అమ్మోనియం నైట్రేట్: ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో ఇదే టెన్షన్

అమ్మోనియం నైట్రేట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్రిస్టొఫర్ గైల్స్, శ్రుతి మేనన్, జుల్ఫికర్ అలీ
    • హోదా, బీబీసీ రియాల్టీ చెక్

లెబనాన్‌లోని బేరూత్ పోర్టులో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ భారీ పేలుడుకు కారణమైంది. 200 మందికి పైగా ఈ ఘటనలో చనిపోయారు.

అయితే, అమ్మోనియం నైట్రేట్ బేరూత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంది.

అమ్మోనియం నైట్రైట్‌ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ దానికి నిప్పు తోడైతే మాత్రం చాలా ప్రమాదం.

అమ్మోనియం నైట్రైట్ పేలినప్పుడు నైట్రోజెన్ ఆక్సైడ్, అమ్మోనియా లాంటి విషవాయువులు విడుదలయ్యే అవకాశం ఉంది.

అమ్మోనియా నైట్రేట్‌కు మండే స్వభావం ఎక్కువ. అందుకే దీన్ని నిల్వ ఉంచే చోట నిప్పు, మంటలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి.

అమ్మోనియం నైట్రేట్‌తో బాంబులు కూడా తయారుచేసే అవకాశం ఉండటంతో, దాన్ని ఉంచే స్థలాల గురించి గోప్యత, భద్రత చర్యలు తీసుకుంటుంటారు.

బేరూత్ ప్రమాదం తరువాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ నిల్వలపై ఆందోళన పెరుగుతోంది.

విశాఖలో నిల్వలు
ఫొటో క్యాప్షన్, విశాఖలో నిల్వలు

భారత్

చెన్నైలో జనావాస ప్రాంతాలకు కేవలం 700 మీటర్ల దూరంలో ఇదివరకు 740 టన్నుల అమ్మోనియం నైట్రైట్‌ను నిల్వ చేశారు. 37 కంటెయినర్లలో వీటిని ఉంచారు.

ఐదేళ్లుగా ఈ నిల్వలు ఇక్కడే ఉన్నాయి. వ్యవసాయ అవసరాల కోసమంటూ దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్థ దీన్ని ఇక్కడికి దిగుమతి చేసుకుంది. దీన్ని నిల్వ ఉంచడంపై తమిళనాడు ప్రభుత్వం ఆ సంస్థపై న్యాయ పోరాటం చేసింది.

దీనికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇవ్వలేదు.

చెల్లుబాటు కాని లైసెన్స్ మీద అమ్మోనియం నైట్రేట్‌ను ఆ సంస్థ దిగుమతి చేసుకుందని... ‘గుర్తు తెలియని ప్రైవేటు వ్యక్తులు’, ఇదివరకు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన సంస్థలకు వాటిని విక్రయంచిందని విచారణలో తేలింది.

2015లో వచ్చిన వరదల్లో దీనిలో కొంత మేర అమ్మోనియం నైట్రైట్ కొట్టుకుపోయింది. మిగిలిన 697 టన్నులను వేలం వేసి, తెలంగాణకు తరలించారు.

అమ్మోనియం నైట్రైట్‌ను ఎరువుగా కూడా ఉపయోగిస్తారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అమ్మోనియం నైట్రైట్‌ను ఎరువుగా కూడా ఉపయోగిస్తారు

యెమెన్

అడెన్‌లోని దక్షిణ పోర్టులో 100 అమ్మోనియం నైట్రేట్ కంటెయినర్లు ఉన్నట్లు వచ్చిన మీడియా కథనాలపై యెమెన్ అటార్నీ జనరల్ విచారణకు ఆదేశించారు.

మూడేళ్ల క్రితం దీన్ని దిగుమతి చేసుకున్నారని, ఐరాస గుర్తించిన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సౌదీ దళాలు ఈ నిల్వలను సీజ్ చేశాయని కథనాలు పేర్కొన్నాయి.

‘‘130 కంటెయినర్లలో దాదాపు 4,900 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్లు అంచనాలున్నాయి. దీని భద్రత బాధ్యత ఈ పోర్టులో గస్తీ కాస్తున్న దళాలదే’’ అని అడెన్ గవర్నర్ తారిక్ సలాం అన్నారు.

‘ఎరువుగా ఉపయోగించే ఆర్గానిక్ యూరియా’‌ను ఉంచేందుకు ఆ కంటెయినర్లను ఉపయోగిస్తున్నట్లు యెమెన్ గల్ఫ్ ఆఫ్ అడెన్ పోర్స్ట్ కార్పొరేషన్ తెలిపింది.

‘‘అవి పేలుడు పదార్థాలో, రేడియో యాక్టివ్ పదార్థాలో కాదు. వాటిని నిల్వ ఉంచడంపై నిషేధం లేదు’’ అని వివరించింది.

పేలుడు తర్వాత బేరూత్ పోర్టు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పేలుడు తర్వాత బేరూత్ పోర్టు

ఇరాక్

బేరూత్ ప్రమాదం నేపథ్యంలో పోర్టుల్లో, ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రమాదకర పదార్థాల నిల్వపై వెంటనే సమీక్ష నిర్వహించాలని ఇరాక్ ప్రభుత్వం ఆదేశించింది.

బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమ్మోనియం నైట్రైట్ నిల్వ ఉన్నట్లు గుర్తించింది.

‘‘బాగ్దాద్ విమానాశ్రయంలోని అత్యంత ప్రమాదకరమైన పదార్థాలను ఇరాక్ రక్షణశాఖకు చెందిన మిలిటరీ ఇంజినీరింగ్ డైరెక్టరేట్ క్షేమంగా ఓ గోదాముకు తరలించింది’’ అని ఆగస్టు 9న ఓ సైనిక అధికారి ట్వీట్ చేశారు.

ఫ్రాన్స్‌లో అమ్మోనియం నైట్రైట్ ఉత్పత్తయ్యే కర్మాగారం

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా

బేరూత్‌లో పేలుడు జరగక ముందు నుంచే నగర కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ గోదాంను మరో చోటికి తరలించాలని న్యూ సౌత్‌వేల్స్‌లోని న్యూకాజిల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

మైనింగ్ పరిశ్రమలకు పేలుడు పదార్థాలు సరఫరా చేసే ఒరికా సంస్థ దీన్ని నిల్వ చేస్తోంది.

మంటలు అంటుకోని ప్రత్యేకమైన పదర్థాలతో, అగ్నినిరోధకంగా రూపొందించిన గోదాంల్లో అమ్మోనియం నైట్రైట్‌ను నిల్వ ఉంచుతున్నామని ఆ సంస్థ అంటోంది.

దక్షిణ ఆస్ట్రేలియా వ్యాప్తంగా 170 ప్రాంతాల్లో అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ ఉంచుతున్నారని, వీటిపై గట్టి నిఘా ఉందని సేఫ్‌వర్క్ ఎస్ఏ సంస్థ తెలిపింది.

లింకన్‌షైర్‌లోని పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లింకన్‌షైర్‌లోని పోర్ట్

బ్రిటన్

ఇమ్మింగ్హమ్‌లోని లింకన్‌షైర్‌తోపాటు హంబర్ ప్రాంతంలోని ఇతర చోట్ల అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై విచారణ మొదలైంది.

బ్రిటన్‌లోని పోర్టులు అమ్మోనియం నైట్రేట్ నిల్వ, నిర్వహణ విషయంలో చాలా కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అసోసియేట్ బ్రిటీష్ పోర్ట్స్ (ఏబీపీ) తెలిపింది.

ఏబీపీనే వీటి నిర్వహణను చూసుకుంటుంది.

పోర్టికోలోని పోర్ట్స్‌మౌత్ పోర్టులో ఉన్న ఓ సంస్థ అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచేందుకు పెట్టిన ఓ దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఆ పదార్థాన్ని ఈ పోర్టుకు తేవడం లేదని తెలిపింది.

బేరూత్ పేలుడు తర్వాతే ఈ ప్రకటన చేసినప్పటికీ, వాణిజ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

‘‘అమ్మోనియం నైట్రేట్ విడిగా ఉంటే ఏ ప్రమాదమూ లేదు. చమురు లాంటి మరో పదార్థంతో కలుషితమైనే, దానితో ప్రమాదం. ప్రమాదకర పదార్థంగా దీన్ని గుర్తించారు కాబట్టి, గట్టి నియంత్రణ ఉంటుంది’’ అని ఇంటర్నేషనల్ కార్గో హ్యాండ్లింగ్ కో ఆర్డినేషన్ అసోసియేషన్ హెడ్ రిచర్డ్ బరో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)