అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయం దగ్గర పేలుడుపై చైనా ఏమందంటే..

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images

గురువారం కాబుల్ విమానాశ్రయం బయట జరిగిన పేలుళ్లపై చైనా స్పందించింది. ఆ ఘటనలను తీవ్రంగా ఖండించింది.

ఈ పేలుళ్లు అఫ్గానిస్తాన్‌లోని భద్రతా ఎలా ఉందో చెబుతున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చావో లిజియన్ అన్నారు.

చైనా ఈ పేలుళ్ల గురించి ఏం చెబుతుంది, ఇందులో చైనా పౌరులకు ఏదైనా నష్టం జరిగిందా అని ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు చావో సమాధానం ఇచ్చారు.

"కాబుల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగిన పేలుళ్లలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంపై చైనా దిగ్భ్రాంతికి గురైంది. దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. ఈ పేలుళ్లు అఫ్గానిస్తాన్‌లో భద్రతా స్థితిని స్పష్టం చేస్తున్నాయి. అక్కడి పరిస్థితులు ఇప్పటికీ చాలా కఠినంగా, తీవ్రంగా ఉన్నాయి" అన్నారు.

"అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేలా, దేశంలో అఫ్గాన్ ప్రజలు, విదేశీ పౌరులకు తగిన భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకుంటారని మేం ఆశిస్తున్నాం" అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా దళాలు

ఫొటో సోర్స్, Reuters

చైనా ఎంబసీలో ఉన్న సిబ్బంది

అఫ్గానిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయానికి ఏదైనా నష్టం జరిగినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన చెప్పారు.

అక్కడ మా రాయబార కార్యాలయంలో తక్కువ సంఖ్యలో చైనా పౌరులు ఉన్నారు. చర్చలు జరిపేందుకు, అవసరమైన సాయం అందించడానికి అక్కడే ఉండాలని వారు నిర్ణయించుకున్నారని చావో లిజియన్ తెలిపారు.

అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదం ముప్పును చైనా ఎలా చూస్తోందని ఆ తర్వాత విదేశాంగ శాఖ ప్రతినిధిని జర్నలిస్టులు అడిగారు.

"చైనా అన్నిరకాల తీవ్రవాదాన్ని ఖండిస్తోంది. అఫ్గానిస్తాన్ మళ్లీ ఉగ్రవాదులకు అడ్డాగా మారకుండా అడ్డుకోడానికి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన సమాధానం ఇచ్చారు.

అఫ్గానిస్తాన్‌లో గత రెండు దశాబ్దాలుగా కొన్ని తీవ్రవాద గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ శాంతికి, భద్రతకు ముప్పుగా మారాయని మేం గుర్తించాం అని ఆయన చెప్పారు.

ఈటీఐఎం(తూర్పు తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్) చైనాకు, చైనా పౌరులకు ప్రమాదంగా మారింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఈ సంస్థను అంతర్జాతీయ తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.

మరోవైపు, చైనాకు నష్టం కలిగించేలా అఫ్గానిస్తాన్‌ భూభాగాన్ని ఉపయోగించనివ్వబోమని తాలిబాన్ చీఫ్ ఇప్పటికే ఆ దేశానికి స్పష్టం చేశారు.

అమెరికా డ్రోన్ దాడి

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్-కె మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి

తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది.

ఈ డ్రోన్ దాడిలో ఒక ఐసిస్ మిలిటెంట్ చనిపోయాడని అమెరికా సైనికాధికారి తెలిపారు.

నంగహార్ ప్రావిన్సులో ఐసిస్-కె గ్రూపునకు చెందిన ఒక ప్లానర్‌ను అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌లో లక్ష్యంగా చేసుకున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రోన్ దాడిలో ఐఎస్ మిలిటెంట్ చనిపోయినట్లు తెలిసిందని, ఇందులో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా చెప్పింది.

కాబుల్ విమానాశ్రయం దగ్గర గురువారం దాడులు తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్(ఐసిస్-కె) చెప్పింది.

ఐసిస్-కె ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు సహా మొత్తం 170 మంది చనిపోయారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: ఐసిస్-కె ఏంటి? ఇది ఎందుకంత హింసాత్మకమైంది?

ప్రతీకారం తీర్చుకుంటాం-జో బైడెన్ హెచ్చరిక

బాంబు దాడులు చేసినవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం హెచ్చరించారు.

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని జో బైడెన్ చెప్పారు.

"ఈ మిషన్‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు.

అలాగే కాబుల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, EPA

బాంబు పేలుళ్లకు బాధ్యత వహించిన ఐసిస్-కెపై ఎలా దాడి చేయాలో ప్రణాళిక రూపొందించాలని తాను పెంటగాన్‌ను ఆదేశించానని బైడెన్ చెప్పారు.

బైడెన్ అలా చెప్పిన మరుసటి రోజే అమెరికా డ్రోన్ దాడి చేసింది.

గురువారం నాడు (ఆగస్ట్ 26) స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు కాబుల్ ఎయిర్ పోర్ట్ దగ్గర దాడి జరిగింది.

ముందుగా ఎయిర్‌పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది.

బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్‌లో పరిశీలిస్తుంటారు.

"మేము క్షమించం. మేము మర్చిపోం. మేం వారిని వదిలిపెట్టం. వెంటాడి వేటాడుతాం. పేలుళ్లకు వాళ్లు మూల్యం చెల్లించుకునేలా చేస్తాం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

ఐసిస్- కే నుంచి ముప్పు ఎక్కువగా ఉందని, మళ్లీ దాడులు జరగకుండా ఎలా ఆపాలనే దానిపై తాలిబాన్లతో కలిసి పనిచేస్తున్నామని జనరల్ ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. తాలిబాన్లు ఇప్పటికే చాలా దాడులను నిలువరించారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)