జమ్మూ కశ్మీర్: ‘‘ఎవ్వరినీ వదిలిపెట్టబోమని చెబుతూ జర్నలిస్టులందరికీ గట్టి సందేశం పంపిస్తున్నారు’’

ఆఖిబ్ జావీద్

ఫొటో సోర్స్, Sajid Raina

ఫొటో క్యాప్షన్, ఆఖిబ్ జావీద్
    • రచయిత, అమీర్ పీర్‌జాదా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని గత ఏడాది భారత ప్రభుత్వం రద్దుచేసిన అనంతరం ఇక్కడ జర్నలిస్టులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఇటీవల ఉగ్రవాదంపై పోరాడే భారత సంస్థ.. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ).. ద గ్రేటర్ కశ్మీరీ పత్రిక కార్యాలయంతోపాటు ఏఎఫ్‌పీ జర్నలిస్టు పర్వాయిజ్ బుఖారీ ఇంటిలోనూ సోదాలు చేపట్టిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. ఎన్‌జీవోల కార్యాలయాలతోపాటు శ్రీనగర్‌లోని సామాజిక కార్యకర్తల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది.

భారత్‌ను ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు విదేశీ వ్యక్తుల నుంచి వీరికి నిధులు అందుతున్నాయని తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని, అందుకే సోదాలు చేపడుతున్నామని ఎన్‌ఐఏ చెబుతోంది.

అయితే, కశ్మీర్‌ లోయలో అసమ్మతిని అణచివేయడంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా దీన్ని విమర్శకులు అభివర్ణిస్తున్నారు.

గడిచిన ఏడాదిలో 18 మంది రిపోర్టర్లను పోలీసులు విచారించారు. డజను మందికిపైగా పాత్రికేయులపై దాడులు జరిగాయి.

ఐదుగురు జర్నలిస్టులు తమ కథలను బీబీసీకి వివరించారు.

ఆఖిబ్ జావీద్, 28

సెప్టెంబరులో విచారణకు హాజరు కావాలంటూ శ్రీనగర్ సైబర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆఖిబ్ జావీద్‌కు సమన్లు అందాయి.

ఆర్టికల్ 14 అనే న్యూస్ వెబ్‌సైట్‌కు తను రాసిన ఒక వార్త శీర్షిక, ఫోటోలను మార్చాలని చెప్పడానికి తనను పిలిపించారని జావీద్ చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన అనంతరం కొందరు ట్విటర్ వినియోగదారుల్ని పోలీసులు విచారించడం, ఆ తర్వాత ఆ ట్విటర్ వినియోగదారులు మౌనం వహించడంపై ఆయన ఆ వార్త రాశారు.

అక్కడి పరిస్థితులకు భిన్నంగా తమ స్టేషన్ ఫోటోను ఉపయోగించావని పోలీసులు ఆరోపించినట్లు జావీద్ తెలిపారు. తనను నిర్బంధించినట్లు అనిపించిందని, మాస్క్ వేసిన పోలీసులు తనను కొట్టారని ఆయన వివరించారు.

అయితే, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని పోలీసులు కొట్టిపారేశారు. మరోవైపు ఆయన రాసిన వార్త శీర్షికతోపాటు ఫోటో కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని వారు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

చివరకు తమ ఎడిటర్‌కు ఫోన్‌చేసి పోలీసులు సూచించిన మార్పులు చేయాలని కోరినట్లు జావీద్ తెలిపారు. ‘‘ద రియల్ సైబర్ బుల్లీ: పోలీస్ ఇన్ కశ్మీర్ క్వశ్చన్ ట్విటర్ యూజర్స్’’గా ఉన్న శీర్షికను ‘‘పోలీస్ క్వశ్చన్ కశ్మీరీ ట్విటర్ యూజర్స్ ఫర్ యాంటీ గవర్నమెంట్ పోస్ట్స్’’గా మార్పించారు. మరోవైపు ఫోటోను తప్పుగా ఎంచుకున్నందుకు ఆర్టికల్ 14 తమ వెబ్‌సైట్‌లో క్షమాపణలు కూడా చెప్పింది.

‘‘ఒక ఫోటో కోసమే వివాదం అయ్యుంటే.. పోలీసులు మాకు సందేశం పంపిస్తే.. మేం మార్చేసేవాళ్లం’’అని జావీద్ వ్యాఖ్యానించారు.

‘‘జర్నలిస్టులకు వేధింపులు ఎదురైనప్పుడు, కొట్టినప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఎప్పటికప్పుడే జర్నలిస్టులను పిలిచి విచారిస్తున్నారు’’అని ఆయన అన్నారు.

పీర్‌జాదా ఆషిఖ్

ఫొటో సోర్స్, Mukhtar Zahoor

ఫొటో క్యాప్షన్, పీర్‌జాదా ఆషిఖ్

పీర్‌జాదా ఆషిఖ్, 39

ద హిందూ పత్రికలో పనిచేసే పీర్‌జాదా ఆషిఖ్‌పై గత ఏప్రిల్‌లో శ్రీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మిలిటెంట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరి మృతదేహాలను వారి కుటుంబం తవ్వి బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించిందని పీర్‌జాదా వార్త రాశారు. భద్రతా దళాలతో చోటుచేసుకున్న కాల్పుల్లో ఆ ఇద్దరు మరణించారు. భారీగా ప్రజలు గుమిగూడతారని, దీంతో కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందని, అందుకే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించలేదని అధికారులు తెలిపారు.

అయితే, మృతదేహాలను తవ్వి బయటకుతీసి అంత్యక్రియలు నిర్వహించేందుకు తమకు అనుమతి లభించిందని మృతుల్లో ఒకరి బంధువు పీర్‌జాదాకు తెలిపారు. తన దగ్గర మృతుడి బంధువులు పెట్టుకున్న అభ్యర్థన పత్రం కాపీ కూడా ఉందని పీర్‌జాదా వివరించారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు స్పందించలేదు.

వార్త ప్రచురితం అయిన తర్వాత.. ఇది ఫేక్ న్యూస్ అని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అధికారుల ధ్రువీకరణ తీసుకోకుండా వార్తలు ప్రచురించారని పీర్‌జాదాపై పోలీసులు ఆరోపణలు చేశారు. అయితే, వార్తలో అధికారులను సంప్రదించినా.. స్పందించలేదని రాసివుంది.

ఈ అంశంపై హిందూ వివరణ ఇచ్చింది. మృతదేహాలు పూడ్చిన చోటును సందర్శించడానికి ఇచ్చిన అనుమతిని తవ్వడానికి ఇచ్చిన అనుమతిగా కుటుంబం పొరబడిందని దానిలో పేర్కొన్నారు.

అయితే, పీర్‌జాదాకు శ్రీనగర్‌తోపాటు 60 కి.మీ దూరంలోని అనంతనాగ్ పోలీస్ స్టేషన్‌కు కూడా విచారణకు రావాలని రెండుసార్లు సమన్లు వచ్చాయి.

వారు అడిగిన ప్రశ్నలు భయపెట్టేలా ఉన్నాయని పీర్‌జాదా వివరించారు. రెండో సారి చాలా దూరంలోని పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారని అన్నారు.

‘‘అదే ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడిగారు. రాత్రి 10.30కు ఇంటికి పంపించారు’’.

‘‘వార్తలో మార్పులు చేయాలంటే అధికారులు ఫోన్ చేసినా లేదా ఈ-మెయిల్ పంపినా సరిపోతుంది. కానీ వారు ఆ అవకాశాన్ని నన్ను శిక్షించేందుకు వాడుకున్నారు’’.

తనపై పెట్టిన కేసు ఇప్పటికీ అలానే ఉందని చెప్పారు.

‘‘కేసులో నా పేరు రాయలేదని చెబుతున్నారు. అయితే కేసును మాత్రం కొట్టేయట్లేదు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు నన్ను వారు పిలిపించొచ్చు’’.

అనురాధ భాసిన్
ఫొటో క్యాప్షన్, అనురాధ భాసిన్

అనురాధ భాసిన్, 52

అక్టోబరు 19న స్థానిక పత్రిక కశ్మీర్ టైమ్స్ శ్రీనగర్ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా అనురాధ పనిచేస్తున్నారు.

‘‘ఎందుకు బయటకు వెళ్లాలో చెప్పలేదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. మమ్మల్ని భయపెట్టేందుకే ఇలా చేశారు’’అని ఆమె వివరించారు.

పొరుగునున్న జమ్మూలోని పత్రిక కార్యాలయం తెరిచేవుంది. అయితే శ్రీనగర్ సిబ్బంది మాత్రం ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు.

దీనిపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు పోలీసులు స్పందించలేదు.

అయితే, ఇలాంటి చర్యలతో మీడియాపై ప్రతికూల ప్రభావం పడుతుందని ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. గట్టిగా మాట్లాడటంతో తమపై కక్ష తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నారని అనురాధ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్, సోషల్ మీడియాలపై నిషేధంతోపాటు మీడియానూ నియంత్రించడంపై సుప్రీం కోర్టులో 2019లో అనురాధ ఒక పిటిషన్ దాఖలు చేశారు.

‘‘నేను కోర్టుకు వెళ్లిన మరుసటిరోజే.. మా పత్రికకు ఇచ్చే ప్రకటనలను అధికారులు నిలిపివేశారు. అన్నింటినీ వారు నియంత్రించాలని అనుకుంటున్నారు’’అని అనురాధ వ్యాఖ్యానించారు.

ఫహాద్ షా

ఫొటో సోర్స్, Mukhtar Zahoor

ఫొటో క్యాప్షన్, ఫహాద్ షా

ఫహాద్ షా, 30

శ్రీనగర్‌లో మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య చోటుచేసుకున్న ఓ ఘర్షణలో చాలా మంది ఇళ్లు ధ్వంసం అయ్యాయని మేలో ఫహాద్ షా వార్త రాసిన తర్వాత పోలీసులు విచారణకు పిలిచారు.

ద కశ్మీర్ వాల్లా మ్యాగజైన్, వెబ్‌సైట్‌కు షా వ్యవస్థాపకుడు, ఎడిటర్.

15 ఇళ్లు ధ్వంసం అయ్యాయని ఆయన వార్తలో రాశారు. పోలీసులు తమ ఆభరణాలను దొంగిలించారని స్థానికులు ఆరోపణలు చేస్తున్న వీడియో వెబ్‌సైట్‌లో పెట్టారు.

ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే తమను కావాలనే షా చెడుగా చూపిస్తున్నారని పోలీసులు వ్యాఖ్యానించారు.

‘‘కాల్పులు జరిగినప్పుడు కమ్యూనికేషన్ సదుపాయాలన్నీ బ్లాక్ చేశారు. మేం పోలీసులను ఎలా సంప్రదించాలి. ఒకవేళ పోలీసులు స్పందించి వుంటే.. దాన్ని కూడా మేం వార్తలో రాసేవాళ్లం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

కొన్ని వారాల తర్వాత మరో పోలీస్ స్టేషన్ నుంచి ఆయనకు సమన్లు వచ్చాయి. మళ్లీ ఆయన్ను ప్రశ్నించారు. ఈ సారి అయితే, అల్లర్లను రెచ్చగొడుతున్నారని, ఫేక్ న్యూస్ వ్యాపింప జేస్తున్నారని ఆరోపించారు.

అక్టోబరులో కూడా నాలుగు గంటలపాటు షాను నిర్బంధించారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు.

ఈ కేసు విషయంలోనూ పోలీసుల్ని బీబీసీ సంప్రదించింది. అయితే ఎలాంటి స్పందనా రాలేదు.

‘‘ఫోన్‌చేసి పిలిపించడం, వేధించడం, ప్రశ్నించడం ఇవేమీ ఇప్పుడు కొత్తేం కాదు. అందరూ వీటికి అలవాటు పడిపోతున్నారు’’అని షా వ్యాఖ్యానించారు.

మస్రత్ జహ్రా

ఫొటో సోర్స్, Mukhtar Zahoor

ఫొటో క్యాప్షన్, మస్రత్ జహ్రా

మస్రత్ జహ్రా, 26

‘‘ఇప్పుడు అందరూ మాట్లాడటానికే భయపడుతున్నారు. చాలా మంది జర్నలిజాన్ని వదిలిపెట్టి పోతున్నారు. ఎందుకంటే పోలీసులు అలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు’’అని ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా వ్యాఖ్యానించారు.

అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పోలీసులు గత ఏప్రిల్‌లో ఆమెపై కేసు నమోదుచేశారు. నేరపూరిత ఉద్దేశంతో ఆమె దేశ వ్యతిరేక పోస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

2018లో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్‌కు సంబంధించి ఈ కేసు నమోదు చేవారు. అంతకుముందు రెండేళ్ల క్రితం మరణించిన మిలిటెంట్ బుర్హాన్ వనీ పోస్టర్‌ను పట్టుకొని కొందరు సంతాపం ప్రకటిస్తున్న ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.

బుర్హాన్ వనీ మరణంతో ఇక్కడ నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. 22ఏళ్ల వనీకి చాలా మంది స్థానికుల మద్దతు ఉంది. భారత్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టేవారు అతణ్ని అమరవీరుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే, మస్రత్‌ చేసిన పోస్టు ఎందుకు కేసు వరకూ వెళ్లిందో తెలియడం లేదు. ఆమెను అరెస్టు చేయలేదు. అయితే ఆ కేసు ఇప్పటికీ అలానే ఉంది. ‘‘ఎప్పుడైనా వారు నన్ను అదుపులోకి తీసుకొవచ్చు. దీన్ని నేనెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘నాపై కేసు పెట్టడం ద్వారా జర్నలిస్టులందరికీ వారు ఓ సందేశం పంపాలని అనుకున్నారు. మేం ఒక అమ్మాయిని కూడా వదిలిపెట్టలేదు.. ఏమైనా చేయగలం.. అని వారు చెప్పాలని అనుకుంటున్నారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)