మనీశ్ మిశ్రా: బిచ్చగాడు అనుకుని సాయం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు

మనీశ్ మిశ్రా

ఫొటో సోర్స్, SHUREIH NIAZI / BBC

ఫొటో క్యాప్షన్, మనీశ్ మిశ్రా
    • రచయిత, షురేహ్ నియాజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్వర్గ్ సదన్ ఆశ్రమంలో ఉన్న మనీశ్ మిశ్రా అనే వ్యక్తిని కలవడానికి తరచుగా పోలీసు అధికారులు వస్తూ పోతూ ఉన్నారు.

మనీశ్ మిశ్రా చాలాకాలం రోడ్ల మీద జీవితం గడిపారు. 2020 నవంబర్‌లో ఈ ఆశ్రమానికి వచ్చారు. ఆయన్ని కలవడానికి వస్తున్న పోలీసులు గతంలో ఆయనతో పాటూ పని చేసినవాళ్లే.

"మనీశ్ మిశ్రా ఇప్పుడు బాగున్నారు. ఆశ్రమంలో ఆయన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఆయన కూడా తేరుకుంటున్నారు" అని స్వర్గ్ సదన్ ఆశ్రమ సంచాలకులు పవన్ సూర్యవంశీ తెలిపారు.

"మనీశ్ మిశ్రాను కలవడానికి ఆయన బ్యాచ్‌మేట్స్ తరచూ వస్తున్నారు. వచ్చినప్పుడల్లా గతాన్ని తలుచుకుంటున్నారు. ఆయనతో పాటూ పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటున్నారు" అని సూర్యవంశీ తెలిపారు.

మనీశ్ మిశ్రా

ఫొటో సోర్స్, SHUREIH NIAZI / BBC

ఫొటో క్యాప్షన్, మనీశ్ మిశ్రా

ఇంతకీ మనీశ్ మిశ్రా ఎవరు?

ఇంతకీ ఈ మనీశ్ మిశ్రా ఎవరు? ఆయన కథేమిటి? తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాలి.

2020 నవంబర్ 10న గ్వాలియర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ సందర్భంగా అర్థరాత్రి సుమారు ఒంటిగంటన్నర ప్రాంతంలో ఇద్దరు డీఎస్పీలు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక బిచ్చగాడు చలిలో వణుకుతూ కనిపించారు.

ఆయన పరిస్థితి చూసి జాలిపడి ఒక అధికారి తన బూట్లు ఇవ్వాగా, రెండో అధికారి తన జాకెట్ ఇచ్చారు. అవి ఇచ్చేసి వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళుపోతుండగా ఆ బిచ్చగాడు వారిద్దరినీ పేర్లు పెట్టి పిలిచారు.

అది విని ఇద్దరు అధికారులూ ఆశ్చర్యపోయారు. మళ్లీ వెనక్కి వెళ్లి బిచ్చగాడిని కలిశారు. మాటల్లో తెలిసిన విషయమేమిటంటే ఆ బిచ్చగాడు వాళ్ల బ్యాచ్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ మనీశ్ మిశ్రా అని.

గత పదేళ్లుగా ఇలాగే ఆయన బిచ్చగాడిలా రోడ్ల మీద తిరుగుతున్నారని తెలిసింది.

గ్వాలియర్‌లో ఝాన్సీ రోడ్డు ప్రాంతంలో ఏళ్లుగా వీధుల్లో బికారిగా తిరుగుతున్న మనీశ్ మిశ్రా మధ్య ప్రదేశ్ పోలీస్ విభాగంలో 1999 బ్యాచ్ అధికారి.

ఆయన చాలా మంచి షూటర్.

నగరంలో ఓట్ల లెక్కింపు రోజు రాత్రి భద్రత వ్యవస్థను పర్యవేక్షించే బాధ్యత డీఎస్పీలైన రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ బదౌరియాలకు అప్పగించారు.

ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత విజయీ జులూస్ మార్గంలో గస్తీ తిరుగుతున్న వాళ్లిద్దరికీ దారి పక్కన చలిలో వణుకుతున్న మనీశ్ మిశ్రా కనిపించారు.

ఆ దీన స్థితిలో ఉన్న బిచ్చగాడు తమ పాత స్నేహితుడని తెలిసి ఆ అధికారులిద్దరూ ఆశ్చర్యపోయారు.

మనీశ్ మిశ్రా

ఫొటో సోర్స్, SHUREIH NIAZI / BBC

మానసిక స్థితి సరిగ్గా లేక...

"మనీశ్ మిశ్రా మానసిక స్థితి సరిగ్గా లేనందువల్లే ఆయన ఇవాళ ఈ దీన పరిస్థితుల్లో ఉన్నారు.

మొదట్లో ఆయన తన కుటుంబంతో కలిసి నివసించేవారు. అప్పుడప్పుడూ ఇంట్లోంచి పారిపోతూ ఉండేవారు.

కొన్నాళ్లకి ఇంట్లోవాళ్లు కూడా ఆయన మానాన ఆయన్ని వదిలేశారు" అని రత్నేష్ సింగ్ తోమర్ తెలిపారు.

రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ బదౌరియాలతో పాటూ మనీశ్ మిశ్రా కూడా 1999లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరారు.

తమ పాత స్నేహితుడిని అలా దారి పక్కన దీన స్థితిలో చూసి వారిద్దరూ చలించిపోయారు. తమతో పాటూ ఆయన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు కానీ అందుకు మనీశ్ నిరాకరించారు.

తరువాత ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో ఆయన్ని స్వర్గ్ సదన్ ఆశ్రమానికి పంపించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించారు.

మనీశ్ మిశ్రా శివపురిలో నివసించేవారు. ఇప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. తోబుట్టువులు చైనాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు.

మనీశ్ మిశ్రా

ఫొటో సోర్స్, SHUREIH NIAZI / BBC

2005 వరకూ మనీశ్ మిశ్రా ఉద్యోగం చేశారు. అప్పట్లో దతియా జిల్లాలో పోలీసు శాఖలో పనిచేసేవారు. ఆ తరువాత ఆయన మానసిక పరిస్థితి దెబ్బతింది.

మొదట ఐదు ఏళ్లు ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. చికిత్సకోసం ఆయనను ఎన్నిసార్లు చికిత్సా కేంద్రాలలోనూ, ఆశ్రమాల్లోనూ చేర్పించినా అక్కడనుంచీ పారిపోతుండేవారు. ఆయన ఎక్కడికి వెళిపోయేవారో కుటుంబానికి కూడా తెలిసేది కాదు. భార్యతో విడాకులు అయిపోయాయి.

మనీశ్ బ్యాచ్‌మేట్‌లు ఇద్దరూ ఆయన్ను కలవడానికి తరచూ ఆశ్రమానికి వెళుతున్నారు. తమ స్నేహితుడు సాధారణ జీవితం గడపడానికి కావాలసిన సహాయాన్ని అందించడానికి వారు తయారుగా ఉన్నారు.

"మనీశ్ స్నేహితులిద్దరూ తరచూ వచ్చి చూసి వెళుతుండడమే కాకుండా, ఆయన సాధారణ జీవితం ప్రారంభించడానికి కావలసిన సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. తమ స్నేహితుడు కోలుకుని మామూలు జీవితం ప్రారంభించాలని వారిద్దరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు" అని సూర్యవంశీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)