హాంకాంగ్: 24 ఏళ్ల యువతిని 'ప్రజాస్వామ్య దేవత'గా ఎందుకు అభివర్ణిస్తున్నారు?

ఫొటో సోర్స్, Reuters
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల పేర్లతో బీబీసీ ‘100 విమెన్’ జాబితాను ప్రకటించింది.
హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారిణి ‘‘ఆగ్నెస్ చౌ’’ని ఆమె మద్దతుదారులు 'హీరో' అని ప్రశంసిస్తున్నారు. ఆమెను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వివాదాస్పద కొత్త చట్టం కింద ఆమెపై అభియోగాలు నమోదుచేయలేదు. గత ఏడాది ఇక్కడ జరిగిన నిరసనలకు సంబంధించి ఆమెను ఇదివరకు కూడా అరెస్టు చేశారు.
తనకు ఎలాంటి ఒత్తిడి ఎదురవుతుందో బీబీసీ చైనా ప్రతినిధి లామ్ చో వాయ్‌తో ఇదివరకు ఆమె మాట్లాడారు.
"నేను ఒత్తిడిలో లేననుకున్నాను. కానీ, నా శరీరం మరోలా చెబుతుంది" అని చౌ అన్నారు.
"చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటున్నట్లు చెబుతారు. కానీ నేను ఆలా అనుకోవడం లేదు. నేను సాధారణంగానే తింటున్నాను. కానీ, నేనసలు బరువు పెరగడం లేదు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆగస్టులో ఇక్కడ జాతీయ భద్రతా చట్టాన్ని చైనా అమలు చేసిన తర్వాత.. అరెస్టయిన కొంత మంది మీడియా వ్యక్తులు, ఉద్యమకారుల్లో ఆమె కూడా ఒకరు.
వేర్పాటువాద, దేశద్రోహం, తీవ్రవాదం, విదేశీ శక్తులతో కుమ్మక్కులను నేరాలుగా ఈ చట్టం పరిగణిస్తుంది. హాంకాంగ్ వీధుల్లో నెలల తరబడి కొనసాగిన నిరసనల అనంతరం.. సామాజిక స్థిరత్వాన్ని నెలకొల్పడానికి ఈ చట్టం అవసరం అని చైనా చెబుతోంది.
కానీ, దీని వల్ల వేధింపులు, వాక్ స్వాతంత్రంపై నియంత్రణ పెరుగుతాయని, నిరసన కూడా తెలియజేయడం కుదరదని విమర్శకులు అంటున్నారు.
ప్రస్తుతం విదేశీ శక్తులతో కుమ్మక్కయిందనే అనుమానంతో చౌను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె దోషిగా నిరూపణ అయితే, జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది.
ఆమెకు అరెస్టులు కొత్త కాకపోయినప్పటికీ, పరిస్థితులు మాత్రం ఇటీవల కాలంలో బాగా దారుణంగా తయారయ్యాయని ఆమె అన్నారు.
ఆగస్టులో పోలీసులు ఆమె ఇంటి తలుపు కొట్టే ముందు ఇంటిని ఎలా చుట్టుముట్టారో ఆమె వివరించారు. ఇంటికి దగ్గర్లో ఉండే కొండ మీద ఒక ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
"వాళ్ళు మా ఇంటిని రెండు గంటల పాటు సోదా చేశారు. అక్కడ మా అమ్మగారు ఉన్నారు. నేను నా ఇంటిని చూడటం ఇదే ఆఖరి సారేమో అని నాకు చాలా భయం వేసింది"అని ఆమె వివరించారు.
అరెస్టు అయినప్పటి నుంచి పీడ కలలు తరచుగా వస్తున్నాయని ఆమె చెప్పారు. "నాకు ఎవరైనా డోర్ బెల్ కొట్టినా, తలుపు కొట్టినా భయం వేసేస్తోంది"అని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ప్రజాస్వామ్యానికి దేవత
24 సంవత్సరాల చౌ ప్రముఖ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారిణి.
ఉద్యమకారుడు జాషువా వాంగ్‌తో జాతీయ ప్రణాళికల్లో జరుగుతున్న మార్పుల గురించి ఆమె ప్రచారం చేశారు. దీని తర్వాత ప్రభుత్వం తమ నిర్ణయాలను ఉపసంహరించుకుంది.
2014లో చోటు చేసుకున్న అంబ్రెల్లా ఉద్యమంలో ఆమె ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఈ ఉద్యమంలో సార్వత్రిక ఓటు హక్కును డిమాండు చేస్తూ నిరసనకారులు 79 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాలను ఆక్రమించారు.
రెండు సంవత్సరాల తర్వాత.. ఆమె వాంగ్, మరొకరితో కలిసి ప్రజాస్వామ్య ఉద్యమ సంస్థ 'డెమోసిస్టో' ని ఏర్పాటు చేశారు.
జాతీయ భద్రతా చట్టాన్ని అమలులోకి తెచ్చిన రోజే ఈ సంస్థను నిషేధించారు. చైనా, హాంకాంగ్ అధికారులపై ఆంక్షలు విధించాలని ఈ సంస్థ పదేపదే పిలుపునిచ్చింది.
ప్రస్తుతం చౌ మద్దతుదారులు ఆమెను.. దేశాన్ని కాపాడేందుకు పోరాడిన చైనా కాల్పనిక హీరోయిన్ ములాన్‌తో పోలుస్తున్నారు. కొంత మంది ఆమెను 'ప్రజాస్వామ్యానికి దేవత' అని అభివర్ణిస్తున్నారు.
"ఇలాంటి బిరుదులకు అర్హురాలినని నేననుకోవడం లేదు. అయితే, హాంకాంగ్ ప్రజల దృష్టిని తాజా పరిస్థితులవైపు ఇది మళ్లించగలిగితే బావుంటుంది" అని ఆమె అంటారు.
"నాకు వస్తున్న పేరు ప్రతిష్ఠలు ప్రజలను తాము నమ్మిన దానికి కట్టుబడి ఉండేలా ప్రోత్సహిస్తాయని ఆశిస్తున్నాను" అని ఆమె అన్నారు.
ఈ ఉద్యమంలో ఆమె వహించిన పాత్ర అమ్మాయిలపై వివక్షకూ సమాధానం ఇస్తుందని ఆమె గర్వంగా భావిస్తున్నారు.
"గతంలో అమ్మాయిలు పోరాటాలలో ఉండే ప్రమాదకరమైన కలహాలను ఎదుర్కోలేరని , తెర వెనకే ఉండమని నిరసనకారులు సూచించేవారు" అని చెప్పారు.
"కానీ, ఇప్పుడేమి జరిగిందో చూడండి. మహిళా నిరసనకారులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వారు ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ భాష జాపనీస్‌ను చౌ ధారాళంగా మాట్లాడతారు. ఆమెకు జపనీస్ యానిమేషన్ అంటే చాలా ఇష్టం. జపాన్‌లో కూడా ఆమె అభిమానులను కూడగట్టుకున్నారు. ఆమెను విడుదల చేయాలని జపాన్ నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా మంది అభ్యర్ధించారు.
గత సంవత్సరం ఆమె టోక్యోకి వెళ్లి షింజో అబే ప్రభుత్వాన్ని తమకు మద్దతుగా మాట్లాడమని అభ్యర్ధించారు. కానీ, కొత్తగా అమలు చేసిన జాతీయ భద్రతా చట్టంతో ఈ ప్రయత్నాలన్నీ ఆగిపోయినట్లే అని ఆమె చెప్పారు.
"నేను గతంలో మాట్లాడిన మాటలేవీ ఇప్పుడు మాట్లాడలేను".
"ఇదొక రకమైన శ్వేత తీవ్రవాదం. నిరసనకారులు గళమెత్తకుండా మౌనంగా చేయడాన్ని శ్వేత తీవ్రవాదం అంటారు. ఇదిప్పుడు నాతో సహా ప్రతి హాంకాంగ్ పౌరుని నెత్తి మీద వేళాడుతోంది" అని ఆమె అన్నారు.
ఆమె ఈ చట్టం గురించి చెబుతూ, " ప్రభుత్వం ప్రజలను భయపెట్టి విస్మయానికి గురిచేస్తోంది" అని అన్నారు.
"అలా అని, ప్రజలు బాగా జీవించటం లేదని చెప్పడానికి లేదు. వారిని కేవలం భయం ఆవహించింది" అని చెప్పారు.
గత సంవత్సరం అంతా ప్రజాస్వామ్య అనుకూల మద్దతుదారులు.. పోలీసులతో హింసాత్మక గొడవల్లో తలపడుతూనే ఉన్నారు. మరోవైపు నిరసనకారులు భద్రతా దళాలపై దాడి చేసి, ప్రజా జీవనానికి భంగం కలిగిస్తున్నారని చైనా మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
కానీ, ఈ చట్టాన్ని అమలులోకి తేవడంతోపాటు, కరోనా మహమ్మారి కూడా తోడవ్వడంతో నిరసనలన్నీ ఒకే సారి ఆగిపోయాయి.
నిరసనకారులు ఈ ఉద్యమాలను తీవ్రంగా చేయడం వల్ల నగర ప్రజలు తమ స్వేచ్ఛను పోగొట్టుకున్నారా? అని ప్రశ్నించినప్పుడు, ఇప్పుడు ఒక సమాధానం చెప్పడం కష్టం అని ఆమె అన్నారు.
"మా డిమాండ్లేవీ తీరలేదు. ఇది విజయంగా అభివర్ణించలేం" అని అన్నారు.
‘‘కానీ, మేం గత సంవత్సరం నిరసనలు చేయకపోయినా రాజకీయ బీటలు వారడం మాత్రం కొనసాగి ఉండేది. హాంకాంగ్ ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్రాలన్నీ నెమ్మదిగా హరించుకు పోయేవి’’.
చాలా మంది నిరసనకారులు, ఉద్యమ నాయకులతో సహా బ్రిటన్‌కు వెళ్లిపోయారు. చౌకి దేశం వదిలి వెళ్లే ఆలోచనలు లేవు.
"అందరూ దేశం వదిలి ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారో నేనర్ధం చేసుకోగలను" అని ఆమె అన్నారు.
"హాంకాంగ్ రోజు రోజుకీ బతకడానికి ఆశ లేని నగరంగా మారుతోంది. హాంకాంగ్ ప్రజలు ప్రజాస్వామ్యం, స్వాతంత్రాన్ని కోరుకుంటారు. అవి మాకు చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి".
కానీ, ఇలాంటి చాలా సామాజిక ఉద్యమాలు చాలా ఆటంకాలను ఎదుర్కొంటాయి.
‘‘చాలా మంది త్యాగాలు చేస్తారు. నిస్సహాయత, భయం మన ఆలోచనలను అధిగమించేలా చేయకూడదు. ప్రజాస్వామ్యం కోసం పోరాడటానికి కృత నిశ్చయంతో ఉండాలి’’.
"కానీ, ఈ భయం పోగొట్టుకోవడం ఎలాగో నాకు తెలియడం లేదు. ఎవరికైనా తెలిస్తే నేర్పించండి" అని ఆమె అన్నారు.
ఆగ్నెస్ చౌ బీబీసీ 100 విమెన్ జాబితాలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








