పాకిస్తాన్: ఇస్లామాబాద్‌ హిందూ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్.. శ్రీకృష్ణ మందిరానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

రావల్పిండిలోని హిందూ మందిరం

ఫొటో సోర్స్, Shiraz Hassan

ఫొటో క్యాప్షన్, రావల్పిండిలోని హిందూ మందిరం
    • రచయిత, షహజాద్ మలిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హిందూ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఇస్లామాబాద్ హైకోర్టు జస్టిస్ ఆమిర్ ఫారూఖ్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

నగర మాస్టర్ ప్లాన్‌లోనే ఆలయానికి స్థల కేటాయింపులు చేశారని న్యాయమూర్తి వెల్లడించారు. (ఒకవేళ అలా కేటాయించకపోయినప్పటికీ) లే అవుట్ ప్లాన్‌ ప్రకారం ఇస్లామాబాద్ నగరంలోని ఏ సెక్టారులో అయినా స్థలాన్ని కేటాయించే అధికారం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్, సభ్యులకు ఉందని వివరించారు.

ఈ నేపథ్యంలో పిటిషనర్ల అభ్యంతరాలు చెల్లవంటూ కేసును కొట్టేశారు.

కాగా, ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మూడు హిందూ ఆలయాలు ఉన్నాయని.. ఈ రెండు నగరాల్లో నివసిస్తున్న హిందూ ప్రజలకు ఆ ఆలయాలు సరిపోతాయని వాదనల సందర్భంగా పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని, ఈ నేపథ్యంలో కృష్ణుడి ఆలయం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం దేశ ఖజానా నిధులను దుర్వినియోగం చేయడమేనని చెప్పారు.

అయితే, ఆలయ నిర్మాణం కోసం ఎలాంటి నిధులనూ విడుదల చేయలేదని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని తీర్పులో హైకోర్టు ప్రస్తావించింది. నిధుల విడుదల అంశంపై ప్రభుత్వం ఇప్పటికే ఇస్లామాబాద్ ఐడియలాజికల్ కౌన్సిల్‌ను సంప్రదించిందని, అయితే.. మత మార్గదర్శకాల ప్రకారం.. ఇస్లామిక్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణానికి నిధులను సమకూర్చదని మత పెద్దలు వెల్లడించారని కూడా తెలిపింది.

పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ప్రకారం.. దేశంలోని మైనార్టీలు తమ మతం ప్రకారం మతాచారాలను స్వేచ్ఛగా పాటించే హక్కు కలిగి ఉన్నారని కూడా కోర్టు గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో పిటిషన్లను కొట్టేస్తున్నామని, అయితే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని పిటిషనర్లు భావిస్తే తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుపై మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి ట్విటర్లో స్పందించారు.

కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, ఆ తీర్పును తు.చ. తప్పకుండా పాటిస్తామని వివరించారు.

పాక్‌లో ఆలయం

2017లో స్థలం కేటాయించిన ప్రభుత్వం

ఆ ఆలయ భవనం ప్లాన్ లేకపోవడం వల్ల దాని పనులు ఆపివేశామని ఇస్లామాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీడీఏ) నగర వ్యవహారాల డైరెక్టర్ విచారణ సందర్భంగా కోర్టుకు చెప్పారు.

ఈ ఆలయ స్థలం ఎక్కడ ఉంది, ఏ ఉద్దేశం కోసం దానిని ఉపయోగిస్తున్నారని కోర్టు సీడీఏను ప్రశ్నించింది.

మందిర నిర్మాణం కోసం ఉద్దేశించిన స్థలం ఇస్లామాబాద్ సెక్టార్ H92లో ఉందని సీడీఏ అధికారి కోర్టుకు తెలిపారు.

హిందూ సమాజాభివృద్ధికి పనిచేసే ఒక సంస్థ నుంచి ఆలయం కోసం ప్లాట్ కేటాయించాలని 2016లో దరఖాస్తు రావడంతో దానిపై దర్యాప్తు ప్రారంభమైంది.

ఆ దరఖాస్తుపై చట్టపరమైన దర్యాప్తు కోసం వివిధ ఏజెన్సీలను పంపించామని, వాటిలో నిఘా ఏజెన్సీలు కూడా ఉన్నాయని ఆ అధికారి చెప్పారు.

2017లో దాదాపు 4 కనాల్(అర ఎకరం) భూమి కేటాయించామని, అందులోనే ఆలయం, కమ్యూనిటీ సెంటర్, శ్మశానం నిర్మించాలని సూచించామని సీడీఏ అధికారి తెలిపారు.

“మతపరమైన అంశాలను చూసే మంత్రిత్వ శాఖ, పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌తోపాటూ ఇస్లామాబాద్ జిల్లా యంత్రాంగం సిఫారసుతో హిందూ సమాజం దరఖాస్తుకు స్పందించి స్థలం మంజూరు చేశాం. వారికి ఇస్లామాబాద్ సెక్టార్ H92లో ఆలయ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి కేటాయించాం” అని సీడీఏ అధికారి కోర్టుకు చెప్పారు.

ఆలయ నిర్మాణానికి సీడీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆ భూమికి ఎలాంటి నగదు వసూలు చేయలేదు. ఆ స్థలాన్ని 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. తర్వాత అంతే కాలానికి లీజును రెండు సార్లు పొడిగించవచ్చు.

“హిందూ పంచాయత్ పేరున ఆ ప్లాట్ కేటాయించాం. అంతేకాదు, ఇస్లామాబాద్‌లో ఉండే మిగతా మైనారిటీ వర్గాలకు కూడా 90వ దశకం మొదట్లో శ్మశానం కోసం స్థలాలు కేటాయించాం” అని ఆయన కోర్టుకు చెప్పారు.

ఆ ప్రాంతంలో ముస్లింలకు శ్మశానం కోసం స్థలం కేటాయించడంతోపాటూ ఇస్లామాబాద్‌లోనే ఉంటున్న మైనారిటీలు కూడా తమ మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోడానికి స్థలాలు కేటాయించామని అధికారి చెప్పారు.

“ఆలయ భవనం ప్లాన్ ఆమోదం కోసం మీ దగ్గరకు వచ్చిందా” అని జస్టిస్ ఆమిర్ ఫారుఖ్ సీడీఏ డైరెక్టర్‌ను అడిగారు.

అది కచ్చితంగా చెప్పలేమని, కానీ, తనకు తెలిసినంతవరకూ ఆమోదం కోసం ప్లాన్ ఇప్పటివరకూ సీడీఏ సంబంధిత విభాగానికి రాలేదని ఆయన చెప్పారు.

హిందూ ఆలయ నిర్మాణ పనులు

‘ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఇవ్వలేదు’

ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిధులూ అందించలేదని డిప్యూటీ అటార్నీ జనరల్ రాజా ఖాలిద్ మహమూద్ కోర్టుకు చెప్పారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం పది కోట్ల రూపాయలు ఇచ్చిందన్న పిటిషనర్ చౌధరి తన్వీర్ వాదనల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

నిధుల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ఇస్లామిక్ వ్యూ కౌన్సిల్ సిఫారసులు కోరిందని ఆయన కోర్టుకు తెలిపారు.

“ఈ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేయడం వల్ల ప్రపంచానికి సరైన సందేశం వెళ్లదు, ఎందుకంటే పాకిస్తాన్ రాజ్యాంగం కూడా ముస్లిమేతరులకు తమ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతులు ఇస్తుంది” అని డిప్యూటీ అటార్నీ జనరల్ వాదించారు.

ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించడం, దానికి నిధులు అందించడం రెండూ వేరు వేరు అని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వం నిధులు గానీ, ఆలయ నిర్మాణానికి అనుమతులు గానీ ఇవ్వకూడదన్నారు.

రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఆ పిటిషన్లపై విచారణ కొనసాగించాలా, వద్దా అనేదానిపై సోమవారం తీర్పు రిజర్వ్ చేసింది. ఆలయ నిర్మాణం వివాదాస్పదం కావడంతో ఆ ప్రాంతంలో స్థానిక పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావటం పట్ల హిందూ పంచాయత్ సంతోషం వ్యక్తం చేసింది.

వీడియో క్యాప్షన్, వీడియో: పాకిస్తాన్‌లో హిందూ ఆలయ నిర్మాణం... వ్యతిరేకంగా మదర్సా ఫత్వా

‘బిల్డింగ్ మెటీరియల్ దొంగతనం కాలేదు’

హిందూ ఆలయ కాంప్లెక్స్ నిర్మాణం దగ్గర పనులు చేస్తున్న కాంట్రాక్టర్, ఎవరైనా ఎత్తుకెళ్తారనే భయంతో తన బిల్డింగ్ మెటీరియల్‌ను వేరే ప్రాంతానికి తరలించారని, వాటిని ఎవరూ ఎత్తుకెళ్లలేదని ఇండస్ట్రియల్ ఏరియా ఎస్పీ జుబేర్ అహ్మద్ చెప్పారు.

“ఆయన వాటిని తరలిస్తున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. దర్యాప్తు పూర్తైన తర్వాత తన వస్తువులు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్‌ను అనుమతించారు” అని ఆయన చెప్పారు.

కానీ ఆలోపే ఆలయ నిర్మాణం కోసం ఉంచిన బిల్డింగ్ మెటీరియల్‌ను ఎవరో ఎత్తుకెళ్లారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

ఇస్లామాబాద్‌లో మైనారిటీలకు స్థలం ఇచ్చే విధానం

సెక్టార్ H92లో క్రైస్తవులు, పార్శీలు, బహాయి సమాజంతో సంబంధాలు ఉన్నవారికి కూడా స్థలాలు కేటాయించామని సీడీఏ అధికారి చెప్పారు.

“సీడీఏలోని ఈ సెక్టార్‌ను నివాస, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించరు. అక్కడ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయడానికి, మైనారిటీలకు తమ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోడానికి స్థలాలు కేటాయించారు. అందరికీ ఒకే సైజున్న ప్లాట్లు కేటాయించాం” అని సీడీఏ ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ మజహర్ హుస్సేన్ చెప్పారు.

“ఆలయ నిర్మాణానికి సంబంధించి 2011లో హిందూ సమాజం నుంచి దరఖాస్తు వచ్చింది. ఐదేళ్ల తర్వాత 2016లో మానవ హక్కుల మంత్రిత్వ శాఖ నుంచి ఆ దరఖాస్తును సీడీఏకు పంపించారు. ఏడాది వరకూ ఆ ఫైల్ మీద పని చేశాం. 2017లో హిందూ కమ్యూనిటీకి ఆ స్థలం కేటాయించాం. ఆ ప్రాంతంలో ఆలయంతోపాటూ, శ్మశానం, కమ్యూనిటీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని అప్పుడే నోటిఫికేషన్ జారీ చేశాం” అన్నారు.

“సంబంధిత విభాగం భవనాల ప్లాన్‌ను ఆమోదించేవరకూ ఇస్లామాబాద్‌లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదు. హిందూ ఆలయ భవనం ప్లాన్ ఇంకా ఆమోదం పొందలేదు. అందుకే దాని నిర్మాణం నిలిపివేశాం” అని మజహర్ చెప్పారు.

ఆగాఖాన్ కేంద్రంతోపాటూ ఇస్లామాబాద్‌లోని చాలా సెక్టార్లలో వివిధ మైనారిటీ వర్గాల వారికి ఇప్పటికీ కేంద్రాలు ఉన్నాయని, డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్‌లో బౌద్ధుల కోసం ప్రార్థనా స్థలం నిర్మించామని ఆయన చెప్పారు.

ఇస్లామాబాద్ సెక్టార్ 18లో బహాయి సమాజంతో సంబంధాలు ఉన్న వారికోసం ఒక కమ్యూనిటీ సెంటర్ నిర్మించారు.

“ముస్లింలు, రాజధానిలో నివసించే మైనారిటీల మతపరమైన కార్యక్రమాల కోసం మేం భూములు కేటాయిస్తాం. వాటికి ఎలాంటి ధర ఉండదు. సెక్టార్ H92లో మైనారిటీలకు కేటాయించిన స్థలాలకు కూడా ఎలాంటి నగదు వసూలు చేయలేదు” అని సీడీఏ ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)