రాయల్ ఎన్‌ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు

మంగ్లి

ఫొటో సోర్స్, facebook/manglisinger

    • రచయిత, జస్టిన్ హార్పర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోని అతిపెద్ద మోటార్ సైకిల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే ఉద్దేశంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బ్రాండ్‌ను శరవేగంగా విస్తరిస్తోంది.

ప్రపంచంలో అత్యంత పురాతన మోటార్ సైకిల్ బ్రాండ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఇప్పటికీ దానిని చాలా మంది ఇష్టపడుతున్నారు.

భారత మార్కెట్లో మంచి అమ్మకాలు నమోదు చేసిన ఈ కంపెనీ యాజమాన్య హక్కులు 1994 నుంచి భారత్‌లో ఐషర్ గ్రూప్ దగ్గరే ఉన్నాయి.

ఈ కంపెనీ ఇప్పుడు ఆసియాలో తన అమ్మకాలను పెంచుకోవాలని అనుకుంటోంది. ఇటీవల థాయ్‌లాండ్‌లో కూడా ఒక కొత్త ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

భారత వినియోగదారులు ఈ మోటార్ సైకిల్ స్టైల్, దాని వారసత్వాన్ని ఇష్టపడుతున్నారని రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ దాసరి బీబీసీతో అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/AFP VIA GETTY IMAGES

"మేం మెరుగైన మోటార్ సైకిళ్లు తయారుచేస్తాం. వాటి ధర కూడా ఎక్కువ ఉండదు. దానితోపాటూ మేం కేవలం భారత్ కోసమ కాకుండా, మొత్తం ప్రపంచం కోసం మోటార్ సైకిళ్లను తయారుచేస్తున్నాం" అన్నారు.

థాయ్‌లాండ్‌లో నిర్మించబోయే ఫ్యాక్టరీలో 12 నెలల్లోపే పనులు ప్రారంభమవుతాయని కంపెనీ ఆశిస్తోంది. భారత్ తర్వాత ఈ కంపెనీ అతిపెద్ద ఫ్యాక్టరీ ఇదేనని భావిస్తున్నారు.

వియత్నాం, మలేసియా, చైనా లాంటి ఆగ్నేయాసియా దేశాలకు తమ మోటార్ సైకిళ్లను ఎగుమతి చేయడానికి ఈ ఫ్యాక్టరీని కంపెనీ ఒక ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మార్చాలనుకుంటోంది.

దానికి చాలా పెద్ద ప్రణాళికలు రూపొందించామని, మరో మూడు నుంచి ఐదేళ్లలో ప్రతి త్రైమాసికానికి ఒక కొత్త మోటార్ సైకిల్ లాంచ్ చేయాలని అనుకుంటున్నామని వినోద్ దాసరి చెప్పారు

"మాకు ఆసియా పసిఫిక్ చాలా ముఖ్యమైన మార్కెట్. మాకు మా వినియోగదారులు చాలా ముఖ్యం. వారు మా నుంచి కాస్త మెరుగైనదే కోరుకుంటారు" అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్

ఫొటో సోర్స్, Getty Images

బుల్లెట్‌లా దూసుకెళ్లేందుకు

మోటార్ సైకిల్ రైడింగ్ ఆసియాలో ఒక గట్టి సంప్రదాయం. మోటార సైకిల్ అమ్మకాల విషయంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో థాయ్‌లాండ్, ఇండోనేసియా, వియత్నాం ఉన్నాయి.

ఈ దేశాల్లో కిక్కిరిసిన రోడ్లపై, ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకుని వేగంగా ముందుకు దూసుకెళ్లాలంటే మోటార్ సైకిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

మోటార్ సైకిల్ విక్రయాల గత ఏడాది గణాంకాలను చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఈ దేశాల్లో 88 శాతం ఉన్నాయి. ఈ కంపెనీ 250-750 సీసీ క్లాస్ మిడ్-సెగ్మెంట్‌ మోటార్ సైకిళ్లను మాత్రమే తయారు చేస్తుంది.

కానీ, ఆసియాలోని అన్ని మోటార సైకిల్ కంపెనీలు ఈ స్థాయిలో విజయవంతం కావడం లేదు.

ఒకవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మోటార సైకిళ్లను ఆసియా అంతటా విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తుంటే, మరోవైపు హార్లీ డేవిడ్‌సన్ లాంటి కంపెనీలు ఈ ప్రాంతాల్లో తమ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్

ఫొటో సోర్స్, Getty Images

"హార్లీ-డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్లను భారత్‌లో ఖరీదైనవిగా భావిస్తారు. దేశంలో రోడ్లు, ప్రభుత్వ ట్రాఫిక్ నిబంధనలు లాంటివి మోటార్ సైకిల్‌ను ఎక్కువ వేగంతో నడపడానికి అనుకూలంగా ఉండవ"ని ఫ్రాస్ట్ అండ్ సులివన్‌ ట్రాన్స్ పోర్ట్ నిపుణుడు వివేద్ వైద్య చెప్పారు.

"హార్లీ డేవిడ్‌సన్ తక్కువ శక్తి ఇంజన్ కూడా తయారుచేయడం ప్రారంభించింది. కానీ అది దానిలో కూడా ఎక్కువ సక్సెస్ కాలేకపోయింది. ఈ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డుతో పోటీపడడం అంత సులభం కాదు" అన్నారు.

హార్లీ డేవిడ్‌సన్‌తో పోలిస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తులు మోటార్ సైకిల్ వినియోగదారులకు మెరుగ్గా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

"నడపడం సులభంగా ఉండడంతోపాటూ, దాని సింపుల్ డిజైన్, క్లాసిక్ వింటేజ్ స్టైల్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను వినియోగదారులు ఎక్కువ ఇష్టపడతార"ని మోటార స్పోర్ట్ కన్సల్టెంట్ స్కాట్ లుకైటిస్ అంటున్నారు.

"రాయల్ ఎన్‌ఫీల్డ్ తక్కువ ఖర్చులో తమ వినియోగదారులకు స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేసే అవకాశం అందిస్తోంది. అంతేకాదు, వినియోగదారులకు ఆ మోటార్ సైకిళ్ల గురించి పెద్దగా సాంకేతిక సమాచారం అవసరం ఉండదు. వారికి మెయింటనెన్స్ ఖర్చు కూడా ఎక్కువ రాదు" అన్నారు.

"రాయల్ ఎన్‌ఫీల్డ్ వారసత్వం వినియోదారులను ఆకర్షిస్తోంది. కంపెనీ తన ఉత్పత్తిని మాత్రమే అమ్మడం లేదు. ఆ ఉత్పత్తితోపాటూ దాని ఎన్నో ఏళ్ల అనుభవాన్ని కూడా అందిస్తోంద"ని వినోద్ దాసరి చెప్పారు.

లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ మోటార్ సైకిల్‌ను రెండో ప్రపంచ యుద్ధం ప్రత్యేక గ్లైడర్ 'ఫ్లయింగ్ ఫ్లీ'కి గుర్తుగా 2018లో తయారుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ మోటార్ సైకిల్‌ను రెండో ప్రపంచ యుద్ధం ప్రత్యేక గ్లైడర్ 'ఫ్లయింగ్ ఫ్లీ'కి గుర్తుగా 2018లో తయారుచేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్ర

  • 1893- సైకిల్ తయారు చేసే ఈ కంపెనీ మొదట ఎన్‌ఫీల్డులోని రాయల్ స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ కోసం విడిభాగాలు తయారుచేసేది. తర్వాత అది తన పేరును రాయల్ ఎన్‌ఫీల్డ్ అని పెట్టుకుంది.
  • 1901- ఈ కంపెనీ బ్రిటన్‌లో మోటార్‌తో నడిచే తన మొదటి సైకిల్ తయారుచేసింది.
  • 1914-18 - మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, అమెరికా, రష్యా సైన్యం కోసం మోటార్ సైకిళ్లు సప్లై చేసింది.
  • 1932 - కంపెనీ తన మొదటి బుల్లెట్ మోటార్ సైకిల్ తయారుచేసింది. దానిలో ప్రత్యేకంగా స్లోపర్ ఇంజన్ ఉపయోగించారు. ఈ మోడల్‌ చాలామందికి నచ్చింది.
  • 1939-1945 - రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ సైన్యం కోసం మోటార్ సైకిల్‌తోపాటూ సైకిల్ జనరేటర్, యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్ తయారీ కూడా ప్రారంభించింది. పారాచూట్, గ్లైడర్ ఉపయోగించే సైనికుల కోసం 'ఫ్లయింగ్ ఫ్లీ' పేరుతో గ్లైడర్ కూడా ఉత్పత్తి చేసింది.
  • 1960 - అది సంప్రదాయ మోటార సైకిళ్ల కాలం. ఆ సమయంలో చాల కంపెనీలు మోటార్ సైకిళ్ల మార్కెట్లో అడుగుపెట్టాయి. వాటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఒకటి.
  • 1970 - కంపెనీ బ్రిటన్‌లో తన ఉత్పత్తి నిలిపివేసింది. భారత్‌లోని దాని సహచర కంపెనీ ఎన్‌ఫీల్డ్ ఇండియా ఉత్పాదనను తమ చేతుల్లోకితీసుకుంది.
  • 1994 - భారత్‌లోని ఐషర్ మోటార్స్ ఎన్‌ఫీల్డ్ ఇండియాను కొనుగోలు చేసింది. దాంతో, కంపెనీ పేరు మళ్లీ మార్చి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్స్ లిమిటెడ్‌ అని పెట్టారు.
  • 2020 - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కు బ్రిటన్ ఇప్పటికీ ప్రతిష్టాత్మక మార్కెట్‌గా నిలిచింది. మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ కేటగిరీలో కంపెనీకి చెందిన 'ఇంటర్‌సెప్టర్ 650' ఇక్కడ అత్యధికంగా అమ్ముడవుతోంది.

వచ్చే ఏడాదికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ 120 ఏళ్లు పూర్తి కాబోతోంది. కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉన్న భారత్‌లో ఈ సందర్భంగా ఏదైనా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కంపెనీ ఇప్పటివరకూ ఏ ప్రకటనా చేయలేదు.

కరోనా తర్వాత ఆసియా మోటార్ సైకిల్ మార్కెట్ మరోసారి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు.

"కలిసి తిరగడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే భయంతో జనం ప్రజా రవాణాలో తిరగడానికి బదులు ప్రైవేటు వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో చౌక రవాణా సాధనంగా మోటార్ సైకిల్ మార్కెట్ భవిష్యత్ ఉజ్వలంగా కనిపిస్తోంద"ని వివేక్ వైద్య అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)