అమెరికా కొత్త అధ్యక్షుడి నుంచి భారత్ ఏం కోరుకుంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఇటీవల జరిగిన అమెరికా పౌరసత్వ ప్రధాన కార్యక్రమంలో ఐదుగురు కొత్త అమెరికన్లు పాల్గొన్నారు. వారిలో ఒక మహిళ అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఆమె పేరు సుధా సుందరి నారాయణన్. భారతదేశం నుంచి వచ్చిన ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఆమె. ప్రకాశవంతమైన గులాబీ రంగు చీర కట్టుకుని చిరునవ్వుతో తన పౌరసత్వ ధ్రువపత్రాన్ని ఆమె గర్వంగా ప్రదర్శించారు.
రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు సందర్భంగా ఆగస్టు 25వ తేదీన ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని వివక్షాపూరిత స్టంట్‌గా అమెరికాలో చాలా మంది విమర్శించారు. కానీ, ఈ అరుదైన కార్యక్రమం గురించి.. ఒక భారతీయ మహిళను అమెరికా అధ్యక్షుడు స్వయంగా కొత్త పౌరసత్వం ఇచ్చి ఆహ్వానించారంటూ భారతదేశంలో సగర్వంగా వార్తలు ప్రసారం చేశారు.
అమెరికా వలస విధానం భారతదేశానికి, భారతీయులకు ముఖ్యమైన విషయం. టెక్నాలజీ నైపుణ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తున్న గర్వించదగ్గ ట్రాక్ రికార్డ్ భారతదేశానికి ఉంది. హెచ్1బి వీసాలతో అమెరికా వచ్చే ఈ టెక్ శ్రామికులు ఆ తర్వాత అమెరికా పౌరులయ్యే అవకాశముంది.

ఫొటో సోర్స్, RNC handout via Reuters
దీనిని అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా గుర్తించటాన్ని వీక్షించిన భారతీయ అమెరికన్లను ఈ దృశ్యం బాగా ఆకట్టుకుని ఉంటుంది. సంప్రదాయంగా డెమొక్రాట్ పార్టీని ఇష్టపడే భారతీయ అమెరికన్లను ఈ కార్యక్రమం రిపబ్లికన్ పార్టీవైపు ఆకర్షించి వుండవచ్చు.
దేశాధ్యక్షుడు చేసిన ఈ పని సదభిప్రాయాన్ని కచ్చితంగా బలోపేతం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలపడుతున్న దశలో ఈ కార్యక్రమం జరిగింది.
భారతీయ అమెరికన్లు అమెరికా అధ్యక్షుడికి తమ ఓట్లు వేయొచ్చు. అయితే, ఆ అధ్యక్షుడు - అది డోనాల్డ్ ట్రంప్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు - భారతదేశం కోసం ఏం చేయగలరు?

చైనా - లద్దాఖ్
అమెరికా తాను ఎక్కడ సాయం చేయగలదన్న విషయంలో చాలా స్పష్టంగానే వ్యవహరిస్తోంది. భారత్ తన పొరుగుదేశమైన చైనాతో హిమాలయాల్లోని లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంలో కూరుకుంది.
గత ఏప్రిల్ - మే నెలల నుంచి భారత్, చైనాలు దాదాపు 50,000 మంది సైనికులను ఈ ప్రాంతంలో మోహరించాయి. కొన్ని చోట్ల అయితే ఇరు దేశాల సైనికుల మధ్య దూరం 200 మీటర్ల కన్నా తక్కువగానే ఉంది. ఈ సైన్యాల క్రమశిక్షణలో అనాలోచితంగా ఒక చిన్న పొరపాటు జరిగినా.. అది భారీ సైనిక సంఘర్షణగా మారిపోవచ్చునని భద్రతా నిపుణులు భయపడుతున్నారు.
జూన్ నెలలో లద్దాఖ్‌లో భారత్, చైనాల బలగాల మధ్య జరిగిన కొట్లాటలు.. ఈ రెండు అణ్వస్త్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
ఈ ఘర్షణలో భారత్‌కు సాయం చేస్తానంటూ అమెరికా పలుమార్లు ముందుకు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
''వారు (ఇండియా) అమెరికాను తమ మిత్రపక్షంగా చేసుకుని, ఈ పోరాటంలో భాగస్వామిగా చేసుకోవాల్సిన అవసరముంది'' అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో ఈ నెల ఆరంభంలో వ్యాఖ్యానించారు.
చైనా ఆక్రమించుకున్నట్లుగా భారత్ ఆరోపిస్తున్న ప్రాంతాల నుంచి ఖాళీ చేసేలా చైనా మీద ఒత్తిడి తేవటానికి అమెరికా భారత్ వైపు ఉండాల్సిన అవసరముందని కొందరు భారత దౌత్యవేత్తలు అంగీకరిస్తారు. ఇతర ప్రాంతీయ భాగస్వాములను కూడా కలుపుకోవాలని కూడా భారతదేశం భావించవచ్చు.
భారత్, అమెరికాలు రెండూ జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి 'క్వాడ్' అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఈ బృందం.. భద్రతా అంశాల గురించి చర్చించటానికి - ప్రధానంగా పెరుగుతున్న చైనా దూకుడుకు ఎలా ప్రతిస్పందించాలనే అంశం మీద చర్చించటానికి అక్టోబర్ ఆరంభంలో టోక్యోలో సమావేశమైంది.
ఈ బృందాన్ని నాటో తరహా కూటమిగా మార్చాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
బలపడుతున్న బంధం
భారత్, అమెరికాల మధ్య గత 20 ఏళ్లుగా అంతకంతకూ బలపడుతూ వస్తున్న బంధాల నేపథ్యంలో ఇటువంటి ఆలోచన బాగానే సరిపోతుంది.
భారత్ సంప్రదాయంగా అలీన విధానానికి మొగ్గుచూపింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలమంతా, అఫ్ఘానిస్తాన్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించినపుడు ఇదే విధానాన్ని అనుసరించింది. కానీ 21వ శతాబ్దపు భౌగోళిక రాజకీయాలు భారతదేశ విదేశాంగ దృక్కోణాన్ని మార్చేశాయి.
అమెరికా నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000 సంవత్సరంలో చేపట్టిన భారతదేశ పర్యటన చరిత్రాత్మకంగా నిలిచింది. దాదాపు పావు శతాబ్ద కాలంలో ఒక అమెరికా అధ్యక్షుడు భారత్‌ను సందర్శించటం అదే మొదలు. క్లింటన్ ఆ పర్యటనలో భారత్‌ను అమెరికా మిత్రపక్షంగా మారేలా ఆకర్షించటానికి ప్రయత్నించారు. ఆయన ఆరు రోజుల పర్యటన ఇండియా - అమెరికా సంబంధాల్లో కీలక మలుపు. అంతకుముందు వరకూ ఈ రెండు దేశాలనూ 'విభేదాలుగల ప్రజాస్వామికదేశాలు'గా అభివర్ణించేవారు.
అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ పర్యటన సమయంలో అణు ఒప్పందం మీద సంతకాలు చేయటం.. ఈ బంధానికి వ్యూహాత్మక బలాన్నిచ్చింది. ఆ తర్వాత అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు సార్లు భారత పర్యటనకు వచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుజరాత్‌లో ఒక భారీ సభలో పాల్గొన్నారు. ఆయన గౌరవార్థం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సభను ఏర్పాటు చేశారు. ''ఇరు దేశాల మధ్య ఇప్పుడున్నంత సత్సంబంధాలు ఇంతకుమునుపెన్నడూ లేవు'' అని ట్రంప్ ఆ సభలో ప్రకటించారు.
అయినప్పటికీ, సాయం చేస్తామన్న అమెరికా మాటను భారత్ ఆహ్వానించినప్పటికీ.. దానిని అంగీకరించటానికి విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, EPA/LUONG THAI/REUTERS/Adnan Abidi/Jonathan Ernst
విముఖత
భారత్ సంకోచించటానికి చాలా కారణాలు ఉండొచ్చు.
లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్‌లో రాజనీతిశాస్త్రం, అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ డాక్టర్ నిటాషా కౌల్.. అమెరికా నిబద్ధత మీద సందేహం వ్యక్తంచేశారు.
''అమెరికా విదేశాంగ విధానం విరుద్ధమైన దిశల్లో ప్రయాణిస్తున్నపుడు ట్రంప్ ప్రభుత్వం మౌఖికంగా ఇచ్చిన ప్రకటనలకు పెద్ద విలువ లేదు. పైగా అంతర్జాతీయంగా అమెరికా బాధ్యతలను ట్రంప్ కుదిస్తున్నారు'' అని ఆమె బీబీసీతో పేర్కొన్నారు.
''అమెరికాను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నపుడు.. భారతదేశం పెద్దగా ఆసక్తిచూపనపుడు.. సాయం చేస్తానని, మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా చెప్పటం వల్ల పెద్ద ఉపయోగం లేదు'' అంటారామె.
ఒకవేళ సాయం చేస్తామనే మాటల్లో నిజాయితీ ఉన్నాకూడా.. లద్దాఖ్ విషయంలో అమెరికా అసలు ఏ రకంగా సాయపడుతుందనేది చెప్పటం కష్టమని డాక్టర్ కౌల్ పేర్కొన్నారు.
''మహా అయితే.. సైనిక నిఘా సమాచారం (అదికూడా పరిమితమైనదే), హార్డ్‌వేర్, శిక్షణలో అమెరికా పాలుపంచుకోగలదు. అదే సమయంలో ఉద్రిక్తతలు నివారించాల్సిందిగా చైనాకు సంకేతాలు పంపుతోంది'' అని ఆమె అభిప్రాయపడ్డారు.
సాయం చేస్తానన్న దాంట్లో నిజాయితీ ఉన్నా.. భారత ప్రజలతో సంబంధాల్లో అమెరికాకు ఒక సమస్య ఉంది.
అమెరికా దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగింది. అంటే భారత సమాజంలోని చాలా వర్గాలు అమెరికాను విశ్వసనీయమైన మిత్రుడిగా పరిగణించటానికి చాలా ఇబ్బందిపడతాయి.
స్వీడన్‌లోని ఉప్సల యూనివర్సిటీలో పీస్ అంద్ కాన్ఫిక్లిట్ విభాగంలో బోధించే ప్రొఫెసర్ అశోక్ స్వైన్.. అమెరికాను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇండియాను హెచ్చరిస్తున్నారు.
''అమెరికా ఎన్నడూ ఎవరికీ నమ్మకమైన మిత్రపక్షంగా లేదు. ట్రంప్ పాలనలో ఆ విషయం మరింత స్పష్టమైంది. చైనా వంటి శక్తితో వ్యవహరించేటపుడు భారత్‌కు అమెరికా కార్డు పనిచేయబోదు'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరు పార్టీల మద్దతు
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య వ్యక్తిగత సఖ్యత, సంబంధాలు బలంగా ఉన్నాయి. కానీ, ఈ సంబంధాలను బలోపేతం చేయటానికి వాస్తవంగా ఎంత కృషి చేశారని దౌత్యవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
''ట్రంప్ అధ్యక్షతన మేం మంచి పురోగతి సాధిస్తున్నాం. మోదీకి, ట్రంప్‌కు మధ్య గొప్ప వ్యక్తిగత సఖ్యత ఉంది. కానీ పురోగతి నెమ్మదిగా ఉంది.. దానిని వేగవంతం చేయాలని మేం కోరుకుంటున్నాం'' అని అమెరికాలో రెండు పర్యాయాలు పనిచేసిన మాజీ భారత దౌత్యాధికారి నీలం దేవ్ బీబీసీతో చెప్పారు.
సాయం చేస్తామన్న అమెరికా ఆఫర్‌ను అంగీకరించటమో, తిరస్కరించటమో చేయకుండా భారత్ ఇప్పటివరకూ జాగ్రత్తగా వ్యవహరించింది. నవంబర్ 3న జరగబోయే అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలని భారత్ వేచివుంటుందని ప్రొఫెసర్ స్వైన్ పేర్కొన్నారు. కానీ.. అమెరికా అధ్యక్షుడిగా వేరే వ్యక్తి వచ్చినా కూడా పెద్దగా మారేదేమీ ఉండదని దౌత్యవేత్తలు భావిస్తున్నారు.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌లు దాదాపు ప్రతి అంశం మీదా విభేదించారు. అయితే భారత్ విషయంలో విధానానికి సంబంధించి మాత్రం ఈ విభేదాలకు మినహాయింపు ఉంది.
భారత్ విషయంలో అమెరికా విధానానికి అమెరికాలో ఇరు పార్టీల మద్దతూ ఉందని భారత మాజీ దౌత్యవేత్తలు చెప్తారు.
''రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీ - రెండు పార్టీల అభ్యర్థులూ భారత్ విషయంలో ఒకే వైఖరితో ఉండటం ఇదే మొదటిసారి కాదు. క్లింటన్ నుంచి ట్రంప్ వరకూ అమెరికా అధ్యక్షులు భారతదేశానికి వస్తున్నారు. ఒబామా రెండు సార్లు ఇండియాలో పర్యటించారు. కాబట్టి రెండు పార్టీల అధ్యక్షుల హయాంలోనూ సంబంధాలు పురోగమిస్తున్నాయి'' అని నీలమ్ దేవ్ వివరించారు.
అంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా.. చైనాతో ఘర్షణ విషయంలో ఇండియాకు అమెరికా తన సాయం ఆఫర్ చేయటం కొనసాగుతుందని కనిపిస్తోంది. కానీ ఇండియా ఎలా ప్రతిస్పందిస్తునేది మాత్రం ఖచ్చితంగా తెలీదు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఉత్తర కొరియా ప్రదర్శించిన భారీ క్షిపణి సత్తా ఏంటి? దాని వల్ల అమెరికాకు ముప్పు ఉందా?
- న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- ‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








