కిసాన్ సంసద్: ఒక పార్లమెంటులో గందరగోళం మధ్య బిల్లులు, మరో 'పార్లమెంటు'లో పద్ధతిగా తీర్మానాలు

- రచయిత, వెంకట కిషన్ ప్రసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 'పెగాసస్' గ్రహణం ఇంకా తొలగిపోలేదు. విపక్షాల వ్యతిరేకతలు, వాయిదాలు, గందరగోళాలు, సస్పెన్షన్ల మధ్యే ఉభయ సభలూ కొనసాగుతున్నాయి. ఈలోగా, చర్చేమీ లేకుండానే కొన్ని బిల్లులు ఆమోదం కూడా పొందుతున్నాయి.
మరోవైపు, పార్లమెంటు భవనానికి కిలోమీటరున్నర దూరంలో, జంతర్ మంతర్‌లో కొలువుదీరిన మరో 'పార్లమెంటు'లో పద్ధతి ప్రకారం, ఎలాంటి అంతరాయాలూ, వాయిదాలూ లేకుండా సభా వ్యవహారాలు సాగుతున్నాయి. అంతే కాదు, బుధవారం నాటికి ఈ 'పార్లమెంటు' నాలుగు ప్రధానాంశాలపైన 45 గంటల పాటు చర్చించి అనేక తీర్మానాలు ఆమోదించింది. పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై కూడా ఈ 'పార్లమెంటు' కొన్ని సవరణ తీర్మానాలు చేయడం మరో విశేషం.
ఉదాహరణకు, దిల్లీ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో గత వారం ప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా, ఆ బిల్లుపైన ఈ 'పార్లమెంటు' అదే రోజు చర్చించడమే కాదు, దానికి కొన్ని సవరణ తీర్మానాలు కూడా చేసింది. పంట వ్యర్థాలను తగులబెట్టే రైతులను శిక్షార్హులను చేసే నిబంధనలను ఈ 'పార్లమెంటు' వ్యతిరేకించింది.
ఈ 'పార్లమెంటు' పేరు 'కిసాన్ సంసద్'. ఇది రైతులు నడిపిస్తున్న పార్లమెంట్.

రైతుల కొత్త 'పార్లమెంట్'
2020 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆమోదించిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ మొదలైన రైతుల ఉద్యమంలో ముందుకొచ్చిన ఒక వినూత్న రూపం 'కిసాన్ పార్లమెంట్'. దేశ పార్లమెంటుకు సమీపంలోనే, దానికి సమాంతరంగా, సింబాలిక్‌గా జరుగుతున్న ఈ 'పార్లమెంటు' ప్రధానంగా రైతుల అంశాల వరకే పరిమితమైంది.
దిల్లీ సరిహద్దుల్లో గత 8 నెలలుగా జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని కవర్ చేసేందుకు రెండు సార్లు సింఘూ బార్డర్ వరకూ వెళ్లిన నాకు ఈసారి 'కిసాన్ సంసద్' తీరుతెన్నుల్ని పరిశీలించాలనిపించింది.
నిజానికి దీని నిర్వహణకు అనుమతి పొందే ప్రక్రియ ఆషామాషీగా ఏమీ జరగలేదు. సమావేశాల సందర్భంగా పార్లమెంటు వరకూ మార్చ్ నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు గతంలో చాలా సార్లు ప్రకటించినా పోలీసులు ప్రతిసారీ అనుమతిని నిరాకరించారు. అనేక ప్రయత్నాల తర్వాత, చివరకు జంతర్ మంతర్‌లో అనేక షరతులతో 'కిసాన్ సంసద్' నిర్వహించుకునేందుకు పోలీసులు ఒప్పుకున్నారు. ఇందులో పాల్గొనే 'పార్లమెంటు సభ్యుల' సంఖ్య 206 దాటకూడదు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 లోపుగానే సమావేశాన్ని ముగించుకోవాలి. పాల్గొనే వారి వివరాలు ముందే పోలీసులకు అందించాలి... ఇలాంటి షరతులు ఎన్నో ఉన్నాయి.
అనేక ఆంక్షల మధ్య మొదలైన 'కిసాన్ సంసద్' కోసం సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఎంతో కసరత్తు చేసిందని చెప్పాలి. 500 పైచిలుకు రైతు సంఘాలతో ఉమ్మడి వేదికగా ఏర్పడ్డ ఎస్‌కేఎంకు 9 మంది సభ్యుల కోఆర్డినేషన్ కమిటీ ఉంది. కిసాన్ సంసద్‌లో ఏ రోజు ఎవరు పాల్గొంటారో నిర్ణయించి, ప్రతినిధుల జాబితాను ఈ కమిటీ ముందే సిద్ధం చేస్తుంది. అంతేకాదు, చర్చించాల్సిన అజెండాను కూడా ఈ కమిటీనే తయారు చేస్తుంది. సింఘూ బార్డర్ కేంద్రంగా పని చేస్తున్న ఎస్‌కేఎం.. తమ 'పార్లమెంటు సభ్యుల' ఎంపికలో వేర్వేరు రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తోంది.

'నిర్బంధం.. దిగ్బంధం..'
బుధవారం ఉదయం నేను ఈ 'పార్లమెంటు'ను చూసేందుకు వెళ్లినప్పుడు అనేక మెటల్ డిటెక్టర్ ద్వారాలను దాటుకొని ముందుకు సాగాల్సి వచ్చింది. అడుగడుగునా, అనేక వరుసల్లో భారీగా మోహరించి ఉన్న సాయుధ పోలీసులు ఎస్‌కేఎం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. మీడియా వాళ్లనైతే ఐడీ కార్డులు పరిశీలించి లోపలికి వెళ్లనిస్తున్నారు.
ఈ 'పార్లమెంటు'కు 'ఎంపీ'గా హాజరైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేవీవీ ప్రసాద్‌ను తన అనుభవాలేంటో చెప్పమని అడిగాను. బుధవారం ఈ సమావేశంలో ఏపీ నుంచి పాల్గొన్న 25 మంది ప్రతినిధుల్లో ఆయనొకరు.
'నేనెన్నో సార్లు ధర్నాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నాను. కానీ, ఈ తరహా నిర్బంధాన్ని ఎక్కడా చూడలేదు. ఎటు చూసినా పోలీసులే. మేం ఈ పార్లమెంటులో పాల్గొనడం కోసం వారం రోజుల ముందే ప్రతినిధులుగా నమోదు చేసుకున్నాం. మా పేర్లు, ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు ఎస్‌కేఎం కమిటీ వారికి పంపిస్తే వారు వాటిని పోలీసులకు అందజేశారు. ఆ తర్వాత మేం నిన్న సాయంత్రానికల్లా సింఘూ బార్డర్‌కు చేరుకున్నాం. ఇక ఈరోజు ఉదయం అక్కడ పోలీసులు ఆమోదించిన ఎస్‌కేఎం గుర్తింపు కార్డులు జేబుకు పెట్టుకొని పోలీసుల బస్సుల్లోకెక్కాం. ప్రతి కూడలిలోనూ మాకు పోలీసులే కనిపించారు. మా బస్సుకు వెనుకా ముందు లెక్కలేనన్ని పోలీసు వాహనాలు. మధ్యలో ఓ చోట మమ్మల్ని బస్సుల్లోంచి దింపి బస్సులన్నీ మళ్లీ చెక్ చేశారు. ఆ తర్వాత 'కిసాన్ సంసద్' దగ్గరి వరకూ తీసుకొచ్చి వదిలేశారు. సాయంత్రం మళ్లీ అవే బస్సుల్లో మమ్మల్ని సింఘూ బార్డర్‌కు తీసుకెళ్లి వదిలేస్తారు. మధ్యలో దిగిపోవడానికి లేదు.'

సభాపతులు, అజెండా, ప్రొటోకాల్స్
ఈరోజు తమ అజెండాలో కనీస మద్దతు ధరల చట్టంపై చర్చ ఉందని నిర్వాహకులు నాకు ముందే చెప్పారు. నేను వెళ్లేసరికి మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక రైతు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం అధికారికంగా కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్నా, తాను పండించే జొన్న పంటకు మాత్రం ఎప్పుడూ మద్దతు ధర లభించలేదని ఆయన వివరిస్తున్నారు.
ఒక్కో ప్రతినిధి వేదికపైకెక్కి మాట్లాడుతున్నప్పుడు వేదికపైన కూర్చున్న 'స్పీకర్', 'డిప్యూటీ స్పీకర్'లు సమయపాలన గురించి మధ్య మధ్యలో గుర్తు చేస్తున్నారు. 'అందరికీ అవకాశం వచ్చేలా త్వరగా ముగించాలి' అని వక్తలకు సూచిస్తున్నారు.
అంతేకాదు, సభ జరుగుతున్న సమయంలో ఎవరూ బయటకు వెళ్లొద్దని, బ్రేక్ సమయాల్లోనే బయటకు వెళ్లాలని చెప్తున్నారు. మీడియా వాళ్లతో కూడా బ్రేక్ సమయాల్లోనే మాట్లాడాలి తప్ప మధ్యలో ఎవరూ మాట్లాడొద్దనే నిబంధన ఉందని ప్రతినిధులు ముందే చెప్పారు.
సభ మొదలయ్యాక రెండు గంటల తర్వాత 10 నిమిషాల పాటు టీ బ్రేక్, ఆ తర్వాత 2 గంటల సమయంలో లంచ్ బ్రేక్ ప్రకటించారు. వీరికి భోజనాలు దగ్గరలో ఉన్న ఒక గురుద్వారా నుంచి సరఫరా అవుతున్నాయని ప్రతినిధులు చెప్పారు.
మరి ఈ ప్రతినిధుల ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కిరణ్ విస్సాతో ఫోన్లో మాట్లాడినపుడు ఆయనిలా చెప్పారు: 'ప్రతిరోజూ కొత్త ప్రతినిధులే హాజరు కావడం ఈ పార్లమెంటుకున్న మరో ప్రత్యేకత. అయితే కంటిన్యూటీ కోసం ఎస్‌కేఎం నుంచి ముగ్గురు సీనియర్ నేతలు ప్రతిరోజూ హాజరవుతున్నారు. వాళ్లు ఈ సమావేశాన్ని గైడ్ చేస్తారు. అయితే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను మాత్రం ప్రతిరోజూ విధిగా ప్రతినిధుల్లోంచే, ప్రతినిధులే ఎన్నుకుంటున్నారు.'
అసలిలా సింబాలిక్‌గా ఓ పార్లమెంటును నిర్వహించాలనే నిర్ణయం ఎలా, ఎందుకు తీసుకున్నారని అడిగినపుడు, 'ఇదివరకు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా రైతుల బడ్జెట్ కార్యక్రమం నిర్వహించి దానిపై చర్చించడం అనే ఆనవాయితీ ఉండింది. ఉదాహరణకు మేం 2018-19లో అలా చేశాం. అలాంటివి ఒక్కరోజే జరిగేవి. అయితే, ఈసారి వర్షాకాల సమావేశాలు జరిగే కాలమంతా, అంటే జులై 22 నుంచి అగస్ట్ 14 వరకూ ప్రతిరోజూ కిసాన్ సంసద్ నిర్వహించాలనుకున్నాం' అన్నారు.
'ప్రజాస్వామ్యంలో అత్యున్నతాధికారం ప్రజలదే. కాబట్టి ప్రజలకుండే బలమేంటో మేం చాటాలనుకున్నామ'ని కవిత కురుగంటి అన్నారు. గత జనవరిలో ప్రభుత్వంతో 11 సార్లు జరిగిన చర్చల్లో పాల్గొన్న రైతు ప్రతినిధుల్లో కవిత కూడా ఒకరు. బుధవారం 'కిసాన్ సంసద్'లో కనీస మద్దతు ధర చట్టం ఆవశ్యకత గురించి ప్రసంగించారు.
బీబీసీతో ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన కవిత, 'పార్లమెంటులో 6 ఏళ్లలో మొదటిసారి మోదీ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు గట్టిగా ఎదుర్కొంటున్నాయంటే, వారికి దారి చూపించింది ఈ రైతుల ఉద్యమమే. గత రెండు వారాల్లో 107 గంటల్లో వాళ్లు 18 గంటలు మాత్రమే సభా కార్యక్రమాల్ని నడపగలిగారు. కానీ ఇక్కడ మాత్రం నిన్నటి వరకూ 45 గంటల పాటు ప్రొసీడింగ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచాయి. వందల మంది రైతులు ఎంపీల్లాగా వచ్చి ఇందులో పాల్గొన్నారు. చాలా క్రమశిక్షణతో, అసలైన విషయాలపైనే చర్చిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలో ఈ ఉద్యమం ఈ విధంగా దేశానికంతా చూపిస్తోంది' అని అన్నారు.
ప్రతినిధుల సమాచారం ప్రకారం, ఈ 'పార్లమెంటు'లో ఇప్పటి వరకు మూడు వ్యవసాయ చట్టాలపైన దాదాపు రెండేసి రోజుల చర్చ జరిగింది. జులై 26న ప్రత్యేకించి పూర్తిగా మహిళలే పాల్గొన్నారు. 'మహిళా కిసాన్ సంసద్'గా పిలిచిన ఆ సభలో రైతు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించామన్నారు.

భిన్న అభిప్రాయాలకు చోటుందా?
అందరి అజెండా ఒకటే అయినప్పుడు, అందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో ఉన్నప్పుడు మరి ఈ 'పార్లమెంటు'లో భిన్న అభిప్రాయాలకు, భావఘర్షణకు తావుంటుందా?
ఈ అనుమానం నాలో ముందు నుంచే ఉండటంతో అక్కడున్నంత సేపూ వేదికపై ప్రతినిధులు మాట్లాడిన మాటల్ని జాగ్రత్తగా విన్నాను. వాళ్లంతా కనీస మద్దతు ధరపైన తమ అనుభవాలను జోడించి మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల ప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలేంటో చెప్పారు.
ఎంఎస్‌పీ ఉంది, ఉంటుందనీ మోదీ ప్రభుత్వం ఎంత బలంగా చెప్తున్నా, దాన్ని వాస్తవికంగా పొందుతున్న రైతుల సంఖ్య 13 నుంచి 25 శాతం మధ్యే ఉంటుందని ఓ అంచనా. కాబట్టి తమ పంటలకు గిట్టుబాటు కాని ధరలు అమ్ముకోవాల్సిన పరిస్థితుల గురించి వారు స్పష్టంగానే మాట్లాడుతున్నారు.
మొత్తానికి, దీనిపై వాళ్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్లో పెద్ద తేడాలు లేవు కానీ వాళ్ల అనుభవాల్లో మాత్రం వైవిధ్యం ఉంది. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ!

ఫొటో సోర్స్, Venkat Prasad G
పంజాబ్, హరియాణా రైతులే ఎందుకు ముందున్నారు?
రైతుల ఉద్యమంపై ఎవరికి ఏ అభిప్రాయాలున్నా, ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఇటీవలి చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం పాటు, లక్షల మంది భాగస్వామ్యంతో కొనసాగిన ఉద్యమం మరొకటి లేదన్న వాస్తవంతో మాత్రం ఎవరూ విభేదించరు.
కానీ చాలా మంది తరచూ అనుమానంతో అడుగుతున్న ప్రశ్న - పంజాబ్, హరియాణా రాష్ట్రాల రైతులే ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టేందుకు ముగ్గురు రైతు ఉద్యమకారులతో విడివిడిగా మాట్లాడాను. మిగతా రాష్ట్రాల రైతులు, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల రైతులు ఇందులో క్రీయాశీల పాత్ర పోషించకపోవడానికి కారణాలేంటని అడిగినపుడు ఒక్కొక్కరూ ఒక్కో పార్శ్వాన్ని తడిమారు.
'ప్రతి రాష్ట్రంలోనూ తమకు వ్యతిరేకత ఎదురవుతోందని బీజేపీ వాళ్లే అంటున్నారు. రాజస్థాన్‌లో, యూపీలో బీజేపీ నేతలు, మంత్రులు ప్రజల మధ్యకు వచ్చేందుకు భయపడుతున్నారు. కాబట్టి కేవలం పంజాబ్, హరియాణా వాళ్లే ఉద్యమంలో ఉన్నారనేది పూర్తిగా కరెక్టు కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులంతా కొద్దిపాటి తేడాలతో ఈ ఉద్యమంలో చురుగ్గానే ఉన్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మూడు బిల్లుల ప్రభావాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకపోవడం అనే సమస్య ఉంది. మండీ వ్యవస్థ పంజాబ్‌లో ఉన్నంత గట్టిగా లేకపోవడం, మండీ వ్యవస్థ కూలిపోతే ఏమవుతుందో ఊహించలేకపోవడం కూడా వాళ్లలో సమస్యగా ఉంది. కానీ ఎంఎస్‌పీ కోసమైతే దేశవ్యాప్తంగా రైతులు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు' అన్నారు కూరుగంటి కవిత.
మాజీ మంత్రి, వ్యవసాయ రంగ నిపుణులు వడ్డే శోభనాద్రీశ్వరరావుతో ఇదే అంశంపై చర్చించగా, ఆయనిలా అన్నారు: 'పంజాబ్, హరియాణాల్లో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తున్నారు. ఆర్మీలో పని చేసి రిటైరై వచ్చిన వాళ్లు కూడా ఊళ్లళ్లో వ్యవసాయం చేస్తారు. కానీ ఏపీ విషయానికొస్తే 70 శాతం భూమి కౌలు రైతుల చేతుల్లో ఉంది. కౌలు రైతులకు తమ పనులు, అప్పులు తీర్చడంతోనే సరిపోతుంది. దాంతో వాళ్లు ఉద్యమంలోకి రాలేకపోతున్నారు. ఇక అసలు యజమానుల్లో నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల ప్రభావం వాళ్లపై బాగా ఉంది. అందుకే వాళ్లు రోడ్లపైకి రాలేకపోతున్నారు.'

ఫొటో సోర్స్, Venkat Prasad G
'పంజాబ్, హరియాణా రైతులు అందరి కోసం పోరాడుతున్నారు'
ఈ ఉద్యమం విజయవంతమైతే ఎక్కువగా లాభపడేది పంజాబ్, హరియాణా రైతులేనని, అందుకే అక్కడి రైతుల లాబీ అంత పట్టుదలగా పోరాడుతోందనేది మరి కొందరి వాదన. మరి దీనిపై రైతు ఉద్యమకారులేమంటున్నారు?
'ఒకరకంగా చెప్పాలంటే పంజాబ్, హరియాణా రైతులు దేశం మొత్తం కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే, అన్ని ప్రాంతాల వాళ్లూ ఇంత దూరం రాలేరు. అలాగే పంజాబీలకున్న వెసులుబాటు మిగతా వాళ్లకు లేదు. ఎలా అంటే, పంజాబ్ గ్రామాల్లో వంతులవారీగా ఓ పది మంది ఉద్యమంలో పాల్గొంటే, మిగతా వారు వాళ్ల పనుల్ని చక్కబెడుతున్నారు. అలాంటి ఏర్పాట్లు వారికున్నాయి' అని కిరణ్ విస్సా అన్నారు.
'ఎంఎస్‌పీ గ్యారంటీ చట్టంతో దేశవ్యాప్తంగా రైతులు లాభపడతారు. నిజానికి, అసలు పంజాబ్ రైతులకు ఈ చట్టం కూడా అక్కర్లేదు. ఎందుకంటే, పంజాబ్‌లో ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్‌ను ఇప్పుడున్నట్టుగానే కొనసాగిస్తామని, ఎంఎస్‌పీ మునుపటిలాగానే కొనసాగుతుందని మోదీ ప్రభుత్వం ముందే ప్రకటించింది. కావాలంటే రాతపూర్వకంగా హామీ ఇస్తామని కూడా ప్రకటించింది. ఎందుకంటే, పంజాబ్ వాళ్ల డిమాండ్లు తీర్చేస్తే వాళ్లను ఉద్యమం నుంచి పక్కకు తప్పించవచ్చని ప్రభుత్వం భావించింది. దాంతో ఉద్యమం చల్లారిపోతుందని ప్రభుత్వం ఆలోచన. కానీ అన్ని పంటల్లోనూ ఎంఎస్‌పీ ఉండేలా చట్టం కావాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తోంది. నిజానికి పంజాబ్ రైతులకు అన్ని పంటలతో కూడా పని లేదు. ఎందుకంటే, వాళ్లకు ప్రధానంగా గోధుమ, వరి పంటలకుంటే చాలు. వాస్తవానికి ప్రభుత్వ హామీని స్వీకరించి, వాళ్లు హాయిగా ఇంటికి వెళ్లిపోయి ఉండొచ్చు. అందుకే, పంజాబ్, హరియాణా వాళ్లు తమ స్వార్థం కోసం కాకుండా, ఇతర ప్రాంతాల రైతుల కోసం త్యాగం చేస్తున్నారనడం సరిగ్గా ఉంటుంది.'

ఫొటో సోర్స్, Venkat Prasad G
ఆ పార్లమెంటు వైపే ఈ 'పార్లమెంటు' చూపు
'కిసాన్ సంసద్' ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే ఒక కార్యకర్త వేదిక పైకొచ్చి ఓ కాగితం ముక్కను 'డిప్యూటీ స్పీకర్'కు అందించారు. 'పార్లమెంటులో పెగాసస్' అంశంతో పాటు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం గురించి చర్చించాల'ని డిమాండ్ చేస్తూ 14 విపక్ష పార్టీలు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయన్న సమాచారాన్ని 'డిప్యూటీ స్పీకర్' సభకు చదివి వినిపించారు. రైతుల 'పార్లమెంటు' చప్పట్లతో మార్మోగింది.
అంటే, ఆ పార్లమెంటులో ఎప్పుడు, ఏం జరుగుతుందో ఈ 'పార్లమెంటు' ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. అక్కడి ముఖ్యమైన అప్‌డేట్స్ ఇక్కడి సభ్యులకు ఎప్పటికప్పుడు అందుతున్నాయి.
8 నెలలుగా చలినీ, ఎండనూ, వాననూ లెక్కచేయకుండా కొనసాగిస్తున్న తమ ఆందోళనకు ఇకనైనా తెరపడుతుందేమో, ఇప్పటికైనా ఏదైనా రాజకీయ పరిష్కారం లభిస్తుందేమో అన్న ఆశాభావం వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.
మరి ఈ 'పార్లమెంటు' వ్యక్తం చేసిన ఆవేదనకు స్పందించి, ఆ పార్లమెంటు ఓ స్థిరమైన పరిష్కారాన్ని కనిపెడుతుందేమో వేచి చూడాల్సిందే.
(జంతర్ మంతర్‌లో జరుగుతున్న 'కిసాన్ సంసద్' నుంచి తిరిగొచ్చాక...)
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








