటరింగ్
తాము ఇప్పటివరకు అభివృద్ధి చేసిన క్షిపణుల్లో అతిపెద్దదైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా మరోసారి వార్తల్లో నిలిచింది.
అయితే, ఈ ప్రయోగానికి సంబంధించిన వార్తలను ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో చూపించిన తీరుపై చర్చ జరుగుతోంది. చాలా మంది ఈ వార్తలను చూసి గందరగోళానికి గురవుతున్నారు.
ఈ వార్తల్లో విజయోత్సాహం కంటే హాలీవుడ్ తరహా సినిమా ఎఫెక్ట్స్ చూసిన ఉత్తర కొరియా వాసులు కూడా అయోమయానికి గురయ్యారు.
ఈ దృశ్యాల్లో కిమ్ జోంగ్ ఉన్ ఒక లెథర్ జాకెట్ వేసుకొని, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. వెనుక వినిపిస్తున్న సంగీతం కూడా చాలా నాటకీయంగా అనిపిస్తోంది.
ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ఛానెళ్లలో సాధారణంగా కిమ్ కుటుంబ విశేషాలు, సైనిక బ్యాండ్ కచేరీలు, దేశ భక్తి సినిమాలు చూపిస్తుంటారు. టీవీ ప్రసారాల్లో వేరే అంశాలు కనిపించడం చాలా అరుదు.

ఫొటో సోర్స్, EPA
అందుకే హ్వాసంగ్-17 కవరేజీ చాలా భిన్నంగా ఉంది.
దీన్ని ఒక న్యూస్ బులిటెన్‌లో భాగంగా ప్రసారం చేశారు. కానీ, ఆ స్టైల్ మాత్రం ముందెన్నడూ ఉత్తర కొరియన్లు చూడనిది.
15 నిమిషాలపాటు వీడియో ఎఫెక్ట్స్, డ్రామాతో ఈ దృశ్యాలకు హాలీవుడ్ హంగులు అద్దారు. అద్దాలు తీసేసి నేరుగా కెమెరావైపు కిమ్ చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ‘‘క్షిపణిని ప్రయోగిద్దాం రండి’’అని ఆయన చెబుతున్నట్లుగా ఆ దృశ్యాలున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తేజపరిచే సంగీతంతో క్షిపణి దృశ్యాలు చూపించారు. మధ్యమధ్యలో విజయోత్సాహంతో ఉత్తర కొరియా సీనియర్ న్యూస్ రీడర్ రీ చున్ హీ వాయిస్ కూడా వినిపించింది. ఆమెను పశ్చిమ దేశాల్లో ఉత్తర కొరియా ‘‘పింక్ లేడీ’’గా పిలుస్తుంటారు.
ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో టాప్ గన్, థండర్‌బర్డ్స్ లాంటి హాలీవుడ్ సినిమాలతో పోల్చారు. కొందరు బాలీవుడ్ సినిమాలను కూడా ఉదహరించారు.
ప్యాంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయ హ్యాంగర్ దగ్గర క్షిపణి ప్రయోగ వేదిక ముందు కిమ్, కొందరు సైనిక జనరల్స్ బయటకు నడుస్తూ వస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు 1983 బ్లాక్‌బస్టర్ మూవీ ‘‘ద రైట్ స్టఫ్’’లోని దృశ్యాలతో పోలుస్తున్నారు.
ఏమిటీ దీని ప్రత్యేకత?
ఉత్తర కొరియావాసులకు ఇలాంటి ఎఫెక్టులు చాలా కొత్త. కొందరు విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో తీసుకొచ్చిన సినిమాలు చూస్తుంటారు. కానీ, పట్టుబడితే, వారికి భారీ జరిమానాలు విధిస్తారు. ఇలాంటి దృశ్యాలను టీవీ తెరలపై వారు ముందెన్నడూ చూడలేదు.
దేశానికి మద్దతుగా ప్రచారం నిర్వహించే శక్తిమంతమైన ప్రాపగాండా విభాగం.. ఉత్తర కొరియా ప్రజలను కొత్తగా, ఉత్తేజ పరిచేలా ఈ వీడియోను సిద్ధం చేసింది. దీంతో ఇటు దేశ పరువు ప్రతిష్ఠలు పెరగడంతోపాటు కిమ్ పేరు, ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయని భావించింది. ఇటీవల బరువు తగ్గించుకున్న కిమ్‌ను ఇందులో యాక్షన్ హీరో స్థాయిలో చూపించే ప్రయత్నం చేసింది.
చివరిసారిగా 2019లో పేక్తు శిఖరాన్ని కిమ్ అధిరోహించినప్పుడు ఇలాంటి ప్రయత్నాన్నే ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా చేసింది. అయితే, ఆనాడు విపరీతమైన బరువుతో గుర్రం మీద కిమ్ కనిపించారు.

ఫొటో సోర్స్, North Korea state media
తాజా వీడియోను చూసిన ఉత్తర కొరియావాసులు సరిగ్గా ఏం అనుకున్నారో చెప్పడం కాస్త కష్టమే. అయితే, ఒక్కసారిగా సంగీతం, రంగులు మారిపోవడం, ఎఫెక్టులను చూడటం వారికి కాస్త కొత్తే.
హాలీవుడ్ సినిమాలు చూసిన కొందరు ఉత్తర కొరియా వాసులు కాసేపు గందరగోళపడి ఉండొచ్చు. బహుశా పొరపాటున ఇలాంటి ఎఫెక్ట్స్ పెట్టారని అనుకోవచ్చు.
ఈ ప్రచారం వెనుకున్న ఉత్తర కొరియా నాయకులకు దీనిపై విదేశాల్లో చర్చ జరుగుతుందని తెలుసుండొచ్చు. వారు కావాలనే హాలీవుడ్ ఎఫెక్ట్స్ పెట్టి ఉండొచ్చు. కానీ, కొన్నిచోట్ల ఆ ఎఫెక్టులు నవ్వు తెప్పించేలానూ ఉన్నాయి.
సందేశం ఏమిటి?
మొత్తానికి ఈ క్షిపణి ప్రయోగం ద్వారా ఉత్తర కొరియా తమ బలాన్ని ప్రపంచానికి తెలియజేప్పే ప్రయత్నం చేసింది.
రాజధాని ప్యాంగ్యాంగ్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని సునాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఓ క్షిపణి ప్రయోగ వేదిక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.
ఈ ప్రయోగం ఒకవేళ విఫలమైతే, విమానాశ్రయంతోపాటు చుట్టుపక్కల ఉండే ప్రజలపైనే ప్రభావం పడేది.
తమను రెచ్చగొడితే ఎక్కడైనా దాడి చేయగలమనే సందేశాన్ని ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు ఉత్తర కొరియా దీని ద్వారా ఇచ్చింది.
అయితే, ఈ సందేశాన్ని హాలీవుడ్ స్టైల్‌లో ఇవ్వడాన్ని ఉత్తర కొరియా గర్వకారణంగా భావించి ఉండొచ్చు.
ఉత్తర కొరియా చేసే హెచ్చరికలు దాదాపుగా అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఉంటాయి. యుక్రెయిన్ యుద్ధం గురించి ఉత్తర కొరియా మీడియాలో చాలా కొన్ని వార్తలు మాత్రమే ప్రసారం చేశారు. అంతేకాదు, దీనికి కారణం అమెరికానే అని వారు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- RRR సినిమా రివ్యూ: రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల ఎలివేషన్లు, ఎమోషన్లతో వెండి తెరపై రాజమౌళి మరో దృశ్యకావ్యం లిఖించాడా?
- శ్రీలంక ఆర్థిక సంక్షోభం: నాలుగు నెలల పసిబిడ్డతో సముద్రం దాటిన దంపతులు
- జొరాస్ట్రియనిజం: మృతదేహాలను పక్షులకు ఆహారంగా వదిలిపెట్టే ఈ మతం ఏంటి?
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్‌కు ఇబ్బందికరంగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











