అఫ్గానిస్తాన్ విషయంలో పాకిస్తాన్ మాట వినకపోతే, ప్రపంచం పెద్ద సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : మంత్రి ఫవాద్ చౌదరి

పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి

ఫొటో సోర్స్, Twitter/MoIB_Official

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి

అఫ్గానిస్తాన్ సమస్యపై పాకిస్తాన్ మాట వినకపోతే, ప్రపంచం పెద్ద సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి పేర్కొన్నారు. టీఆర్‌టీ వరల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌదరి ఈ విషయం చెప్పారు.

''ఇటీవల కాలంలో, పాకిస్తాన్ సలహాను ఎవరూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి సలహాలను పాటించి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది'' అని ఆయన అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి పాకిస్తాన్‌కు చాలా ఆందోళనకరంగా ఉందని మంత్రి అన్నారు.

''1988లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టినప్పుడు మేము సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది."

అఫ్గాన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రష్యా, చైనా, అమెరికా, పాకిస్తాన్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. టర్కీ, పాకిస్తాన్, ఇరాన్ ఇతర మధ్య ఆసియా దేశాలు ఉన్న ఇతర సమూహం కూడా చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ సమస్య పరిష్కారానికి ''క్రియాశీల పాత్ర'' పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అఫ్గానిస్తాన్ నుండి అమెరికా, నాటో దళాలు వెనుదిరిగిన వెంటనే పాకిస్తాన్ మరోసారి చిక్కుల్లో పడిందని ఫవాద్ చౌదరి అన్నారు.

పాకిస్తాన్‌లో ఇప్పటికే 35 లక్షల మంది శరణార్థులు నివసిస్తున్నందున ''ఎక్కువ మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించే సామర్థ్యం పాక్ ఆర్థిక వ్యవస్థకు లేదు'' అని ఆయన అన్నారు.

''ఇంతకు ముందు అఫ్గానిస్తాన్ ని వదలివేసినట్లు ప్రపంచం అదే తప్పు మళ్లీ చేస్తే, మా సరిహద్దులో తీవ్రవాద సంస్థల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. ఇది మాకు చాలా ఆందోళన కలిగించే విషయం'' అని ఆయన అన్నారు.

అమ్రుల్లా సాలేహ్

ఫొటో సోర్స్, Getty Images

'తాలిబాన్‌కు మేం లొంగేది లేదు.. పాకిస్తాన్‌ను బెదిరిస్తే.. తాలిబాన్‌ను దారిలో పెట్టొచ్చు' - అఫ్గాన్ మాజీ ప్రధాని అమ్రుల్లా సాలేహ్

లొంగుబాటుకు సంబంధించిన ఒప్పందానికి తావే లేదని అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి అమ్రుల్లా సాలేహ్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన జర్మన్ దినపత్రిక డెర్ స్పీజెల్‌కు ఒక కథనాన్ని రాశారు.

తాలిబాన్‌ పాలనను తాను గుర్తించబోనని, అలాగే లొంగిపోయే ప్రణాళికలేవీ లేవని చెప్పారు.

ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు రాజధాని కాబుల్ నగరాన్ని చేజిక్కించుకుని, దేశంలో తమ పాలన మొదలైందని ప్రకటించుకున్నారు.

అదే రోజు దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయారు. దీంతో దేశానికి తానే నాయకుడినని సాలేహ్ ప్రకటించారు.

ప్రస్తుతం పంజ్‌షీర్ లోయలో ఉన్నట్లు, తాలిబాన్లపై పోరాడుతున్నట్లు సాలేహ్ చెబుతున్నారు.

‘‘భౌగోళికంగా మేం ఏకాకులం అయినప్పటికీ.. రాజకీయంగా, నైతికంగా అఫ్గానిస్తాన్ మాతోనే ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

తాలిబాన్‌కు రాజకీయ పరిష్కారంపై ఎన్నడూ నమ్మకం లేదని ఆయన వెల్లడించారు.

ట్రంప్, బైడెన్ ఇద్దరి నాయకత్వాల్లోనూ అమెరికా ప్రభుత్వ అమాయకత్వాన్ని, అలసటను, దూరదృష్టితో చూడలేనితనాన్ని తాలిబాన్లు బాగా వాడుకుని అఫ్గాన్‌ను చేజిక్కించుకున్నారని వివరించారు.

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఒక పరిష్కారం ఉందని.. ‘‘నిర్దిష్టమైన ఆంక్షలు విధిస్తామని పాకిస్తాన్‌‌ను బెదిరించి, రాజకీయ పరిష్కారానికి డిమాండ్ చేయడం, పంజ్‌షీర్‌లోని జాతీయ ప్రతిఘటనను గుర్తించి, రాజకీయ మద్దతు ఇవ్వడం’’ ద్వారా తాలిబాన్‌ వ్యవహారం పరిష్కారం అవుతుందని తెలిపారు.

చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ

‘తాలిబాన్‌ను ప్రపంచం గుర్తించాలి.. గైడ్ చేయాలి’ - చైనా

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ పరిపాలనను ప్రపంచం గుర్తించాలని, పాలనలో మార్గనిర్దేశం చేయాలని చైనా సూచించింది.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ మధ్య అఫ్గానిస్తాన్ అంశంతో పాటు వాతావరణ మార్పులపైనా చర్చలు జరిగాయి.

ఈ ఫోన్ సంభాషణలో ముఖ్యమైన విషయాలు అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌ చేసింది. అందులో పేర్కొన్న సమాచారం ప్రకారం..

‘‘అఫ్గానిస్తాన్‌లో ప్రాథమికంగా ఎన్నో మార్పులు జరిగాయి. అందరూ తాలిబాన్‌తో సంబంధాలు ఏర్పరుచుకుని, దానికి మార్గనిర్దేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా, అంతర్జాతీయ సమాజాన్ని కలుపుకుని పోతూ అఫ్గానిస్తాన్‌కు అత్యవసరమైన ఆర్థిక, జీవన, మానవత్వంతో కూడిన సాయన్ని అందించాలి.

కొత్త అఫ్గాన్ రాజకీయ వ్యవస్థ ప్రభుత్వాన్ని స్ధిరంగా నడిపేందుకు, సామాజిక భద్రతకు, శాంతికి విఘాతం కలుగకుండా చూసేందుకు, కరెన్సీ విలువ, ద్రవ్యోల్బణం పడిపోకుండా కాపాడేందుకు, శాంతియుతంగా అఫ్గానిస్తాన్‌ను వేగంగా పునర్నిర్మించేందుకు అమెరికా సాయం చేయాలి.

అఫ్గాన్ గడ్డపై ఉగ్రవాద శక్తులను అంతమొందించడం సాధ్యపడలేదని యుద్ధంలో మరోసారి నిరూపితమైంది. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ వల్ల అఫ్గానిస్తాన్‌లోని ఉగ్రమూకలకు తిరిగి బలపడే అవకాశం కలిగింది.

అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వాన్ని, స్వతంత్రాన్ని గౌరవిస్తూ ఉగ్రవాదం, హింసపై పోరాడేందుకు అమెరికా అండగా నిలవాలి. ద్వంద్వ విధానాలు లేదా ‘ఎంపిక చేసిన ఉగ్రవాదం’పై మాత్రమే పోరాటం తగదు.

యుద్ధం కన్నా చర్చలే మిన్న, సమస్య కన్నా సహకరమే మేలు.

చైనా పట్ల అమెరికా వైఖరిని బట్టే ఇరువురి మధ్య సంబంధాలు ఎలా ఉండాలన్న దానిపై చైనా ఓ నిర్ణయం తీసుకుంటుంది’’ అని చైనా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)