ఆంధ్రప్రదేశ్: న్యాయ రాజధానిపై అయోమయం - కర్నూలులో కొత్త కార్యాలయాలు, అమరావతి హైకోర్టు అదనపు భవనాల నిర్మాణాలకు టెండర్లు

- రచయిత, శంకర్ వి
- హోదా, బీబీసీ కోసం
ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబరులో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తామని చట్టం చేసింది.
దానికి అనుగుణంగా కర్నూలులో ఏపీ హైకోర్టుతో పాటుగా వివిధ న్యాయ సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఏపీ లోకాయుక్త కార్యాలయం, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాలను త్వరలో కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నట్టు ఇటీవల క్యాబినెట్ సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది.
అదే సమయంలో అమరావతిలోని ఏపీ హైకోర్టు భవనాలను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు ప్రాంగణంలోనే కొత్త భవనాల నిర్మాణాలకు టెండర్లు కూడా పిలిచింది.
ఓవైపు కర్నూలు న్యాయరాజధాని అంటూ, మరోవైపు అమరావతిలో కొత్త భవనాల నిర్మాణం దేనికి సంకేతం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కర్నూలులో కార్యాలయాల ఏర్పాటు సన్నాహాలు
అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ, ఉత్తరాంధ్రలోని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ, రాయలసీమలోని కర్నూలుని న్యాయరాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం చట్టం చేసింది.
శాసనసభ, శాసనమండలిలో అనేక మలుపులు తిరిగినా చివరకు 2020 జూలైలో ఆమోదం పొందింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆమోదించిన పాలన వికేంద్రీకరణ చట్టం , సీఆర్డీయే రద్దు చట్టాలను పలువురు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు.
ప్రస్తుతం కోర్టు స్టే విధించడంతో ఏడాదిన్నరగా పాలనా వ్యవహారాలు అమరావతి నుంచే కొనసాగుతున్నాయి. అదే సమయంలో రేపోమాపో రాజధాని తరలింపు అంటూ నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఆగస్ట్ 6న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏపీ లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
న్యాయరాజధానిలో భాగంగా ఏపీ హైకోర్టుతో పాటుగా వివిధ న్యాయ సంబంధిత కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నట్టుగా క్యాబినెట్ భేటీ అనంతరం సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.
భవనాల పరిశీలన పూర్తి
లోకాయక్త కార్యాలయంతో పాటుగా మానవ హక్కుల కమిషన్ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాల పరిశీలన పూర్తయింది.
ఈ నెల 7న లోకాయుక్త పి.లక్ష్మణరెడ్డి కర్నూలులో పర్యటించారు. పలు భవనాలను పరిశీలించారు. కర్నూల్ - హైదరాబాద్ జాతీయ రహదారిని అనుకుని సంతోష్ నగర్ లో ఉన్న ఓ ప్రైవేటు భవనంతో పాటుగా బళ్లారి చౌరస్తాలోని రాగమయూరి ప్రైడ్ భవనంలోని మొదటి, రెండు అంతస్తులను పరిశీలించి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. రాగమయూరి భవనం ఖరారు చేసినట్టు ప్రచారం సాగుతోంది.
అంతకుముందు జులై 16న మానవహక్కుల కమిషన్ సభ్యులు కర్నూలులో పర్యటించారు.
జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం. నాన్ జ్యుడిషియల్ సభ్యుడు శ్రీనివాసరావు కలిసి కర్నూలులో రెండు భవనాలను పరిశీలించారు.
హంద్రీనీవా సుజల స్రవంతి సీఈ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న నూతన భవనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
అప్పటి జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో కలిసి కమిషన్ సభ్యులు కార్యాలయ భవనాలకు స్థలాలు పరిశీలించారు.వాటితో పాటుగా త్వరలో రాష్ట్ర మహిళా కమిషన్.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ కోసం కూడా భవనాలను సిద్ధం చేయబోతున్నారు.
దానికి అనుగుణంగా కొన్ని భవనాలను ఎంపిక చేశామని కర్నూలు డీఆర్వో బీబీసీకి తెలిపారు. ఆయా కమిషన్లు పరిశీలించిన తర్వాత భవనాల ఏర్పాటు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మరికొన్ని ట్రైబ్యునళ్లు కూడా కర్నూలు తరలించే దిశలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

అమరావతిలో హైకోర్టు భవనం విస్తరణ
ఇప్పటికే అమరావతిలో నిర్మాణ దశల్లో వివిధ భవనాలు వృథాగా కనిపిస్తున్నాయి.
వివిధ దశల్లో పనులు ఆగిపోవడంతో వాటి పరిస్థితి ఏమిటన్నది స్పష్టత కనిపించడం లేదు.
నివాస భవనాలతో పాటుగా కార్యాలయాల నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. దాదాపు రెండున్నరేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
కర్నూలు, విశాఖలో కొత్త రాజధానుల ఏర్పాటు విషయమై వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు ఏపీ హైకోర్టు నిర్మాణం కోసం అమరావతి కేంద్రంగా కొత్తగా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దానికనుగుణంగా అమరావతి మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు భవనం ప్రాంగణంలో రూ. 29.40 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తోంది.
14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల బిల్ట్ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది.
ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయబోతున్నారు.
ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ కం రివర్స్ ఆక్షన్ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు వేయాలని ఆహ్వానించారు. ఆగష్టు 16నుంచి వచ్చే నెల 1లోపు దానికి గడువుగా నిర్ణయించారు.
‘రాజధాని మార్పు ఎప్పుడైనా ఉండొచ్చు’
పాలన వికేంద్రీకరణ చట్టాలను కచ్చితంగా అమలు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. త్వరలోనే రాజధాని తరలింపు ఉంటుందని ఆయన బీబీసీతో అన్నారు.
అమరావతిలో కొత్త భవనాల నిర్మాణ టెండర్ల గురించి వివరిస్తూ, "అమరావతితో పాటుగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. పరిపాలన రాజధానిగా విశాఖతో పాటు న్యాయరాజధానిగా కర్నూలును కూడా అభివృద్ధి చేస్తాం. దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే చట్టం చేసినందున ఎప్పుడయినా రాజధాని మార్పు ఉంటుంది" అని అన్నారు.
ప్రస్తుతం ఏపీ హైకోర్టు భవనం కార్యకలాపాలకు అనువుగా లేదు. చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణలోపాల మూలంగా గతంలో వర్షపునీరు కూడా చేరింది అలాంటి పరిస్థితుల్లో కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల ఛాంబర్ల విస్తరణ అనివార్యం అవుతోంది. దానికోసమే కొత్త భవనం నిర్మాణం చేయాలని టెండర్లు పిలిచాం. అమరావతి భవనాలను ఎలా వినియోగిస్తామనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.
కర్నూలు అభివృద్ధి
ఆంధ్రుల తొలి రాజధానిగా ఉన్న కర్నూలుని న్యాయరాజధానిగా చేయాలని సంకల్పించడం ఆహ్వానించదగ్గ విషయమంటూ పలువురు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలుతో పాటుగా రాయలసీమ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా హైకోర్టు సహా వివిధ కార్యాలయాలు వేగంగా తరలించాలని ఆమె కోరుతున్నారు.
కర్నూలు న్యాయరాజధాని ఏర్పాటు ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పటికే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ కార్యాలయాల ఏర్పాటు ఖరారయ్యింది. వాటిని వేగంగా తరలించాలి. ఇక విజిలెన్స్ సహా వివిధ ట్రైబ్యూనళ్లు కూడా కర్నూలు కేంద్రంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఏపీ హైకోర్టు ఏర్పాటు చేస్తే కర్నూలు అభివృద్ధి అవుతుంది.
రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చినట్టవుతుంది. న్యాయపరమైన అడ్డంగులన్నీ వైదొలగి, కర్నూలు కేంద్రంగా ఏపీ హైకోర్టు కార్యకలాపాలు జరగాలని ఎదురుచూస్తున్నాం అంటూ ఆమె అభిప్రాయపడ్డారు.
మూడు పరిశ్రమలు పెట్టండి మేలు జరుగుతుంది..
కర్నూలు న్యాయరాజధాని అంటూ కొన్ని కార్యాలయాలను తరలించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని విపక్ష టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు హయాంలో కియా పరిశ్రమను నిర్మించినట్టు మూడు పరిశ్రమలు పెడితే సీమ పారిశ్రామికాభివృద్ధికి బాటు వేసినట్టవుతుందని టీడీపీకి చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.‘‘రాజధానుల అంశం కోర్టు వివాదాల్లో ఉంది. ఏపీ హైకోర్టు తరలించాలంటే రాష్ట్రపతి గెజిట్ అవసరం అవుతుంది. అప్పటి వరకూ స్పష్టత లేదు. ఈలోగా కొన్ని ఆఫీసులు తరలించి రాయలసీమను అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. రాయలసీమకు సంబంధించిన జలవనరుల వినియోగంపై తెలంగాణా అభ్యంతరాలు పెడుతోంది. వాటిని తీర్చాలి. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వాటి వల్ల సీమలో ఉపాధి పెరిగి, అభివృద్ధి అవుతుంది. దానికి భిన్నంగా జగన్ మాత్రం మూడుముక్కలాట లాడుతూ జనాల్ని మభ్యపెడుతున్నార’’ని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- కాందహార్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గాన్‌లో రెండో అతిపెద్ద నగరం
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ హత్యకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- అఫ్గానిస్తాన్: తాలిబన్ల వశమైన ఐదు ప్రాంతీయ రాజధానులు
- అఫ్గానిస్తాన్: జైలును స్వాధీనం చేసుకుని ఖైదీలందరినీ వదిలేశామని ప్రకటించిన తాలిబన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








