ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?

ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, NEHRU MEMORIAL MUSEUM AND LIBRARY

ఫొటో క్యాప్షన్, ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1960 సెప్టెంబర్ 7, ఇందిరాగాంధీ త్రివేండ్రం నుంచి దిల్లీ పాలం విమానాశ్రయానికి చేరుకోగానే, ఫిరోజ్ గాంధీకి మరోసారి గుండెపోటు వచ్చిందనే విషయం ఆమెకు తెలిసింది.

ఇందిర విమానాశ్రయం నుంచి నేరుగా వెల్లింగ్టన్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఫిరోజ్ గాంధీకి చికిత్స జరుగుతోంది.

అక్కడ అప్పటికే ఆయన సహాయకురాలు ఉషా భగత్ ఉన్నారు. ఆమె ఇందిరాగాంధీతో రాత్రంతా ఫిరోజ్ అప్పుడప్పుడూ స్పృహలోకి వచ్చేవారని, "ఇందూ ఎక్కడ" అని అడిగి మళ్లీ స్పృహ తప్పేవారని ఆమెకు చెప్పారు.

ఒక వారం ముందు నుంచీ ఫిరోజ్‌కు గుండె నొప్పి మొదలైంది. సెప్టెంబర్ 7న సాయంత్రం ఆయన తన డాక్టర్, స్నేహితుడు డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు తన ఆరోగ్య పరిస్థితి చెప్పడానికి ఫోన్ చేశారు. డాక్టర్ ఆయన్ను వెంటనే ఆస్పత్రికి రమ్మని సలహా ఇచ్చారు.

ఫిరోజ్, ఇందిరాగాంధీ వివాహానికి సంబంధించిన అరుదైన ఫొటో

ఫొటో సోర్స్, others

ఫొటో క్యాప్షన్, ఫిరోజ్, ఇందిరాగాంధీ వివాహానికి సంబంధించిన అరుదైన ఫొటో

ఫిరోజ్ తనే కారు నడుపుకుంటూ ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్ ఖోస్లా కాసేపట్లో ఆయన్ను చెక్ చేస్తారనగా స్పృహప్పి పడిపోయారు.

ఫిరోజ్ చనిపోయిన రోజు ఇందిరాగాందీ ఆయన పక్కనే ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం ఆయన కాసేపు కళ్లు తెరిచారు. ఇందిరాగాంధీ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె రాత్రంతా ఏం తినలేదు, పడుకోలేదు. ఫిరోజ్ ఆమెతో "నువ్వు కాస్త టిఫిన్ అయినా తిను" అని చెప్పారు. కానీ, ఇందిర వద్దని చెప్పారు. ఫిరోజ్‌కు మళ్లీ స్పృహతప్పింది. ఉదయం 7 గంటలా 45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

మరో నాలుగు రోజులు అయితే ఫిరోజ్ తన 48వ జన్మదినం జరుపుకునేవారు. ఫిరోజ్ పార్థివ దేహంతో ఇందిర వెల్లింగ్టన్ ఆస్పత్రి నుంచి తీన్ మూర్తి భవన్ చేరుకున్నారు. ఇందిరాగాంధీ జీవితచరిత్ర రాసిన కేథరీన్ ఫ్రాంక్ తన 'ఇందిర' పుస్తకంలో ఆ నాటి వివరాలు రాశారు.

"ఆ రోజు ఇందిరాగాంధీ తానే ఫిరోజ్ మృతదేహానికి స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని పట్టుబట్టారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని కూడా చెప్పారు" అని అన్నారు.

తీన్ మూర్తి భవన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీన్ మూర్తి భవన్

షాక్ అయిన నెహ్రూ

ఇందిరా గాంధీ తీన్ మూర్తీ భవన్ కింది అంతస్తులో ఉన్న మొత్తం ఫర్నీచర్ తీయించేశారు. కార్పెట్ల మీద తెల్ల దుప్పట్లు వేయించారు. ఆ తర్వాత ఫిరోజ్‌కు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చేవారి రాకతో అక్కడ జనం పెరగడం మొదలైంది. సంజయ్, రాజీవ్ గాంధీ తెల్ల దుప్పట్లపైనే కింద కూర్చున్నారు.

నెహ్రూ ఆ సమయంలో తన గదిలో ఒంటరిగా ఉండిపోయారని, ఆయన మాటిమాటికీ "ఫిరోజ్ అంత త్వరగా వెళ్లిపోతారని నేను అసలు ఊహించలేదు" అంటూ ఉండిపోయారని నయనతారా సహగల్ చెప్పారు.

అదే సమయంలో మేరీ సెటాన్ నెహ్రూ అతిథిగా ఉన్నారు. ఆమె కూడా తీన్ మూర్తీ భవన్‌లో ఉంటున్నారు.

"నెహ్రూ ముఖం పాలిపోయి ఉంది. ఫిరోజ్ మృతదేహాన్ని ఉంచిన చోటుకు ఆయన, సంజయ్ ఒకేసారి వచ్చారు" అని నెహ్రూ గురించి రాసిన ఒక పుస్తకంలో ఆమె రాశారు.

అక్కడ సర్వమత ప్రార్థనలు జరుగుతున్న సమయంలో అక్కడ ఎలా ఉందో బర్టిల్ ఫాక్ తన 'ఫిరోజ్-ద ఫర్గాటెన్ గాంధీ' పుస్తకంలో రాశారు.

అక్కడ, అంతమంది జనాన్ని చూసిన నెహ్రూ, "ఫిరోజ్‌కు ప్రజల్లో ఇంత ఆదరణ ఉందని నాకు తెలీదు" అన్నారు. ఇందిరా గాంధీ బయటకు గంభీరంగా ఉన్నట్టు కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, లోలోపల ఆమె చాలా కదిలిపోయి ఉన్నారు. ఆమె కళ్లనిండా నీళ్లున్నాయి.

రాజీవ్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీ

తలకొరివి పెట్టిన రాజీవ్ గాంధీ

తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 9న త్రివర్ణ పతాకం చుట్టిన ఫిరోజ్ పార్థివ దేహంతో ఇందిర, రాజీవ్, సంజయ్, ఫిరోజ్ గాంధీ సోదరి తహమీనా ఒక ట్రక్కులో బయల్దేరారు.

ట్రక్ మెల్లగా నిగమ్‌బోధ్ ఘాట్ వైపు వెళ్తోంది. దారిలో రెండు వైపులా ఉన్న వేలమంది ఫిరోజ్ గాంధీ చివరి చూపు కోసం ఎదురుచూస్తున్నారు.

16 ఏళ్ల రాజీవ్ గాంధీ ఫిరోజ్ చితికి నిప్పు పెట్టారు. ఆయన అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.

ఫిరోజ్‌కు తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినపుడే, "నా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగాలనే కోరుకుంటున్నా" అని తన స్నేహితులతో చెప్పారు.

ఎందుకంటే, ఆయనకు పారశీ సంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు జరగడం ఇష్టం లేదు. ఆ సంప్రదాయం ప్రకారం మృతదేహాలను రాబందులకు ఆహారంగా వదిలేస్తారు.

కానీ, "ఇందిరా గాంధీ ఫిరోజ్ మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లే ముందు పారశీ సంప్రదాయాల ప్రకారం కొన్ని విధులు జరిపించారు" అని కేథరీన్ ఫ్రాంక్ తన పుస్తకంలో చెప్పారు.

ది ఫర్గాటెన్ గాంధీ పుస్తకం

ఫొటో సోర్స్, BERTIL FALK/BBC

ఫొటో క్యాప్షన్, 'ది ఫర్గాటెన్ గాంధీ' పుస్తకం

త్రివేణీ సంగమంలో కలిసిన అస్థికలు

బర్టిల్ ఫ్రాంక్ తన ఫిరోజ్-ఫర్గాటెన్ గాంధీ పుస్తకంలో ఆయన అంత్యక్రియల సమయంలో ఏం జరిగిందో రాశారు.

"ఫిరోజ్ మృతదేహం ఎదుట పారశీ సంప్రదాయంలో గేహ్-సార్‌నూ చదివిన సమయంలో ఇందిరా గాంధీ, ఆమె ఇద్దరు కొడుకులు తప్ప మిగతా వారందరినీ అక్కడ నుంచి బయటికి పంపించేశారు. ఫిరోజ్ నోటిపై ఒక తెల్ల గుడ్డ ముక్క పెట్టి అహనావేతి మొదటి అధ్యాయం పూర్తిగా చదివించారు" అన్నారు.

రెండు రోజుల తర్వాత ఫిరోజ్ గాంధీ అస్థికలను ఒక రైల్లో అలహాబాద్ తీసుకెళ్లారు. అక్కడ వాటిలో కొంత భాగాన్ని త్రివేణీసంగమంలో కలిపారు. మిగతా వాటిని అలహాబాద్‌లోని పారశీ శ్మశానంలో ఖననం చేశారు.

ఆయన అస్థికల్లో కొన్నింటిని, సూరత్‌లో ఫిరోజ్ గాంధీ పూర్వీకులను ఖననం చేసిన శ్మశానంలో కూడా పూడ్చిపెట్టారని ఫిరోజ్ గాంధీ స్నేహితుడు ఆనంద్ మోహన్ చెప్పారు.

అలహాబాద్ త్రివేణీ సంగమంలో ఫిరోజ్ అస్థికలను కలుపుతున్న సమయంలో అక్కడ జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఉన్నారు.

పీడీ టండన్ తన 'ది నెహ్రూ యూ డోంట్ నో' పుస్తకంలో ఆ సమయంలో ఆయన పరిస్థితి గురించి రాశారు.

"ఆ సమయంలో నెహ్రూ నిర్వేదంగా ఉన్నారు. కాసేపు చేతులు జోడించిన ఆయన తర్వాత చేత్తో తన ముఖం కప్పుకున్నారు. ఆయన బహుశా కన్నీళ్లు పెడుతున్నారని మేం అనుకున్నాం. కానీ, తన చేతిని తీసినప్పుడు ఆయన కళ్లు పొడిగానే ఉండడం కనిపించింది" అని చెప్పారు.

ఫిరోజ్ అస్థికలను త్రివేణీ సంగమంలో కలిపిన రోజు, ఫిరోజ్ గాంధీ చదువుకున్న సీఏవీ కాలేజీలో ఒక సంతాప సభ నిర్వహించారు, ఒక రోజు సెలవు కూడా ప్రకటించారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

'ఐ డిడింట్ లైక్ ఫిరోజ్, బట్ ఐ లవ్ హిమ్'

ఫిరోజ్ అంత్యక్రియల్లో సాధారణంగా హిందూ వితంతువులు ధరించినట్లే ఇందిర తెల్ల చీర ధరించారు. భారత్‌లో తెల్ల రంగును విషాదాన్ని సూచించే రంగుగా భావిస్తారు. కానీ, ఫిరోజ్ చనిపోయిన చాలా ఏళ్ల వరకూ ఇందిరాగాంధీ తెల్ల వస్త్రాలే ధరించేవారు. తాను వితంతువు అని అలా చేయడం లేదన్న ఇందిర తెల్ల దుస్తులు ధరించడానికి ఒక కారణం చెప్పేవారు.

"ఫిరోజ్ వెళ్లిపోయినప్పుడే, నా జీవితంలోని రంగులన్నీ నన్ను వదిలి వెళ్లిపోయాయి" అన్నారు.

తర్వాత, "నన్ను తీవ్రంగా కుదిపేసిన మరణం నా భర్త ఫిరోజ్‌దే. నా కళ్ల ముందే మా తాత, తల్లి, తండ్రి చనిపోవడం నేను చూశాను. కానీ, ఫిరోజ్ చనిపోవడం ఎంత హఠాత్తుగా జరిగిందంటే, అది నన్ను ఘోరంగా కుదిపేసింది" అని డామ్ మోరెస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇందిరా గాంధీ చెప్పారు.

"నేను బహుశా ఫిరోజ్‌ను ఇష్టపడేదాన్ని కాదు, కానీ, నేను ఆయన్ను ప్రేమించేదాన్ని" అని ఇందిర మరో చోట రాశారు.

ఫిరోజ్ పట్ల ఇందిరా గాంధీ భావాలకు ఆ మాట అద్దంపడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)