రైతుల ఆందోళన: మోదీ ప్రభుత్వాన్ని రైతులు ఎందుకు నమ్మడం లేదు - కార్పొరేట్ సంస్థలంటే వారికి భయమెందుకు?

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP via Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధిపత్యం సాధిస్తాయని, అప్పుడు తాము దోపిడికి గురవుతామన్నది రైతుల భయం.
అయితే కార్పొరేట్ రంగం వ్యవసాయం రంగంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనే జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి, గోధుములను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం.
గోధుమలను కొనడంలో ప్రభుత్వం తర్వాత రెండోస్థానంలో ఎవరిది? రూ.75వేల కోట్ల విలువైన ప్రపంచస్థాయి కార్పొరేట్ సంస్థ ఐటీసీ గ్రూప్‌ది. ఈ సంస్థ ఈ ఏడాది రైతుల నుంచి 2.2 మిలియన్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది.
మహీంద్రా గ్రూప్ కూడా వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభించింది. నెస్లే, గోద్రెజ్‌లాంటి బడా ప్రైవేట్ కంపెనీలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి.

ఫొటో సోర్స్, RAWPIXEL
ఈ-చౌపాల్
ఐటీసీ కంపెనీకి, రైతులకు మధ్య అనుసంధానకర్త పాత్ర పోషించడంలో ఈ-చౌపాల్ పథకం కీలకపాత్ర పోషించింది. ఈ-చౌపాల్ సహకారంతో 20 సంవత్సరాలుగా ఐటీసీ గ్రూప్ రైతులతో కలిసి వ్యాపారం చేస్తోంది.
2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ-చౌపాల్ మోడల్ గ్రామాల్లో ఇంటర్నెట్ కియోస్క్‌లు ఏర్పాటు ఒక నెట్‌వర్క్‌గా పని చేస్తుంది. చిన్న,సన్నకారు రైతులకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ చేసుకోవడంలో ఇది మెలకువలు అందిస్తుంది. వివిధ మార్కెట్లలో ధరలు, వాతావరణ సూచనల్లాంటివి అందిస్తూ రైతులకు బాసటగా ఉంటుంది.
ఈ-చౌపాల్ మోడల్ ఎలా పనిచేస్తుంది?
అది 2005 సంవత్సరం. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో సోయాబీన్ పంటకు రైతుల నుంచి పెరుగుతున్న ఆదరణ గురించి ఒక కథనం కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ-చౌపాల్ పథకం గురించి విన్నాను.
ఈ-చౌపాల్ పరిధిలో ఉండే మార్కెట్లకు వెళ్లి చూశాను. ఒకరిద్దరు యువకులు గ్రామాల్లో కంప్యూటర్లు పెట్టుకుని వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించడం, అంతర్జాయతీయ మార్కెట్‌లో సోయాబీన్ ధరల గురించి వివరించడం గమనించాను.
ఇక్కడి ధరలు తెలుసుకున్నాక రైతులు మార్కెట్‌కు వెళ్లి సోయాబీన్ ధరను ముందుగా నిర్ణయించిన ధరకు ఐటీసీకి అమ్మేవారు. అప్పటికి ఆ పథకం కొత్తది. ఒక కార్పొరేట్ కంపెనీ, రైతులు కలిసి పని చేయడం కూడా కొత్త విషయమే.
రైతులతో తమకున్న అనుబంధంపై ఐటీసీ సంస్థ ఒక వీడియో ఫిల్మ్ తయారు చేసి గ్రామాల్లో రైతులకు ప్రదర్శించి చూపేది. తమ పథకాల గురించి వివరించేది. అప్పట్లో రైతులు, సంస్థా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.
కానీ ఒక సంస్థ రైతులను మోసం చేయాలనుకున్నా, దోచుకోవాలనుకున్నా అది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే రైతుల రక్షణకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు.
ఈ-చౌపాల్‌లో ఇప్పుడు 40 లక్షలమంది రైతుల నెట్‌వర్క్‌గా మారింది. 10 రాష్ట్రాల్లో 6100 కంప్యూటర్ కియోస్క్‌ల ద్వారా 35,000 గ్రామాల్లో విస్తరించి ఉంది. కోటిమంది రైతులను సభ్యులుగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
రైతులు, కంపెనీల మధ్య కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఈ-చౌపాల్ ఒక మోడల్. అయితే కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్ గ్రూప్‌లైన అంబానీలు, అదానీలు వ్యవసాయరంగంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అందుకే రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయోత్పత్తిలో భారత్ వెనకబాటు
అమెరికా తరువాత భారతదేశంలో అత్యధికంగా సాగు చేయగల భూమి ఉంది. కాని దిగుబడిలో మాత్రం భారతదేశం అమెరికాకంటే చాలా వెనకబడి ఉంది.
సాంకేతిక పరిజ్ఞానం వాడకం తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే పరిజ్జానం రైతులకు అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు క్రమంగా తగ్గుతుండటం మరో కారణం.
అయితే వ్యవసాయంలో ప్రభుత్వం ఎక్కువ భూమికను పోషించడం సరికాదని నిపుణులు అంటుండగా, ఉత్తర భారతదేశ రైతులు మాత్రం సర్కారుకు దూరమయ్యేందుకు సిద్ధంగా లేరు.
ఆహార భద్రతలో అదనపు భారం
ప్రజలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం(పీడీఎస్) ద్వారా కరువుల, అంటువ్యాధుల సమయంలో ఉచితంగా ధాన్యం అందిస్తారు. కానీ ఈ పథకం పేరుతో సేకరిస్తున్న ధాన్యం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంది.
ఆహార భద్రత పేరుతో ఎక్కువగా ధాన్యాన్ని కొనడం రాజకీయ అనివార్యతగా మారింది. " ప్రభుత్వం బియ్యం, గోధుమల కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది. దానికి బదులు వల్ల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మంచిది” అని ముంబయికి చెందిన ఆర్థిక నిపుణుడు వివేక్ కౌల్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు?
కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) చట్టంలో చేర్చాలని, ప్రభుత్వం మండీల (మార్కెట్లు) నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ప్రస్తుత చర్చల్లో రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే కొత్త వ్యవసాయ చట్టాలు ప్రస్తుత అవసరమని, దానివల్ల రైతులే ప్రయోజనం పొందుతారని మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుత ఆందోళనల కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దీనిని వాస్తవిక దృష్టితో చూడాల్సిన అవసరముంది.
వ్యవసాయంలో పెను మార్పులు
గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు ప్రభుత్వంకన్నా ప్రైవేటు శక్తుల వల్లనే ఎక్కువగా సాధ్యమయ్యాయి. టెక్నాలజీ, కొత్త విత్తనాలు, నాణ్యమైన ఎరువుల్లాంటి అంశాలు వ్యవసాయాభివృద్ధికి కారణం.
ఇవే మార్పులు వ్యవసాయ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు చోటు కల్పించాయి. కానీ ఏ వేగంతో మార్పులు జరుగుతున్నాయో, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వకాలంలో ఈ కొత్త చట్టంపై చర్చ జరిగింది. కానీ అది అమలు కాలేదు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ప్రైవేటు కంపెనీలు వ్యవసాయ రంగంలోకి రాకుండా నిరోధించలేనప్పుడు కొన్ని చట్టాలు, నిబంధనలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి ప్రైవేట్ కంపెనీలు తమను దోచుకోకుండా తమ ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలని రైతులు కోరుతున్నారు
అయితే మోదీ ప్రభుత్వం ఈ మూడు చట్టాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే తెచ్చామని చెబుతున్నా, తమను పరిగణనలోకి తీసుకోకుండా, హడావుడిగా ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, అయితే అవి రైతులను దోచుకునేందుకు అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని కేరళ మాజీ శాసన సభ్యుడు, రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కృష్ణ ప్రసాద్ అంటున్నారు.

ఫొటో సోర్స్, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ప్రభుత్వం-రైతులు ఎందుకు పట్టుదలగా ఉన్నారు?
“ రైతులకు మరిన్ని ఆప్షన్లు ఇస్తుంటే మమ్మల్ని రైతు అనుకూలురు అంటారా లేక వ్యతిరేకులు అంటారా? కొత్త వ్యవసాయ చట్టంతో రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాం” అని బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది.
కానీ ఈ చట్టంపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి మరీ దీన్ని ఉపసంహరించుకోవాలని దర్శన్‌పాల్ లాంటి రైతు ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇందులో ఎవరు గెలుస్తారు?
ఇవి కూడా చదవండి:
- వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు"
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








