అసోం ప్రొఫెసర్‌పై క్రిమినల్ కేసు... శ్రీరాముడిపై ఎఫ్‌బీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏబీవీపీ ఫిర్యాదు

ఫొటో సోర్స్, Prof. Sen
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
అసోం విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అనింద్య సేన్‌పై సిల్చర్ సదర్ పోలీస్ స్టేషన్లో కేసు కేసు పెట్టారు. శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మత భావాలను కించపరిచారని ఆరోపిస్తూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆగస్టు 5న అనింద్య సేన్ తన ఫేస్‌బుక్‌లో శ్రీరాముడు, ఆయన భార్య సీతను వదిలేసిన సందర్భం గురించి ఒక పోస్ట్ పెట్టారు. ఆ నాలుగు లైన్ల ఫేస్‌బుక్ పోస్టులో మొదటి లైన్‌లో “జరుగుతున్న ఈ డ్రామా అంతా భార్యను వదిలేసిన ఒక వ్యక్తి కోసమా...” అని రాశారు.

ఫొటో సోర్స్, Viral Post Grab
ప్రొఫెసర్ తన పోస్టులోని చివరి లైన్‌లో శ్రీరాముడి పేరు రాశారు. ఈ ఫేస్‌బుక్ పోస్టుపై ఆయనకు చాలా మంది అభ్యంతరకరమైన సందేశాలు కూడా పంపించారు.
సోషల్ మీడియాలో శ్రీరామచంద్రుడిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ సేన్ హిందువుల మనోభావాలను కించపరిచారని ఎఫ్ఐఆర్ కాపీలో ఆరోపించారు.
దానితోపాటు, ప్రొఫెసర్ సేన్ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రధానమంత్రి, హోం మంత్రి వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అవమానించారనే ఆరోపణలు కూడా చేశారు.
పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్-295ఎ, 294, 501 కింద కేసు నమోదు చేశారు.
“ఆగస్టు 5న దేశమంతా శాంతియుతంగా రామమందిరం భూమిపూజ వేడుకను చేసుకుంటున్నప్పడు, ప్రొఫెసర్ మతకల్లోలాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టార”ని ఆయన మీద ఫిర్యాదు చేసిన రోహిత్ చందా అన్నారు.
సిల్చర్, గురుచరణ్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న 18 ఏళ్ల రోహిత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిల్చర్ యూనిట్‌లో అజిటేషన్ ఇంచార్జ్.

ఫొటో సోర్స్, Rohit
రోహిత్ చందా ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడుతూ, “ప్రొఫెసర్ సేన్ చాలా కాలంగా ఇలాంటి పోస్టులు పెడుతూ వస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో బోధించే ఒక ప్రొఫెసర్ అలా చేయడం సరికాదు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు పెట్టారు. ఆయనకు పాలన అందించే పార్టీ నచ్చకపోవచ్చు, కానీ, ఒక మతం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, వారిని కించపరచడం తగదు. శ్రీరాముడి జీవితాన్ని అవమానించేలా ప్రొఫెసర్ సేన్ పోస్టులు పెట్టారు. హిందువుల మనోభావాలను కించపరిచారు” అన్నారు.
బజరంగ్ దళ్ కార్యకర్త స్నేహాన్షు చక్రవర్తి కూడా ప్రొఫెసర్ సేన్ మీద ఫిర్యాదు చేశారని రోహిత్ చెప్పారు.
ప్రొఫెసర్ సేన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కఛార్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ భన్వర్ లాల్ ధ్రువీకరించారు.
ప్రొఫెసర్ సేన్ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుకు సంబంధించిన కేసులో మతపరమైన భావాలను కించపరిచారనే ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
“ఈ కేసులో ప్రొఫెసర్ సేన్ మీద నమోదు చేసిన సెక్షన్లలో, సెక్షన్-265ఎ కూడా ఉంది. ఇది అరెస్ట్ చేసిన వ్యక్తిని వెంటనే బెయిల్ మీద విడుదల చేయడానికి వీలులేని నాన్-బెయిలబుల్ నాన్-కంపౌండబుల్ నేరాల కోసం ఉద్దేశించిన సెక్షన్” అన్నారు.
ఈ కేసులో వారికి బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Assam Police
నేను కొత్తగా ఏం చెప్పలేదు: ప్రొఫెసర్ సేన్
ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్ గురించి ప్రొఫెసర్ సేన్ ప్రస్తుతం చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు.
“రామాయణం మీద వచ్చిన రకరకాల గ్రంథాల్లో శ్రీరాముడు తన భార్య సీతను వదిలేశాడని రాసుంది. రాముడి గురించి వివిధ కోణాల్లో విమర్శలున్నాయి. అవి చాలా పురాతనమైనవి. నేను కొత్తగా ఏం రాయలేదు. హిందూ దేవుడిని లేదా దేవతలను అవమానించాలని, ఒక మతంవారి మనో భావాలను కించపరచాలనే ఉద్దేశాలు నాకు ఏమాత్రం లేవు” అని అన్నారు.
“ఈ విషయాన్ని ఎంత పెద్దది చేశారంటే, ఒక గ్రూప్ ఇప్పుడు నా వెంట పడింది. నాపై నాన్ బెయిలబుల్ సెక్షన్-295ఎ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది కూడా వారే” అని ఆయన చెప్పారు.
ప్రొఫెసర్ సేన్‌పై ఆగస్టు 8న ఈ కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకూ, పోలీసులు ఆయనను సంప్రదించలేదు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామాబాద్ హిందూ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








