మేరీ మ్యాలన్: టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ

ఫొటో సోర్స్, FOTOSEARCH / GETTY IMAGES
20వ శతాబ్దపు తొలినాళ్లలో అమెరికాలో అత్యంత దీనమైన పరిస్థితులను, సమాజం నుంచి ఛీత్కారాలను ఎదుర్కొన్న మహిళల్లో ఈమె కూడా ఒకరు. ఆమె జీవితమే ఓ విషాదం. ఓ ప్రత్యేక వ్యాధి, వైరస్, బ్యాక్టీరియా లక్షణాలను ఆమె వ్యాప్తి చేస్తున్నారంటూ అందరూ ఆమెను నిందించారు. కానీ ఆమెలో ఆ వ్యాధి లేదా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లుగా నిర్థరణ జరిగినట్లు ఆధారాలు లేవు.
మేరీ మ్యాలన్ ద్వారా కనీసం 50 మందికి టైఫాయిడ్ జ్వరం సోకింది. అందులో ముగ్గురు మరణించారు. అయితే వీరి మరణాలకు, వ్యాధి వ్యాప్తికి మేరీనే కారణం అని అప్పట్లో డాక్టర్లు గానీ, బాధితుల తరపు కుటుంబ సభ్యులు గానీ చాలా ఏళ్ల వరకూ గుర్తించలేకపోయారు.


కానీ, మేరీ తన శరీరంలో ఇన్‌ఫెక్షియస్ బ్యాక్టీరియాను కలిగి ఉన్నారని తేలడంతో, ఆ వ్యాధి వ్యాప్తికి కారణం ఆమే అని తొలిసారిగా డాక్టర్లు గుర్తించారు.
దీంతో ఆమెపై వివక్ష, విమర్శలు ప్రారంభమయ్యాయి. ఎవరికీ తెలియకుండా తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు పేరు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. కానీ, చివరికి ఆమెను చనిపోయే వరకూ ప్రత్యేక చికిత్సా విభాగం (క్వారంటైన్)లో ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఓ శరణార్థి కథ
మేరీ మ్యాలన్ 1883లో ఐర్లాండ్ నుంచి అమెరికాకు వచ్చిన శరణార్థి. యుక్తవయసులో ఉండగానే ఆమె ఇళ్లలో వంట పని, ఇంటిపని చేయడం ప్రారంభించారు.
మొదట్లో న్యూయార్క్, లాంగ్ ఐలాండ్ వంటి నగరాల్లో పనిచేశారు. ఈ సమయంలోనే ఆమెకు ఇన్ఫెక్షన్ సోకింది. అప్పటి వరకూ మరెవరికీ ఈ వ్యాధి లేదు.
1907 నాటికి మొత్తం 30 మంది ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో వ్యాధి వ్యాప్తికి కారణాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. అసలు ఎవరి నుంచి ఈ ఇన్ఫెక్షన్ తొలిసారిగా మొదలైందనే దిశలో వారు విచారణ సాగించారు.
అప్పటి వరకూ వ్యాధికి కారణం నీళ్లు, ఆహారం కలుషితం కావడం అనే వైద్య విభాగం అధికారులు భావిస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, టైఫాయిడ్ జ్వరం సాధారణంగా పేదలు నివసించే ప్రదేశాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రబలుతుంది కానీ న్యూయార్క్ వంటి మహానగరంలో కాదు అనే ఓ తప్పుడు అభిప్రాయం అప్పట్లో ఉండేది. కానీ, అది నగరాల్లోని కుటుంబాలు, ఉన్నతాదాయ కుటుంబాల్లో కూడా వ్యాపించడం మొదలు పెట్టింది.
దానికి కారణం, ఆ కుటుంబాల్లో మేరీ మ్యాలన్ లాంటి పనిమనుషులు ఉండటమే.
ఎలా గుర్తించారు?
నిజానికి కొన్ని రకాల మహమ్మారులు, వ్యాధులు, వాటికి వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఆ కాలంలోనే సైన్స్ కొంత పురోగతి సాధించింది. అయితే, టైఫాయిడ్ జ్వరంలాంటి అంటువ్యాధి వ్యాప్తికి సంబంధించి అమెరికా వైద్య పరిశోధకులకు అప్పట్లో ఎలాంటి సమాచారం లేదు.
ఓ వ్యక్తి తనకు తెలియకుండానే తనలో ఉన్న వ్యాధి బ్యాక్టీరియాను ఎదుటివారికి వ్యాప్తి చేయడం వల్లే టైఫాయిడ్ వస్తోందని ముందుగా గుర్తించేవరకూ కూడా దీనిపై రకరకాల అపోహలు ప్రచారమయ్యాయి.
మన్‌హటన్‌లోని పార్క్ ఎవెన్యూలో ఉన్న ఓ ఇంట్లో కొత్త అనారోగ్య కేసులు నమోదుకావడంతో న్యూయార్క్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారి జార్జి సోపర్‌కు మేరీపై అనుమానం కలిగింది.
ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ మహిళ వేరే ఇతర ఇళ్లలో కూడా ఇంటిపనులు చేయడం, ఆ ఇళ్లలో కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలే రావడం జార్జి అనుమానాలను బలపర్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాలన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె మలమూత్రాల్లో టైఫాయిడ్ జ్వరాన్ని కలిగించే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లుగా సోపర్ నిర్థరించారు.
ఈ పరీక్షలన్నీ వైద్య శాఖ అధికారులు, పోలీసు అధికారుల జోక్యంతోనే సాధ్యమయ్యాయి.
చాలా సంవత్సరాల తర్వాత, ఆనాటి పరిస్థితులను సోపర్ గుర్తు చేసుకున్నారు. ఒంటరిగా నివసించే, పట్టుదల కలిగిన ఓ మహిళ నుంచి వైద్య పరీక్షల కోసం నమూనాలు సేకరించడం చాలా కష్టమైందని ఆయన అన్నారు.
ప్రత్యేక గదిలో ఉండాల్సిందే
మేరీ మ్యాలన్ వల్లే వ్యాధి ప్రబలుతోందని నిర్ధరణ కావడంతో ఈ అంశం న్యూయార్క్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎంతమందికైనా ఓ మహిళ ద్వారా ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదాన్ని కూడా స్థానిక అధికారులు ముందుగానే గుర్తించారు.
కొన్ని వారాల పాటు ఓ హాస్పటల్లోని ప్రత్యేకమైన గదిలో ఉంచిన తర్వాత, క్వారంటైన్ పిరియడ్ కోసం ఆమెను ఓ చిన్న ఐలాండ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Getty Images
1907 నుంచి 1910 వరకూ అంటే మూడేళ్ల పాటు ఓ ఐలాండ్‌లోని చిన్న గదిలో ఆమెను ఉంచారు. ఆమెకు అవసరమైన వంట సామగ్రి, ఇతర పదార్థాలను జాగ్రత్తగా అందిస్తే, వాటితో వంట చేసుకుని మేరీ తినేవారు.
అప్పటికే స్థానిక వార్తా పత్రికలు ఆమెను 'టైఫాయిడ్ మేరీ' అని పిలవడం, ఆమె పైన, ఆమె ఆరోగ్యం పైన ప్రత్యేక వ్యాసాలు, కథనాలు రాయడం ప్రారంభించాయి.
తాను ఓ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యానని ఒంటరిగా గడిపిన ఈ మూడేళ్లలో మేరీకి కనీసం తెలియదు. ఎలాగైనా తాను మళ్లీ బయటకు వచ్చి, తన పని తాను చేసుకోవాలని ఎంతో ప్రయత్నించారు.
ఎట్టకేలకు కొన్ని షరతుల మీద 1910లో ఆమె కోరిక నెరవేరింది. ఆమె ఎవరి ఇంట్లోనూ వంటచేయకూడదు, వేరే వారి ఆహార పదార్థాలను తాకకూడదు.
కొత్త జీవితం
ఐదేళ్లపాటు, రెండు కొత్త పేర్లతో మేరీ మ్యాలన్ వేర్వేరు ప్రాంతాల్లో వంటమనిషిగా పనిచేశారు. దీంతో అతి కొద్ది కాలంలోనే మళ్లీ అంటువ్యాధి వ్యాప్తి వెలుగులోకి వచ్చింది.
ఒక్క హాస్పటల్లోనే ఉన్నట్లుండి 20మందికి తీవ్రమైన జ్వరం సోకింది.
మళ్లీ డాక్టర్ సోపర్ రంగంలోకి దిగారు. వైద్య కేంద్రాల రికార్డుల్లో ఉన్న వివరాలు, సంతకం పరిశీలిస్తే, మ్యారీవి కాదని తేలాయి. కానీ, రూపురేఖలు మాత్రం ఆమెలాగే ఉన్నాయని అధికారులు సోపర్‌కు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దీంతో, 1915లో మరో 23 ఏళ్ల క్వారంటైన్ పిరియడ్ ప్రారంభమైంది. ఇది ఆమె మరణంతోనే అంతమవుతుంది.
1932లో మేరీ మ్యాలన్‌కు స్ట్రోక్ వచ్చి, పక్షవాతానికి గురయ్యారు. అనంతరం 69 ఏళ్ల వయసులో మరణించారు.
ఆమె మృతదేహానికి శవపరీక్ష జరిగిందా, లేదా? చనిపోయే నాటికి కూడా ఆమె మలమూత్రాల్లో బ్యాక్టీరియా సజీవంగానే ఉందా, లేదా? అనే అంశాలపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?
- వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ :'కొట్టుకుంటున్న ఎలుకల' ఫొటోకు 'టాప్ పీపుల్స్ పోల్' అవార్డ్
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఇష్టపూర్వకంగా 'ఆత్మహత్య' చేసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









