బరాక్ ఒబామా: 'తప్పుడు కుట్ర సిద్ధాంతాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఒక పదవీకాలం సరిపోదు'

అమెరికా ప్రజల్లో చీలికలు తెచ్చిన "విచిత్రమైన కుట్రపూరిత సిద్ధాంతాల" సంస్కృతిని తిరగరాయాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడు దేశం పై ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
ఒబామా నవంబరులో విడుదల చేయనున్న స్వీయ అనుభవాలతో కూడిన పుస్తకం గురించి చరిత్రకారుడు డేవిడ్ ఒలుసోగకి ఇంటర్వ్యూ ఇచ్చారు. బీబీసీ ఆర్ట్స్ కోసం చేసిన ఆ ఇంటర్వ్యూలో ఆయన, అమెరికాలో నాలుగేళ్ల కిందట డోనల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికయినప్పుడే ఈ చీలికలు వచ్చాయని అన్నారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావడం ఈ విభజనలను సరిదిద్దడానికి ఒక ఆరంభం మాత్రమే అన్నారు. ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి ఒక ఎన్నికలు సరిపోవని, కనీసం రెండు పదవీ కాలాల అవసరం ఉంటుందని చెప్పారు.
సామాజిక విభజన రేఖలను చక్కదిద్దే బాధ్యత కేవలం రాజకీయ నాయకుల నిర్ణయాల పైనే వదిలేయడానికి లేదని, నిర్మాణాత్మక మార్పులు జరిగి , ప్రజలు ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి కూడా రావాలని అన్నారు. ఈ పరిస్థితి గురించి ఏమి చేయాలనే వాదనలు చేసుకోవడం కన్నా అందరూ కలిసి ఒక సాధారణ అంగీకారానికి రావాలని సూచించారు.
అయితే, భావి తరాల అధునాతన ఆలోచనా వైఖరి పట్ల ఆశావహంగా ఉన్నానని ఆయన అన్నారు. యువత కూడా ప్రపంచం మారుతుందనే ఆశావహ దృక్పధాన్ని అలవర్చుకుని ఆ మార్పులో వారు కూడా భాగం కావాలని పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో విభజనలు ఎలా రగులుకున్నాయి?
సమాజంలో సత్యం దెబ్బతిందని, క్షీణించిందని ఒబామా అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య పెరిగిన కోపం, ఆగ్రహం, వలసలు, అసమానత్వం లాంటి అన్యాయాలు, కొన్ని విచిత్రమైన కుట్ర పూరిత సిద్ధాంతాలు ఈ క్షీణదశను ప్రేరేపించాయన్నారు. అవి అమెరికా మీడియా సంస్థల వలన మరింత రెట్టింపయ్యాయని కొందరు అంటారు. ఇవే భావాలు సోషల్ మీడియా ద్వారా ద్విగుణీకృతమై టర్బో ఛార్జ్ అయ్యాయని ఒబామా అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుతం మనం చీలిపోయి ఉన్నాం. నేను 2007లో అధ్యక్ష పదవికి పోటీ చేసి 2008లో ఆ పదవికి ఎన్నిక అయినప్పటి కంటే ఇప్పుడు కచ్చితంగా ఎక్కువగా విభజనకు గురయ్యాయి" అని ఒబామా అన్నారు.
"ఈ విభజనలను కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పెంచి పోషించుకోవాలని చూసిన ట్రంప్ కూడా దీనికి కొంత వరకు కారణమని ఆరోపించారు. ఆన్ లైన్ లో విస్తృతంగా ప్రచారం అయిన తప్పుడు సమాచారం కూడా ఈ విభజనలకు ఊపిరి పోసింది" అని ఆయన అంటారు.
జో బైడెన్ ఒక సోషలిస్ట్ అని, హిల్లరీ క్లింటన్ పిల్లల పట్ల లైంగిక అకృత్యాలను ప్రేరేపించి సొమ్ము చేసుకునే కుట్రదారుల ముఠాకు చెందినవారేనంటూ పుట్టుకొచ్చిన తప్పుడు సిద్ధాంతాల్ని లక్షలాది మంది ప్రజలు నమ్మారని ఆయన అన్నారు.
వాషింగ్టన్‌లోని ఒక పిజ్జా రెస్టారెంటు నుంచి డెమొక్రటిక్ నాయకులు బాలల పట్ల లైంగిక అకృత్యాలను ప్రేరేపించే వ్యవస్థను నడిపిస్తున్నారని, అందులో హిల్లరీ కూడా ఉన్నారంటూ పుట్టుకొచ్చిన ఒక అవాస్తవ సిద్ధాంతం గురించి ఆయన ఉదహరించారు.
ఈ పరిస్థితులు చక్కదిద్దడానికి నియంత్రణతో కూడిన ప్రమాణాలు రావాలని అన్నారు. దీనికి అమలు చేయనున్న నిబంధనల పట్ల ఒక సాధారణ అంగీకారానికి రావాలని ఆయన సూచించారు.
ఆన్ లైన్ లో ప్రచారం అయ్యే తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడానికి చాలా సంప్రదాయ మీడియా సంస్థలు ఇప్పటికే ఫ్యాక్ట్ చెకింగ్ ని మొదలు పెట్టాయని, కానీ ఇది సరిపోదని అన్నారు. ఇప్పటికే నిజం తలుపులు దాటి బయటకు వెళ్లే లోపే తప్పుడు సమాచారం ప్రపంచాన్ని చుట్టేసిందని అన్నారు.
సాంఘిక ఆర్ధిక కారణాల వలన గ్రామీణ , నగర ప్రజల మధ్య పెరుగుతున్న అసమానతల వలన కూడా విభజనలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇలాంటి అంశాలన్నిటితో పాటు ఆర్ధిక అభివృద్ధి అనే నిచ్చెన అదుపు తప్పుతుందనే భావనతో తప్పును ఎవరో ఒకరి పైకి నెట్టి ఇది వారి తప్పు అంటే వారి తప్పు అని తోసే పరిస్థితులు యుకె తో సహా ప్రపంచంలో చాలా దేశాలలో కూడా ఉన్నాయని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తప్పుడు సమాచారం ప్రాముఖ్యం సంతరించుకోవడమే ప్రధాన సమస్య
మరియానా స్ప్రింగ్, స్పెషలిస్ట్ డిస్ఇన్ఫర్మేషన్ రిపోర్టర్
ఈ ఏడాది అమెరికా ఎన్నికలలో వైరల్ అయిన కుట్రపూరిత సిద్ధాంతాలతో పాటు, ట్రంప్ అధ్యక్ష కాలంలో ప్రచారమైన ప్రధాన సిద్ధాంతాలు చాలా ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి.
దీనికి కారణం ఆన్ లైన్ లో ప్రచారమైన తప్పుడు సమాచారంలో దాగిన కుట్రపూరిత ఉద్దేశ్యాలు కేవలం ఇంటర్నెట్ చీకటి కోణాలకే పరిమితం కాలేదు. వీటిని సోషల్ మీడియాలో ఎక్కువ సంఖ్యలో అనుచరులు ఉన్న కొంత మంది ప్రముఖులు కూడా ప్రచారం చేశారు. ఉదాహరణకు వైట్ హౌస్ కూడా ఇలాంటి ప్రచారాలకు కొంత వరకు సమర్ధతను ఇచ్చింది.
విభజితమైన ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రచారమయ్యే ప్రతీ అంశమూ నిజం కంటే అభిప్రాయానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఇక్కడ మనకి ఇష్టమైన వారిని మనం ఎన్నుకునే అవకాశం ఉండటంతో ఈ కుట్రలు, తప్పుడు సమాచారం ప్రచారం పుట్టి పెరగడానికి ఒక ఫలవంతమైన కేంద్రంగా తయారయింది. సోషల్ మీడియాను వాడి పరిశోధన చేసే చాలా మంది తప్పుడు అభిప్రాయాలను ఏర్పర్చుకునే అవకాశం కలిగింది. పక్షపాత ధోరణితో పని చేసే మీడియా సంస్థలు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని వాటిని మరింత పెంచి పోషించే ప్రమాదం ఉంది.
బరాక్ ఒబామా చెప్పినట్లు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మీడియా సంస్థలు కానీ ప్రముఖులు కానీ ప్రచారం చేసినప్పుడు వాటిని తిప్పి కొట్టడానికి బదులు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. కేవలం వాస్తవాలను తెలియచేయడమే దీనికి పరిష్కారం కాదు. ఆ వాస్తవం నిలిచే ఉండేటట్లు కూడా చేయగలగాలి. ఆన్ లైన్ లో ప్రచారం అయ్యే కుట్రపూరిత సిద్ధాంతాల పట్ల ప్రజలు పదే పదే ఎందుకు ఆకర్షితులవుతారో కూడా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.
ఆన్ లైన్ లో కుట్రపూరిత సిద్ధాంతాలకు బలై వీటి వలన కలిగే హాని, విభజనలు గురించి తెలుసుకోవడం కోసం కొంత మంది వ్యక్తులతో నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను. ఈ నష్టాన్ని హానిని తిరిగి సరిదిద్దడం ఎంత సంక్లిష్టమైనదో అర్ధం అవుతూ ఉంటుంది.
నల్ల జాతీయుల జీవితాలు కూడా ముఖ్యమే...
"అమెరికా చరిత్రలోనే ఉన్న ఒక ముఖ్యమైన తప్పిదం జాతి- అది మనం నిజంగా చేసుకున్న పాపం " అని అమెరికా తొలి నల్ల జాతి అధ్యక్షునిగా పదవిని చేపట్టిన ఒబామా అన్నారు.
గత వేసవిలో పోలీసు కస్టడీలో మరణించిన జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతీయుని ఉదంతంతో అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన స్పందనలతో ఒక నిరుత్సాహాన్ని, ఒక ఆశావహ దృక్పధాన్ని కూడా కలుగ చేశాయి" అని ఆయన అన్నారు.
" నేర న్యాయ విధానంలో జాతి వివక్ష, పక్షపాతం ఇంత బహిరంగంగా ఉండటం పట్ల నిస్సహాయత... గతంలో ఎన్నడూ లేనంతగా దీని పట్ల విపరీతంగా, శాంతియుతంగా స్పందించిన ఉద్యమకారులు - ఒక ఆశావహ దృక్పధాన్ని కలిగిస్తున్నాయి.
ఈ నిరసనల్లో అన్ని జాతుల వారు పాల్గొనడం ఇంకొక విశేషం అని ఆయన అన్నారు. 2012 లో ఫ్లోరిడా టీనేజర్ ట్రేవన్ మార్టిన్ వాచ్ వాలంటీర్ జార్జి జిమ్మెర్మాన్ చేతిలో హతమైనప్పుడు వచ్చిన స్పందనలు భిన్నంగా ఉన్నాయి .
2014 లో మిస్సోరి లో ఒక 18 సంవత్సరాల నల్ల జాతీయుడు మైకేల్ బ్రౌన్ కూడా ఒక శ్వేత జాతి పోలీసు ఆఫీసర్ చేతిలో కాల్పులకు గురవడాన్ని కూడా ఒబామా గుర్తు చేసారు.
ఆ ఘటనలన్నీ అమెరికాలో ప్రజల భావాలను రగిల్చినప్పటికీ, జాతి, న్యాయం పట్ల ఒక చర్చను లేవదీసినప్పటికీ , అప్పటికి చాలా మంది శ్వేత జాతీయులు ఇది ఎక్కడో ఒక చోట జరిగే ఒక చిన్న ఘటనగానే చూసారు అని ఆయన అన్నారు.
"ఈ వేసవిలో మాత్రం నల్ల జాతీయులు తక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా "బ్లాక్ లైవ్స్ మేటర్" అంటూ మాట్లాడటం మాత్రం నిజమైన మార్పుకు సూచిక అని ఆయన అన్నారు.
ఒబామా ఆయన రాసిన స్వీయ అనుభవాల పుస్తకం "ఏ ప్రోమిస్డ్ ల్యాండ్" లో ఆయన అమెరికా సెనేట్లో ఎదుగుదల, అధ్యక్ష కాలంలో ఆయన అనుభవాల గురించి రాసారు. ఇది నవంబరు 17న విడుదల కానున్నది. ఆయన వైట్ హౌస్ జీవితాన్ని తెలియచేసే రెండు పుస్తకాలలో ఇది మొదటిది.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- కఠినమైన సవాళ్ల నడుమ ‘కమలం’ ఎలా వికసించింది
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








