కాందహార్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గాన్‌లో రెండో అతిపెద్ద నగరం

తాలిబన్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తమ ఆధీనంలోకొచ్చిన గజిని నగరంలోని గవర్నర్ ఇంటి వెలుపల గస్తీ కాస్తున్న ఓ తాలిబాన్

అఫ్గానిస్తాన్‌లో రెండో అతిపెద్ద నగరం కాందహార్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారితో పోరాడుతున్న ప్రభుత్వ బలగాలకు ఇదొక పెద్ద ఎదురుదెబ్బ లాంటిది.

తాలిబాన్ల ప్రస్థానం కాందహార్ నుంచే ప్రారంభమయ్యింది. ఒకప్పుడు ఈ ప్రాంతం వారికి కంచుకోటలా ఉండేది. ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఈ నగరానికి వ్యూహాత్మకంగానూ ప్రాధాన్యముంది. ఇప్పుడు కాందహార్‌పై పట్టు నిలుపుకోవడం వారికి ఒక పెద్ద విజయం లాంటిది.

కాందహార్‌పై దాడి చేయడానికి ముందు తాలిబన్లు అనేక వారాలపాటు నగర శివార్లను ఆక్రమిస్తూ వచ్చారు. ఇప్పటికే వారు హెరాత్, గజినీ నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

తాలిబాన్లు బుధవారం కాందహార్ సెంట్రల్ జైలుని ఆక్రమించారు. గురువారం నగరం మధ్యలోకి తాలిబన్లు ప్రవేశించినట్టు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

దేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో కాందహార్ ఒకటి. అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటూ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఈ నగరం ముందుంది. వ్వూహాత్మక ప్రాంతమైన గజినీని స్వాధీనం చేసుకోవడంతో ఇక రాజధాని కాబుల్‌పై పట్టు సాధించే అవకాశం పెరిగింది.

20 ఏళ్ల సైనిక కార్యకలాపాల తర్వాత అమెరికా, ఇతర విదేశీ దళాలు వైదొలగడంతో తిరుగుబాటుదారులు దాదాపు ప్రతి రోజు కొత్త భూ భాగాలను ఆక్రమిస్తూ వస్తున్నారు.

తమ సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు 3,000 మంది భద్రతా సిబ్బందిని పంపిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. మరో తమ పౌరులను సురక్షితంగా తీసుకు వెళ్లేందుకు బ్రిటన్ కూడా 600 మంది జవాన్లను పంపనున్నట్లు ప్రకటించింది.

ఖాలా-ఐ-నవ్ నగరం కూడా తాలిబన్ల వశమయ్యింది. ఇప్పుడు దేశంలోని ప్రాంతీయ నగరాల్లో మూడో వంతు, ఉత్తర అఫ్గానిస్తాన్‌లో ఎక్కువ భాగం తాలిబన్ల పాలనలోకి వెళ్లిపోయింది. సాయుధ తాలిబన్లు మెరుపు వేగంతో విరుచుకుపడుతుండటంతో ప్రభుత్వ సేనలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.

హెల్మాండ్ ప్రావిన్స్ రాజధాని లష్కర్ గాహ్ కూడా ఇప్పుడు తాలిబాన్ల చేతిలోకి వెళ్లిపోయిందని విశ్వసనీయ వర్గాల నుంచి బీబీసీకి సమాచారం అందింది. అయితే దీనిని ధ్రువీకరించాల్సి ఉంది.

కాబూల్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేలాది మంది ప్రజలు కాబూల్‌కు చేరుకుని, తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు

దేశంలో వేలాది మంది పౌరులు నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణల నుంచి తప్పించుకోవడానికి వారు కాబుల్‌కు పారిపోతున్నారు.

గజినీ ఉన్న వ్యూహాత్మక స్థానాన్ని బట్టి దీనిని స్వాధీనం చేసుకోవడం తాలిబన్లకు గణనీయమైన లాభంగా చెప్పుకోవొచ్చు. కాబుల్ నుంచి 150 కి.మీ దూరంలో ఉన్న ఇది దక్షిణాన తాలిబన్ల ప్రాబల్యం ఉన్న ముఖ్య ప్రాంతాలతో కలిపే కాబూల్-కాందహార్ హైవేపై ఉంది.

గజినీలోని ఎక్కువ భాగం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని, నగర శివార్లలోని ఒక పోలీస్ బేస్ మాత్రమే అఫ్గాన్ భద్రతా దళాల నియంత్రణలో ఉందని నగరానికి చెందిన ఒక ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు బీబీసీతో చెప్పారు.

వారాలుగా ముట్టడిలో ఉన్న హెరాత్ స్వాధీనం కూడా తాలిబన్లకు ప్రధాన విజయం. ఇది అఫ్గానిస్తాన్‌లో మూడో అతిపెద్ద నగరం. ముఖ్యమైన పురాతన వాణిజ్య మార్గాల్లో ఒకటి. ఇరాన్‌కు ఇది ముఖద్వారంగా కనిపిస్తుంది.

సెంట్రల్ హెరాత్ వీధుల్లో తుపాకీ మోతలు గురువారం సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. పోలీసు ప్రధాన కార్యాలయంపై తాలిబాన్ జెండా ఎగురుతూ కనిపించింది. నగరం తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిందని ప్రాంతీయ మండలి సభ్యుడు బీబీసీకి తెలిపారు.

"జీవితం రోజురోజుకు కష్టంగా మారుతోందని మాకు తెలుసు" అని కాందహార్‌లోని ఓ మహిళ బీబీసీకి చెప్పారు. "రెండు వైపులా కేవలం స్వలాభానికి-అధికార దాహానికి మమ్మల్ని పావులుగా ఉపయోగిస్తున్నారు" అని చెప్పారు.

లొంగిపోతున్న అఫ్గాన్ సైనికులను తాలిబాన్లు హతమారుస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయని కాబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విటర్లో పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని చెప్పింది. గత 20 ఏళ్లుగా అఫ్గానిస్తాన్ సాధించిన మానవ హక్కులను హరించరాదని పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భారతీయులు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి

కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్న దేశ పౌరులకు భారత్ ఓ సూచన జారీ చేసింది. అఫ్గానిస్తాన్‌లో ఉంటున్న భారత పౌరులందరూ ఆలస్యం చేయకుండా రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పింది.

అఫ్గానిస్తాన్‌లో ఉంటున్నప్పుడు, రాకపోకలు సాగిస్తున్నప్పుడు భారత మీడియా సభ్యులు అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.

రాయబార కార్యాలయం జూన్ 29, జులై 24, ఆగస్టు 10న కూడా అడ్వైజరీ జారీ చేసింది. అందులోని సలహాలను పట్టించుకోని భారత పౌరులు తమను తాము ప్రమాదంలో పడేలా చేసుకుంటున్నారు" అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించింది. కానీ అమెరికా సైన్యం ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభావం పెరుగుతుండడంతో అక్కడి భారత పౌరుల పరిస్థితి మారుతోంది. గత నెల తాలిబన్ల కవరేజ్ కోసం అఫ్గానిస్తాన్ చేరుకున్న భారత జర్నలిస్ట్ దానిష్ సిద్ధిఖీ హత్యకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)