బిహార్ ఎన్నికలు: బీజేపీకి మాయావతి మద్దతు, అసదుద్దీన్ ఒవైసీ మౌనం.. తెరవెనుక ఏం జరుగుతోంది?

ఒవైసీ, మాయావతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సమాజ్‌వాదీ పార్టీని ఓడించడానికి అవసరమైతే తమ పార్టీ, బీజేపీకి మద్దతు ఇస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు.

కొంతమంది బీఎస్‌పీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాది పార్టీలో చేరిన తరువాత, ఉత్తర ప్రదేశ్‌లో జరగనున్న శాసన మండలి ఎన్నికల సందర్భంగా మాయావతి గురువారం వార్తా సంస్థ ఏఎన్ఐ ద్వారా ఒక వీడియో ప్రకటన జారీ చేసారు.

"ఇక్కడ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) అభ్యర్థిని ఓడించడానికి బీఎస్‌పీ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీనికోసం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రత్యర్థులను (ఎస్‌పీ) ఓడించడానికి అవసరమైతే బీజేపీ లేదా మరే ఇతర పార్టీకైనా ఓటు వెయ్యాల్సి వస్తే తప్పకుండా వేస్తారు" అని మాయావతి తెలిపారు.

ఈ ప్రకటన వెనుక కారణం ఏమిటి?

శాసన మండలి ఎన్నికల సందర్భంగా మాయావతి ఈ ప్రకటన విడుదల చేసారు. కానీ, నిజానికి నవంబర్ 9న జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటన చేసారని అనుకోవచ్చు.

యూపీలో పది రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో తన బలం ఆధారంగా బీజేపీ ఎనిమిది స్థానాలను చేజిక్కించుకోగలదు. మరొక పార్టీ మద్దతుతో తొమ్మిదవ స్థానాన్ని కూడా గెలుచుకోగలదు. కానీ బీజేపీ తన తొమ్మిదవ అభ్యర్థిని ఎంపిక చేయలేదు.

మాయావతి దగ్గర కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. గెలవాలంటే కనీసం 37 మంది ఎమ్మెల్యేలు కావాలి. అయినప్పటికీ, రాంజీ లాల్ గౌతంను తమ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టారు.

మాయావతి, బీజేపీల మధ్య పొత్తు కుదిరిందని, తమ మిగిలిన 24 ఓట్లను మాయవతి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వేస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు విశ్లేషకులు అంటున్నారు.

వాస్తవానికి తన ఏడుగురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాది పార్టీలో చేరినప్పటినుంచీ మాయావతి చిక్కుల్లో పడ్డారు. పైగా, రాంజీ లాల్ గౌతం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు తమ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యూపీ ఇంఛార్జి ప్రియాంకా గాంధీ... మాయావతి ప్రకటన తరువాత "దీని తరువాత ఇంకా ఏమైనా మిగిలి ఉందా?" అంటూ ట్వీట్ చేసారు.

బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త

ఫొటో సోర్స్, Virendra Singh Gosain/Hindustan Times via Getty Im

సమాజ్‌వాది పార్టీ ఏమంటోంది?

సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ...మాయావతి చేసిన ప్రకటన ద్వారా బీఎస్‌పీకి, బీజేపికి ముందే పొత్తు కుదిరిందని నిర్థరణ అవుతోందని అన్నారు.

బీజేపీతో ఒప్పందం కారణంగానే మాయావతి, అసెంబ్లీలో తగినంత బలం లేకపోయినప్పటికీ తమ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించారని, ఇప్పుడు ఎస్‌పీని ఓడించడానికి అవసరమైతే బీజేపీకి ఓటు వెయ్యడానికి కూడా రెడీ అని ప్రకటించారు. మాయావతి తన బండారాన్ని తానే బయటపెట్టుకున్నారని ఆయన అన్నారు.

"ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తే మాయావతి తనకు తానే అమోయమయంలో ఉన్నట్టు తోస్తోందని" లఖ్‌నవూకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సునీత అరోన్ అభిప్రాయపడ్డారు.

సునీత అరోన్ బీబీసీతో మాట్లాడుతూ.."మాయావతి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కొత్త విషయమేమీ కాదు. కానీ జరుగుతున్నవాటిని పరిశీలిస్తే, ఈ సమయంలో ఏం చెయ్యాలో ఆవిడ నిర్ణయించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది. బిహార్‌ని చూడండి...అక్కడ ఆవిడ ఒవైసీతో పొత్తు పెట్టుకున్నారు. ఇతర రాష్ట్రాలలో ఆవిడ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. యూపీ ప్రభుత్వంపై కూడా కినుక వహించినట్లు అప్పుడప్పుడు ట్విటర్‌లాంటి సోషల్ మీడియాలో ప్రకటిస్తుంటారు. కానీ ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం చెందినట్లు కనిపించలేదు" అని అన్నారు.

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో చరిత్ర బోధించే ప్రొఫెసర్ మొహమ్మద్ సజ్జాద్ మాట్లాడుతూ..."గత కొద్దిరోజులుగా బీజేపీకి ఎవరు ఎక్కువ దగ్గరవారో తేల్చుకోవడానికి బిహర్‌లోని లోక్ జనశక్తి పార్టీకి, బీఎస్‌పీకి మధ్య పోటీ జరుగుతోందని" అన్నారు.

"రాంవిలాస్ పాశ్వాన్ మరణం తరువాత ఆయన కుమారుడు, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, ఎన్‌డీఏనుంచీ విడిపోయి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్‌డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ మరో పక్క తాను ప్రధాని నరేద్ర మోదీ బంటును అంటున్నారు" అని ప్రొఫెసర్ సజ్జాద్ వివరించారు.

మాయావతి

ఫొటో సోర్స్, Getty Images

మాయవతి ఏం చెప్పదల్చుకున్నారు?

తమని కూడా తమ పరివారంలో సభ్యులుగా లెక్కించవచ్చని మాయావతి ఈ ప్రకటన ద్వారా బీజేపీకి చెప్పదల్చుకున్నారని ప్రొఫెసర్ సజ్జాద్ అభిప్రాయపడ్డారు.

మాయావతి చేసిన తాజా ప్రకటన ద్వారా బీఎస్‌పీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేస్తారనే కాకుండా సాధారణ దళిత ప్రజలను కూడా బీజేపీకి ఓటు వెయ్యమని సూచించినట్లుగా తోస్తోంది అని ఆయన అన్నారు.

అదే నిజమైతే, ఈ సూచన బిహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా వర్తిస్తుందా?

మాయావతి బిహార్ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం), మోదీ ప్రభుత్వంలో పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ, మరో కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యావద్‌లతో కలిసి పోటీ చేస్తున్నారు.

మాయావతి చేసిన తాజా ప్రకటన తరువాత ఒవైసీ స్పందన ఏమిటని బిహార్‌లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో ఒవైసీ ఇప్పటివరకూ స్పందించలేదు. బీబీసీ, ఒవైసీని, బిహార్ ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ, సాధ్యపడలేదు.

పార్టీ ప్రతినిధి ఆసిం వకార్‌తో బీబీసీ మాట్లాడడానికి ప్రయత్నించగా, ఆయన కాసేపట్లో ఫోన్ చేస్తానని చెప్పి, మళ్లీ ఫోన్ చెయ్యలేదు. మెసేజులకు జవాబు కూడా ఇవ్వలేదు.

ఒవైసీ, మాయావతి పార్టీల కూటమి

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఒవైసీ మౌనానికి కారణమేంటి?

మాయావతి, కుష్వాహలతో పొత్తు పెట్టుకునేముందే ఒవైసీ బిహార్ ఓటర్ల ముందు తన స్థానాన్ని స్పష్టం చేసి ఉండాల్సిందని ప్రొఫెసర్ సజ్జాద్ అభిప్రాయపడ్డారు.

"గత కొన్నేళ్లుగా దళితులను బీజేపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో బీజేపీ మద్దతుతో మాయావతి యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఇటీవల సంవత్సరాలలో కూడా ఆవిడ వైఖరి బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తోస్తోంది."

"ఒవైసీ ఎప్పుడూ ముస్లింల సాధికారత, గుర్తింపు, అధికారంలో భాగస్వామ్యం గురించి మాట్లాడతారు. మరి మాయావతి, కుష్వాహలతో చేతులు కలిపాక బిహార్‌లో ముస్లింల సాధికారత ఎలా సాధ్యమవుతుందో ఆయనే చెప్పాలి. మాయావతి తాజా ప్రకటన నేపథ్యంలో, నవంబర్ 10 న బిహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వారితో పొత్తు, పార్టీ పరిస్థితి ఏమిటో ఒవైసీ చెప్పాలి" అని ప్రొఫెసర్ సజ్జాద్ తెలిపారు.

పాట్నాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సురూర్ అహ్మద్ కూడా మాయావతి తాజా ప్రకటన దళితులకు ఇస్తున్న ఒక సూచనగానే భావిస్తున్నట్లు తెలిపారు.

"సమాజ్‌వాదీ పార్టీని ఓడించడం వరకూ సమ్మతమేగానీ బీజేపీకి ఓటు వేస్తామని ఎలా అనగలరు? ఈ విషయంలో ఒవైసీ ఎలా మౌనంగా ఉండగలరు?"

"తన మొత్తం రాజకీయాలు హిందుత్వ పార్టీలకు, ముఖ్యంగా ప్రధాని మోదీకి వ్యతిరేకమని ఒవైసీ పలుమార్లు వెల్లడించారు. మరిప్పుడు, తన కూటమిలో ఒక భాగం బీజేపీకి మద్దతు ఇవ్వడం గురించి ఎలా మాట్లాడగలరు?" అని సురూర్ అహ్మద్, బీబీసీతో తన అభిప్రాయం వెల్లడించారు.

బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందనీ, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ర్యాలీలకు భారీగా జనం తరలి వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"బిహార్‌లో ఈసారి గడ్డు పరిస్థితి ఏర్పడవచ్చు. నవంబర్ 10 న ఎవరికీ తగినంత మెజారిటీ లభించకపోవచ్చు. అలాంటప్పుడు ఒవైసీ, మాయావతి, కుష్వాహల కూటమి కొన్ని స్థానాలు గెలిస్తే ఏం చేస్తారో తెలుసుకునే హక్కు బిహార్ ఓటర్లకు ఉంది. ఈ కూటమి ఎన్‌డీఏకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయా?" అని సురూర్ అహ్మద్ అన్నారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, Diwakar Prasad/Hindustan Times via Getty Images)

లౌకికవాదాన్ని బలపరచడంలో ఒవైసీ పాత్ర ఏమిటి?

ఈసారి ఒవైసీ ర్యాలీలలో కూడా అధిక సంఖ్యలో జనం కనిపిస్తున్నారు. సీమాంచల్ (కిషన్‌గంజ్, అరరియా, కటిహార్, పూర్ణియా) ప్రాంతాలలో ఒవైసీకి ఎక్కువ మద్దతు ఉంది. ఈ ప్రాంతాల్లో ఎన్నికలు చివరి దశలో నవంబర్ 7 న జరగనున్నాయి.

ప్రస్తుత అసెంబ్లీలో కిషన్‌గంజ్‌నుంచీ ఆయన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌గంజ్‌నుంచీ ఆయన పార్టీ ఎంపీ అభ్యర్థి ఓడిపోయారుగానీ దాదాపు మూడూ లక్షల ఓట్లు సాధించారు.

సీమాంచల్ ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఒవైసీకి, ఆయన పార్టీకి అక్కడ మద్దతు పెరిగింది. మాయావతి ప్రకటనపై ఒవైసీ ఎందుకు మౌనంగా ఉన్నారన్న సంగతి అక్కడి ముస్లిం ప్రజలు తెలుసుకోవాలనుకుంటారని" సురూర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

బీజేపీ, ముస్లిం వ్యతిరేక పార్టీ అని ఒవైసీ పలుమార్లు ప్రస్తావించారు. కానీ లౌకికవాద పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్, ఇతర పార్టీలు ముస్లింలకు ఇవ్వవల్సిన హక్కులు ఇవ్వలేదు. బీజేపీ పేరు చెప్పి వాళ్లకు కోపం తెప్పించి ఓట్లు మాత్రం దండుకున్నారు.

"కాంగ్రెస్, ఇతర పార్టీలు లౌకికవాదాన్ని ఒక గుర్తుగానే వాడుకున్నాయని, ఆచరణలో ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకోసం ఏమీ చెయ్యలేదన్న ఒవైసీ ఆరోపణలు కొంతవరకూ నిజమే" అని ప్రొఫెసర్ సజ్జాద్ అభిప్రాయపడ్డారు.

అయితే, ఒవైసీ ఇంకా ఎన్నాళ్లు ముస్లిం సాధికారత గురించే మాట్లాడతారు? లౌకికవాదాన్ని బలోపేతం చెయ్యడం కోసం ఆయనేం చేస్తున్నారని ప్రొఫెసర్ సజ్జాద్ ప్రశ్నిస్తున్నారు.

"బిహార్‌లో సీమాంచల్‌పై మాత్రమే దృష్టి పెడతారా లేక బిహార్ మొత్తం వ్యాపించే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఓవైసీ నిర్ణయించుకోవాలి. సీమాంచల్ అభివృద్ధి గురించి ప్రస్తావించారుగానీ మొత్తంగా బిహార్ ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ గురించి ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. దీన్నిబట్టి సీమాంచల్ పేరుతో వారు ముస్లిం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. మరి లౌకికవాద పార్టీలు కూడా ఇలాంటి రాజకీయలు చేస్తే ఎలా" అని ప్రొఫెసర్ సజ్జాద్ అన్నారు.

ఒవైసీ

ఫొటో సోర్స్, Sanjeev Verma/Hindustan Times via Getty Images

మయావతి ప్రకటనతో బిహార్‌లో కూటమిపై సవాళ్లు

మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, బిహార్‌లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ జనతా దళ్...మాయావతి, కుష్వాహలతో ఒవైసీ పొత్తును ఎలా ప్రశ్నించగలరని ఒవైసీ మద్దతుదారులు అంటున్నారు.

"కాంగ్రెస్‌ను నిస్సందేహంగా ప్రశ్నించవచ్చు. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేదు. శివసేన తీవ్ర స్థాయిలో హిందుత్వ రాజకీయాలు చేసినప్పటికీ బీజేపీతో విడిపోయి, కాంగ్రెస్, ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాక వారి విధానాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీసుకుంటున్న నిర్ణయాల్లోనూ, విధానాల్లోనూ స్పష్టంగా మార్పు కనిపిస్తోందని" సురూర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

"ఒవైసీ తన ఎన్నికల ప్రచారంలో రాష్ట్రీయ జనతాదళ్‌ను కూడా విమర్శిస్తున్నారు కానీ నిజానికి ఉత్తర భారతదేశంలో ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే బీజేపీతో ఎప్పుడూ పొత్తు కలపకుండా, ముస్లింలకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలూ చేపట్టకుండా ఉన్నారని" సురూర్ అహ్మద్ తెలిపారు.

మాయావతి తాజా ప్రకటనపై ఒవైసీ స్పందిస్తారో లేదో ఆయనే నిర్ణయించుకోవాలి. కానీ బిహార్ ప్రజలు ఇప్పటికే మాయావతి, ఒవైసీ కూటమిపై వేలెత్తి చూపుస్తున్నారు. మాయావతి ప్రకటన, ఒవైసీపై దాడి చెయ్యడానికి మరో అవకాశం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)