కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీని దాటి ఏదైనా సాధించగలదా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీని మూడోసారి గెలిచిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో కూడా అదృష్టం పరీక్షించుకుంటుందా? అనే ప్రశ్నలు రావడం సర్వసాధారణం.
2016 నవంబర్లో దిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ బీబీసీతో "మేం ముందు ముందు 2014 లోక్‌సభ ఫలితాల కంటే ఇంకా మెరుగ్గా చేస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ, ఈశాన్య భారత్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రజలకు నిజాయితీ అంటే ఇష్టం" అన్నారు.


2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. దిల్లీలో 7 స్థానాల్లో ఓటమిపాలైన ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.
ఆ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అప్పటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీ చేయడానికి వారణాసి చేరుకున్నారు.
అక్కడ మోదీ ఆయన్ను మూడు లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. కానీ బీజేపీకి కోటలాంటి వారణాసిలో కేజ్రీవాల్‌కు దాదాపు రెండు లక్షల ఓట్లు లభించడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత కేజ్రీవాల్ పార్టీ దిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌ను ఊడ్చేసింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 67 సీట్లు గెలుచుకుని రికార్డు విజయం అందుకుంది.
కానీ, తర్వాత వెంటనే ఆప్‌లో అభిప్రాయ బేధాలు వెలుగులోకి వచ్చాయి. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వారిని పార్టీ నుంచి తొలగించారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాజయం లభించింది.
ఆప్ జాతీయ లక్ష్యాల్లో ఆ ఓటమి ఒక చిన్న తేడా మాత్రమేనని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ చెబుతారు.
"కేజ్రీవాల్ ఓటమికి ఒకే ఒక పెద్ద కారణం ఉంది. ఇక్కడ గెలిస్తే తను దిల్లీ వదిలి పంజాబ్ వచ్చేస్తానని ఆయన అక్కడ చెప్పలేదు. ఆయన ఓటర్లకు ఆ భరోసా ఇచ్చుంటే, బహుశా ఓడిపోయేవారు కాదు" అని ప్రదీప్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈసారి దిల్లీ ఎన్నికల్లో(2020) కేజ్రీవాల్‌కు సలహాదారుడుగా ఉన్న ప్రశాంత్ కిశోర్ అప్పటి పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా ఉన్నారు.
ఆ ఓటమి తర్వాత కూడా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయికి చేరడానికి కేజ్రీవాల్ మరో ప్రయత్నం చేశారు. కానీ ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి.
ఆ ఎన్నికల్లో ఆప్ 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 40 స్థానాల్లో పోటీచేసింది. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానం తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
దిల్లీ లోక్‌సభ స్థానాలు అన్నిటిలో ఓడిపోవడంతోపాటు, ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తన పొలిటికల్ స్టైల్ మీద చాలా పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
"కేజ్రీవాల్ దగ్గర కరిష్మా ఉంది. కానీ వనరుల లోటుంది. మొదట రెండుసార్లు జాతీయ స్థాయిలో ఆయనకు వైఫల్యం కూడా ఎదురయ్యింది. అయితే కేజ్రీవాల్ లక్ష్యాలు ఉన్న వ్యక్తి. దిల్లీని ఒక మోడల్‌గా చేసి దానిని జాతీయ స్థాయిలో అందించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారు. కానీ, అది ఎప్పుడు అనేది చెప్పలేం అని రాజకీయ విశ్లేషకులు పూర్ణిమా జోషి అన్నారు.
బీజేపీ లేదా మోదీ ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించడం, ఎప్పుడూ వారిని వ్యతిరేకంగా మాట్లాడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి తెలిసొచ్చింది అనేది కూడా స్పష్టమైంది.
అసోంలో ఎన్ఆర్సీ అమలు, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడంపై కూడా అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడప్పుడూ పరిమితంగానే స్పందించింది.
దిల్లీ షాహీన్ బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ధర్నాలో కూచున్న మహిళలు, పిల్లల గురించి కూడా ఆప్ చాలాకాలంపాటు మౌనం పాటించింది.
ఆమ్ ఆద్మీ పార్టీలా మిగతా పార్టీలు కూడా జాతీయ స్థాయిలో కాలు మోపడానికి ప్రయత్నించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు దశాబ్దాలలో బహుజన్ సమాజ్ పార్టీ దానికి ఒక పెద్ద ఉదాహరణ.

ఫొటో సోర్స్, @ARVINDKEJRIWAL
దీనిపై పూర్ణిమా జోషి "సాధారణంగా ప్రాంతీయ పార్టీల విస్తరణ అంత సులభం కాదు. ఒకప్పుడు మాయావతికి మిగతా రాష్ట్రాల్లో కూడా ఓట్లు వేసేవారు. కానీ ఆ పార్టీ ఎక్కడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుతం బీఎస్పీ, తన మూల రాష్ట్రం యూపీలోనే అస్థిత్వం కోసం పోరాడుతోంది" అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్, మాయావతి పార్టీల మధ్య ప్రదీప్ సింగ్ తులనాత్మక సమీక్ష కూడా చేశారు
"పార్టీలో తన కంటే పెద్దవారు ఎవరూ ఉండకూడదు అనే మాయావతి వైఖరితో, కేజ్రీవాల్ రాజకీయ స్టైల్ కలుస్తుంది. అదే ఆయన్ను మిగతా రాష్టాల్లో ఎదగనీకుండా చేసింది. ఎందుకంటే మనం ఒక లీడర్‌షిప్ డెవలప్ చేస్తే, వేరే రాష్ట్రాల్లో మరో నేత అతడికంటే ఎక్కువ పాపులర్ కావచ్చు. కేజ్రీవాల్ ఆ రిస్క్ తీసుకోరు" అన్నారు.
"కేజ్రీవాల్ ఎంత దూకుడుగా రాజకీయాల్లోకి వచ్చారంటే, మధ్యలో ఆయనకు ఎన్నో దెబ్బలు తగిలాయి. ఆ మిశ్రమ అనుభవాల నుంచి పాఠం నేర్చుకుంటూ ఆయన మరోసారి జాతీయ స్థాయిలో కాలు మోపడానికి ప్రయత్నించవచ్చు" అని నిపుణులు భావిస్తున్నారు.
ఆప్ పొలిటికల్ మోడల్ దిల్లీ ప్రజల మనసుల్లో అద్భుతమైన ముద్ర వేసింది. బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయమే దీనికి ఉదాహరణ.

ఫొటో సోర్స్, EPA
ఆప్ మళ్లీ అధికారంలోకి రావడం కచ్చితంగా చారిత్రక విజయమే. కానీ ముందుకెళ్లడానికి అది ఇంకా కాస్త ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పొలిటికల్ ఎడిటర్ అదితి ఫడ్నవీస్ అన్నారు.
"భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఒక బలమైన, వ్యవస్థీకృత ప్రతిపక్ష పార్టీ స్థానం ఖాళీగా ఉంది. కానీ ఆ స్థానం కోసం ఎలాంటి సన్నాహాలు చేయాలో, అవి కఠినంగా ఉంటాయి. దానితోపాటూ అది చాలా సుదీర్ఘ ప్రక్రియ" అని ఆయన అన్నారు.
గత ఎన్నో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా నాయకత్వంలోని బీజేపీకి ఓటమి లభించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఫలితాలు దీనికి ఉదాహరణ.
కానీ మొదట 2015, తర్వాత 2020లో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆ పార్టీకి అత్యంత దారుణమైన ఓటమి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచే ఎదురైంది.
అందుకే, ఇప్పుడు జాతీయ స్థాయిలో ముందుకెళ్లాలనే ఆప్ ప్రతి ప్రయత్నాన్నీ బీజేపీ చాలా నిశితంగా గమనిస్తుంది.

ఇవి కూడా చదవండి:
- దిల్లీ ఎన్నికల ఫలితాలు: బిరియానీ కథలు, కాల్పుల నినాదాలు బీజేపీకి పనికొచ్చాయా...
- ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు తీర్పులు వివాదాలకు దారి తీస్తున్నాయా
- అమరావతి గజెట్: హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
- ఆంధ్రప్రదేశ్: మెడికల్ కాలేజీల కోసం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ పద్దు సామాన్యుడి ప్రశ్నలకు బదులిచ్చిందా?
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









