ఉత్త‌ర కొరియాలో 'హైపర్‌సోనిక్' క్షిపణి ప్రయోగం... ఈ మిసైల్ సత్తా ఏంటి?

హైపర్‌సోనిక్ మిసైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హైపర్‌సోనిక్ మిసైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా

హాసంగ్‌-8 అనే కొత్త హైపర్సోనిక్ క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.

అయిదు సంవత్సరాల అయిదు కీలక ఆయుధాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో ఈ కొత్త మిస్సైల్ ఒకటి అని ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా ప్రకటించింది.

అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని వారు "వ్యూహాత్మక ఆయుధం"గా అభివర్ణిస్తున్నారు.

కఠినమైన ఆంక్షల నడుమ ప్యాంగ్యాంగ్‌లో పెరుగుతున్న ఆయుధ సాంకేతిక సంపత్తికి ఈ క్షిపణి ప్రయోగం తాజా ఉదాహరణ.

"ఈ ఆయుధ వ్యవస్థలను అభివృద్ధిపరచడం వల్ల అన్ని విధాలుగా దేశ ఆత్మరక్షణకు కావాల్సిన సామర్థ్యాలను పెంపొందించినట్టు అవుతుంది" అని ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది.

ఈ ప్రయోగంతో ఇదే నెలలో ఉత్తరకొరియా మూడవ క్షిపణి పరీక్షను చేసినట్టు అయింది. గత రెండు క్షిపణుల్లో ఒకటి కొత్త రకం క్రూయిజ్ క్షిపణి, మరొకటి రైలు నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ క్షిపణి.

గతంలో ఉత్తర కొరియా ప్రయోగించిన క్రూజ్ మిసైల్

ఫొటో సోర్స్, KCNA

ఫొటో క్యాప్షన్, గతంలో ఉత్తర కొరియా ప్రయోగించిన క్రూజ్ మిసైల్

హైపర్సోనిక్ క్షిపణి అంటే ఏమిటి?

హైపర్సోనిక్ క్షిపణులు సాధారణమైన వాటి కంటే చాలా వేగంగా మరింత చురుకుగా దూసుకుపోతాయి. వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుకోవడం చాలా కష్టం.

ఈ పరీక్ష ప్రయోగంలో నేవిగేషనల్ కంట్రోల్‌తోపాటూ క్షిపణి స్థిరత్వాన్ని సాధించినట్టు ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది.

క్షిపణి "కచ్చితమైన సామర్థ్యాలను" అంచనా వేయడం ఈ సమయంలో కష్టమని కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్ పీస్‌లో స్టాంటన్ సీనియర్ ఫెలో అయిన అంకిత్‌ పాండా అన్నారు. "సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలకు ఈ సరికొత్త క్షిపణులతో బహుశా చాలా భిన్నమైన సవాల్లు ఎదురు అవ్వొచ్చు"

ఉత్తర కొరియా ఈ కొత్త అయుధంలో మిష‌న్ ఫ్యూయ‌ల్ ఆంపౌల్ కూడా ప్రవేశపెట్టిందని, ఇది వారు సాధించిన ముఖ్యమైన మైలు రాయి అని పాండా తెలిపారు.

ఈ ఆయుధం నేరుగా దాడి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఫీల్డ్‌లో ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. దీంతో క్షిపణిని చాలా వేగంగా లాంచ్ చేయవచ్చు. అంటే, అవతలి దేశాలకు వెంటనే ప్రతిదాడులు చేయడం కష్టతరం అవుతుంది.

హైపర్‌సోనిక్ గ్లైడింగ్ వార్‌హెడ్‌లను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు "పరిశోధన పూర్తి చేశారు" అని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ జనవరిలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థలో మంగళవారం జరిగిన పరీక్ష మొదటిది.

"కిమ్ జాంగ్ ఉన్ జనవరిలోనే దీని గురించి వెల్లడించడంతో, హైపర్‌సోనిక్ గ్లైడర్‌ను అభివృద్ధి చేయాలనే పరిణామం అంతగా ఆశ్చర్యం కలిగించదు" అని పాండా అన్నారు.

అయితే, ఈ హైపర్‌సోనిక్ క్షిపణి ఇంకా అభివృద్ధి దశలో ఉందని తాము భావిస్తున్నామని, దీనిని యుద్ధంలో మోహరించడానికి ఇంకా సమయం పడుతుందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు. దక్షిణ కొరియా, యూఎస్ రెండూ ప్రస్తుతం ఈ క్షిపణిని గుర్తించి, అడ్డగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు.

దక్షిణ కొరియా టీవీలో మిసైల్ ప్రయోగానికి సంబంధించిన వార్త

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా టీవీలో మిసైల్ ప్రయోగానికి సంబంధించిన వార్త

ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమం గురించి మనకు ఏం తెలుసు?

ఉత్తర కొరియా ఇటీవల పెరిగిన క్షిపణి పరీక్షలు, ముఖ్యంగా ఈ నెలలోనే ఇది మూడో ప్రయోగం. వీటిని బట్టి తన ఆయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోందని అర్థమవుతుంది.

ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను విడిచిపెట్టాలని అమెరికా పిలుపునిస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్‌ పరిపాలనా యంత్రాంగానికి ప్యాంగ్‌యాంగ్‌కు మధ్య సంబంధాలు ఇప్పటి వరకు ఉద్రిక్తతతో నిండి ఉన్నాయి.

జపాన్, ఉత్తర కొరియా మధ్య ఎన్నో ఏళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 35 సంవత్సరాల పాటు కొరియాలో జపాన్ వలసపాలన, ప్యాంగ్‌యాంగ్‌ అణు పరీక్షలు, గతంలో జపాన్‌ పౌరులను అపహరించడం వంటి కారణాల వల్ల ఈ దేశాల మధ్య సత్సంబంధాలు లేవు.

ప్యాంగ్‌యాంగ్ కొత్త ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. అవి తమ స్వీయ రక్షణకే అవసరమని వాదిస్తోంది.

సైనిక కార్యకలాపాలపై దక్షిణ కొరియా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుందని పలుమార్లు ఉత్తర కొరియా ఆరోపించింది.

దక్షిణ కొరియా ఇటీవల తన మొట్టమొదటి జలాంతర్గామి నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ క్షిపణినిని పరీక్షించింది. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు ప్రతిగా ఈ పరీక్షలు చేశామని దక్షిణ కొరియా తెలిపింది.

అణ్వాయుధాల తయారీకి ఉత్తర కొరియా ప్లూటోనియంను ఉత్పత్తి చేయగల రియాక్టర్‌ను పునః ప్రారంభించినట్లు కనిపించిందని గత నెలలో ఐక్యరాజ్యసమితి అణు ఏజెన్సీ తెలిపింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే పరిణామం అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)