ఆంధ్రాలో లేటరైట్‌ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?

లేటరైట్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ఎన్జీటీ బృందం
ఫొటో క్యాప్షన్, 'లేటరైట్, బాక్సైట్ రెండింటి ముడి ధాతువు చూడ్డానికి ఒకేలా కనిపిస్తుంది.. కాబట్టి లేటరైట్ తవ్వకాలనే అనుమతులు తీసుకుని, బాక్సైట్‌ను తవ్వినా ఎవరికి అనుమానం రాదు'
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ ఏజెన్సీలో అనుమతులు లేని చోట లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారని, పర్యావరణానికి హాని చేస్తున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదులు అందాయి.

దాంతో లేటరైట్ తవ్వకాలు జరుగుతున్న నాతవరం మండలం బమిడికలొద్ది గ్రామంలో ఎన్జీటీ బృందం బుధవారం పర్యటించింది.

ఈ బృందంలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎల్లమురుగన్‌, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, డీఎఫ్‌వో అనంతశంకర్‌, గనుల శాఖ డీడీ, కాలుష్య నియంత్రణ మండలి విశాఖ ఈఈ ఉన్నారు.

స్థానిక ప్రజా, గిరిజన సంఘాలు లేటరైట్ తవ్వకాలు ఆపాలంటూ ఎన్జీటీ బృందానికి వినతి పత్రాలు సమర్పించాయి.

"బమిడికలొద్దిలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు అందిన ఫిర్యాదు మేరకు ఇక్కడికి వచ్చాం. సరిహద్దులో నిర్మించిన రోడ్డు, నరికేసిన చెట్లను పరిశీలించాం. అలాగే మైనింగ్ జరిగిన, జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించాం. కేవలం మైనింగే కాకుండా, పర్యావరణ, అటవీ చట్టాల ఉల్లంఘన తదితర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. దీనిపై నివేదిక తయారు చేసి, ప్రభుత్వానికి సమర్పిస్తాం" అని ఎన్జీటీ బృంద సభ్యులు, విశాఖ జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున తెలిపారు.

ఖనిజ తవ్వకాలు

విశాఖ, తూర్పు గోదావరి సరిహద్దులో...

విశాఖ, తూర్పు గోదావరి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ ఖనిజం విస్తారంగా ఉంది. గతంలో దీని తవ్వకాల కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.

కానీ, గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బాక్సైట్ తవ్వకాల నిమిత్తం కంపెనీలకు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి.

అయినప్పటికీ బాక్సైట్ తవ్వకాల కోసం మాత్రం తెరవెనుక ప్రయత్నాలు ఆగడం లేదని గిరిజన సంఘం నాయకులు అంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు లేటరైట్ తవ్వకాలు తెరమీదకు వచ్చాయిని చెప్తున్నారు.

"జిల్లాలోని మాకవరపాలెంలో యూఏఈకి చెందిన అన్ రాక్ కంపెనీ అల్యూమినియం శుద్ధి కర్మాగారాన్ని నిర్మించింది. దీనికి బాక్సైటే ముడిఖనిజం. బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ఆ సమయంలోనే ఈ కంపెనీ రూ. 720 కోట్లతో ఈ ఫ్యాక్టరీని నిర్మించింది.

వైఎస్‌ఆర్ ప్రభుత్వం తవ్వకాలు జరుపుకునేందుకు కోసం ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చిన అనుమతులను మాత్రమే రద్దు చేసింది. బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. అంటే బాక్సైట్ తవ్వకాల రద్దు అనేది పూర్తిగా జరగలేదు.

దీంతో విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతంలో కొంతకాలంగా లేటరైట్, బాక్సైట్ తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. వీటిని తరలించడానికి ప్రత్యేకంగా అటవీ ప్రాంతంలో రోడ్లు కూడా వేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఇవేమి తెలియనట్టే ఉంటున్నారు. ఇవాళ ఎన్జీటీ బృందం రావడంతో నిజాలు బయటకు వస్తాయనే అనుకున్నాం. కానీ వాళ్లు కూడా గిరిజనులను పట్టించుకోకుండా.. వచ్చి, వెళ్లారంతే" అని నాతవరం గిరిజన సంఘం నాయకులు కిల్లో రాజు బీబీసీతో చెప్పారు.

లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు.. నిజమేనా?

లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు, గిరిజన సంఘాలు పదేపదే ఆరోపిస్తున్నాయి.

సిమెంట్ పరిశ్రమలో ఉపయోగపడే లేటరైట్ కోసం విశాఖ ఏజెన్సీలో నాతవరం మండలంలోని సుందరకోట, అసనగిరి, బమిడికలొద్ది గ్రామాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.

అయితే, ఇక్కడ లేటరైట్‌తో పాటు బాక్సైట్ కూడా తవ్వేసే అవకాశం ఉందా అనే విషయమై ఏయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ధనుంజయ్‌తో బీబీసీ మాట్లాడింది.

"కేంద్ర సర్వే, అటవీ, గనుల శాఖలు చేసిన సర్వేలలో విశాఖ, తూర్పు గోదావరి మీదుగా విస్తరించి ఉన్న తూర్పు కనుమల్లో అనేక ఖనిజాలు ఉన్నాయని తేలింది. ఏ ఖనిజానికైనా అందులో ఉన్న ప్రధాన థాతువు బట్టి దాన్ని లక్షణాలు నిర్థారించబడతాయి. లేటరైట్, బాక్సైట్లను నిర్ధారించేది అందులో ఉండే అల్యూమినా థాతువే. ఎక్కువ మోతాదులో అల్యూమినియం ఉంటే దానిని బాక్సైట్ ఖనిజంగా, తక్కువ మోతాదులో ఉంటే లేటరైట్‌గా ప్రాథమికంగా అంచనా వేస్తారు. తవ్విన తర్వాత, ఇతర పరీక్షలు ద్వారా అందులో అల్యూమినియం శాతాన్ని లెక్కించి, అప్పుడు దాన్ని బాక్సైట్‌గానో, లేటరైట్‌గానో నిర్థారిస్తారు. కాబట్టి లేటరైట్ తవ్వకాలనే అనుమతులు తీసుకుని, బాక్సైట్‌ను తవ్వినా ఎవరికి అనుమానం రాదు" అని ప్రొఫెసర్ థనుంజయ్ వివరించారు.

ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన రోడ్డు
ఫొటో క్యాప్షన్, ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన రోడ్డు

‘‘ఊరికి రోడ్డేశారు.. జేబులో డబ్బులు కూడా పెట్టారు’’

విశాఖ జిల్లా నాతవరం మండలంలోని బమిడికలుద్ది నుంచి తూర్పు గోదారి జిల్లాలోని రౌతులపూడి వరకు ఉన్న ఏజెన్నీ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు వేశారు. అయితే ఆ రోడ్డు ఎవరు వేశారో, ఎందుకు వేశారో స్థానిక గిరిజనులకు తెలియలేదు.

"మా ఊరికి మనుషులే రారు. అలాంటిది పెద్ద పెద్ద మిషన్లు తెచ్చి అందమైన రోడ్లు వేశారు. చెట్లు చాలా నరికేశారు. అడవి పోయినా, రహదారి వచ్చిందని సంతోషించాం. రోడ్లు వేసినప్పుడు ఎవరో మా గ్రామాల్లోని ఇళ్లకు వచ్చి కొందరికి డబ్బులు, ఇంకొందరికి బియ్యం, పప్పులు ఇచ్చారు. కుర్రోళ్లు కొందరికి ఫోన్లు కూడా ఇచ్చారు. అయితే ఆ రోడ్లు మా గ్రామంలోని లేటరైట్ తవ్వి తీసుకుపోడానికి అని మాకు తెలియలేదు. మాకు రోడ్డు వద్దు, డబ్బులు వద్దు. మా అడవిని అలాగే ఉంచండి" అని 55 ఏళ్ల గోవింద్ చెప్పారు. బమిడికలుద్దిలో రోడ్డు వేసినప్పుడు గోవిందుకు మూడు వేలు ఇచ్చారు.

తవ్వకాలు జరుపుతున్నది ఎవరు?

విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీ సరిహద్దులో ఉన్న సరుగుడు పంచాయితీలో లేటరైట్ ఖనిజం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని 2010లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 2004లో ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ చేసిన సర్వేలలో నిర్థారించారు.

ప్రస్తుతం నాతవరం మండలంలో ఉన్న 16 గ్రామాల్లో లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానిక గిరిజనులు తెలిపారు.

"2009లో నాతవరం మండలానికి చెందిన జె. లక్ష్మణరావు అనే గిరిజనుడు లేటరైట్ తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతి కావాలంటూ గనుల శాఖకు దరఖాస్తు చేశారు. 2011లో పబ్లిక్ హియరింగ్ తర్వాత అనుమతి కూడా లభించింది. కొంతకాలం తవ్వకాలు జరిపిన తర్వాత ప్రభుత్వం మారింది. ఆ తర్వాత సింగంభవాని అనే గిరిజన మహిళకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. వైసీపీ సర్కార్ రావడంతో మళ్లీ లక్ష్మణరావు పేరుతోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ లక్ష్మణరావు ఒక ఆటోడ్రైవర్.

ఆయనను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి చెందిన పెద్దలే ఈ తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్నది లేటరైటో, బాక్సైటో తెలియదు కానీ, నాతవరం నుంచి తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడికి రోడ్డు వేసి మరి ఖనిజాన్ని తరలిస్తున్నారు. ఈ రోడ్డు వేయడం, లేటరైట్ తవ్వకాలు గిరిజన చట్టాలను ఉల్లంఘించి జరుగుతున్నాయని నాతవరం మండలం గునుపూడికి చెందిన మరో గిరిజనుడు కొండ్రు మరిడయ్య ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా రెండు రాజకీయ పక్షాలు ఆడుతున్న డ్రామా" అని విశాఖ సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం బీబీసీతో అన్నారు.

ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన రోడ్డు

అనుమతులెన్ని? తవ్విందెంత?

విశాఖ జిల్లాలో రోడ్డు మెటల్‌, గ్రావెల్‌, వైట్‌ క్లే, లేటరైట్‌ తవ్వకాలకు అనుమతులున్నాయి. నాతవరం మండలంలో జరుగుతున్న లేటరైట్‌ త్వవకాలకు సంబంధించిన క్వారీలు అనకాపల్లి భూగర్భ గనులశాఖ పరిధిలోకి వస్తాయి.

ఇక్కడ గనులు, రెవెన్యూ, అటవీ అధికారులు అంతా కుమ్మక్కై లేటరైట్ అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

"విశాఖ జిల్లాలో ఆరు లేటరైట్‌ లీజులు ఉన్నాయి. వీటిలో ఐదు పని చేయడం లేదు. హైకోర్టు తీర్పు మేరకు ఒకేచోట మాత్రమే మైనింగ్‌ నడుస్తోంది. అది కూడా 5 వేల టన్నులకే అనుమతి ఉంది. 2013 నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల టన్నుల లేటరైట్ అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించాం. దీనిపై తూర్పు గోదావరి, విశాఖపట్నంలలో విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే లేటరైట్ పేరుతో బాక్సైట్‌ తవ్వరా? అని కూడా విచారిస్తున్నాం. గతంలో జరిగిన అక్రమ తవ్వకాలపై విచారణ చేపడుతున్నాం. దీనిలో గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉంది. వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం" అని రాష్ట్ర గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

కాగా, ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న ఖనిజాన్ని అంతా సిమెంట్ కంపెనీలకు మాత్రమే తరలిస్తుండటంతో దీనిని లేటరైట్‌గానే పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు.

మైనింగ్ చుట్టూ రాజకీయం

లేటరైట్ ముసుగులో బాక్సైట్ తరలిస్తున్నారని ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్జీటీకి ఫిర్యాదులు అందడంతో...తవ్వకాలు ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసినా తవ్వకాలు సాగుతున్నాయి.

ఇదంతా ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే జరుగుతుండటంతో అధికారులు కూడా చూసీ చూడనట్లే వదిలేస్తున్నారని టీడీపీ అంటోంది.

అయితే, మైనింగ్ దొంగలంటే టీడీపీయేనని వైసీపీ ఎదురుదాడికి దిగింది. దీంతో మన్యంలో మైనింగ్ సమస్య రాజకీయ రంగు పులుపుకుంది.

"ఈ అక్రమ తవ్వకాల వెనుక గనుల శాఖ సహకారం ఉంది. అలాగే రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. ఒక్క బమిడికలొద్దు గ్రామంలోనే రెండు వందల హెక్టార్లకుపైగా లేటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిలో తవ్వకాలకు అనుమతులు ఉన్న ప్రాంతం చాలా పరిమితం. చీకటిపడటంతోనే తవ్వకాలు ప్రారంభించి, వెలుతురు వచ్చే వరకు మైనింగ్ చేస్తూ, వందలాది టిప్పర్లలో లేటరైట్, బాక్సైట్‌లను తరలించారు. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అడ్డగోలుగా నిర్మించిన రోడ్డు మీద తరలిస్తున్నారు. ఇదేమి పట్టించుకోకుండా అటవీ, గనుల శాఖలు చోద్యం చూస్తున్నాయి. మా పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే మాత్రం అరెస్టులు చేశారు" అని టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

"గతంలో లేటరైట్ ముసుగులో టీడీపీ పెద్దలు బాక్సైట్ తవ్వి ఎగుమతులు చేశారు. ఇందులో ఒక మాజీ అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు కూడా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం మన్యంలో మైనింగ్‌కు కొత్తగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. హైకోర్టు అనుమతితోనే లేటరైట్ మైనింగ్ జరుగుతోంది. మా పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేశాం. బాక్సైట్‌ తవ్వకాలకు మా ప్రభుత్వం వ్యతిరేకం. అయినా బాక్సైట్ తవ్వకాలంటూ బూటకపు ప్రచారాలు చేస్తున్నారు" అని అనకాపల్లి ఎమ్మేల్యే గుడివాడ గుర్నాధరావు అన్నారు.

ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన రోడ్డు

ఈ అనుమానాలు రావడానికి కారణాలేంటి?

ఫలానా ప్రాంతంలో ఫలానా ఖనిజం ఉందని గుర్తించేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గనుల శాఖ.

అలా గుర్తించిన ఖనిజాల వివరాలను ఆయా సంస్థలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తాయి. ప్రభుత్వం ఆ వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతుంది.

తవ్వకాలు చేయాలనుకునే వారు ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసుకుంటారు.

అలా తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల ప్రకారం ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. అయితే, గిరిజన ప్రాంతాల్లో మాత్రం గిరిజనులకు మాత్రమే అనుమతులు ఇస్తుంది. మిగతా ప్రాంతాల్లోని ఖనిజాలను తవ్వుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

బాక్సైట్‌ ఖనిజాన్ని తవ్వేందుకు అనుమతి ఇవ్వాలన్నా, ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు.

లేటరైట్‌ ఖనిజాన్ని తవ్వేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది.

లేటరైట్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, బాక్సైట్ తవ్వుకుంటున్నారనేది చాలా కాలంగా వినిపిస్తున్న ఆరోపణలు.

లేటరైట్, బాక్సైట్ ఖనిజ ముడి పదార్థాలు లేదా రాళ్లు చూడటానికి ఒకేలా ఉంటాయి. ఈ రాయి (ధాతువు)లో ఎక్కువగా అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటే దానిని బాక్సైట్ అంటారు.

అయితే, స్థానికంగా ఖనిజాన్ని తవ్విన తర్వాత దానిని ఫ్యాక్టరీలకు తరలించే వరకు ప్రభుత్వ పరంగా.. తవ్విన ఖనిజం ఏంటి? అని తనిఖీ చేసే వ్యవస్థ ఏదీ లేదు. అంటే తవ్విన ముడి పదార్థం ఒకేలా కనిపిస్తుంది కాబట్టి శాస్త్రీయంగా పరిశీలించకుండా.. చూడగానే ఇది లేటరైటా, బాక్సైటా అనేది చెప్పలేం.

విశాఖ, తూర్పు గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో లేటరైట్ తవ్వకాలు చాలా ఏళ్లుగా నడుస్తున్నాయి.

కానీ, గత మూడేళ్లుగా లేటరైట్ తవ్వకాలు ఉధృతం కావడం, మొత్తం అనుమతి ఐదు వేల టన్నులకు అయితే, ప్రతి రోజూ కొన్ని వేల టన్నుల ఖనిజం తరలిపోతోందని భావించడం, ఎవరి అనుమతులు లేకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు రోడ్లు వేయడం, గత ఏడాది కాలంగా ఈ రోడ్లను భారీగా విస్తరించడం.. అందులోనూ రోడ్లు వేసిన వాళ్లే గిరిజనులకు డబ్బులు, మొబైల్ ఫోన్లు వంటి తాయిలాలు పంచడంతో లేటరైట్ పేరు చెప్పి బాక్సైట్ తవ్వుతున్నారనే అనుమానాలు బలపడ్డాయి.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన పెద్దల బినామీలకే అనుమతులు లభిస్తున్నాయని, కాబట్టి రాష్ట్ర గనుల శాఖ తనిఖీలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇంత వరకూ లేటరైట్ పేరుతో తవ్వకాలు జరిపి, బాక్సైట్ తరలిస్తున్నారని ఎవ్వరూ శాస్త్రీయంగా రుజువు చేయలేదు.

లేటరైట్, బాక్సైట్ ముడి ధాతువు చూడ్డానికి ఒకేలా కనిపిస్తుంది కాబట్టి లేటరైట్ తవ్వకాలనే అనుమతులు తీసుకుని, బాక్సైట్‌ను తవ్వినా ఎవరికి అనుమానం రాదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లేటరేట్‌ను ప్రధానంగా సిమెంటు తయారీకి ఉపయోగిస్తారు.. బాక్సైట్‌తో అల్యూమినియం తయారు చేస్తారు. కాబట్టి బాక్సైట్‌కు డిమాండ్, రేటు ఎక్కువ

లేటరైట్ పేరుతో 38 లక్షల మెట్రిక్ టన్నుల బాక్సైట్ తవ్వారా?

ఆండ్రూ మినరల్స్ అనే ఒక కంపెనీకి 2013లో తూర్పు గోదావరి జిల్లాలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. ఆ కంపెనీ చేపట్టిన ఖనిజ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు.

బుధవారం వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ.. లేటరైట్ తవ్వకాలకు అనుమతులు పొందిన ఆండ్రూ మినరల్స్ కంపెనీ ఒడిసాలోని వేదాంత అల్యూమినియం కంపెనీకి 32 లక్షల మెట్రిక్ టన్నుల ముడి ఖనిజాన్ని సరఫరా చేసిందని, అల్యూమినియం కంపెనీకి సరఫరా చేసిందంటే అది బాక్సైట్ అయి ఉంటుందని, దీనిపై విచారణ చేపడతామని వెల్లడించారు.

అలాగే, 4.6 లక్షల మెట్రిక్ టన్నులను చైనాకు ఎగుమతి చేశారని, దీనిపైనా విచారణ చేస్తామన్నారు.

కాగా, లెక్కల్లో చూపించని మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజ తవ్వకాలు జరిగినట్లు కూడా విజిలెన్స్ తనిఖీల్లో తేలిందని వెల్లడించారు.

తవ్వకాలకు అనుమతులు ఇచ్చేప్పుడు రసాయన విశ్లేషణలు చేసే అనుమతులు ఇస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)