యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త

ఫొటో సోర్స్, Yalavarthy Pavan Kumar
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈరోజు యలవర్తి నాయుడమ్మ 99వ జయంతి. (1922 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. 1985 జూన్ 23వ తేదీన మరణించారు)
యలవర్తి నాయుడమ్మ ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో, రైతు కుటుంబంలో పుట్టిన ఆయన అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
మద్రాస్ లెదర్ టెక్నాలజీ సంస్థలో కెమిస్ట్రీ డెమాన్‌స్ట్రేటర్‌గా 17 రూపాయల జీతంతో ప్రస్థానాన్ని ప్రారంభించిన నాయుడమ్మ, భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్‌గా, ఆ తర్వాత దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వైస్ చాన్స్‌లర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీకి సలహాదారుగా పనిచేసిన ఆయన, ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలకు, విదేశీ సంస్థలకు కూడా సలహాదారుగా పనిచేశారు.
''సమగ్ర గ్రామీణాభివృద్ధికి సాయం చేయాలని, ఇందులో భాగం కావాలని శాస్త్రవేత్తలను కోరిన తొలితరం వారిలో నాయుడమ్మ ఒకరు'' అని 2006లో భారత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ కార్యక్రమంలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. నాయుడమ్మను 'గ్రేట్ సన్ ఆఫ్ ఆంధ్రా'గా అభివర్ణించారు.
నాయుడమ్మ తండ్రి అంజయ్య. ఆయనకు ముగ్గురు కొడుకుల్లో మొదటివాడైన నాయుడమ్మ బాగా చదువుకుని, మంచి ఉద్యోగంలో స్థిరపడగా.. రెండో కొడుకు, గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసిన రాజగోపాలరావు మాత్రం ఏ ఉద్యోగంలోనూ నిలదొక్కుకోలేదని అంజయ్య భావించేవారు. దీంతో తమ్ముడికి సరైన ఉద్యోగం ఇప్పించట్లేదని నాయుడమ్మను నిందించేవారు.
''ఒకసారి నాయుడమ్మ తండ్రి మద్రాసు వచ్చారు. రాజగోపాలరావు విషయాన్ని నాయుడమ్మ వద్ద ప్రస్తావిన్తసూ.. 'నువ్వు చాలామందికి ఉద్యోగాలు ఇస్తున్నావు. కానీ, తనకు మాత్రం సహాయం చేయట్లేదని నీ తమ్ముడు అసంతృప్తితో ఉన్నాడు. నువ్వనుకుంటే నీ తమ్ముడికి ఉద్యోగం పెద్ద సమస్య కాదు' అన్నారు'' అని చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) డైరెక్టర్‌గా పనిచేసిన కాట్రగడ్డ శేషగిరిరావు తన పుస్తకం 'నాయుడమ్మ గారితో నేను'లో పేర్కొన్నారు.
దీనికి నాయుడమ్మ సమాధానం ఇస్తూ.. ''నాన్నా, నువ్వొక రైతువి కదా. ఒక గిడసబారిన మొక్కకి నీళ్లుపోసి, ఎరువు వేస్తావా? వేయవు కదా. దానికి బదులు ఏపుగా ఎదిగే మొక్కలకు నీళ్లు పోసి, వాటిని బాగా చూసుకుంటావు. అలాగే రాజా నా సహాయం పొందేందుకు అర్హుడు కాదు. తమ్ముడికి సహాయం చేసే బదులు అర్హులైన వారికి నా మద్దతు ఇస్తా'' అన్నారు.
వాస్తవానికి తమ్ముడి ఉద్యోగం కోసం పలుమార్లు నాయుడమ్మ సహాయం చేశారని, కానీ, నిలకడగా ఎక్కడా పనిచేయలేదని, అందుకే నాయుడమ్మ కొంచెం కఠినంగా, రైతు అర్థం చేసుకునే భాషలోనే తండ్రికి సమాధానం ఇచ్చారని మాజీ ఐఆర్ఎస్ అధికారి కాటా చంద్రహాస్ 'ప్రజల శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ జీవిత చరిత్ర' పుస్తకంలో పేర్కొన్నారు. నాయుడమ్మ రెండో తమ్ముడు రాధాకృష్ణ గ్రామంలోనే ఉండి వ్యవసాయం చూసుకునేవారు.

ఫొటో సోర్స్, Yalavarthy Pavan Kumar
17 రూపాయల జీతంతో ప్రారంభమైన ప్రస్థానం..
అర్హులైన వారికి మద్దతు ఇస్తానని నాయుడమ్మ తండ్రికి చెప్పడమే కాదు, సీఎల్ఆర్ఐ డైరెక్టర్‌గా, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన సుదీర్ఘకాలంలో ఆయన ఎంతో మంది ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిజంగానే మద్దతుగా నిలిచారు. అలా మద్దతుగా నిలిచినందుకు, ప్రతిభను ప్రోత్సహించినందుకు ఆయనపై నిందారోపణలు కూడా వచ్చాయి. కాట్రగడ్డ శేషగిరిరావుకు సామర్థ్యం లేకపోయినా పక్షపాతబుద్ధితో శాఖాధిపతిని చేశారని నాయుడమ్మను ఆరోపిస్తూ ఆయనకే ఆకాశరామన్న ఉత్తరం రాశారు. దానిని నాయుడమ్మ నోటీసుబోర్డులో పెట్టించారు. దీన్ని చూసి కాట్రగడ్డ శేషగిరిరావు ఖంగుతిన్నారు. ఇందుకు నాయుడమ్మ సమాధానం ఇస్తూ.. ''ఇలాంటి లేఖలు మామూలే. అసూయాపరులు ఎంతకైనా తెగిస్తారు. నోటీసు బోర్డులో పెడితే, దాన్ని ఎవరు రాశారో అందరూ గ్రహిస్తారు. ఆ వ్యక్తితో దూరంగా మసలడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వెలివేతే అతనికి శిక్ష'' అన్నారని కాట్రగడ్డ శేషగిరిరావు తన పుస్తకంలో తెలిపారు.
అలాగే కాట్రగడ్డ శేషగిరిరావుపైన కూడా నాయుడమ్మకు ఇలాంటి ఉత్తరాలు అందేవి. దీనిపై ఆయన తన పుస్తకంలో ఇలా రాశారు. ''నువ్వు మీ డిపార్ట్‌మెంటులో తెలుగువాళ్లని, అందునా ముఖ్యంగా కమ్మ వాళ్లను కొత్తగా ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నావని నాకు ఉత్తరాలు వస్తున్నాయి'' అని నాయుడమ్మ అన్నారు. ఆ ఆరోపణలు అర్థరహితం, ఆధారరహితం. కానీ, నాయుడమ్మగారు నా వివరణ అడగలేదు. చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఆయనే కల్పించుకుని.. ''వీటిని నేను లక్ష్యపెట్టను. నువ్వు న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకున్నంతకాలం నీకు ఎలాంటి హాని జరిగే ప్రసక్తి లేదు'' అని చెప్పి, నా గుండె నిండా ధైర్యాన్ని నింపారు.
ప్రతిభను ప్రోత్సహించే వ్యక్తుల వల్లనే నాయుడమ్మ ఉన్నత శిఖరాలకు ఎదిగారని చెప్పవచ్చు. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బీఎస్సీ చేసిన ఆయన మద్రాసు వచ్చి న్యాయవాద కోర్సులో చేరారు. కానీ, అది ఆయనకు ఇష్టం లేదు. పది రోజులకే క్లాసులకు వెళ్లడం మానేశారు. అప్పుడే మద్రాస్ లెదర్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ కాట్రగడ్డ శేషాచలం చౌదరితో ఆయనకు పరిచయం అయ్యింది. నాయుడమ్మ ఉన్నత విద్యను అభ్యసించారని తెలుసుకున్న శేషాచలం చౌదరి నాయుడమ్మకు తమ సంస్థలో కెమిస్ట్రీ డిమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. జీతం నెలకు 17 రూపాయలు. శేషాచలం చౌదరి సహాయంతోనే నాయుడమ్మ ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టి ట్రైనింగు కోసం బ్రిటన్ వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. పీహెచ్‌డీ చేసి, తర్వాత భారతదేశం తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఖర్చులకు అవసరమైన డబ్బును అలవెన్సుల రూపంలో సర్దుబాటు చేసింది కూడా శేషాచలం చౌదరే.

ఫొటో సోర్స్, Kata Chandrahas
నాయుడమ్మ.. అంటే మహిళ అనుకుని భంగపడ్డ మంత్రి
నాయుడమ్మకు ఆ పేరు ఎలా వచ్చింది?
అంజయ్య తన తండ్రి పేరులోని 'నాయుడు'ను తీసుకుని మొదటి కొడుక్కి 'నాయుడమ్మ' అని పెట్టారని యలవర్తి ఫౌండేషన్‌కు చెందిన యలవర్తి పవన్ కుమార్ చెప్పారు.
తన పేరుపై తానే జోకులు పేల్చేవారు నాయుడమ్మ. వేదికలపై ప్రసంగాన్ని ప్రారంభించేప్పుడు కూడా పలుమార్లు ఆయన ఇలాగే చేసేవారు.
1977 నవంబర్ 30వ తేదీన మాక్స్‌ముల్లర్ భవనంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ''నాయుడమ్మ అనగానే ఒక మహిళ మాట్లాడుతుందని మీరంతా ఊహించి ఉంటారు. మన్నించండి. మిమ్మల్ని నిరాశపరిచాను'' అంటూ తన ప్రసంగం మొదలు పెట్టారు.
మరో ముఖ్య సంఘటన 1957లో తమిళనాడు సెక్రటేరియేట్‌లో జరిగింది. నాయుడమ్మ సీఎల్ఆర్ఐ డైరెక్టర్ హోదాలో తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి అయిన చిదంబరం సుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలవాలనుకున్నారు. మంత్రి పేషీ నుంచి అపాయింట్‌మెంట్ తీసుకుని, ఆఫీసుకు వెళ్లారు. నాయుడమ్మ వచ్చిన విషయాన్ని సెక్రటరీ మంత్రికి చెప్పగా.. 'కాసేపాగి లోనికి పంపించు' అని సుబ్రహ్మణ్యం సమాధానం ఇచ్చారు. ఈలోపు గబగబా బాత్‌రూమ్‌కు వెళ్లి, ముఖం కడుక్కుని, తల దువ్వుకుని, సీటులోకి తిరిగొచ్చి బెల్ నొక్కారు. ఒక మహిళ వస్తుందని ఆశించిన ఆయన ఎదుట నాయుడమ్మ ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను ఒకటికి రెండుసార్లు పైకీ కిందకీ చూసిన మంత్రి సుబ్రహ్మణ్యం.. నాయుడమ్మ అంటే మహిళ కాదని అర్థం చేసుకున్నారు. ఇదంతా తర్వాత సీఎల్ఆర్ఐలో జరిగిన ఒక సమావేశంలో, నాయుడమ్మ సమక్షంలో సుబ్రహ్మణ్యం అందరికీ చెప్పి, నవ్వించారు.
'ఒక వ్యక్తిని గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు. కానీ, ఆ వ్యక్తిలోని గ్రామాన్ని మాత్రం తీసేయలేము' అని నాయుడమ్మ తరచూ అంటుండేవారని కాటా చంద్రహాస్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
నాయుడమ్మకు గ్రామాలపై ఉండే అభిమానం గురించి యలవర్రు మునసబుగా పనిచేసిన యలవర్తి వెంకట సుబ్బారావు ఇలా చెప్పారు. ''ఆయన రైల్లో నిడబ్రోలు వచ్చేవారు. అక్కడి నుంచి జట్కా బండిలో కూర్చుని పంట పొలాలు చూసుకుంటూ ఇంటూరు వెళ్లి, చెల్లెలు దగ్గర ఒకరోజు గడిపేవారు. తర్వాత మూడు కిలోమీటర్లకు పైగా కాలి నడకన యలవర్రు వచ్చేవారు. చేలు, చెట్ల మధ్యన పంచె కట్టుకుని తిరగడానికి, ఊర్లో నలుగురితో కలిసి కూర్చోవడానికి, మాట్లాడటానికి ఇష్టపడేవారు''.
'నేను పుట్టుకతో రైతును. వృత్తి రీత్యా అంటరాని వాడిని' అని నాయుడమ్మ పదేపదే చెబుతుండేవారు. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. దీని గురించి కాటా చంద్రహాస్ ఇలా పేర్కొన్నారు.. నాయుడమ్మ సీఎల్‌ఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయనకు పెద్దవాళ్లతో పరిచయాలు బాగా ఉండేవి. అలాంటివారిలో అప్పటి తమిళనాడు గవర్నర్ కూడా ఒకరు. తోలు పరిశ్రమతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని, చర్మకారులతో ఆయన సాన్నిహిత్యాన్ని చూసి నాయుడమ్మ కులంపై ఆయన ఒక అంచనాకు వచ్చారు. కానీ, దానిని ఎవరూ ధృవీకరించలేకపోయారు. దీంతో కుతూహలం కొద్దీ ఆయన ఒకరోజు నేరుగా నాయుడమ్మకే ఫోన్ చేసి.. ''మీ కులమేంటో తెలుసుకోవచ్చా?'' అని అడిగారు. గవర్నర్ ప్రశ్నకు సమాధానంగా నాయుడమ్మ 'నేను వృత్తి రీత్యా అంటరానివాడిని' అని సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Katragadda Seshagiri Rao
నాయుడమ్మ - రాజకీయాలతో అనుబంధం
బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఉన్నప్పుడు నాయుడమ్మ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాలేజీ రోజుల్లో తాను ఎర్ర జెండాలను కూడా మోశానని 1983లో ఎన్టీ రామారావుకు రాసిన లేఖలో నాయుడమ్మ పేర్కొన్నారని కాటా చంద్రహాస్ వెల్లడించారు.
అమెరికాలోని లీహాయ్ యూనివర్శిటీలో నాయుడమ్మ, వసంత్ పండిట్ ఇద్దరూ ఒకేసారి ఎంఎస్ చదివారు. దేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మి పండిట్ కొడుకే వసంత్ పండిట్. అలా ఆయనకు అమెరికాలో రాయబారిగా ఉన్న విజయలక్ష్మి పండిట్‌తో పరిచయం ఏర్పడింది. 35 ఏళ్ల వయసులో సీఎల్ఆర్ఐ డైరెక్టర్‌గా నాయుడమ్మ నియామకాన్ని నెహ్రూ ఖరారు చేయడానికి విజయలక్ష్మి పండిట్ మాటసాయం కూడా ఒక కారణం.
తదనంతరకాలంలో ఇందిరాగాంధీ నాయుడమ్మను సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. నిజానికి ఇది చాలా పెద్ద పోస్టు. కానీ, ఈ రెండు కండీషన్లకు ఒప్పుకుంటేనే తాను ఈ పదవిని చేపడతానని నాయుడమ్మ అన్నారు. అందులో ఒకటి - ఐదేళ్లు మాత్రమే ఈ పదవిలో కొనసాగడం. రెండు - వివిధ విదేశీ, అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా ఉన్నందున ఆ బాధ్యతల మేరకు ప్రతి ఏటా మూడు వారాలు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి. దీంతో ఇందిరాగాంధీ అవాక్కయ్యారు. ఈయనెవరు కండీషన్లు పెట్టడానికి అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిని అడిగారు. వాస్తవానికి నాయుడమ్మను సీఎస్ఐఆర్ డీజీ పోస్టుకు సిఫార్సు చేసింది స్వయానా మంత్రే. ఆయన నాయుడమ్మ కావాలని పట్టుబట్టడంతో ఇందిరాగాంధీ నాయుడమ్మ కండీషన్లకు ఆమోదం తెలిపారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలుసా.. నాయుడమ్మను మహిళ అనుకొని తమిళనాడు సెక్రటేరియేట్‌లో ముస్తాబయ్యారే.. ఆయనే సీ సుబ్రహ్మణ్యం. తదనంతర కాలంలో లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో చేరారు. భారతదేశంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు తొలి మంత్రి ఆయనే. కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ, ఆర్థిక, రక్షణ శాఖల మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆయన హయాంలోనే 'భారతదేశ హరిత విప్లవం' జరిగింది. ఇందుకు గాను ఆయనకు భారతరత్న పురస్కారం కూడా దక్కింది.

ఫొటో సోర్స్, Yalavarthy Pavan Kumar
ఇందిరాగాంధీ, ఎన్టీఆర్.. ఇద్దరికీ నమ్మకస్తుడిగా..
రాజకీయంగా ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌కి మధ్య శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ బయట కూడా ఎన్నికల ప్రచారాలు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేశారని ఇందిరాగాంధీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఇద్దరికీ నాయుడమ్మ నమ్మకస్తుడిగా పేరొందారు. ప్రధాని ఇందిరాగాంధీకి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఆయన సలహాదారుడిగా పనిచేశారు.
సీఎస్ఐఆర్ డీజీగా ఆరేళ్లు పనిచేసిన తర్వాత, ఆ పదవి నుంచి తప్పుకోవాలని నాయుడమ్మ భావించారు. కానీ, అదే సమయంలో ఎమర్జెన్సీని విధించడంతో.. తాను తప్పుకుంటే ఎమర్జెన్సీ వల్లనే తప్పుకున్నానని ఇందిరాగాంధీ భావిస్తారేమోనని ఆయన మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగారని కాటా చంద్రహాస్ వెల్లడించారు.
ఇందిరాగాంధీ అధికారం కోల్పోయిన తర్వాత 1977లో ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామిని కలవాలనుకున్నారు. అక్కడికి నాయుడమ్మను కూడా వెంటతీసుకెళ్లారు ఇందిరాగాంధీ.
నాయుడమ్మ మరణించినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అప్పుడు నాయుడమ్మ భార్య పవనాబాయి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్వయంగా రాజీవ్ గాంధీ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, ఆమె ఆరోగ్యం గురించి కూడా వాకబు చేశారు. ఇలా నెహ్రూ-గాంధీ కుటుంబంలోని మూడు తరాలతో నాయుడమ్మకు అనుబంధం ఏర్పడింది.
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయుడమ్మ గౌరవ సలహాదారుగా పనిచేశారు. వరుసగా అదే పదవిలో కొనసాగారు. ఎన్టీఆర్ హయాంలో కూడా సలహాదారుగా పనిచేసిన నాయుడమ్మ కేవలం పారిశ్రామిక రంగానికి సంబంధించిన సలహాలే కాకుండా, వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా కూడా సలహాలు ఇచ్చేవారని ఆయన లేఖలను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే 1983 ఆగస్టు 6వ తేదీన రాసిన లేఖలో.. ''నల్లధనం అధికంగా ఉన్న కొంతమంది పెద్దవాళ్లని జాగ్రత్తగా వలేసి పట్టుకుని, బహిరంగంగా ఉరి తీయండి'' అని సలహా ఇచ్చారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి.. 1984 జూలై నెలలో అమెరికాలో పర్యటించినప్పుడు నాయుడమ్మ కూడా వెంట ఉన్నారు. అప్పటికే ఎన్టీఆర్, ఇందిరాగాంధీ మధ్య రాజకీయ వైరం నెలకొంది. దీంతో సహజంగానే విలేకరులు ఇందిరాగాంధీ గురించి ఎన్టీఆర్‌కు ప్రశ్నలు వేస్తారని అంచనా వేసిన నాయుడమ్మ.. బయటి దేశంలో ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదని, విలేకరుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తే బాగుంటుందో వివరించారని కాటా చంద్రహాస్ తన పుస్తకంలో రాశారు. నాయుడమ్మ అంచనా వేసినట్లే.. విలేకరులు 'మీరు ఇందిరాగాంధీతో ఎలా నెట్టుకొస్తున్నారు?' అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ''నేను మా దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఆమె దేశానికి ప్రధాన మంత్రి. కొన్ని విధానపరమైన విబేధాలు ఉన్నా, జాతీయ ప్రయోజనాల విషయంలో మా మధ్య అభిప్రాయబేధాలు లేవు' అని సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Yalavarthy Pavan Kumar
'విభూతి బదులు ఒక గడ్డిపరక మొలిపించండి'
సత్య సాయిబాబాకు భక్తుడైన ఒక శాస్త్రవేత్తతో కలసి నాయుడమ్మ ఒకసారి పుట్టపర్తి వెళ్లారు. సాయిబాబా తన భక్తుల కోసం శూన్యం నుంచి విభూతి సృష్టించేవారు. నాయుడమ్మ చూస్తుండగా కూడా సాయిబాబా విభూతి సృష్టించారు. అప్పుడు నాయుడమ్మ రెండు చేతులూ జోడించి.. ''విభూతి బదులు మీ అరచేతిలో ఒక గడ్డిపరకని మొలిపించండి'' అని సాయిబాబాను కోరారు. దీంతో సాయిబాబా అనుచరులు నాయుడమ్మను అక్కడినుంచి పంపించేశారు. ఈ సంఘటన గురించి నాయుడమ్మపై వెలువడ్డ మూడు పుస్తకాల్లో పేర్కొన్నప్పటికీ, ఇది ఎప్పుడు జరిగిందనే ఆధారాలు మాత్రం ఇవ్వలేదు. అయితే, 'శూన్యం నుంచి విభూతి కాకుండా ఒక గుమ్మడికాయను సృష్టిస్తే ఆయన్ను నేను బాబాగా నమ్ముతా'' అని నాయుడమ్మ తన సహచరుల వద్ద అనేవారు.
కాగా, మూఢనమ్మకాలను నాయుడమ్మ తీవ్రంగా వ్యతిరేకించేవారు. 'శాస్త్రం-మూఢనమ్మకాలు' అనే అంశంపై ఆయన ఒక వ్యాసం కూడా రాశారు. 'సైన్సూ, అద్భుతాలూ ఒక ఒరలో ఇమడవని శాస్త్రవేత్తలు గుర్తించాలి. కాలం చెల్లిన విలువలనూ, అపోహలనూ, మూఢనమ్మకాలనూ భారతీయ శాస్త్రవేత్తలు తీవ్రంగా నిరసించాలి. విజ్ఞానం, హేతువాదం ప్రజల ఆలోచనలకు మూలం కావాలి. ఈ దిశగా సమాజంలో మార్పుకోసం శాస్త్రవేత్తలు కృషి చేయాలి'' అని నాయుడమ్మ పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Yalavarthy Pavan Kumar
కరీంనగర్ ప్రాజెక్టు
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మాటల్లో చెప్పాలంటే.. ''నాయుడమ్మ కరీంనగర్ జిల్లాలో సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రారంభించిన సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు''.
శాస్త్ర, సాంకేతికను గ్రామాలకు తీసుకెళ్లి, గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, పేదరిక నిర్మూలనతో ప్రజల జీవితాలను మెరుగుపర్చాలని నాయుడమ్మ ఆలోచించారు. ఆ ఆలోచనల ప్రతిరూపమే సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం.
1972 సెప్టెంబర్ నెలలో కరీంనగర్ ప్రాజెక్టు మొదలైంది.
హైదరాబాద్‌లోని రీజినల్ రీసెర్చి ల్యాబొరేటరీ (ఆర్ఆర్ఎల్) కరీంనగర్‌ను దత్తత తీసుకుంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జల విభాగం, ఇంజనీరింగ్ విభాగం, ప్రాంతీయ అభివృద్ధి విభాగం వంటి వాటితో సంబంధం ఉన్న ఎనిమిది జాతీయ ప్రయోగశాలలు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాయి.
- రైతుల కోసం నేల సారాన్ని పరీక్షించడం
- తాగునీటిని ప్రక్షాళన చేయడం
- ప్రజలు రోజువారీ వాడుకునే పనిముట్లను మరమ్మత్తు చేయడం, ఆధునీకరించడం
- కుటుంబ పోషకాహార విలువలు పెంచడం
ఇలా సైన్స్‌ను ఉపయోగించి, ప్రముఖ శాస్త్రవేత్తల సహకారంతో ప్రజల రోజువారీ జీవితాలను మెరుగుపర్చాలని భావించారు నాయుడమ్మ. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించాలని నిర్ణయించారు. అలాగే, దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలతో చర్చించి, సీఎస్ఐఆర్ ప్రయోగశాలల ద్వారా ఎంపిక చేసిన జిల్లాలకు కరీంనగర్ ప్రాజెక్టును విస్తరించాలని అనుకున్నారు.
కానీ, ఈ ప్రాజెక్టు విఫలమైంది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తి చూపకపోవడం, వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న నాయుడమ్మ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపకపోవడమే ఇందుకు కారణాలని భావించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు నాయుడమ్మ సీఎస్ఐఆర్ డీజీగా కొనసాగినప్పటికీ, దీనిని అమలు చేయించలేకపోయారు.
వాస్తవానికి ఐదో పంచవర్ష ప్రణాళికలో భాగమై, దేశవ్యాప్తంగా సంపూర్ణ గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికి నమూనా కావాల్సిన కరీంనగర్ ప్రాజెక్టును తర్వాతి కాలంలో కేంద్ర స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. మూడు దశాబ్ధాల తర్వాత 2006లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దీనిని మళ్లీ గుర్తు చేశారు.
''నాయుడమ్మ కరీంనగర్ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. శాస్త్రవేత్తలనూ, సాంకేతిక నిపుణులనూ, పనివాళ్లనూ, సమాజాభివృద్ధికి పాటుపడేవాళ్లనూ ఒక చోట చేర్చే ప్రాజెక్టు అది. దీని నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకున్నామో తెలుసుకోవాలి, ఈ ప్రయత్నాన్ని ఎలా ముండుకు తీసుకెళ్లగలమో ఆలోచించాలి'' అని ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అన్నారు.
సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ పదవికి 1977లో నాయుడమ్మ రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వరి పొట్టు నుంచి సిమెంట్..
అయితే, ఆయన ప్రతిపాదించిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ (సీడీఏ)ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం దానికి ఆయననే అధిపతిగా నియమించింది. గ్రామీణ ప్రజల అవసరాలను గుర్తించడం, వాటిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రవేశపెట్టడం, పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సైన్సును ఉపయోగించడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, చర్మ సంబంధ పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆ పరిశ్రమల్లోని కార్మికుల సంక్షేమం ఈ కేంద్రం లక్ష్యాలు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రచించి, అమలు చేయడం దాని పని.
ఈ క్రమంలో ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తికి ప్రజలు పెంచి పోషించే ప్రతి మొక్కను, ప్రతి పశువునూ సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని, ఇందుకు అనుగుణంగా గ్రామాల్లోనే పరిశ్రమలు, అనుబంధ కర్మాగారాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పండే వరిని ఉదాహరణగా తీసుకుని, పంట నూర్పిళ్ల తర్వాత వచ్చే గడ్డితోనూ, పొట్టుతోనూ, బియ్యం మర ఆడిన తర్వాత వచ్చే ఊక, తవుడుతో ఏమేం తయారు చేయొచ్చో ఇలా వివరించారు.
- వరిగడ్డితో కార్డుబోర్డు, మడత కాగితం తయారీ
- ఇంటిపై కప్పును కప్పేందుకు ఉపయోగించడం
- పుట్టగొడుగులను పెంచే ప్రాపుగా వాడటం
- వరి పొట్టును ఇంథనంగా మార్చడం
- వరి పొట్టును బూడిద చేసి, ఆ బూడిదతో సిమెంట్, సోడియం సిలికేట్, సోలార్ గ్రేడ్ సిలికేట్, సిలికా సోల్, పింగాణీ వస్తువులు, మొదలైనవి తయారు చేయాలి
- వరి పొట్టుతో పార్టికల్ బోర్డు, యాక్టివేషన్ కార్బన్, ఫిల్లర్లు, అగ్నిమాపక పదార్థాలు, ఇటుకలు తయారు చేయాలి
- తవుడు నుంచి వంట నూనెలు, ఇతర నూనెలు తయారు చేయాలి
- బియ్యం నుంచి బీరు తయారు చేయాలి. అలాగే, బియ్యాన్ని వైన్ తయారీలోనూ ఉపయోగించాలి
ఒక్క చెరకు తోట చుట్టూ 25 రకాల పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చని నాయుడమ్మ ప్రతిపాదించారు. అన్ని రకాల పంట భూములు, పశువుల కొట్టాల వద్ద పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఉండాలని ఆయన సూచించారు. అసలు వ్యర్థం అనేదే లేకుండా అన్నింటినీ ఉపయోగించుకుని, సంపదగా మార్చడమే ధనిక దేశ లక్షణం అని నాయుడమ్మ అభిప్రాయపడ్డారు.
ఈ ఆలోచనలకు కార్యరూపం కల్పించేందుకు సీడీఏ ఆధ్వర్యంలో మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ గోపీచంద్ నేతృత్వంలో ఒక కమిటీని నాయుడమ్మ ఏర్పాటు చేయగా.. వరి పంట భూములకు సమీపంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే.. ఒక్క వరి నుంచే వంద ఉత్పత్తులు తయారు చేయొచ్చని ఈ కమిటీ అథ్యయనంలో తేలింది.
‘‘ఒకసారి నాయుడమ్మ గ్రామానికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో.. ‘వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం రావట్లేదు కదా బాబాయ్. వరి ఊక నుంచి సిమెంటు తయారు చేసే టెక్నాలజీ ఇస్తాను. మీరు పరిశ్రమ పెట్టుకోండి’ అన్నారు. ఇది 40 ఏళ్ల కిందటి మాట. డబ్బులు, ఇతరత్రా అన్నీ చూసుకుని మళ్లీ మీ దగ్గరికి వస్తాం అని ఆయనకు చెప్పాను కానీ, నేను మాత్రం దాని జోలికి పోలేదు. వాస్తవానికి ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసి, ఫార్ములాను తయారు చేస్తే తప్ప సీఎస్ఐఆర్ వాళ్లు బయటకు చెప్పరు. అలా తయారు చేసిన టెక్నాలజీని అప్పట్లో ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు అమ్మేవాళ్లు’’ అని యలవర్రు మునసబుగా పనిచేసిన యలవర్తి వెంకట సుబ్బారావు అన్నారు.

ఫొటో సోర్స్, Yalavarthy Pavan Kumar
55 దేశాలకు సేవలు
జాతీయ స్థాయిలో రాజకీయాలు మలుపుతిరగడం, తిరిగి ఇందిరాగాంధీ అధికారాన్ని చేపట్టడం, జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్ పదవిని చేపట్టాలని కోరడంతో నాయుడమ్మ 1981లో జేఎన్‌యూ వీసీ అయ్యారు. కానీ, అక్కడ కూడా ఆయన చేపట్టాలనుకున్న సంస్కరణలు చేపట్టలేకపోవడంతో ఆయన ఆ పదవికి కూడా రాజీనామా చేసి, మళ్లీ మద్రాసులో సీడీఏ బాధ్యతలు చేపట్టారు.
1984లో నాయుడమ్మ రిటైర్ అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు జాతీయ స్థాయిలోని పలు సంస్థలకు, ఐక్యరాజ్య సమితి సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు.
ఆ క్రమంలోనే కెనడాలోని ఐడీఆర్‌సీ సమావేశానికి హాజరై 1985 జూన్ 23న తిరిగి వస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందారు. విమానంలో పెట్టిన బాంబు పేలుడు వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కెనడాలోని సిక్కు తీవ్రవాదులు ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా ఈ బాంబు పెట్టారని విచారణలో తేల్చారు.
ఆకాశానికి 31 వేల అడుగుల ఎత్తులో పేలిపోయిన విమానం శకలాలు తప్ప సముద్రంలో ఇంకేమీ లభించలేదు. నాయుడమ్మ దుర్మరణం గురించి తెలుసుకున్న భార్య పవనాబాయి ఆత్మహత్యాయత్నం చేసి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. (మొదటి భార్య సీతాదేవి క్యాన్సర్‌తో మరణించారు. 1964లో పవనాబాయిని పెళ్లి చేసుకున్నారు)
సీఎల్ఆర్ఐకి అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడంలో నాయుడమ్మ పోషించిన పాత్ర గొప్పది. తోళ్ల పరిశ్రమలో కింది స్థాయి చర్మకారులు, ట్యానరీల సమస్యలను స్వయంగా గుర్తించి, వాటిని పరిష్కరించారు. భారతదేశంలో చర్మ పరిశ్రమకు, చర్మకారులకు నాయుడమ్మ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
''శాస్త్రవేత్తలు పరిశోధనలకు మాత్రమే పరిమితం అవుతామనడం, ఆ ఫలితాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వాలు, పరిశ్రమలే నిర్ణయించుకోవాలనడం తెలివైన శాస్త్రవేత్తల అసంబద్ధ ప్రేలాపన. శాస్త్రవేత్తలు ప్రజలతో సంబంధం లేకుండా ఆశ్రమవాసుల్లా జీవిస్తామంటే కుదరదు. వాళ్లు అలా ఏకాంతవాసం చేస్తూ.. తమ అద్భుత ఆవిష్కరణలకు ఆదరణ లభించడం లేదని ఫిర్యాదు చేయడం తగదు'' అని ఒక సందర్భంలో నాయుడమ్మ అన్నారు.
సీఎల్‌ఆర్ఐ డైరెక్టర్‌గా, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా ఇరవై ఏళ్లపాటు పనిచేసిన నాయుడమ్మ.. ఒక శాస్త్రవేత్తగా తన సలహాలు, సూచనలు, పనితీరు, పరిశోధనలతో భారతదేశానికే కాక 50కి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సేవలు అందించారు. ఐక్యరాజ్య సమితి విభాగాలైన ఎఫ్ఏఓ (తర్వాత యూఎన్‌డీపీ అయ్యింది), యూఎన్ఐడీఓ, యునెస్కో వంటి సంస్థలకు కూడా సీనియర్ సలహాదారుగా పనిచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శాస్త్ర, సాంకేతికతపై కమిటీ (కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ - సీఎస్‌టీడీ)కి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. కెనడాలోని ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ రీసెర్చి సెంటర్ (ఐడీఆర్‌సీ) గవర్నర్‌గా కూడా నియమితులయ్యారు.
నాయుడమ్మ సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 1971లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
నాయుడమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. అమెరికాలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎడ్విన్ రే థయిశ్ మార్గదర్శకత్వంలోనే నాయుడమ్మ పీహెచ్‌డీ చేశారు. ఆయన తనపై చూపిన అభిమానానికి గుర్తుగా తన మొదటి కొడుకు పేరు రతీశ్ అని పెట్టుకున్నారు నాయుడమ్మ. రతీశ్ తొలి సంతానం, కుమార్తె అంజన (నాయుడమ్మ తండ్రి పేరు అంజయ్య). తెలుగు సినీ హీరో నానిని ఆమె పెళ్లి చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- షరియా పాటించే ముస్లిం దేశాల్లోని మహిళలు ఆ చట్టం గురించి ఏమంటున్నారు?
- గూగుల్‌లో ఉద్యోగం వదిలేశాడు.. అమ్మతో కలిసి హోటల్ పెట్టాడు
- మన దేశానికి సెకండ్ హ్యాండ్ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్, ఇంతకీ సమస్య ఎక్కడుంది?
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)












