తమిళనాడు: ప్లే స్కూల్స్ కావు... ఇవి పోలీస్ స్టేషన్లు

పోలీస్ స్టేషన్

ఈ ఫోటో చూసి ‘ఇది ఏదో ప్లే స్కూల్‌లోని తరగతి గదిలా ఉందే’ అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే. తమిళనాడులోని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ కార్నర్లు ఇవి.

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌తో కలిసి తమిళనాడు పోలీసులు దేశంలోనే మొదటిసారి ఇలా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ కార్నర్లు మొదలుపెట్టారు.

తిరుచిరాపల్లి సర్కిల్‌లో పది చోట్ల వీటిని పెట్టారు.

పోలీస్ స్టేషన్

పిల్లలపై జరిగే హింసాత్మక నేరాలకు సంబంధించిన విచారణ పద్ధతి, బాల నేరస్థుల విషయంలో తీసుకోవాల్సిన సంస్కరణ చర్యలను సూచిస్తూ 2015లో జువైనెల్ జస్టిస్ చట్టం ఆమోదం పొందింది.

ఈ చట్టం ప్రకారం బాల నేరస్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకురాకూడదు. పోలీసు దుస్తుల్లో విచారణ కూడా చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వారిని అరెస్టు చేయకూడదు, లాకప్‌లోనూ పెట్టకూడదు.

ఇక ఏవైనా ఫిర్యాదుల విషయంలో స్టేషన్లకు వచ్చే పిల్లలకు సరైన వాతావరణం, స్నేహపూర్వక పరిస్థితులు కల్పించేలా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ కార్నర్‌ను ఏర్పాటు చేయాలి.

డీఐజీ అన్నీ విజయ నేతృత్వంలో తిరుచిరాపల్లి సర్కిల్‌లో ఐదు జిల్లాల్లో రెండేసీ చొప్పున... మొత్తం పది చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్లు పెట్టారు.

పోలీస్ స్టేషన్

ఈ కార్నర్లకు వచ్చే పిల్లలు భయపడకుండా గోడలపై అందమైన బొమ్మలు వేయించారు. ఆయా పోలీస్ స్టేషన్లలోనూ శాంతిభద్రతల ఇన్స్పెక్టర్ నేతృత్వంలో మహిళా పోలీసులు ఈ కార్నర్లలో ఫిర్యాదులు స్వీకరిస్తారని డీఐజీ అన్నీ విజయ చెప్పారు.

‘‘చాలా మంది మహిళలు తమ పిల్లలను వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు వస్తుంటారు. అందుకే, పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేశాం. శాంతిభద్రతల విభాగంలో ఇతర ఫిర్యాదుల విషయంలో వ్యవహరించనట్లే చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్‌లో తీసుకునే ఫిర్యాదులకు సంబంధించి కూడా వ్యవహరిస్తాం. కానీ, ఈ కార్నర్లలో మహిళా అధికారులు ఉంటారు’’ అని అన్నీ విజయ చెప్పారు.

‘‘పిల్లలపై వచ్చే ఫిర్యాదుల సంఖ్యలో తమిళనాడు ఐదు స్థానంలో ఉంది. పిల్లలు హింస ఎదుర్కోకుండా, ఫిర్యాదుల ప్రక్రియ కూడా సులభంగా ఉండేలా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌తో కలిసి తిరుచిరాపల్లి సర్కిల్‌లో పోలీస్ శాఖ చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్లను ఏర్పాటు చేసింది. వీటిలో వచ్చే ఫిర్యాదులపై విచారణను పోలీసు అధికారులతో పాటు, శిశు సంక్షేమ అధికారులు కూడా చేపడతారు’’ అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆనంద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)