ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...

ఇంగువ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ న్యూస్

భారతీయుల్లొ కొందరికి ప్రీతి పాత్రమైన ఇంగువ కొన్ని శతాబ్దాలుగా వారి ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంది. కానీ, భారతీయులు ఈ పదార్ధాన్ని ఇప్పటి వరకు ఈ దేశంలో పండించలేదు.

శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్).. రెండేళ్ల కిందట ఈ ఇంగువ మొక్కలను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంది. గత వారంలో శాస్త్రవేత్తలు హిమాలయాల్లోని మంచు పర్వత ప్రాంతాలైన లాహౌల్, స్పితిలో 800 ఇంగువ మొక్కలు నాటారు.

"ఇవి ఈ ప్రాంతంలో పెరుగుతాయని మాకు నమ్మకం ఉంది" ఒక పరిశోధనశాలలో కష్టపడి విత్తనాలను నాటి పరిశీలించిన డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు.

ఇవి ప్రతి 100 విత్తనాలకు కేవలం రెండు మాత్రమే మొక్కలు మొలుస్తాయని, అందుకే వీటిని పరిశోధన శాలలో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చాలా మొక్కలు చనిపోతాయి. ఈ మొక్కలు పెంచడం కష్టమైన విషయం. అందువల్ల అన్ని అంశాలు పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.

"కొన్ని కఠినమైన పరిస్థితులను నిలదొక్కుకోలేకపోతే ఈ మొక్కలు చనిపోతాయి" అని తెలిపారు.

ఇంగువ మొక్క సాధారణంగా అటవీ ప్రాంతాలలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్న ఉష్ణోగ్రతల్లోనే పెరుగుతుంది. అందువలన ఉష్ణోగ్రతలు, తేమ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలలో దీనిని పెంచడం కష్టం.

2019లో భారతదేశం అఫ్గానిస్తాన్‌, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి సుమారు 10 కోట్ల డాలర్ల విలువ చేసే ఇంగువను దిగుమతి చేసుకుంది.

భారతీయ వంటల్లో అత్యధికంగా వాడే ఈ పంటను ఇక్కడ పండించరనే విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి తినని కొంత మంది హిందూ, జైన మతస్థులు వాటికి బదులుగా ఆహారంలో ఇంగువ వాడతారు.వీరి సంఖ్య అత్యంత స్వల్పం. అయితే ఉల్లి వెల్లుల్లి వాడే వారిలో కొంతమంది దీన్ని వంటలో మంచి వాసన కోసమూ, జీర్ణశక్తి పెంచుతుందనే నమ్మకం తోనూ వాడుతుంటారు.

ఇంగువ

ఫొటో సోర్స్, Getty Images

"నేను అన్ని రకాల పప్పు వంటకాలలోనూ ఇంగువ వాడతాను. నేను ఉల్లి, వెల్లుల్లి వాడను" అని 'ది ఫ్లేవర్ ఆఫ్ స్పైస్' పుస్తక రచయత మర్యమ్ రేషి చెప్పారు.

'ఒక్క చిటికెడు ఇంగువ వంటల్లో వాడితే, ఆహారం రుచే అద్భుతంగా మారిపోతుంది" అని ఆమె అంటారు.

రేషి తనను తాను ఇంగువ ప్రేమికురాలిగా చెప్పుకుంటారు. ఆమె ఈ ఇంగువ పుట్టుక, ఉపయోగాల గురించి ఒక పోస్టు కూడా పెట్టారు.

ఇంగువకి ఉండే ప్రత్యేకమైన వాసన ఇతర మసాలా దినుసుల నుంచి దీనిని వేరుగా, విశిష్టంగా నిలుపుతుంది.

ఇంగ్లీష్‌లో దీనిని అసోఫెటిడా అని పిలుస్తారు. లాటిన్‌లో అసోఫెటిడా అంటే దుర్గంధంగా ఉండే జిగురు పదార్ధం అని అర్ధం.

ఊదా రంగు, తెలుపు మిశ్రమ వర్ణంలో ఉన్న జిగురు పదార్ధాన్ని మొక్క వేళ్ళ నుంచి సేకరిస్తారు. దీనిని ఎండబెట్టి గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ కలిపి వంటల్లో వాడేందుకు అనువుగా తయారు చేస్తారు.

ఈ ఇంగువను దిగుమతి చేసుకునే హోల్‌ సేల్ వ్యాపారులు దీనిని ముక్కలుగా, గరుకుగా ఉండే కణికలుగా లేదా మెత్తటి పొడిలాంటి వివిధ రూపాలలోకి మార్చి అమ్ముతారు.

ఇంగువ

ఫొటో సోర్స్, Getty Images

పర్షియన్లు ఒకప్పుడు దీనిని "దేవుళ్ళ ఆహార పదార్థం" అని పిలిచేవారు.

కొన్ని దేశాలలో దీనిని కొన్ని వైద్య అవసరాలకు గాని, లేదా క్రిమిసంహారకంగా కానీ వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంగువ వాడకంలో ఒక్క భారతదేశంలోనే 40 శాతం వాడుతున్నారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. వంట గదిలో ఈ దినుసు వహించే పాత్రను తీసి పారేయలేం.

ప్రతీ రోజు వండుకునే పప్పులో జీలకర్ర, ఎండుమిర్చితో పాటు తాలింపులో ఒక్క చిటికెడు ఇంగువ వేస్తె ఆ పప్పుకి ఉండే రుచే వేరు. తెలుగు నాట, ఇతర దక్షిణాది రాష్ర్టాల్లో పప్పు సాంబారు లాంటి వంటల్లో కొందరు ఇంగువను ఎక్కువగా వాడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వండే రసం, సాంబారు, కొన్ని రకాల పులుసులు, పచ్చళ్ళ పోపులో ఆవాలు, కరివేపాకుతో పాటు దీనిని వాడతారు. కొన్ని రకాల కారం సూప్‌లలో కూడా ఇంగువ వాడతారు.

కశ్మీరీ హిందువులు వండే రోజన్ గోష్ అనే మాంసం కూరలో సోంపు, ఎండు మిర్చి, శొంఠి మసాలాలతో పాటు ఇంగువను కూడా కలుపుతారు.

కోల్‌కతాలో ప్రసిద్ధి చెందిన ఇంగువ కచోరీలు, కాంచీపురంలో దొరికే ఇంగువ ఇడ్లీలకు ప్రత్యేకమైన రుచిని తెచ్చి పెట్టేది ఇంగువే.

దీనిని ఆయుర్వేదంలో అనేక రోగాలకు పరిష్కారంగా కూడా వాడతారు. పొట్ట ఉబ్బరం తగ్గించడానికి దీనిని కొన్ని రకాల పప్పు దినుసులు, బఠానీలతో చేసే వంటకాలలో వాడాలని సూచిస్తారు.

భారత్‌లో వాడకం ఎక్కువ ఉన్నప్పటికీ ఇది భారతదేశానికి చెందిన పంట కాదు. వాతావరణ పరిస్థితుల రీత్యా దీనిని పండించుకోలేకపోయినప్పటికీ చరిత్ర, వాణిజ్యం మాత్రం దీనికి భారతదేశంలో విశిష్ట స్థానం కల్పించాయి.

ఇంగువ

ఫొటో సోర్స్, Getty Images

"దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో ఇంగువ వాడకం దాని పురాతత్వాన్ని తెలియచేస్తోంది" అని చెప్పారు చరిత్రకారిణి డాక్టర్ మనోషి భట్టాచార్య. ఆమె న్యూట్రిషన్ థెరపీలో పని చేస్తున్నారు.

అరబ్బులు, పర్షియన్లు, గ్రీకు దేశస్థులు, ఆఫ్రికన్లు వివిధ దేశాలకు ప్రయాణాలు చేస్తూ తమతో పాటు తమ దేశానికి చెందిన ఆహార పదార్ధాలను తీసుకుని వెళ్లేవారు. అలాగే ఆ ప్రాంతం వదిలి వెళ్ళేటప్పుడు అక్కడ దొరికే ఆహార పదార్ధాలను తమతో పాటు తీసుకుని వెళ్లేవారు.

ఇంగువ క్రీస్తు పూర్వం 600 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి ఉండవచ్చని ఆమె ఊహించి చెబుతున్నారు. ఇంగువ గురించి హిందూ, బౌద్ధ పత్రాలలో ప్రస్తావన ఉందని ఆమె చెప్పారు. మహాభారతంలో కూడా ఇంగువ ప్రస్తావన ఉంది.

శతాబ్ధాలుగా ఇంగువ భారతీయ వంటల్లో ఒక ముఖ్య భాగంగా ఉంటూ వస్తోంది.

దీనిని సంస్కృతంలో హింగు అని, హిందీలో హింగ్ అని, కన్నడలో ఇంగు అని, బెంగాలీలో హిం అని అంటారు. పర్షియాలో దీనిని అంగుజేహ్ అని, గ్రీకులు అజా అని, అరబ్బులు హాల్టిత్ అని అంటారు.

యూరప్ దేశాల ప్రజలు మాత్రం దీనిని రాక్షస పేడ అని, దుర్గంధంతో కూడిన జిగురు అని అంటారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇది పశ్చిమ దేశస్థుల ఆహారానికి తగినది కాదని ఫుడ్ రైటర్లు అంటారు. కానీ, ప్రాచీన రోమన్లు, గ్రీకులు తమ వంటల్లో ఇంగువను వాడేవారు. అయితే ఆ ప్రాంతాల ఆహారం నుంచి ఇది ఎలా మాయమయిందో తెలియదు. దీనిని సిల్ఫియాన్ అనే వంటకంలో వాడేవారని, కానీ ఆ వంటకం పూర్తిగా కనుమరుగయిందని చరిత్రకారులు చెబుతారు.

దీనికుండే విచిత్రమైన వాసన వలన దీనిని తక్కువ రకంగా భావించేవారని చెబుతారు.

కానీ, ఆ వాసనే భారతీయులకు ప్రీతి పాత్రమైనది. ఇంగువలో రకాలున్నాయి. ‘‘ఉదాహరణకు తెల్లని రంగులో ఉండే కాబూలీ ఇంగువను నాలుక మీద పెట్టుకోలేం. అది వగరుగా ఉండి నాలుక కాలినట్లవుతుంది’’ అని దిల్లీకి చెందిన ఒక ఇంగువ వ్యాపారి సంజయ భాటియా చెప్పారు. ఈయన ప్రతీ సంవత్సరం 6,30,000 కేజీల ఇంగువ అమ్ముతారు.

నారింజ వాసన ఉండే హడ్డ ఇంగువ ఎక్కువ ప్రాముఖ్యం పొందిందని చెప్పారు.

భాటియా కుటుంబం గత మూడు తరాలుగా ఇదే వ్యాపారంలో ఉంది. ‘‘నేను ఇంగువలోనే పుట్టాను’’ అని చెప్పుకునే ఆయన ఆఫ్ఘాని ఇంగువకి, ఇరానీ ఇంగువకి మధ్యనున్న తేడా చెప్పాలంటే ఒక్కసారి వాసన చూస్తే చాలు అంటారు.

అఫ్గానీ విత్తనాలను దిగుమతి చేసుకోవాలని చూస్తున్నట్లు డాక్టర్ కుమార్ చెప్పారు. ఈ మొక్కలను 741 ఎకరాలలో పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం ఒక హెక్టారులోనే వీటిని నాటినట్లు చెప్పారు.

ఒకవేళ ఈ పంటను పండించడం మొదలుపెట్టినా దేశీయ అవసరాలకు సరిపడేంతగా పండించడానికి చాలా సమయం పడుతుందని భాటియా చెప్పారు. అదొక్కటే సమస్య కాదు.

ఈ అటవీ వృక్షాన్ని ఎక్కడ పడితే అక్కడ నాటి దాని సహజమైన సువాసనని ఇవ్వాలని ఎలా అనుకుంటాం? అని రేషి అంటారు. భారతీయులెవరూ దానిని వంటల్లో వాడలేరు. ఇక్కడ దొరికే ఇంగువను నేనయితే వంటల్లో వాడను" అని ఆమె అన్నారు.

ఇంగువకి ఉండే ప్రత్యేకమైన వాసన భారతదేశంలో పండించే ఇంగువకి కూడా ఉంటుందా? కాలం మాత్రమే సమాధానం చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)