దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఇష్టపూర్వకంగా 'ఆత్మహత్య' చేసుకుందా?

కాంగ్రెస్ ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సింధువాసిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి
News image

2015: కాంగ్రెస్ - 0

2020: కాంగ్రెస్ - 0

ఈ గణాంకాలు దిల్లీలో వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతున్నట్లు చూపిస్తున్నాయి.

ఈసారి కూడా దిల్లీలో కాంగ్రెస్ ఉనికి సున్నా దగ్గరే ఆగిపోయింది. ఒకప్పుడు దిల్లీలో అగ్ర స్థానంలో నిలిచిన కాంగ్రెస్, అక్కడి నుంచి జారిపోయి అత్యంత దిగువకు ఎలా చేరుకుంది?

దిల్లీలో 15 ఏళ్ల వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సున్నాకు ఎలా వచ్చింది?

ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న దిల్లీ ఈరోజు దానిని పూర్తిగా ఎందుకు తిరస్కరించింది?

కాంగ్రెస్ ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ పరిస్థితి ఎందుకిలా?

అందుకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దే అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు వినోద్ శర్మ అన్నారు.

"గైర్హాజరీని రాజకీయాల్లో ఆత్మహత్యలా భావిస్తారు. ఈసారి దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గైర్హాజరీలో ఉంది. పూర్తిగా మాయమైపోయింది. అంటే దానర్థం కాంగ్రెస్ దిల్లీలో ఆత్మహత్య చేసుకుంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

"ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గల్లంతైంది. ఆ పార్టీ పెద్ద నేతలు ర్యాలీల్లో, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కనిపించలేదు. వారు సోషల్ మీడియాలో సమర్థమైన వ్యూహాన్ని కూడా అమలుచేయలేదు" అని వినోద్ శర్మ అన్నారు.

కాంగ్రెస్ తన మాటను జనం వరకూ సమర్థంగా చేర్చలేకపోతోందని, ఆ పార్టీకి అతిపెద్ద లోటు అదేనని కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి చూస్తున్న రషీద్ కిద్వాయ్ అన్నారు.

"దానికంటే ఘోరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ తన లోపాలను సరిదిద్దుకోవాలని అనుకోవడం లేదు. 2014 నుంచి ఇప్పటివరకూ కాంగ్రెస్ తన మీడియా విభాగాన్ని మార్చలేదు. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ తన మాటను ప్రజల వరకూ చేర్చడానికి చిన్న,పెద్ద అని లేకుండా అన్ని ప్రయత్నాలూ చేసింది. చివరి సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం కూడా తీసుకుంది. కాంగ్రెస్ అలా ఏ ప్రయత్నాలూ చేయలేదు" అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్లేయర్ కాదు. గత ఐదేళ్లలో దిల్లీ ప్రజలకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ ఏదీ చేయలేకపోయింది. దిల్లీకి ఒక బలమైన నాయకత్వం, ముఖం లేకపోవడం కూడా కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అని అని సీనియర్ జర్నలిస్ట్ స్మితా సింగ్ అన్నారు.

"దిల్లీలో బీజేపీ ప్రజల ముందు ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరినీ చూపించకపోవచ్చు. కానీ జాతీయ స్థాయిలో వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా లాంటి ముఖాలు ఉన్నాయి. ఒక వర్గాన్ని ఆకర్షించడానికి వారి దగ్గర ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం లాంటి అంశాలు ఉన్నాయి. దానికి విరుద్ధంగా కాంగ్రెస్ దగ్గర అంశాలుగానీ, ముఖంగానీ లేదు" అన్నారు.

రాజకీయ విశ్లేషకులునీరజా చౌధరి కూడా ఆమెతో ఏకీభవించారు.

"మిగతా నాయకత్వం సంగతి వదిలేయండి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరనేదే ఎవరికీ సరిగా తెలీడం లేదు. అది కాకుండా, దిల్లీలో ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం చూస్తే, అది అసలు ఎలాంటి ప్రభావం చూపించలేదు. వారు సుభాష్ చోప్రా లాంటి నేతను ముందుంచారు. ఆయన్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించారు" అన్నారు.

"దిల్లీలో బీజేపీ తరఫున స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమ్ అద్మీ పార్టీ ప్రతి నేత, కార్యకర్త ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ పెద్ద నేతలు మాత్రం ఎన్నికల మైదానంలో దాదాపు కనిపించకుండా పోయారు" అని నీరజ అన్నారు.

కాంగ్రెస్ ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల్లో ఓడిపోవడమే కాంగ్రెస్ వ్యూహమా?

ఎన్నికల ట్రెండ్స్ రాగానే కాంగ్రెస్ నేత రంజన్ చౌధరి "ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అటు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ "మా గురించి మాకు ముందే తెలుసు. పెద్ద పెద్ద మాటలు చెప్పిన బీజేపీ ఏమవుతుందనేదే ప్రశ్న" అన్నారు.

కాంగ్రెస్ కావాలంటే ప్రయత్నించేది, కానీ అది చేయలేదు అని చెప్పడానికి ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి అని సీనియర్ జర్నలిస్ట్ అపర్ణా ద్వివేదీ చెప్పారు.

"ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల ముందు పాపులర్ నేతలను ఎవరినీ నిలబెట్టలేదు. ఈరోజుల్లో అది సుభాష్ చోప్రా, కీర్తీ ఆజాద్ లాంటి నేతలను దిల్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిపింది. సుభాష్ చోప్రా కూతురు శివానీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె అందులో బిజీగా ఉన్నారు. కీర్తీ ఆజాద్ కూతురు పూనమ్ ఆజాద్ కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె తన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అంటే పార్టీలో ఏ నేతా పార్టీని ముందు పెట్టి ఎన్నికల్లో పోటీపడలేదు" అన్నారు.

వీటన్నిటినీ చూస్తే కాంగ్రెస్ ఈసారీ ఎలాంటి ప్రయత్నం చేయలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన జీరోను ఈ ఎన్నికల్లో కూడా మెయింటైన్ చేయాలని మనసులో ముందే నిర్ణయించుకుంది.

కాంగ్రెస్ అలా ఎందుకు చేసింది? అది కావాలనే ఎలాంటి ప్రయత్నం చేయలేదా? అనే ప్రశ్న వస్తుంది.

ఇది కాంగ్రెస్ బాగా ఆలోచించి వేసిన ఎత్తు అని వినోద్ శర్మ అంటున్నారు.

"నాకు ఎందుకో కాంగ్రెస్ ఈసారీ ఆమ్ ఆద్మీ పార్టీతో సైద్ధాంతిక పొత్తు (టాక్టికల్ అలయన్స్) పెట్టుకుంది అనిపిస్తోంది. దిల్లీలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని అది భావించింది. రాహుల్, ప్రియాంక గాంధీ దిల్లీలో చాలా తక్కువ ర్యాలీల్లో పాల్గొనడానికి, చాలా లో ప్రొఫైల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయడానికి బహుశా అదే కారణం" అన్నారు.

ఓటర్ చాలాసార్లు వ్యూహం ప్రకారం ఓటు ఎలా వేస్తాడో, అలాగే రాజకీయ పార్టీలు కూడా వ్యూహం ప్రకారమే ఎన్నికల్లో పోటీ చేస్తాయి అని వినోద్ శర్మ చెప్పారు.

"కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు ఈసారీ ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డాయి. షీలా దీక్షిత్ సమయంలో కాంగ్రెస్‌కు మాస్ బేస్ లేదా లౌకిక మాస్ బేస్ బలంగా ఉంది. అది ఆప్ దగ్గరకు వెళ్లిపోయింది. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీలో కొత్త కాంగ్రెస్‌లా మారింది" అన్నారు.

"కాంగ్రెస్ వ్యూహం అర్థం చేసుకోవాలంటే మరో వ్యూహాన్ని ప్రస్తావించాలి. చాలా దూరం దూకాలంటే, కొంత దూరం వెనక్కు వెళ్లాల్సుంటుంది. కాంగ్రెస్ అదే వ్యూహంతో తన అభ్యర్థులను నిలబెట్టింది. కానీ అది గట్టిగా ప్రచారం చేయలేదు, పూర్తి బలంతో పోరాడలేదు".

సీనియర్ జర్నలిస్ట్ స్మితా సింగ్ కూడా వినోద్ శర్మతో ఏకీభవించారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంతమంది నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీకి కాస్తైనా నష్టం కలిగించగలమని తమకు కాస్త నమ్మకం ఉన్నా, ప్రయత్నించేవారమని.. కానీ, తమకు చాలా వరకూ అలా జరిగేలా కనిపించలేదని చెప్పారు. అందుకే, తాము బీజేపీని ఓడించాలనే మొదటి లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

రాజకీయ విశ్లేషకులు అఫర్ణా ద్వివేదీ కూడా అలాగే భావించారు.

"ఈ దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో వ్యూహం ప్రకారం వెనకే ఉండిపోయింది. అది చేసిన ర్యాలీలు సాంకేతికం. యువ అభ్యర్థుల పేరుతో అది టికెట్లు పంచడం కూడా చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలాలని కాంగ్రెస్ కోరుకోలేదు" అన్నారు.

కాంగ్రెస్ ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ ప్రయత్నించింది, కానీ జనం తిరస్కరించారు

అయితే రషీద్ కిద్వాయ్ ఈ థియరీ(కాంగ్రెస్ కావాలనే ఎన్నికల్లో ఓడింది)ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు.

"నాకు కాంగ్రెస్ కావాలనే ప్రయత్నించలేదని అనిపించడం లేదు. పార్టీ పాజిటివ్ కోణం అయినా, నెగటివ్ కోణం అయినా రాజకీయ పండితులు చాలాసార్లు కాంగ్రెస్ గురించి ఎక్స్‌ట్రీమ్‌గా ఆలోచిస్తారు. రాజకీయాలు కుటుంబం కాదు. అక్కడ ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం జరగదు. రాజకీయాల్లో లక్షల, కోట్ల పార్టీ కార్యకర్తలు, నేతలు, వనరులు, ఖర్చు లాంటి కోణాలు ఉంటాయి" అన్నారు.

"కాంగ్రెస్ తన వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేసింది. కానీ దేశం, దిల్లీలో ఉన్న వాతావరణం దానికి అనుకూలంగా లేదు. ఈసారీ ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పనుల రిపోర్ట్ కార్డ్ ఉంది. మరోవైపు సీఏఏ, షాహీన్ బాగ్ ఆందోళనల అంశం ఉంది. అలాంటి సమయంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు చీలి ఆప్‌ దగ్గరకు వెళ్లాయని నాకు అనిపిస్తోంది" కిద్వాయ్ అన్నారు.

దిల్లీలో ఫలితాలు పూర్తిగా 'ఓటర్-డ్రివన్' అంటారు కిద్వాయ్

"కాంగ్రెస్‌కు బీజేపీని ఓడించలని అంత కోరికే ఉంటే, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే ప్రత్యామ్నాయం దానికి ఉంది. కానీ అది అలా చేయలేదు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం రేడియోల్లో వినిపించలేదా? సోషల్ మీడియాలో కనిపించలేదా? వారు తమ మ్యానిఫెస్టో విడుదల చేయలేదా? డబ్బులు ఖర్చుచేయలేదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలోకి రాలేదు? అనే ప్రశ్నకు కిద్వాయ్ "అమిత్ షా, మొత్తం బీజేపీ ఇంత దూకుడుగా ఎన్నికల ప్రచారం చేసినా లాభం లేనప్పుడు... రాహుల్ , ప్రియాంక ర్యాలీల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది. విషయం ఏంటంటే, కాంగ్రెస్ తన వైపు నుంచి అన్నీ చేసింది, కానీ ప్రజలు దానిని తిరస్కరించారు" అని సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

ఇది జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనమా?

దిల్లీలో బీజేపీ ఓడడం వల్ల జాతీయ రాజకీయాల్లో, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం లభిస్తుందని సీనియర్ జర్నలిస్ట్ స్మితా సింగ్ అన్నారు.

"బీజేపీ గ్రాఫ్ అలా కిందకు పడిపోయేకొద్దీ, దాని ప్రయోజనం కాంగ్రెస్‌కు లభిస్తుంది. ఎందుకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, బీజేపీ తర్వాత మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రజల్లో బీజేపీపై నమ్మకం తగ్గిపోతే, అప్పుడు వారికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అవుతుంది" అని ఆమె చెప్పారు.

"మొదట కాంగ్రెస్ ఒక వైపే ఉండేది. మిగతా విపక్షాలన్నీ మరోవైపు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇప్పుడు బీజేపీ ఒక వైపు ఉంటే, మిగతా విపక్షాలు మరోవైపు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ ఇప్పటికీ ఎలాగైనా ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనుకుంటుంది. అది మహారాష్ట్ర, జార్ఖండ్‌లో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగం అయ్యే విధానాలు కూడా వెతుకుతోంది" అన్నారు.

దిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి వల్ల ఏడాదిన్నర తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం లభించవచ్చని రాజకీయ విశ్లేషకులు నీరజా చౌధరి చెబుతున్నారు.

"బిహార్, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంత బాగా లేదు. కానీ ఉత్తరప్రదేశ్‌లో అది కచ్చితంగా ప్రయత్నించవచ్చు. ఇటీవల ప్రియాంక గాంధీ కూడా యూపీ రాజకీయాల్లో చాలా చురుగ్గా కనిపించారు. అందుకే కాంగ్రెస్ ముందు ముందు ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోడానికి పూర్తి ప్రయత్నాలు చేయవచ్చు" అన్నారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)