‘పోర్న్ వీడియోలు విపరీతంగా చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానం చేస్తూ ఆ ఆలోచనల నుంచి బయటపడ్డా’

- రచయిత, మాక్స్ ఇవాన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాతికేళ్ల నిక్కీ బ్రయాంట్‌కు ఇప్పుడు సెక్స్ అంటే ఏవగింపు ఏర్పడింది. దీనికి కారణం ఆమె విపరీతంగా పోర్న్ వీడియోలు చూడటమే. సెక్స్ విషయంలో అసమర్ధురాలినని, తన శరీరం కళంకమై పోయిందన్న భావనలోకి వెళ్లిపోయారు బ్రయాంట్.
అందుకే బ్రిటన్‌కు చెందిన చిల్డ్రన్స్ చారిటీ ప్లాన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకోసెక్సువల్ మెడిసిన్ లాంటి సంస్థలు పోర్న్ వీడియోలు చూడటం వల్ల కలిగే అనర్ధాలను స్కూల్ స్థాయిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
పోర్నోగ్రఫీ సబ్జెక్టును కొత్త పాఠ్యాంశాలలో ఎలా చేర్చాలన్నదానిపై తాము చర్చిస్తున్నట్లు వేల్స్ ప్రభుత్వం వెల్లడించింది.
“సెక్స్ అనేది ఒక చిత్రమైన వ్యవహారం. ఇందులో ఏదీ ఒక పద్దతి ప్రకారం జరగదు’’ అని కార్డిఫ్‌లో జిమ్ మేనేజర్‌గా పని చేస్తున్న నిక్కీ అన్నారు.
“పోర్న్ వీడియోలలో అంతా కృత్రిమంగా, ఒక పద్దతి ప్రకారం జరుగుతున్నట్లు ఉంటుంది. ఇందులో మగవాళ్ల ఆధిపత్యం కనిపిస్తుంది. నిజమైన సెక్స్‌కు దీనికి పోలికే ఉండదు. అందుకే నాకు ఇది తప్పుడు భావనగా కనిపిస్తుంది’’ అన్నారామె.
తాను పెరుగుతున్న సమయంలో సెక్స్ గురించి తనకు ఎవరూ ఎప్పుడూ వివరించి చెప్పలేదంటారు నిక్కీ. దాని చుట్టూ ఆవరించిన సిగ్గు, బిడియంలాంటివే దీనికి ప్రధాన కారణం కావచ్చంటారామె.
11 సంవత్సరాల వయసులో ఒక సోషల్ మీడియా సైట్‌లో ఆమె తొలిసారి పోర్న్ వీడియో చూశారు. ఆమెపై అది తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.
“అందులో ఒక మహిళ ఉంటుంది. ఆమె అవతలి వ్యక్తి వశమై, పెద్దగా శబ్దాలు చేస్తూ చాలా అసహ్యకరమైన రీతిలో కనిపిస్తుంది’’ అని గుర్తు చేసుకున్నారు నిక్కీ.
“నాకు బాగా గుర్తు. నేను కూడా ఆ దృశ్యాలను అనుకరించడానికి ప్రయత్నించే దానిని. ఎందుకంటే అలా చేయడం కరెక్టనీ, మగవాళ్లు దాన్ని ఇష్టపడతారని అనుకునేదాన్ని” అన్నారు నిక్కీ.
తరచూ పోర్న్ చిత్రాలు చూడటంవల్ల తన శరీరం అందరిలా లేదని, ఏదో లోపం ఉందని భావించడం మొదలుపెట్టారు నిక్కీ. చివరకు ఆమె తన జననావయవాలకు ఆపరేషన్ చేయించుకునే వరకు వెళ్లారు.
చివరకు ఇదంతా చాలా అసహ్యకరమైన వ్యవహారంలా అనిపించడంలో ఈ పోర్న్ ఆలోచనల నుంచి బైటపడాలని భావించారామె. దీని కోసం సెక్సువల్ థెరపీ, యోగా, ధ్యానంలాంటి వాటి సాయం తీసుకున్నారు.
“చిన్నతనంలోనే పోర్న్ వీడియోలను విపరీతంగా చూడటం నా శరీరం మీద ఆపేక్షను, సెక్స్ అంటే ఎలా ఉండాలి అన్న విషయంలో నా ఆలోచనలను దెబ్బతీసింది. దీన్ని గమనించక పోయినట్లయితే ఇది ఇంకా ప్రమాదకరంగా మారేది’’ అని వెల్లడించారు నిక్కీ

పోర్న్ విషయంలో యువత అనుభవాలేంటి?
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక నివేదికను రూపొందించింది. పిల్లలు, యువత పోర్న్ వీడియోలపై వ్యామోహంలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాల్సిందిగా ఈ కమిటీని కోరింది ప్రభుత్వం.
ఈ కమిటీ 11-17 సంవత్సరాల వయసున్న 1,100మంది పిల్లలతో మాట్లాడింది.
- 16 సంవత్సరాల వయసు దాటి సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉన్న వారిలో 18%మంది తమను పోర్న్‌వీడియోలను అనుకరించాల్సిందిగా కోరారని, అలాగే చేశామని చెప్పారు.
- 16 సంవత్సరాల వయసు దాటిన వారిలో 30% మంది నిజమైన సెక్స్.. పోర్న్ వీడియోలలో చూపించినట్లుగా లేదని తేల్చారు. 37% మంది ఏమీ చెప్పలేమన్నారు.
- పోర్న్ వీడియోలలో చూపించిన వ్యక్తుల శరీరాలను చూశాక తమ శరీరాలపై అసహ్యం వేసిందని 11-17 సంవత్సరాల వయసు మధ్య ఉన్న యువతలో 29%మంది చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పోర్న్‌కు బానిస కావడం నా జీవితంలో చీకటి కోణం’
ఆవెన్ (అసలు పేరు కాదు)కు ఇప్పుడు 20 సంవత్సరాలు. టీనేజ్‌లో ఉన్నప్పుడు సెక్స్ వీడియోలకు బానిసగా మారాడు. ఇప్పుడు దానిని తలచుకుని సిగ్గుతో కుచించుకుపోతున్నారు.
కాలేజీ రోజుల్లో అతనికి ఈ పోర్న్ వీడియోలు చూడటం అలవాటైంది. ఇప్పుడు అతని స్నేహితులు చాలామంది యూనివర్సిటీకి వెళ్లారు. అతను మాత్రం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు
“టైమ్ పాస్ కోసం చూడటం మొదలై అది తీవ్రమైన అలవాటుగా మారింది’’ అని ఆవెన్ అన్నారు.
“కొన్నాళ్లు నాకు ఎవరితో రిలేషన్‌షిప్ లేకపోవడంతో ఆత్మవిశ్వాసం లేకుండా పోయింది. అది అప్పుడప్పుడు నన్ను వాస్తవికతకు దూరంగా తీసుకెళుతుంది. ఏమీ తోచకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేది’’ అని ఆవెన్ వెల్లడించారు.
“కొన్నేళ్ల తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. జీవితం ఎంతో మెరుగుపడింది. కానీ నాలో ఆ పాత మురికి ఆలోచనలు మాత్రం పోలేదు. మళ్లీ వాటిని చూడాలనుకోవడం నా జీవితంలో చీకటి కోణం. ఇది నా రిలేషన్‌ల మీద ప్రభావం పడి మరింత కుంగదీసేది’’ అని వివరించారు ఆవెన్.
“దీనికి పూర్తి బాధ్యత నాదే. కానీ మనం ఒక్కసారి బానిసలమైతే దాని గురించి ఎవరితోనూ మాట్లాడలేం. ఎందుకంటే వాళ్లు మనల్ని పోర్న్ పిచ్చోడిగా ముద్రవేస్తారన్న భయం ఉంటుంది’’

ఫొటో సోర్స్, Empics
సెక్స్ వీడియోలలో అతిశయాలు
25 సంవత్సరాలలోపు ఉన్న యువతీ యువకులు ఈ సమస్యను చెప్పుకోవడానికి తమ వద్దకు రావడం ఇటీవల పెరిగిందని బ్రిటన్‌లో సైకో సెక్సువల్ క్లినిక్ నడుపుతున్న కొందరు డాక్టర్లు వెల్లడించారు.
2015లో 31మంది ఈ చికిత్స కోసం వస్తే 2019నాటికి 65మంది వచ్చారని, 2020 మొదటి మూడు నెలల్లోనే 35 దీనికి చికిత్స కోసం వచ్చారని వారు వెల్లడించారు.
“చాలామంది యువతీయువకులు తమకు తాము అవగాహన పెంచుకోవాడానికి ఈ సెక్స్ వీడియోలను ఆశ్రయిస్తున్నారు’’ అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకో సెక్సువల్ మెడిసిన్‌లో పని చేస్తున్న డాక్టర్ కేట్ హావెల్స్ చెప్పారు.
“ఈ తరహా అవగాహన కారణంగా సెక్స్ మీద తప్ప నిజమైన ప్రేమ అనే భావన తెలియకుండా పోతోంది. చాలాసార్లు ఈ పోర్న్ వీడియోలలో కనిపించే సెక్స్ మామూలు సెక్స్‌కన్నా భిన్నంగా, అతిశయంగా ఉంటుంది’’ అన్నారు కేట్.
ఇలాంటి వీడియోలు మనుషుల ప్రవర్తన మీద, లైంగికత మీద, శరీరంపై ఉండే ఆపేక్ష మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి.
“మనం వాళ్లను(యువతను) అడగడానికి భయపడకూడదు. వారు ఎలాంటి సెక్స్ వీడియోలు చూస్తున్నారు, ఏ స్థాయిలో చూస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నారు అన్నది గమనించాల్సి అంశం’’ అని ఆమె అన్నారు.
“దీని మీద చాలా అవగాహన కల్పించాలి. సెక్స్ ఎడ్యుకేషన్‌లోనే పోర్న్ గురించి కూడా చెప్పాలి. ప్రేమాభిమానాలతో కలిగే బంధాల ప్రాముఖ్యత, స్త్రీ, పురుషుల అభ్యున్నతికి అది ఏ విధంగా తోడ్పడుతుందో వివరించాలి’’ అని కేట్ అంటున్నారు.
ప్రేమ, సెక్స్ విషయాలలో ఆరోగ్యకరమైన బంధాలకు సంబంధించిన పాఠ్యాంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తయారు చేస్తున్న సిలబస్‌ను వెల్ష్ ప్రభుత్వం 2022 నుంచి అమల్లోకి తీసుకు రానుంది.
“పాఠ్యాంశాలలోనే పోర్నోగ్రఫీ గురించి అవగాహన కల్పించడం, ముఖ్యంగా అమ్మాయిలకు ఎదుర్కొనే సమస్యల గురించి వివరించడం ఒక గొప్ప నిర్ణయం’’ అని ప్లాన్ ఇంటర్నేషనల్ యూకే సంస్థకు చెందిన రోస్ కాల్డ్‌వెల్ అన్నారు.
“సురక్షితమైన లైంగిక సంబంధాల గురించి వివరించడం ప్రయోజనకరం. ఈ సబ్జెక్టును బోధించే సమయంలో ఉపాధ్యాయులు యువతీ యువకులకు అవగాహన కల్పిస్తున్నామన్న దృష్టితో జాగ్రత్తగా వివరించాలి’’ అన్నారామె.
“కొత్త పాఠ్యప్రణాళిక ప్రకారం రిలేషన్‌షిప్స్ అండ్ సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ (RSE) తప్పని సరి సబ్జెక్ట్’’ అని వెల్ష్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.
అనారోగ్యకరమైన లైంగిక సంబంధాలపై కూడా ఈ పాఠ్యాంశాలలో చేర్చామని, వాటికి ఎలా దూరం కావాలి, తమను తాము రక్షించుకోవడానికి ఎవరిని సంప్రదించాలి అన్నది కూడా ఇందులో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- మాస్కో థియేటర్లో 140 మంది చనిపోయిన భయంకరమైన ఘటనకు 18 ఏళ్లు.. అప్పుడు ఏం జరిగిందంటే..
- భారత్-నేపాల్ వివాదం: నేపాల్ ప్రధానితో రా చీఫ్ రహస్య భేటీ, ఆ దేశ అధికార పార్టీకి షాక్
- చైనా గురించి మోదీ ప్రభుత్వం ఎందుకు గొంతెత్తడం లేదు?
- భారతీయ అమెరికన్లలో హిందువులు, ముస్లింలు ఎవరికి ఓటేస్తారు?
- అమెరికా కొత్త అధ్యక్షుడి నుంచి భారత్ ఏం కోరుకుంటోంది?
- అమెరికా 2020 ఎన్నికల సర్వే: ట్రంప్, బైడెన్లలో పైచేయి ఎవరిది?
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి, విజేతను ఎలా ప్రకటిస్తారు?
- పాకిస్తాన్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








